వెట్టి చాకిరి: గాయమై కాలు కుళ్లిపోతున్నా రోజంతా బావిలో పని, రాత్రి పారిపోకుండా కాళ్లకు గొలుసులు... కూలీలపై కాంట్రాక్టర్ అరాచకాలు

మారుతి జటాల్కర్

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

ఫొటో క్యాప్షన్, మారుతి జటాల్కర్
    • రచయిత, ప్రవీణ్ థాక్రే
    • హోదా, బీబీసీ మరాఠీ

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో వెట్టి చాకిరి ఘటన వెలుగులోకి వచ్చింది.

భూమ్ తాలూకాలో బావులు తవ్వించే ఒక కాంట్రాక్టర్, దళారుల ద్వారా కూలీపని చేసేవారిని కొనుగోలు చేసి, వారితో నిర్బంధంగా రోజుకు 12 నుంచి 14 గంటల పని చేయిస్తున్నట్లు బయటపడింది.

ఈ కూలీల్లో ఒకరి కాలికి గాయాలు అయ్యాయి. ఆ గాయానికి చికిత్స చేయించలేదు. ఏమాత్రం కనికరం చూపకుండా ఆయనతో పనులు చేయించారు. పైగా పారిపోకుండా ఉండేందుకు వారిని గొలుసులతో బంధించారు.

కూలీల్లో ఇద్దరి వద్ద మాత్రమే మొబైల్ ఫోన్లు ఉన్నాయి. బయటి వారెవరితోనూ వారు మాట్లాడకుండా ఉండేందుకు ఆ ఫోన్లతో పాటు వారి వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను కూడా లాక్కున్నారు.

తిరగబడిన కూలీలను కర్రలతో, మెషీన్ పైపులతో కొట్టారు. రోజంతా ఖాళీ లేకుండా పని చేయించడంతో పాటు వారు పారిపోకుండా నిద్రపోయేందుకు బలవంతంగా ఆల్కహాల్ తాగించారు.

కూలీలు

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

పోలీసులకు అందిన సమాచారం ఏంటి?

ఈ అమానవీయ చర్యను గుర్తించిన పోలీసులు రెండు ప్రాంతాల నుంచి 11 మంది కూలీలను రక్షించారు.

ఈ ఘటనలో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మొత్తం 11 మంది కూలీలను ఈ చెర నుంచి విడిపించారు. వీరంతా మహారాష్ట్రలోని వివిధ జిల్లాలకు చెందినవారు. వీరంతా వేర్వేరు పనుల కోసం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సమీపంలోని లేబర్ అడ్డాకు వచ్చారు.

వీరిలో కొంత మంది తమ గ్రామాల్లో పని దొరక్కపోవడంతో, మరికొంతమంది తల్లిదండ్రులతో గొడవ పడి డబ్బు సంపాదించడం కోసం వచ్చారు.

ఇందులో ఒక వ్యక్తి కూతురి పెళ్లికి డబ్బు కోసం పని వెదుక్కుంటూ వచ్చారు.

అయితే, వీరందర్నీ ఒక దళారి ఉస్మానాబాద్ జిల్లాకు పంపించారు. తర్వాత వారిని వఖార్వాడి, ఖామస్వాడి గ్రామాల్లో బావి తవ్వే పనిలో పెట్టారు.

భగవాన్ గుక్సే

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

ఫొటో క్యాప్షన్, మంగేశ్ షిడోల్, భగ్వాన్ గుక్సే

కూలీలపై హింస

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బావిలో పని చేయించేవారు. ఒక్కోసారి పని పూర్తయ్యేంతవరకు వారు పని చేస్తూనే ఉండాల్సి వచ్చేది.

దీని తర్వాత రాత్రి వేళ తినడానికి ఏదైనా ఇచ్చేవారు. పారిపోకుండా వారి కాళ్లను గొలుసులతో బంధించేవారు.

ఎదురు మాట్లాడితే దారుణంగా కొట్టేవారు. నీటిలో 14 గంటల పాటు పనిచేయడంతో కూలీలు అందరి కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇలా వారి చెరలో చిక్కుకున్న కూలీల్లో ఔరంగాబాద్‌కు చెందిన ప్రణవ్ కూడా ఒకరు. ప్రణవ్ కాలుకు తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆయన రోజూ పని చేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం ప్రణవ్‌ ఔరంగాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకవేళ చికిత్స ఇంకా ఆలస్యం అయ్యుంటే ప్రణవ్ కాలును కోల్పోవాల్సి వచ్చేది.

