‘తలనొప్పి తగ్గిస్తానని నా కపాలానికి రంధ్రం చేసి జీవితాన్నే నాశనం చేశాడు’.. ప్రముఖ న్యూరోసర్జన్‌పై మహిళ ఆరోపణ

- రచయిత, లూసీ ఆడమ్స్
- హోదా, బీబీసీ స్కాట్లండ్
అప్పటికి లీన్ సదర్‌ల్యాండ్ వయసు 21 ఏళ్లు. ఆమె తీవ్రమైన మైగ్రేన్(తల నొప్పి)తో బాధపడేవారు. స్కాట్లండ్‌లోని ప్రముఖ సర్జన్లలో ఒకరు తన ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పారు.
దీని కోసం కొన్ని రోజులు ఆసుపత్రిలోనే గడపాల్సి ఉంటుందని ఆమెకు సూచించారు. మైగ్రేన్ నుంచి ఆమె కోలుకునే అవకాశాలు 60 శాతం వరకూ ఉంటాయని చెప్పారు.
అయితే, దీనికి భిన్నంగా నెలలపాటు ఆమె ఆసుపత్రిలోనే గడపాల్సి వచ్చింది.
ఆ సమయంలో డాక్టర్ శామ్ ఇజామెల్ ఆమెకు ఏడు ఆపరేషన్లు చేశారు.
స్కాట్లండ్‌లోని టైసైడ్ ప్రాంతంలోని బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) విభాగంలో న్యూరోసర్జరీ హెడ్‌గా పనిచేసన శామ్ ఇలా ఏళ్లపాటు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేశారని బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.
అయినప్పటికీ ఆయన ఆ పదవిలో కొనసాగేందుకు బోర్డ్ ఆఫ్ హెల్త్ అనుమతించింది.
టైసైడ్‌లోని ఎన్‌హెచ్ఎస్ విభాగం మాత్రం జూన్ 2013 నుంచే ఆయనపై సందేహాలు వచ్చాయని, అప్పటినుంచి ఆయనపై పర్యవేక్షణ కొనసాగించామని చెబుతోంది. అయితే, 2009 నుంచి ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినట్లు ఎన్‌హెచ్ఎస్‌లో పనిచేస్తున్న కొందరు బీబీసీతో చెప్పారు.
టైసైడ్‌లో శామ్‌తో కలిసి పనిచేసిన ముగ్గురు సర్జన్లతో బీబీసీ మాట్లాడింది. రోగుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టే పనులను చేసి ఎలాంటి మరకా చేతికి అంటుకోకుండా తప్పించుకోవడంలో శామ్ సిద్ధహస్తులని వారు చెప్పారు.
శామ్ అందరిపైనా అధికారం చెలాయించేవాడని, అతడిపై ఎవరూ చర్యలు తీసుకునేవారు కాదని ఆ ముగ్గురు సర్జన్లు చెప్పారు. ఎందుకంటే శామ్ పరిశోధనలతో తమ విభాగానికి నిధులు వచ్చేవని వివరించారు.
ప్రస్తుతం శామ్ దగ్గర చికిత్స పొందిన రోగులకు సాయం చేసేందుకు స్కాటిష్ ప్రభుత్వంతో తాము కలిసి పనిచేస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ హెల్త్ బీబీసీతో చెప్పింది.
తాము ఒక్కో కేసుపై విడిగా స్పందించాలని అనుకోవడంలేదని వివరించింది.

‘‘నేను ల్యాబ్ ర్యాట్ అయిపోయాను’’
2011లో ఆపరేషన్‌కు ముందు లీన్ ఉద్యోగం చేసేవారు. సెలవుల సమయంలో స్నేహితులతో కలిసి విదేశాలకు కూడా వెళ్లేవారు. కానీ, మైగ్రేన్‌తో ఆమె చాలా ఇబ్బంది పడేవారు.
