Night terror : ‘రాత్రుల్లో మా అబ్బాయి మరో వ్యక్తిలా మారిపోతాడు... నిద్రలోనే అరుస్తాడు, భయపడతాడు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండ పౌల్
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
‘‘మొదటిసారి అలా జరిగినప్పుడు నా కుమారుడు మతిమరుపులో ఉన్నాడేమో అనుకున్నాను. లేపేందుకు ప్రయత్నించాను. ప్రశాంతంగా ఉండాలని చెప్పాను. కానీ, నా బిడ్డ వేరే ప్రపంచంలో ఉన్నాడు. నా నుంచి దూరంగా ఉన్నాడు.’’
ఓలివియా గార్సియా తన నాలుగేళ్ల కొడుకు జువాన్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుకు చేసుకున్నారు.
2020 ప్రారంభం నుంచి తన కొడుక్కి రాత్రి భయాలు పట్టుకున్నాయని తెలిపారు.
ఈ నిద్ర రుగ్మతను పారాసోమ్నియాగా పేర్కొంటున్నారు.
దీని వల్ల కోపం, ఆందోళన, అరవడం, విపరీతమైన చెమటలు పడుతుంటాయి. కొన్నిసార్లు నిద్రలోనే పిల్లలు హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారు.
‘‘నా కొడుకు మరో వ్యక్తిలాగా మారిపోతాడు. ఎన్నో అర్థం కాని విషయాలు చెబుతుంటాడు. అరుస్తాడు, ఏడుస్తాడు. నేను వాడిని గట్టిగా హత్తుకుని, నా ప్రేమను పంచడానికి ప్రయత్నిస్తాను. కానీ, పిల్లాడు ఎవరి వశమో అయినట్లు అనిపిస్తుంది. కళ్లు తెరిచి, కనుపాపలను పెద్దగా చేస్తాడు... ఆ సమయంలో చూడటానికి చాలా భయకరంగా అనిపిస్తాడు’’ అని సాంటియాగో డె చిల్లీలో నివసించే ఓలివియా చెప్పారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్(ఏఏఎస్ఎం) అంచనాల ప్రకారం, నైట్ టెర్రర్స్ ఎందుకు వస్తాయి అనే దానిపై పూర్తిగా అధ్యయనం చేయనప్పటికీ, పిల్లల్లో ఈ రేటు 1 శాతం నుంచి 6, 5 శాతం వరకు మధ్యలో ఉందని తెలిసింది.
5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 25 శాతం వరకు పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి రుగ్మతకు గురవుతున్నారని ఏఏఎస్ఎం అధ్యయనం పేర్కొంది.
ఇతర అధ్యయనాలు, ప్రముఖ ఆరోగ్య కేంద్రాలు 40 శాతం వరకు ఇలాంటి సమస్య బారినపడుతున్నారని తెలిపాయి.
ఈ సమస్యకు గురయ్యే పిల్లల సంఖ్య దేశ దేశానికి మారుతుంది.
ఇది ఎక్కువగా పిల్లల వయసుపై ఆధారడి ఉంటుంది.
ఏడాదిన్నర నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ రుగ్మత బాగా కనిపిస్తుంది. (ఆరు నెలల నుంచి 12 ఏళ్ల పిల్లలలో ఇది సాధారణంగా పరిగణిస్తున్నారు.)
పెద్ద వారిలో ఈ సమస్య కాస్త తక్కువగానే ఉంటుంది. 65 ఏళ్లు పైబడిన వారిలో 1 శాతం మాత్రమే ఈ కేసులు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, FERNANDA PAUL
పిల్లలకి ఈ సమస్య ఎందుకొస్తుంది?
నైట్ టెర్రర్స్(రాత్రి భయాలు) సాధారణంగా గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత మూడో దశలో అంటే ఎన్3 స్టేజీలో కలుగుతుంటాయి.
ఇవి ఐదు నుంచి 15 నిమిషాల పాటు ఉంటాయి. కొన్ని కేసుల్లో ఈ భయాలు ఎక్కువ సేపు కూడా ఉండొచ్చు.
అయితే, ఈ రుగ్మతకు కారణమేంటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఎక్కువగా అలసిపోవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, విపరీతమైన జ్వరం వీటికి కారణం కావొచ్చు.
అంతేకాక, ఇది జన్యుపరంగా కూడా రావొచ్చు. అబ్బాయి లేదా అమ్మాయి బంధువుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, పిల్లలకి వచ్చే అవకాశం ఉందని మాయో క్లినిక్ తెలిపింది.
ఈ రకమైన రుగ్మత వల్ల బాధపడుతున్నప్పుడు, పిల్లలు ఎలా స్పందిస్తుంటారనే విషయాలపై బీబీసీ ముండోకి చైల్డ్ న్యూరాలజిస్ట్ టటియానా మునోజ్ వివరించారు.