మొత్తం 11 మంది కూలీలను వారు బంధీలుగా చేసుకొని వారిలో ఆరుగురిని ఒక చోట, మరో అయిదుగురిని మరో చోట పనిలో పెట్టారు.

వీరిలో ఒకరు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లి తన కుటుంబానికి జరిగినదంతా చెప్పారు.

తర్వాత, మిగతా కూలీలకు చెందిన కుటుంబీకులు ఉస్మానాబాద్‌లోని ధోఖీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే, తొలుత దీన్ని పోలీసులు నమ్మలేదు. కుటుంబీకుల విజ్ఞప్తి మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ బంధీలుగా ఉన్న కూలీలను రక్షించారు. అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితుల్లో కాంట్రాక్టర్ కృష్ణ బాలు షిండే, కిరణ్, సంతోష్ శివాజీ జాధవ్, మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

సందీప్ గుక్సే

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

ఫొటో క్యాప్షన్, సందీప్ గుక్సే

‘‘ కాలు కుళ్లిపోతున్నా పని చేయించారు’’

హింగోలి జిల్లా కవ్తా గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు భగ్వాన్ గుస్కే, సందీప్ గుస్కే పని వెదుక్కుంటూ అహ్మద్‌నగర్‌కు వచ్చారు.

పని ఇప్పిస్తానంటూ చెప్పి ఒక బ్రోకర్ తమను దాబా వద్దకు తీసుకెళ్లినట్లు వారు చెప్పారు. అక్కడ ఆల్కహాల్ తాగిన తర్వాత కారులో తమను తీసుకెళ్లినట్లు వారు తెలిపారు.

ఒక రోజంతా కారులో తిప్పినట్లు చెప్పారు.

‘‘రోజంతా కారులో తిరుగుతూనే ఉన్నాం. సాయంత్రానికి కారు ఒక బావి దగ్గరికి వచ్చింది. అక్కడ మా ఇద్దరినీ వేరు చేశారు. సందీప్‌ను మరో బావి దగ్గరికి తీసుకెళ్లారు. ఆరోజు రాత్రికి మాకు మళ్లీ మద్యం ఇచ్చారు. తర్వాత మేం పడుకున్నాం.

మరుసటి రోజు ఉదయమే మమ్మల్ని బావి వద్దకు పని చేయడం కోసం తీసుకెళ్లారు. టీ లేదా అల్పాహారం లాంటివి ఏమీ ఇవ్వలేదు. మా కంటే ముందు అక్కడికి వచ్చి పనిచేస్తున్నవారితో మాట్లాడినప్పుడు అక్కడ మద్యం తప్ప మరొకటి దొరకదని మాకు అర్థమైంది. మధ్యాహ్న భోజనానికి కూడా మాకు సమయం ఇవ్వలేదు. పని అయ్యాక సాయంత్రం కూడా మద్యం ఇచ్చారు. వద్దని చెప్పినందుకు నన్ను కొట్టారు. ఏం చేయాలో అర్థం కాలేదు. రోజూ ఇదే తంతు కొనసాగింది.

నాతో పనిచేసే ఇంకో వ్యక్తి కాలికి గాయమైంది. దానివల్ల కాలు కుళ్లిపోయే స్థితికి చేరింది. అయినప్పటికీ అతనితో పని చేయిస్తూనే ఉన్నారు. తర్వాత మా పరిస్థితులు ఎలా ఉండనున్నాయో నాకు అర్థమైంది. ఆహారం కూడా చాలా కొద్ది పరిమాణంలోనే ఇచ్చేవారు. నీళ్లు కలిపిన చట్నీతో తినమనేవారు. అది తినకపోతే కొట్టేవారు. ఎలా అడ్డుకోవాలో కూడా తెలియలేదు. చాలా భయంకర పరిస్థితులు ఉండేవి. స్నానం అనే మాటే లేదు. స్నానం సంగతి పక్కన పెడితే, టాయ్‌లెట్‌కు కూడా నీటిని ఇవ్వలేదు.

అదే పరిస్థితుల్లో నేనూ చచ్చిపోతానేమో అనుకున్నా. ఒకరోజు ఉదయం 3:30 గంటలకు లేచి పారిపోయేందుకు బూట్లు వేసుకున్నా. నా కాళ్లకు బిగించిన గొలుసుకు తాళం వేసి ఉంది. దాన్ని తీసే క్రమంలో నా వేలుకు దెబ్బ తగిలి వాచిపోయింది. అరగంట కష్టపడిన తర్వాత తాళం తీసి మెల్లిగా చెరుకు తోట చాటు నుంచి బయటపడ్డాను. అక్కడ నుంచి రైలు వెళ్తుంటే దాన్ని ఎక్కాను.

