టమోటాలు భారత్‌కు ఎలా వచ్చాయి? వీటిని తింటే చనిపోతారని ఒకప్పుడు ఎందుకు భయపడేవారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పెదగాడి రాజేశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్కెట్‌లో టమోటాల ధర విపరీతంగా పెరుగుతోంది.
నెల రోజుల క్రితం కేజీ రూ.15కు అటూఇటూగా ఉండే టమోటాలు ఇప్పుడు హైదరాబాద్ కూకట్‌పల్లి రైతు బజార్‌లో రూ.85కు పైగా పలుకుతున్నాయి.
ఇక బిగ్‌బాస్కెట్ యాప్ విశాఖపట్నం లొకేషన్‌లోనూ దేశీయ టమోటాలు కేజీ రూ.86 చూపిస్తోంది. ఈ యాప్‌లో హైదరాబాద్ లొకేషన్‌లో కేజీ రూ.89గా చూపిస్తోంది.
వీధి మార్కెట్‌లలో అయితే, వీటి ధర కేజీ రూ.100కు పైనే వసూలు చేస్తున్నారు.
దాదాపు అన్ని కూరల్లోనూ వేసే టమోటాలు నేడు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
అసలు ఇవి ఎలా మన జీవితంలో భాగమయ్యాయి? వీటిని మనకు పరిచయం చేసింది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
టమోటా పేరు ఎలా వచ్చింది?
టమోటా శాస్త్రీయ నామం సోలనమ్ లైకోపెర్సికమ్.
దీన్నే అందరూ టమోటా అని పిలుస్తుంటారు. ఇవి సోలనేసీ జాతి రకం మొక్క నుంచి వచ్చే పళ్లు.
టమోటాలో ఉండేది 95 శాతం నీరే. మిగతా 5 శాతంలో మేలిక్, సిట్రిక్ యాసిడ్లు, గ్లూటామేట్లు, విటమిన్ సీ, లైకోపీన్ లాంటి పోషకాలు ఉంటాయి.
టమోటాలు ఎర్రగా కనిపించడానికి వీటిలో లైకోపీనే కారణం.
ఇంగ్లిష్ పదం ‘టమోటా’ స్పానిష్ పదం ‘టొమాటే’ నుంచి వచ్చింది. ఈ స్పానిష్ పదానికి మూలాలు ఆజ్కెట్ భాషలో ఉన్నాయి.
ఆజ్కెట్‌లో వీటిని జోటోమాటిల్ అని పిలుస్తారు. ఈ పదానికి ‘‘ఫ్యాట్ వాటర్ విత్ నావెల్’’ అని ఇంగ్లిష్‌లో అర్థముంది.
మొదటిసారిగా 1595లో జోటోమాటిల్ అనే పదాన్ని పుస్తకాల్లో ఉపయోగించినట్లు ‘‘హిస్టరీ ఆఫ్ టొమాటో: పూర్ మ్యాన్స్ ఆపిల్’’ పేరుతో ఐవోఎస్ఆర్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో బోటనిస్టు రవీ మెహతా పేర్కొన్నారు.
‘‘టమోటా కచ్చితంగా ఇక్కడ పుట్టిందని చెప్పే ఆధారాలేమీ లేవు. అయితే, సోలనేసీ జాతి మొక్కల్లో మిలియన్ల ఏళ్లపాటు జరిగిన పరిణామక్రమంలో ఇవి ప్రస్తుత రూపంలోకి వచ్చి ఉండొచ్చు’’ అని రవి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మొదట ఎవరు పండించారు?
‘‘దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లోని ప్రస్తుతం పెరూ, బొలీవియా, చిలీ, ఈక్వేడార్ అటవీ ప్రాంతాల్లో టమోటాలు మొదట పండేవిగా భావిస్తున్నారు. ఆజ్కెట్, ఇన్కాస్ లాంటి సంస్కృతుల్లో క్రీ.శ. 700లలోనే వీటిని పండించినట్లు ఆధారాలు ఉన్నాయి’’ అని రవి తప పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
‘‘అయితే, ఆండీస్ పర్వతాల్లోని మొదట్లో పెరిగిన టమోటాలు చాలా చేదుగా ఉండేవి. దాదాపు 20,000 ఏళ్ల క్రితం ఇక్కడ మానవ జాతులు స్థిరపడేటప్పుడు ఈ టమోటాలు చాలా చిన్నవిగా, చేదుగా ఉండేవి’’ అని రవి చెప్పారు.