స్కాట్లండ్‌లోని అత్యుత్తమ న్యూరోసర్జన్లలో శామ్ కూడా ఒకరు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాయం చేస్తానని ఆమెకు శామ్ చెప్పారు.
ఒకేఒక్క ఆపరేషన్‌తో సమస్య తగ్గుతుందని, కొన్ని రోజుల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చని ఆమెతో శామ్ అన్నారు.
ఒత్తిడి తగ్గించేందుకు కపాలంలో ఒక చిన్న భాగాన్ని తొలగిస్తామని, ఆ ప్రాంతంలో గాయాన్ని పూడ్చేందుకు ఒక కొత్త గ్లూ ఉపయోగిస్తామని లీన్‌కు శామ్ చెప్పారు.
‘అయితే, ఆ రంధ్రం సరిగా పూడ్చలేదు. దీంతో తలలోని ద్రవాలు ఆ రంధ్రం నుంచి బయటకు వచ్చేవి’ అని లీన్ చెప్పారు.
‘ఆ గాయం అలా తెరచి ఉంచినట్లే కనిపించేది. దాని నుంచి వచ్చే ద్రవాలూ నా మెడపై కారుతూ కనిపించేవి’ అని ఆమె తెలిపారు.
ఆ హాస్పిటల్‌లోని ఆమె బెడ్ మొత్తం మెదడు నుంచి వచ్చిన ‘‘సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్’’తో తడిసిపోయేదని ఆమె చెప్పారు.
బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు లేచినప్పుడు ఎక్కడపడితే అక్కడ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి ఆమె వెళ్లిపోయేవారు.
అక్కడి నేల మొత్తం ఆమె బుర్ర లోనుంచి వచ్చే ద్రవాలు పడేవి. ఆ చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా ‘‘వెట్ ఫ్లోర్’’ అని సంకేతం కనిపించే హెచ్చరికలను కూడా పెట్టేవారు.
‘‘అసలు నాకు ఏం అవుతోందో చూసేందుకు రావాలని శామ్ దగ్గరకు వెళ్లి మా అమ్మ పిలిచేవారు. ఆయన రావడం మళ్లీ నన్ను సర్జరీ రూమ్‌కు తీసుకెళ్లడం.. ఇవన్నీ సాధారణం అయిపోయాయి.’’ అని లీన్ చెప్పారు.
నెలలపాటు ఆ ఆసుపత్రిలోనే లీన్ గడిపారు. అక్కడే ఆమెకు మెనింజైటిస్, హైడ్రోసెఫలస్ లాంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చాయి.

ఆమె వెన్నుపాములోకి శామ్యూల్ నాలుగుసార్లు సూదులు చొప్పించి ‘లంబార్ పంక్చర్’లు చేశారు.
అసలు అన్నిసార్లు ఆమెకు పంక్చర్‌లు చేసుండాల్సిందికాదని ఆమె రిపోర్టులు చెబుతున్నాయి.
ఒక రీసెర్చ్ ట్రయల్‌లో భాగంగా ఒక కొత్త గ్లూను తనకు ఇస్తున్నారని లీన్‌కు తెలుసు.
‘‘కానీ, నాపై జరిగింది ఒక పూర్తి స్థాయి ప్రయోగం. నేను ఆయన ల్యాబ్‌లో ఒక ఎలుకలా మారిపోయాను.’’ అని ఆమె చెప్పారు.
‘‘నా శరీరంపై పూర్తి హక్కులను ఆయనకు ఇచ్చేసినట్లు అయింది. నా శరీరంతో ఆడుకుంటున్నట్లుగా అనిపించింది. ఏడుసార్లు నా బుర్రలోకి ఆయన కత్తులను చొప్పించారు.’’ అని ఆమె వివరించారు.
అసలు ఏదో తప్పు జరుగుతోందని అక్కడి సిబ్బందికి లీన్ చెప్పేటప్పుడు.. ‘శామ్ మీ ప్రాణాలు కాపాడుతున్నారు.’’అని అక్కడి వారు చెప్పేవారు.
