టీటీడీ -గుండె ఆపరేషన్లు: లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానాలు(టీటీడీ) ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చయ్యే సేవలను ఇక్కడ ఉచితంగానే అందిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది.
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఉండే ‘‘శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం’’, పుట్టుకతో వచ్చే గుండె సమస్యల నుంచి గుండె మార్పిడి ఆపరేషన్ల వరకు అనేక రకాల సేవలను అందిస్తోంది.
టీటీడీ ఆధ్వర్యంలోని ‘‘వేంకటేశ్వర ప్రాణదానం’’ ట్రస్ట్ ద్వారా ఇది పని చేస్తోంది.

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
ఎలాంటి సమస్యలకు చికిత్స దొరుకుతుంది?
శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... చిన్నారుల్లో ఈ కింది గుండె సమస్యలకు ఉచితంగా చికిత్స అందిస్తారు.
- గుండెలో రంధ్రాలు
- కవటాల్లో బ్లాక్స్ లేదా లీక్స్
- మంచి రక్తం, చెడు రక్తం కవలడం. దీన్నే డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటారు.
- రక్తనాళాలు పుట్టుకతోనే తిరిగి ఉండడం. దీన్ని ట్రాన్స్‌పొజీషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అంటారు.
- రక్తనాళాలు మూసుకోవడం

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
సేవలు వినియోగించుకోవాలంటే ఏం చేయాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇక్కడ ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఉచితం, ఆరోగ్య శ్రీ లేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గుండె జబ్బులు ఉన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందిస్తారు.
“ఆంద్రప్రదేశ్ రాష్ట్రం వారికైతే ఆరోగ్యశ్రీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్స్ చేస్తాము. తెలంగాణ సహా భారత దేశంలోని ఇతర రాష్ట్రాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నట్లైతే ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డు లేనివారికి, ఇతర దేశాల వారికి ఇక్కడ మందులకు అయ్యే ఖర్చులు మాత్రం వసూలు చేస్తున్నాం. వేరే ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రిలో రూ.10 లక్షలు అయ్యే సర్జరీలను ఇక్కడ రూ.2 లక్షలకే చేస్తున్నాం” అని శ్రీనాథ్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
ఆసుపత్రిని ఎలా చేరుకోవాలి? ఎవరిని సంప్రదించాలి?
ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో తిరుపతి రైల్యే స్టేషన్‌కు చేరుకుంటే అక్కడి నుంచీ ఆటోలో స్వింస్స్ ప్రాంగణంలో ఉన్న ఈ ఆస్పత్రికి చెరుకోవచ్చు. ఏదైనా సమాచారం కావాలంటే 08772264874 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
ఇతర రాష్ట్రాల వారు ఏం చేయాలి?
తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల వారు ఆయుష్మాన్ భారత్‌లో రిజిస్టర్ చేసుకుని ఉంటే ఈ ఆస్పత్రిలో ఉచిత చికిత్సలు పొందచ్చు.
పిల్లల్లో గుండె సమస్యలను ఎలా గుర్తించాలి?
చిన్న పిల్లల్లో బరువు పెరగకపోవడం, ఆయాసంతో ఉండడం, ఎక్కువ దగ్గు, జలుబు ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సౌమ్య కస్తూరి బీబీసీతో చెప్పారు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలకు న్యుమోనియా వచ్చిందేమోనని వారిని తరచూ ఆసుపత్రులకు తీసుకెళ్తుంటరాని, కానీ అది గుండె సమస్య కూడా అయి ఉండొచ్చని ఆమె అన్నారు.
“పుట్టిన పిల్లలు కొందరు నీలంగా మారుతుంటారు. గుండెలో సమస్య ఉండటం వల్ల ఆక్సిజన్ తక్కువగా అందడం వల్ల అలా జరుగుతుంది. పిల్లలు తల్లి దగ్గర పాలు సరిగా తాగలేకపోతున్నా మధ్య మధ్యలో ఆయాస పడుతున్నా వారిలో గుండె సమస్య ఉందని గుర్తించాలి. అలాగే రక్తనాళాలు అటు నుంచి ఇటు కావడం, ఊపిరితిత్తుల్లోంచి వచ్చే రక్తనాళాలు సరైన చోటులోకి రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఉంటాయి.’’ అని సౌమస్య తెలిపారు.
‘‘పిల్లలు కడుపులో ఉండగానే గుండె సంబంధిత సమస్యలు గుర్తించవచ్చు. తల్లి గర్భంతో ఉన్నప్పుడు నాలుగు నుంచి ఐదు నెలల్లోనే దాన్ని గుర్తిస్తాం. ఇక్కడకు 50 శాతం మంది పిల్లలను గుండెలోరంధ్రాలు ఉండడం వల్ల తీసుకొస్తుంటారు.’’ అని సౌమ్య అన్నారు.

