కారు ఆపలేదని 17 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన ట్రాఫిక్ పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆంటోయినెట్టే రాడ్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ న్యూస్
ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కారును ముందుకు పోనిచ్చిన 17 ఏళ్ల యువకుడిని ఫ్రెంచ్ పోలీసులు కాల్చి చంపారు.
ఈ ఘటన పారిస్ శివారులో మంగళవారం జరిగింది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
పోలీసు అధికారి కారు డ్రైవర్‌కు గన్ గురి పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. తుపాకీ కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి.
పోలీసు అధికారి ఆ యువకుడిపై కాల్పులు జరపడంతో కారు అక్కడికక్కడే ఆగిపోయింది.
పోలీసుల చేతిలో కాల్పులకు గురైన యువకుడిని కాపాడేందుకు ఎమర్జెన్సీ సర్వీసులు ప్రయత్నించాయి. కానీ, కొద్దిసేపటికే ఆ యువకుడు మరణించాడు.
ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న అధికారిని హత్యానేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కాల్పులకు సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో ఫుటేజీని ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది.
ఇద్దరు పోలీసు అధికారులు ఆ కారును ఆపేందుకు ప్రయత్నించినట్లు ఈ ఫుటేజీ చూపిస్తోంది.
ఒకరు కారు అద్దం నుంచి డ్రైవర్ తలకు గన్‌ను గురి పెట్టారు.
ఈ సమయంలో కారులో ఉన్న వ్యక్తి కారును ముందుకు పోనిచ్చేందుకు ప్రయత్నించగా, అత్యంత సమీపం నుంచి యువకుడిపై కాల్పులు జరిపారు అధికారి.
కాల్పులు జరుగుతున్న సమయంలో కారులో మరో ఇద్దరు వ్యక్తులున్నారు.
ఒకరు ఈ సంఘటన తర్వాత పారిపోగా, మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
‘చంపే హక్కు ఏ అధికారికీ లేదు’
అధికారి బెదిరింపులకు గురైనట్లు భావించినప్పటికీ, పోలీసులు తీసుకున్న చర్యలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని ఫ్రెంచ్ టెలివిజన్ స్టేషన్ బీఎఫ్ఎంటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పారిస్ పోలీస్ చీఫ్ లారెంట్ న్యూనెజ్ చెప్పారు.
యువకుడిని పోలీసులు చంపినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని బాధిత కుటుంబం తరఫు న్యాయవాది యాసిన్ బౌజ్రూ అన్నారు.
ఈ ఘటన జరిగిన నాంటెర్రేలో మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
ఆందోళనకారులు కార్లకు, చెత్త డబ్బాలకు, చెక్క ముక్కలకు నిప్పంటించారు.
ఏడుగురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న ఇద్దరు అధికారులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ఫ్రాన్స్ మంత్రి గెరాల్డ్ డార్మనిన్ పార్లమెంట్‌కు తెలిపారు.
సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియో చాలా షాకింగ్‌గా ఉందని అన్నారు.
యువకుడి కుటుంబానికి తన సంతాపం తెలియజేస్తున్నట్లు వామపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌ఛాన్ చెప్పారు.
ఆత్మ రక్షణలో కాకుండా ఏ అధికారికీ చంపే హక్కు లేదని ఆయన ట్వీట్ చేశారు.
ఇలాంటి పోలీసుల వల్ల దేశ పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందన్నారు. దీన్ని పూర్తిగా మార్చాల్సి ఉందన్నారు.
రెండు వారాల క్రితం కూడా, ట్రాఫిక్‌లో ఒక అధికారి కాళ్లను తన్నాడన్న ఆరోపణలతో పశ్చిమ ఫ్రాన్స్ పట్టణం అంగోలేమ్‌లోని పోలీసులు 19 ఏళ్ల డ్రైవర్‌ను కాల్చి చంపారు.
ఇవి కూడా చదవండి:
- కాఫీ ఫిల్టర్ కనుగొన్న మెలిట్టా బెంట్జ్ ఎవరు? రెండు ప్రపంచ యుద్ధాలను ఎదుర్కొని వ్యాపారవేత్తగా ఎలా ఎదిగారు?
- టీటీడీ -గుండె ఆపరేషన్లు: లక్షలు ఖర్చయ్యే చికిత్సలు ఉచితంగా
- ‘తలనొప్పి తగ్గిస్తానని నా కపాలానికి రంధ్రం చేసి జీవితాన్నే నాశనం చేశాడు’.. ప్రముఖ న్యూరోసర్జన్‌పై మహిళ ఆరోపణ
- రష్యా ఆర్మీలో నేపాలీ యువత.. భారీ వేతనాలే కారణమా
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గర్భగుడి బయటే నిల్చుని పూజలు చేయడంపై వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