‘‘పిల్లలు ఒక్కసారి నిద్రలోంచి దుడుచుకుని లేస్తారు. బెడ్‌పై కూర్చోవడం లేదా బెడ్‌పై నుంచి కిందకి పడిపోవడం చేస్తారు. భయకరంగా అరుస్తారు. బాగా భయపడతారు. చూడటానికి కూడా ప్రమాదకరంగా మారతారు.’’ అని ఆమె వివరించారు.
‘‘ఆ సమయంలో పిల్లల గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగంగా తీసుకుంటారు. బాగా చెమటలు పట్టేస్తుంటాయి. ముఖమంతా ఎర్రగా మారిపోతుంది. కళ్లు, కన్నురెప్పలు పెద్దవిగా చేస్తారు. ఆందోళనకరంగా కనిపిస్తారు. వణుకుతారు.’’ ఇవన్ని పిల్లల శరీరంలో ఏర్పడుతుండొచ్చని కూడా డాక్టర్ చెప్పారు.
అయితే, నైట్ టెర్రర్స్‌తో బాధపడుతున్న పిల్లలకి సాధారణంగా ఆ విషయం తర్వాత రోజు ఉదయానికి గుర్తుండవు. వీటిని చూసిన తర్వాత కూడా వారు మళ్లీ ప్రశాంతంగా, గాఢ నిద్రలోకి వెళ్తుంటారు.
జువాన్ కేసు కూడా ఇదే. ముందు రోజు రాత్రి ఏం చేశావన్న విషయాలను ఎవరన్నా ఆ పిల్లాడికి చెబితే కనీసం అర్థం కూడా కావని తల్లి చెప్పారు.
ఈ భయాలు సాధారణంగా సీక్వెల్స్‌లాగా ఉండవు.
‘‘సులువుగా చెప్పాంటే, మెదడులో ఇదొక షార్ట్ సర్క్యూట్ లాంటిది’’ అని క్రిస్టస్ కేథలిక్ యూనివర్సిటీ హెల్త్ నెట్‌వర్క్‌కి చెందిన నిపుణుడైన నిద్రా డాక్టర్ పాబ్లో బ్రోక్‌మాన్ బీబీసీ ముండోకి చెప్పారు.
‘‘రాత్రి భయాలకు చాలా వరకు ఎలాంటి ప్రత్యేక కారణమంటూ ఉండదు. పిల్లల్లో మూర్ఛ లేదా రుగ్మత లాంటి ఏ సమస్య కూడా దీనికి కారణం కాదు. 90 శాతం కేసులు దానికంతట అవే వచ్చి వెళ్లిపోతుంటాయి. ’’ అని పాబ్లో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పీడకలలు కావు
పీడకలలకు లేదా నిద్రలో నడకకు ఈ రుగ్మత పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
‘‘ గాయం లేదా అనుభవం లేదా రోజులో వారికి ఎదురయ్యే సమస్యలు వంటివేవీ కూడా ఈ రాత్రి భయాలతో(నైట్ టెర్రర్స్‌తో) సంబంధం ఉండదు. ఇవి చాలా వరకు మానసిక స్థితితోనే సంబంధాన్ని కలిగి ఉంటాయి’’ అని డాక్టర్ పాబ్లో బ్రోక్‌మాన్ చెప్పారు.
‘‘ గాఢమైన నిద్రలో కాకుండా ఆర్ఈఎం నిద్రలో మనకు పీడకలలు వస్తుంటాయి.’’ అని పాబ్లో బ్రోక్‌మాన్ చెప్పారు. ఆర్‌ఈఎం నిద్ర అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఈ స్థితిలో కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి.
నిద్రలో నడకను చూసుకుంటే, ఇది చాలా వరకు శరీర అవయవాలకు అనుగుణంగా ఉంటుందని పాబ్లో బ్రోక్‌మాన్ చెప్పారు.
‘‘నిద్రలో నడిచే వారు ఎలాంటి భయాలు లేదా ఆందోళనలు లేకుండా నడుస్తారు. మాట్లాడతారు. కూర్చుంటారు. కానీ, రాత్రి భయాలు అలా కాదు. ఇది పూర్తిగా ఆందోళనకరంగా ఉంటుంది. ఎక్కువ టెన్షన్‌కు గురవుతుంటారు. చాలా ప్రమాదకరంగా మారతారు. పూర్తిగా నియంత్రణ కోల్పోతారు’’ అని ఆయన చెప్పారు.
రాత్రి భయాల అనుభవాన్ని పొందే చిన్న పిల్లల్లో కొందరు, ఆ తర్వాత నిద్రలో నడిచే వారికి మారిపోతుంటారు అని నిపుణులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మనం ఏం చేయగలం?
రాత్రి భయాలను ఎదుర్కొనే వారు, పిల్లల్ని దగ్గరికి తీసుకోవడానికి మించి మరింత చేయాల్సి ఉంటుంది.