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
‘‘15 వందల గుండె ఆపరేషన్లు’’
‘‘శ్రీ పద్మావతి హృదయాలయ’’ను 2021 అక్టోబర్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 2023 జూన్ రెండో వారం నాటికి 1,500 గుండె ఆపరేషన్లు పూర్తి చేశారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత ఆరు నెలలుగా నెలకు 100 ఆపరేషన్ల వరకు జరుగుతున్నట్లు చెప్పారు.
పద్మావతి హృదయాలయలో 15 మంది స్పెషలిస్టులు ఉంటారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 24 గంటలూ ఆపరేషన్లు చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలూ ఇక్కడ ఉన్నాయి. తొలుత 50 పడకలతో ప్రారంభమైన ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని, ఇప్పుడు 100 పడకలకు పెంచారు. వీటిలో 40 ఐసీయూ పడకలతోపాటూ మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.
పేద పిల్లలకు సంబంధించి గుండె సమస్యలకు ఉచితంగా చికిత్స అందించాలనే ఉద్దేశంతో సీఏం జగన్ ఈ ఆసుపత్రిని ప్రారంభించారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి బీబీసీతో అన్నారు. ‘‘మూడు రోజులు, పది రోజులు, ఒక నెల వయసు పిల్లలకు కూడా ఆపరేషన్లు చేస్తారు. విజయవంతంగా నాలుగు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేశాం. దీనికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ పీడియాట్రిక్ హాస్పిటల్ నిర్మిస్తున్నాం.’’ అని ధర్మారెడ్డి తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/N Tulasi prasad reddy
‘‘అనుభవజ్ఞులైన డాక్టర్లు’’
అనుభవజ్ఞులైన వైద్యులు, ఇతర సిబ్బంది వల్ల తాము విజయవంతంగా ఆపరేషన్లు చేయగలుగుతున్నట్లు డాక్టర్ శ్రీనాథరెడ్డి అన్నారు.
‘‘మన గుండె సైజు మన పిడికిలి అంత ఉంటుంది అనుకుంటే, చిన్నపిల్లలకి అది నిమ్మకాయ సైజులో ఉంటుంది. అలాంటి గుండెకు ఆపరేషన్ చేయాలన్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్న, కీ హోల్ ప్రొసీజర్ చేయాలన్నా చాలా అనుభవంతో ఉన్నవారు కావాలి.
కార్డియాలజిస్ట్, సర్జన్లు, అనస్తీషియా, చిన్నపిల్లల డాక్టర్లు ఇంకా చాలా మంది సపోర్ట్ స్టాఫ్ కావాలి. అందరం కలిసి ఒక టీమ్‌గా వర్క్ చేస్తాం. అందుకే ఎలాంటి క్రిటికల్ కేసు వచ్చినా మా సక్సెస్ రేటు 95శాతం వరకూ ఉంటోంది’’ అని ఆయన తెలిపారు.
తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు?
బయట ఆస్పత్రిలో 5 లక్షల రూపాయలు అయ్యే ఆపరేషన్‌ను తమ పాపకు ఉచితంగా చేశారని మదనపల్లెకు చెందిన నందిని బీబీసీకి చెప్పారు.
‘‘బయట సర్జరీకి 5 లక్షల రూపాయలు అడిగారు. ఇక్కడికి వచ్చాక ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగానే చేస్తున్నారు. నాకు ఏడో నెల వచ్చినప్పుడు, బిడ్డ గుండెలో రెండు రంధ్రాలు ఉన్నాయని తెలిసింది. డెలివరీ అయ్యాక క్లోజ్ అవుతాయన్నారు. కానీ పాప పుట్టాక అలా కాలేదు. బయటి వాళ్లు చెబితే ఇక్కడకు వచ్చాం. పాపకు ఆపరేషన్ చేసి, ఒక రంధ్రాన్ని పూడ్చారు. తర్వాత ఇంకో సర్జరీ చేయాల్సి ఉంది.’’ అని నందిని చెప్పారు.
పాప గుండె సమస్య మీద బెంగ పెట్టుకొని తన బావ ఏడాది కిందట గుండె పోటుతో చనిపోయినట్లు ఏలూరుకు చెందిన మహేశ్ తెలిపారు. తమకు ఎక్కడికి వెళ్లాలో తెలియక దాదాపు రెండేళ్లు ఆలస్యమైందని, ఏడాది కిందటే పద్మావతి హృదయాలయకు వచ్చి ఉంటే తమకు బావ దక్కేవాడని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