అయితే, బీబీసీలో వార్తలు చూసిన తర్వాతే తన లాంటి చాలా మంది ఇలాంటి వేదనను అనుభవించారని ఆమెకు తెలిసింది.

ఇప్పుడు ఎలా ఉన్నారు?
ఇప్పుడు లీన్ వయసు 33 ఏళ్లు. నిరంతరం నొప్పిని ఆమెను భరించాల్సి వస్తోంది. నడవడానికి ఆమె చేతి కర్రల సాయం తీసుకుంటున్నారు. మెదడు నుంచి వచ్చే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లను సేకరించేందుకు ఆమెకు ‘షంట్’గా పిలిచే ఒక ట్యూబ్‌ను అమర్చారు.
‘‘అంతా మారిపోయింది’’అని ఆమె అన్నారు. ‘‘నేను ఒక పోలీసు అధికారిని కావాలని అనుకున్నాను. కానీ, అది ఎప్పటికీ జరగదు. అసలు కెరియర్ అనేది ఇక ఉండబోదని అంగీకరించడానికి కాస్త సమయం పట్టింది. నేను అనుకునేటట్లుగా ఇక బతకలేను. నాకు పిల్లలు కూడా ఉండరు. అసలు ఏ తప్పూ చేయకుండానే నేను శిక్షను అనుభవించాల్సి వస్తోంది.’’అని ఆమె అన్నారు.
అసలు శామ్ వల్ల ఎంత మంది ఇలా అనారోగ్య సమస్యల బారినపడ్డారో తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరుతున్న వందల మంది రోగుల్లో లీన్ కూడా ఒకరు.
ఆమెతోపాటు చాలా మందికి శామ్ మిగిలిచ్చిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. అయితే, దీనిలో బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు కూడా పాత్ర ఉందని, ఇతర ఏ సర్జన్ కూడా ఇలాంటి ఆపరేషన్లు చేయకుండా చూడాలని ఆమె కోరుతున్నారు.
చాలా మంది రోగులను ఇలానే శామ్ అనారోగ్యంపాలు చేసినట్లు బీబీసీ స్కాట్లండ్ వార్త చూసి తాను తెలుసుకున్నట్లు లీన్ చెప్పారు.
‘‘మొదట్లో నా ఒక్కదానికే ఇలా చేశారని అనుకున్నాను. ఇలాంటి మరో 99 మంది ఉన్నారని నాకు తెలియదు. అసలు ఇన్ని తప్పులు చేసి ఆయన చేతులు ఎలా దులిపేసుకుంటారు?’’అని ఆమె ప్రశ్నించారు.
సస్పెన్షన్..
2013లో వరుస దర్యాప్తుల అనంతరం టైసైడ్ ఎన్‌హెచ్ఎస్ శామ్‌పై సస్పెన్షన్ విధించింది. ఆ తర్వాత ఆయన లిబియాకు వెళ్లిపోయారు.
అయితే, శామ్‌తో కలిసి పనిచేసిన ముగ్గురు సర్జన్లు బీబీసీతో మాట్లాడారు. ఈ తప్పుల నుంచి బోర్డ్ ఆఫ్ హెల్త్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని, అందుకే తాను మీడియాతో మాట్లాడుతున్నానని మార్క్ (పేరు మార్చాం) చెప్పారు.
‘‘నేను మొదట్లోనే ఆందోళన వ్యక్తంచేశాను. కానీ, ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఈ విషయాన్ని మరింత మందికి తెలియజేయకపోవడంలో నాదీ తప్పుంది. అయితే, అప్పట్లో నేను కొత్తగా సర్వీసులో చేరాను. కాబట్టి పెద్దగా ఏమీ చేయలేకపోయాను.’’అని ఆయన చెప్పారు.
‘‘ఇక్కడి పేషేంట్లకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండకుండా ఆయన ప్రైవేటు ప్రాక్టీసు కోసం వెళ్లిపోయేవారని ఇక్కడి నర్సులు, సీనియర్ సర్జన్లు, మేనేజర్లకు కూడా తెలుసు.’’ అని ఆయన అన్నారు.