ఒక గ్రామంలో దిగి అక్కడున్న ఒక ఎలక్ట్రిక్ దుకాణంకు వెళ్లి ఫోన్ పే ఉందా అని అడిగాను. 500 రూపాయలు ఫోన్ పే చేయమని ఇంట్లో వాళ్లని అడిగాను. అక్కడి నుంచి డబ్బు తీసుకొని లాథూర్ వెళ్లారు. అక్కడ మా సోదరులతో పాటు స్నేహితులు ఉన్నారు. వారి నుంచి కొంత డబ్బు తీసుకొని మా గ్రామానికి వెళ్లాను. జరిగిందంతా అక్కడ చెప్పి 30-40 మందిని తీసుకని ధోఖీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను.

అక్కడి పోలీసులు మొదట నేను చెప్పినదంతా నమ్మలేదు. ఇలా జరిగే ప్రసక్తే లేదని వారు అన్నారు. కానీ, నేను వారిని ప్రాధేయపడ్డాను. నాతో పాటు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించాల్సిందిగా కోరాను. అక్కడికి తీసుకెళ్లి వారికి అంతా చూపించాను. మమ్మల్ని కట్టేసిన గొలుసులను చూపించాను. అప్పుడు నిందితులను అదుపులోకి తీసుకొని మా సోదరుడిని విడిపించారు. నిందితులకు అక్కడ మంచి నెట్ వర్క్ ఉంది. పని చేసే బావి దగ్గర కేవలం ఇద్దరు మాత్రమే ఉంటారు. కానీ, ఒక్క ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి అందరూ వస్తారు’’ అని భగ్వాన్ గుక్సే వారు పడిన బాధల్ని చెప్పుకొచ్చారు.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర: కూలీల కాళ్ళకు గొలుసులు కట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్న కాంట్రాక్టర్

‘‘రాత్రి మద్యం తాగించి కాళ్లకు గొలుసులు వేసేవారు’’

వషీమ్ జిల్లాలోని సెలూ బజార్‌కు చెందిన అమోల్ నింబాల్కర్ తన కుటుంబంతో గొడవపడి పని వెదుక్కుంటూ అహ్మద్‌నగర్‌కు వెళ్లారు.

అక్కడ తనకు ఎదురైన అనుభవాలను అమోల్ వివరించారు.

‘‘అహ్మద్‌నగర్‌కు వెళ్లాక అక్కడ రైల్వే స్టేషన్‌లో కూర్చున్నా. హింగోలీకి చెందిన ఇద్దరిని అక్కడ చూశారు. వారితో మాట్లాడుతుండగా ఒక ఏజెంట్ వచ్చి నువ్వు పని చేస్తావా? అని అడిగారు. చేస్తాను అనగానే మమ్మల్ని ఆటోలో కూర్చొబెట్టి మాకు మద్యాన్ని ఇచ్చారు. మద్యం తాగిన తర్వాత మమ్మల్ని అడవిలోని ఒక దాబా దగ్గర దింపేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ మమ్మల్ని వేర్వేరుగా వాహనంలో తీసుకెళ్లి రాత్రిపూట బావి దగ్గర దింపేశారు. తర్వాత గొలుసులతో కట్టేయడానికి మా దగ్గరికి వచ్చారు.

ఎందుకు కట్టేస్తున్నారని నేను అడగగానే వారు నన్ను కొట్టడం మొదలుపెట్టారు. నన్ను కొట్టడం చూసి భయపడి మిగతా వారు నోరు మెదపలేదు. నా జేబులో నుంచి ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు.

పొద్దున గం. 5:30 వచ్చి మమ్మల్ని లేపారు. మేం టాయ్‌లెట్‌కు వెళ్లినా మా వెనుకే నిల్చునేవారు. కనీసం పళ్లు కూడా తోముకోనివ్వకుండా మమ్మల్ని పనికి తీసుకెళ్లేవారు.

దోఖీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్ రౌత్

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

10 గంటల సమయంలో తినడానికి ఏదో ఇచ్చేవారు. మధ్యాహ్నం పూట భోజనంలో బ్రెడ్, చట్నీ పెట్టేవారు. డిన్నర్ తర్వాత కూడా అంతా మర్చిపోయేందుకు మాతో మద్యం తాగించేవారు. వెంటనే కాళ్లను గొలుసుతో కట్టేసి వెళ్లేవారు.