‘‘కొందరు పర్యటకులు ఈ మొక్కలను దక్షిణ అమెరికా నుంచి మధ్య అమెరికాకు తీసుకెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడే మాయా నాగరికత ప్రజలు వీటిని పండించడం మొదలుపెట్టారు. అయితే, అసలు టమోటాలు పండించడం ఎప్పుడు, ఎలా మొదలైందని కచ్చితంగా చెప్పే ఆధారాలేమీ అందుబాటు లేవు’’ అని ఆయన వివరించారు. అయితే, క్రీ.పూ. 500కు ముందే వీటిని పండించి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్‌లోకి ఎలా వెళ్లాయి?
బహుశా 1490లలో నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ దక్షిణ అమెరికా వచ్చినప్పుడే ఈ టమోటాలు యూరోపియన్లను పరిచయం అయ్యుండొచ్చని ఫుడ్ హిస్టారియన్లు చెబుతున్నారు.
ఐరోపా సాహిత్యంలో టమోటాల ప్రస్తావన మొదటగా ఇటాలియన్ ఫిజీషియన్, బోటనిస్టు ఆండ్రియా మట్టియోలి 1544లో రాసిన ‘‘హెర్బల్’’లో కనిపిస్తుందని రవి తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.
దక్షిణ అమెరికాలో వాతావరణానికి కాస్త సరిపోలే మధ్యధరాలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ టొమాటోలు హాయిగా పెరిగేవి.
మొదట్లో ఐరోపాలో పండించే టమోటాలు పసుపు రంగులో ఉండేవని, వీటి ఎల్లో యాపిల్స్‌గా పిలిచేవారని రవి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
విషపూరితమని భావించేవారా?
అయితే, బ్రిటన్‌లో ఒకప్పుడు టమోటాలను విషపూరిత పండ్ల తరహాలో చూసేవారు. దీనికి కారణం టమోటా మొక్కల ఆకులు సోలనేస్ జాతికి చెందిన ‘‘డెడ్లీ నైట్‌షేడ్’’ మొక్కలను పోలి ఉండేవి.
దీంతో చాలావరకూ టమోటాలను టేబుల్‌ను అందంగా అలంకరించుకునేందుకు వాడేవారని రవి పేర్కొన్నారు. అమెరికాలోనూ 1800ల వరకూ టమోటాలను చాలా సందేహాలు వెంటాడేవని ఆయన వివరించారు.
అంతేకాదు దీన్ని ‘‘పాయిజన్ యాపిల్’’అని కూడా పిలిచేవారు. ‘‘వీటిని తినే ధనవంతులు మరణించినట్లు కొన్ని పుస్తకాల్లో పేర్కొన్నారు. అయితే, అవి తప్పుడు వార్తలు. ఆ మరణాలకు కారణం వారు ఉపయోగించే ‘ప్యూటర్’ పాత్రలని ఆ తర్వాత కాలంలో తేలింది. ఆ పాత్రల్లో లెడ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండేవి’’ అని రవి పేర్కొన్నారు.
‘‘టమోటాలలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. లెడ్‌తో ఈ యాసిడ్ చర్యలు జరపడంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది’’ అని రవి ఆ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోకి టొమాటో ఎలా వచ్చింది?
టమోటాలను భారత్‌కు పరిచయం చేసింది పోర్చుగీసువారని ఫుడ్ హిస్టారియన్ కేటీ అచ్చయ్య తన పుస్తకం ‘ఇండియన్ ఫుడ్: ఎ హిస్టారిల్ కంపానియన్’లో పేర్కొన్నారు.
‘‘టమోటాలు, మొక్కజొన్న, అవొకాడో, జీడిపప్పు, క్యాప్షికమ్ లాంటి చాలా పంటలను పోర్చుగీసువారు భారత్‌లో ప్రవేశపెట్టారు’’ అని కేటీ అచ్చయ్య తన పుస్తకంలో వివరించారు.
‘‘ఇక్కడ ఉష్ణోగ్రతలు టమోటా పంటకు చక్కగా సరిపోతాయి. భారత నేలలు కూడా దీనికి అనువుగా ఉంటాయి’’ అని రవి వివరించారు.
‘‘అయితే, భారత్‌లోనూ మొదట ఎక్కడ ఈ పంట మొదలైందో చెప్పండం కష్టం. అయితే, బ్రిటిషర్ల పాలనా కాలంలో ఈ పంట విస్తీర్ణం మరింత పెరిగింది. ఈ పంట చాలావరకు బ్రిటిషర్లకే వెళ్లేది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతలా ఎలా కలిసిపోయింది?