‘‘నేను పిల్లాడిని మరింత దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. నీతో అమ్మ ఉందని చెబుతాను. ప్రతీది సద్దుకుంటుంది అంటాను. ఒకవేళ వాడు నన్ను ఎవరో తెలియని వ్యక్తిగా భావిస్తే, నిద్రలోనే నన్ను పిలుస్తూ ఉంటాడు.’’ ఓలివియా గుర్తుకు చేసుకున్నారు.
ఆ సమయంలో పిల్లల్ని లేపి, వారిని ఓదార్చడం కష్టమవుతుందని న్యూరాలజిస్ట్ టటియానా మునోజ్ చెప్పారు.
కానీ, ఇలా చేయడం ద్వారా వారి ఆందోళన మరింత పెరగకుండా తగ్గించవచ్చు. ఆ బాధ నుంచి బయటికి తీసుకురావొచ్చని అన్నారు.
కొన్ని ఉపశమన విధానాలు కూడా సాయం చేస్తాయని పాబ్లో బ్రోక్‌మాన్ వివరించారు.
రాత్రి పూట మొదటి భాగంలో వారి నిద్రకు అంతరాయం కలిగించకుండా ఉండటం, నిద్రపోయే ముందు టీవీని చూడకుండా ఉండటం వంటి విధానాల ద్వారా దీన్ని అధిగమించవచ్చని నిద్ర నిపుణులు చెప్పారు.
కొన్ని కేసుల్లో ఉదాహరణకు ఇది చాలా తరుచుగా జరుగుతున్నప్పుడు లేదా సాధారణ స్థితిలో వారు లేనప్పుడు వైద్య నిపుణులకు చూపించడం మంచిది.
జువాన్‌లో రాత్రి భయాలు(నైట్ టెర్రర్స్) బాగా ఎక్కువయ్యే సరికి ఓలివియా పిల్లాడిని వైద్యులకు చూపించారు.
‘‘పరిస్థితి మా చేయి దాడుతుందని మాకు అనిపించినప్పుడు మేము డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. వారు ఎంత దగ్గరగా ఉన్నా, పిల్లాడి నియంత్రణ కోల్పోతున్నాడు. వింతగా కదులుతుంటాడు. ఆ సమయంలో ఎక్కడ లేని బలమంతా వస్తుంది’’ అని ఓలివియా చెప్పారు.
జువాన్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) చేయించారు. మెదడు ఎలక్ట్రికల్ కార్యకలాపాలలో సమస్యలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.
దీని ద్వారా పిల్లాడి నిద్ర విధానాలను గమనించడమే కాకుండా, ఇతర సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకుంటారు.
ఇతర పిల్లల మాదిరిగానే జువాన్ కూడా సాధారణ నిద్రనే పోతున్నాడని ఈ ఫలితాల్లో తెలిసింది. ఇతర ఫాథోలజీలు లేవని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా తర్వాత నిద్ర లేమి పెరిగిందా?
కరోనా మహమ్మారి కాలం నుంచి జువాన్‌కు రాత్రి భయాలు పట్టుకున్నాయి.
‘‘మహమ్మారి జువాన్‌పై ప్రభావం చూపుతుంటాది. ఆ సమయంలో జువాన్ చిన్న పిల్లాడు. రోజంతా ఆన్‌లైన్ క్లాస్‌లు వినాల్సి వచ్చేది. ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అది చాలా క్లిష్టతరమైన పరిస్థితి’’ అని ఓలివియా గుర్తుకు చేసుకున్నారు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఎన్నో నిద్ర రుగ్మతలు తలెత్తాయని చాలా అధ్యయనాలు తెలిపాయి.
కొందరు నిపుణులు దీన్ని కరోనాసోమ్నియా లేదా కోవిడ్-సోమ్నియాగా పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లో నిద్ర లేమి ఎదుర్కొంటున్న వారు ప్రతి ఆరుగురిలో ఒకరి నుంచి ప్రతి నలుగురిలో ఒకరు ఎదుర్కోవడం పెరిగిందని యూకేలోని సౌతాంప్టన్ యూనివర్సిటీ 202 ఆగస్ట్‌లో చేపట్టిన అధ్యయనంలో పేర్కొంది.
దీనికి పిల్లలేమీ మినహాయింపు కాదని చెప్పింది.
కరోనా మహమ్మారి వల్ల స్లీప్ పాథోలజీ చాలా మారిందని పాబ్లో బ్రోక్‌మాన్ వివరించారు. పిల్లల్లో ఈ రుగ్మతలు చాలా సాధారణమయ్యాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ప్రిగోజిన్, వాగ్నర్ గ్రూప్: ఇది తిరుగుబాటేనా? పుతిన్ పీఠాన్ని కదిలించగలరా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