బావిలో పని నెమ్మదించినట్లు అనిపించగానే పైనుంచి రాయితో కొట్టేవారు. ఒక రాయి నా చేతికి బలంగా తగిలింది. రాళ్లను పగులగొట్టడానికి బ్లాస్ట్‌లు చేయాల్సి వచ్చేది. వాటి వల్ల కూడా దెబ్బలు తగిలేవి. కాంట్రాక్టర్ తల్లి కూడా మమ్మల్ని తిట్టేవారు.

ఒకసారి మా ఇంటికి ఫోన్ చేస్తానని కాంట్రాక్టర్‌ను అడిగాను. ఇంకోసారి అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రణవ్ నాతో పాటే పనిచేసేవాడు. అతని కాలికి పెద్ద గాయం ఉంది. నీటిలో ఎక్కువ సేపు పనిచేయడం వల్ల నా కాళ్లు కూడా పాడయ్యాయి. ప్రణవ్ కాలి పరిస్థితి సరిగా లేదని, ఆసుపత్రికి తీసుకెళ్లమని కాంట్రాక్టర్ కృష్ణకు చెప్పాను. కానీ, ఆయన నా మాట వినలేదు. ఒకసారి ప్రణవ్ నేరుగా బావి యజమానితో మాట్లాడాడు. ఆ సంగతి తెలిసి కాంట్రాక్టర్ కృష్ణ ప్రణవ్‌ను తీవ్రంగా కొట్టాడు.

నేను అక్కడి నుంచి పారిపోవాలనుకున్నా. కానీ, పొద్దున్నుంచి బావిలో పనిచేసి రాత్రి బయటకు రాగానే కాళ్లకు గొలుసులు వేసేవారు. గొలుసులతో ఎలా పరిగెత్తగలను? నా కాలికి అయిన గాయంపై అతను పేలుడుకు వాడే రసాయన పదార్థాన్ని పూశాడు. మంటను ఆపుకోలేక నేను విపరీతంగా ఏడ్చాను. దాదాపు రెండు గంటల పాటు నా పాదాలను మట్టిలో రుద్దాను. అది తీవ్రమైన నొప్పి. కానీ, అతను ఏమాత్రం కనికరం చూపలేదు. ఇప్పుడు నేను ఇక మా గ్రామంలోనే పనికి వెళ్తాను. ఇక్కడ పనిచేస్తే 500 రూపాయలు దొరకుతాయి. అక్కడ 150 రూపాయలే ఇస్తారు’’ అని చెప్పారు.

బావి

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

‘‘కర్రలు, ఇంజిన్ పైపులతో కొట్టారు’’

మన్నూర్ తాలూకాలోని రూయ్ గ్రామానికి చెందిన భరత్ రాథోడ్ తన తల్లితో కలిసి ఉంటారు. ఆయన ఒక వ్యవసాయ కూలీ. భరత్ తండ్రి చనిపోయారు.

భరత్ కంటి మీద, కాలికి అయిన గాయాలు ఇంకా మానలేదు. కూలీలను కృష్ణ, సంతోష్‌లు తీవ్రంగా కొట్టేవారని ఆయన చెప్పారు.

‘‘పని కోసం నేను, నా స్నేహితుడు సంజయ్ వెళ్లాం. వారు మొదట మాకు మద్యం ఇచ్చి, తర్వాత తినడానికి ఏదో ఇచ్చారు. తర్వాత గొలుసులతో కట్టేయడానికి వస్తే సంజయ్ ఎందుకు మమ్మల్ని కట్టేస్తున్నారని అడిగారు. అతన్ని తీవ్రంగా కొట్టారు.

నేను దాదాపు అయిదు నుంచి ఆరు బావుల్లో పనిచేశాను. అక్కడ ఎనిమిది, తొమ్మిది అడుగుల మేర బురద మేట వేసి ఉండేది. కానీ, పని అంతా పూర్తయ్యే వరకు అక్కడి నుంచి తప్పించుకోలేం. పని అవ్వకపోతే కర్రలతో, ఇంజిన్ పైపులతో కొట్టేవారు. భయంతో బావిలోనే మలమూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది. తర్వాత మట్టితో దాన్ని బయటకు పంపేవాళ్లం.