కొన్ని ఆపరేషన్లను పూర్తిగా జూనియర్ సర్జన్ల మీదకు వదిలేసి ఆయన బయటకు వెళ్లిపోయేవారని మార్క్ తెలిపారు.
‘‘ఆ జూనియర్‌లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయన కనీసం అందుబాటులో కూడా ఉండేవారు కాదు. అసలు ఆ రోగికి ఏమైనా తనకు అవసరంలేనట్లుగా ఆయన ప్రవర్తించేవారు.’’అని మార్క్ వివరించారు.
‘‘కానీ, టైసైడ్ ఎన్‌హెచ్ఎస్ ఇవన్నీ కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అప్పట్లో జరిగినవన్నీ బోర్డుకు తెలుసు.’’అని ఆయన చెప్పారు.
‘‘ఎవరూ ఏం చేసేవారు కాదు’’
‘‘ఒకసారి శామ్ రోగికి ఒక జూనియర్ సర్జన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రమాదవశాత్తు ఆ రోగి వెన్నుపాముకు జూనియర్ గాయం చేశారు.’’ అని మార్క్ చెప్పారు.
‘‘అప్పుడే తలలో నుంచి సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ బయటకు చిమ్మడం మొదలైంది. వెంటనే సర్జన్లు సీనియర్ సర్జన్ కోసం పరుగులు తీశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ రోగి పూర్తిగా వికలాంగుడు అయిపోయాడు.’’అని ఆయన తెలిపారు.
‘‘అసలు ఆ ప్రముఖ న్యూరోసర్జన్ తన రోగులకు ఏం సేవ చేశారు? చేసిందంతా నష్టమే. ఇప్పుడు అంతా కప్పిపుచ్చుతున్నారు. అందుకే ఆ కేసుల్లో ఏం జరిగిందో దర్యాప్తు చేపట్టాలి.’’ అని ఆయన డిమాండ్ చేశారు.
ఎక్స్-రే ఫలితాలకు వ్యతిరేకంగా శామ్ సూచనలు చేసేవారని, ఎందుకంటే ఆయన చాలా దురహంకార వ్యక్తి అని ఆ ముగ్గురు సర్జన్లు బీబీసీతో చెప్పారు.
వెన్నుపాములో అవసరమైన చోటకాకుండా వేరేచోట దాదాపు 70 మందికి శస్త్రచికిత్సలు జరిగుండొచ్చని, ఫలితంగా వీరిలో చాలా మంది వికలాంగులు అయ్యారని వారు తెలిపారు.
‘‘అయితే, ఆయన్ను ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే ఆయన పరిశోధనా ప్రాజెక్టుల వల్లే నిధులు వచ్చేవి. అందుకే ఎవరూ ఆయనకు ఎదురు ప్రశ్నించేవారు కాదు.’’ అని మార్క్ అన్నారు.
శామ్ వల్ల రోగులకు జరిగిన నష్టంపై దర్యాప్తు చేపట్టేందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు.. క్యాబినెట్ సెక్రటరీ, టైసైడ్ ఎంపీలను ఏప్రిల్‌లో కలిసినట్లు ఎన్‌హెచ్ఎస్ టైసైడ్ అధికార ప్రతినిధి చెప్పారు.
‘‘ఈ విషయంలో రోగులకు సాయం చేసేందుకు ఎన్‌హెచ్ఎస్ టైసైడ్ కట్టుబడి ఉంది. ఒక్కొక్క కేసులో ఏం జరిగిందో మేం దర్యాప్తు చేపడుతున్నాం. అయితే, విడివిడిగా ఆ కేసుల్లో ఏం జరిగిందో ఇప్పుడు మేం మాట్లాడలేం. ఎందుకంటే రోగుల వ్యక్తిగత గోప్యతకు మేం ప్రాధాన్యం ఇస్తాం.’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