తెలుగు నేలలోని వంటల్లో టమోటా ఇంతలా ఎలా కలిసిపోయిందో ఫుడ్ హిస్టారియన్ డాక్టర్ పూర్ణచందు బీబీసీతో మాట్లాడారు.
‘‘టమోటాలకు మన దేశంలో రెండు వందల ఏళ్ల కంటే చరిత్ర లేదు. మొదట్లో టమోటాలు ఉసిరి కాయంత పరిమాణంలో ఉండేవి. కానీ, హైబ్రిడ్ టొమాటో వచ్చాక వీటి వినియోగం బాగా పెరిగింది. అసలు టమోటా లేకుండా వంట లేదనే స్థాయికి వెళ్లింది’’ అని ఆయన అన్నారు.
ముఖ్యంగా చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాడటం వల్లే టమోటా ఇంతలా కూరల్లో కలిసిపోయిందని ఆయన అన్నారు.
‘‘చింతపండుకంటే ధర తక్కువగా ఉండటం, దీని కంటూ ప్రత్యేక రుచి ఉండటం, పైగా అన్ని కూరగాయలతోనూ కలిసిపోవడం వల్లే వీటి వినియోగం బాగా పెరిగింది. నేడు టమోటాతో మాత్రమే వంట చేయాలనే స్థాయికి ఇది వెళ్లింది. ఇదంతా గత 30 ఏళ్లలో జరిగిన పరిణామం’’ అని ఆయన చెప్పారు. కానీ, ఆ స్థాయిలో ఉత్పత్తి పెరగకపోవడం వల్లే ధర పెరుగుతోందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అదే ఉత్తర భారత దేశం వంటల్లో టమోటా ఇంతలా కలిసిపోవడానికి ఎక్కువ పంజాబీ వంటల ప్రభావమే కారణమని జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, ఫుడ్ హిస్టారియన్ పుష్పేశ్ పంత్ అన్నారు.
‘‘ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు లేదా యూపీలో ఇంత టమోటాల వినియోగం ఉండేది కాదు. కానీ, పంజాబీ ఢాబాల ప్రభావంతో దాదాపు అన్నీ ప్రాంతాల్లోనూ టమోటా గ్రేవీలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా టమోటా దోశ తిన్నారా? లేదు. దక్షిణాదిలో ఎర్రగా కనిపించే పదార్థాలను తామసిక్‌గా భావిస్తారు. దేవాలయాల్లోనూ వీటిని ఉపయోగించేవారు కాదు. రాజస్థాన్‌లోనూ ఇంతే. కశ్మీర్‌లోనూ అంతే’’ అని ఆయన అన్నారు.
‘‘కానీ, నేడు పరిస్థితి చాలా మారింది. బ్రిటిషర్ల ప్రభావంతో టమోటాల దగ్గర నుంచి టమోటా సాస్‌ల వరకూ అన్నింటా ఇవి కనిపిస్తున్నాయి. మోమోలు, పకోడీలు, బర్గర్లు అన్నింటిలోనూ టమోటా సాస్ కనిపిస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలోనూ దోశతో రెడ్ చట్నీ ఇస్తున్నారు. అది టమోటాలతో చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
రెండో స్థానంలో ఇండియా
టమోటాల దిగుబడిలో నేడు ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో భారత్ ఉంది. 2022లో టమోటాల దిగుబడి 20 మిలియన్ల టన్నులకుపైనే ఉందని నేషనల్ హార్టీకల్చర్ బోర్డు గణంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లో 14.63 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 10.92 శాతం, కర్ణాటకలో 10.23 శాతం టమోటాలు పండుతున్నాయి.
ఇక ధరల విషయానికి వస్తే, భారీగా పెరుగుదల అనేది తాత్కాలికమేనని, త్వరలో ఇవి తగ్గుతాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రోహిత్ కుమార్ సింగ్ పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.
‘‘కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షాలు పడటంతో రవాణాపై ప్రభావం పడుతోంది. మరికొన్నిచోట్ల వర్షాల వల్ల పంట దెబ్బతింది. వర్షాకాలం మొదలు కావడంతో ప్రస్తుతం హెచ్చతుగ్గులు కనిపిస్తున్నాయి. ఇవి డిమాండ్-సరఫరా వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్యలు. కాబట్టి ధరల పెరుగుదల తాత్కాలికమే’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