ఇప్పుడు నేను దాన్నుంచి బయటపడ్డాను. కానీ, నా డబ్బు పోయినందున పోలీస్ స్టేషన్‌కు వచ్చానని మా అమ్మకు చెప్పాను. డబ్బు దొరికినా, దొరక్కపోయినా ఇంటికి వచ్చేయ్ అని మా అమ్మ అన్నారు. ఆమెకు ఆపరేషన్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. ఆమె కడుపులో కణతి ఉంది. దానికి ఆపరేషన్ చేశారు. అలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి నా పరిస్థితి గురించి ఏమని చెప్పాలి’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భరత్ రాథోడ్

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

‘‘పొద్దున బావిలోకి దిగితే రాత్రికే బయటకు వచ్చేది’’

నాందేడ్ జిల్లా అట్కూర్ గ్రామానికి చెందిన మారుతి జటాల్కర్‌కు ముగ్గురు కూతుళ్లు. ఆయనకు భార్యతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ వారి కుటుంబం జీవనోపాధి పొందుతుంది. మారుతిపైనే వారి కుటుంబం ముఖ్యంగా ఆధారపడి ఉంది.

మారుతి పెద్ద కూతురు పెళ్లిని 2023 మే 15న చేయాలని నిశ్చయించారు. గ్రామంలో చేయడానికి పని లేకపోవడంతో కూతురి పెళ్లికి డబ్బు సంపాదించడం కోసం మారుతి పట్టణానికి వెళ్లారు. అక్కడ బ్రోకర్ చేతిలో చిక్కారు.

రోజుకు రూ. 500 చొప్పున కూలీ దొరికినా, ఒక 10 నుంచి 20 రోజులు పనిచేస్తే చేతిలో కొంతడబ్బు ఉంటుందని మారుతి ఆశపడ్డారు.

కానీ, ఆయన అనుకున్నట్లుగా డబ్బు తీసుకొని ఇంటికి వెళ్లలేకపోయారు. కూతురి పెళ్లి చూడలేకపోయారు.

తన కూతురి పెళ్లి జరిగిపోయినట్లుగా తాజాగా తెలుసుకున్న ఆయన బాగా ఏడ్చారు.

‘తన కూతురి పెళ్లి గురించి కాంట్రాక్టర్‌కు చెప్పి, డబ్బులు ఫోన్ పే చేయాలని అడిగినప్పుడు ఆయన్ను తిట్టడంతో పాటు తీవ్రంగా కొట్టినట్లు మారుతి చెప్పారు.

పొద్దున బావిలోకి దిగి పని మొదలుపెడితే రాత్రి పూట బయటకు వచ్చేవాడినని ఆయన చెప్పారు. ఆహారం అడిగితే తిట్టేవారని తెలిపారు.

మారుతి 48 రోజుల పాటు బావిలో పనిచేశారు. కానీ, ఒక్క రూపాయి కూడా అందుకోలేదు. ఇప్పుడు ఆయన తిరిగి గ్రామానికి వెళ్లి పని చేయాలి.

మారుతి జటాల్కర్

ఫొటో సోర్స్, PRAVIN THAKARE/BBC

సొంత డబ్బులతో కూలీలను ఇంటికి పంపించిన పోలీసులు

ధోఖీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్ రౌత్ మాట్లాడుతూ, ‘‘కొంతమందికి చేతులకు సంకెళ్లు వేసి పనిచేపిస్తున్నారని మాకు చెప్పారు. తొలుత దీన్ని మేం నమ్మలేదు. తర్వాత దీని గురించి ఎస్పీ అతుల్‌ కులకర్ణికి సమాచారం ఇచ్చాం. ఆయన పర్యవేక్షణలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం.

వాఖర్వాడి గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ బావిలో అయిదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమతో రోజుకు 12 గంటలు పనిచేపిస్తూ, రాత్రి పూట గొలుసులతో బంధిస్తున్నట్లు వారు చెప్పారు.

పక్కకున్న ఖామస్వాడి గ్రామంలో మరో ఆరుగురు పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. తర్వాత వారిని కూడా అక్కడ నుంచి విడిపించాం.

రోజకు ఒకసారే భోజనం ఇస్తున్నట్లు వారు చెప్పారు. 11 మంది కూలీలను రక్షించి వారికి చికిత్స అందించి ఇంటికి పంపించాం. సొంత ఖర్చులతో పోలీసులు వారు ఇంటికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. కూలీలకు కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన డబ్బు గురించి ఆరా తీస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.

కాంట్రాక్టర్లు సంతోష్ జాధవ్, కిరణ్ జాధవ్, కృష్ణ షిండేలను జూన్ 18వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, అహ్మద్‌నగర్‌కు చెందిన బ్రోకర్ ఇంకా పరారీలో ఉన్నారు.

ఐపీసీ సెక్షన్లు 370 (మానవ అక్రమ రవాణా), 367 (కిడ్నాప్), 346 (నిర్బంధించడం), 321 కింద కేసును నమోదు చేశారు.

వీడియో క్యాప్షన్, మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో మతతత్వ హింస...

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)