రష్యా ఆర్మీలో నేపాలీ యువత.. భారీ వేతనాలే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్వేచ్ఛా రౌత్
- హోదా, బీబీసీ నేపాలి సర్వీస్
రమేష్(పేరు మార్చాం) విద్యార్థి వీసాపై నేపాల్ నుంచి రష్యా వెళ్లారు. నేపాల్‌లో కటిక పేదరికంలో నివసించే రమేష్, మెరుగైన జీవితాన్ని వెతుకుంటూ రష్యాకు వెళ్లారు.
కానీ, రష్యాలో చదువులు పూర్తయినా.. తన సమస్యలు ఏమాత్రం తగ్గలేదు.
నేపాల్ తిరిగి వెళ్లాలి లేదంటే రష్యాలో ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవాలి. కానీ, ఇదంతా అనుకున్నంత తేలిక కాదు.
బీబీసీ నేపాలీతో జరిపిన ఆన్‌లైన్ చర్చలో రమేష్ ఈ విషయాలను పంచుకున్నారు. ‘‘నాలాగా, రష్యా వచ్చిన ప్రతి విద్యార్థి ఇబ్బందుల్లోనే ఉన్నారు. మంచి ఉద్యోగమే దొరకడం లేదు.’’ అని తెలిపారు.
రష్యా ఆర్మీలో ఎలా చేరాలో చెప్తూ టిక్ టాక్ వీడియో
నేపాల్ నుంచి రష్యాకు వెళ్లిన రమేష్, ఆయన స్నేహితులు ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఉన్న సమయంలోనే రష్యా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రకటించింది.
యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో రష్యన్ ఆర్మీ చాలా మంది సైనికుల్ని కోల్పోయింది.
యుద్ధం ప్రారంభంలో చాలా మంది రష్యా సైనికులు మరణించారు.
దీన్ని దృష్టిలోకి తీసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా ఆర్మీలో విదేశీయులు కూడా చేరేలా మరింత ఆకర్షణీయంగా, తేలికగా నిబంధనలను మార్చారు.
ఆకర్షణీయమైన వేతనాల నుంచి రష్యా పౌరులుగా మారే ప్రక్రియను సరళీకరించడం వరకు.. పలు రకాల కొత్త నిబంధనలను ఆర్మీలో చేరే విదేశీ సైనికుల కోసం తీసుకొచ్చారు.
తన ఆర్మీని బలోపేతం చేసుకునేందుకు రష్యా చేతులు చాచి విదేశీయులను ఆహ్వానిస్తోంది.
రష్యా ఆర్మీలో చేరేందుకు తాను ఈ అద్భుతమైన ఆఫర్‌ను అంగీకరించినట్లు రమేష్ చెప్పారు.
రాతపూర్వక పరీక్ష, వైద్య పరీక్షల అనంతరం రష్యా సైన్యంలో తాను ఎంపికైనట్లు రమేష్ తెలిపారు.
దీని కోసం తాను లక్ష నేపాలీ రూపాయలను ఖర్చు చేసినట్లు చెప్పారు. కానీ, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చారో ఆయన చెప్పలేదు.
నియామకాల ప్రక్రియ అంతా నమ్మకం ఆధారంగానే పూర్తయిందని రమేష్ తెలిపారు.
రష్యా సైన్యంలో చేరాలంటూ తన టిక్‌టాక్ అకౌంట్‌లో రమేశ్ ఒక వీడియో షేర్ చేశారు.
ఈ నిర్ణయం తీసుకోవడం తనకెంత కష్టమైందో కూడా తన చాలా వీడియోల్లో రమేష్ తెలిపారు.
‘‘సైనికుడిగా ఉండు లేదంటే చావు. ఇలా చేయాలనుకుంటే, సైన్యంలో చేరవచ్చు’’ అని తన వీడియోల్లో రమేష్ రాశారు.
‘‘ఇక్కడ చాలా సవాళ్లు ఉంటాయి. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఉండవు. జీవితంలో ఇదే క్లిష్టతరమైన దశ అని నేను నమ్ముతాను. ఎందుకంటే, ఈ దేశం ప్రస్తుతం యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది’’ అని తన వీడియోల్లో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా సైన్యంలో చేరేందుకు కౌన్సెలింగ్ సర్వీసులు
చివరి సారి రమేష్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు మాట్లాడేందుకు సమయం లేదన్నారు.
శిక్షణ కోసం తనని బెలారస్ తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీని తర్వాత బీబీసీ ఆయన్ను చేరుకునేందుకు ప్రయత్నించి విఫలైంది.
దీని తర్వాత, బీబీసీ వారాల పాటు చేపట్టిన విచారణలో, కేవలం రమేష్ అనే నేపాలి మాత్రమే కాదు, చాలా మంది ఇతరులు రష్యా ఆర్మీలో చేరినట్లు తెలిసింది.
రాజ్ అనే విద్యార్థి కూడా ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లారు.
2022 ఏప్రిల్‌లో తన ఆర్మీలో విదేశీయులను చేర్చుకునేందుకు రష్యా రిక్రూట్‌మెంట్ ప్రకటన ఇచ్చినప్పుడు రష్యా భాష పెద్దగా తెలియని నేపాలీలకు సాయం చేయాలని ఆయన్ను కోరారు.
రష్యన్ భాషలో ఉండే దరఖాస్తును నింపేందుకు వారు ఆయన సాయం తీసుకున్నారు.
‘‘నేను చాలా మంది నేపాలీలకు సాయం చేశాను. నాకు దరఖాస్తును నింపడం తెలుసు. రష్యా సైన్యంలో చేరాలనుకునే వారికి, వీరు నా నెంబర్‌ను ఇస్తున్నారు’’ అని రాజ్ బీబీసీ నేపాలికి తెలిపారు.
ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లాలనుకునే విద్యార్థులకు కూడా రాజ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
నేపాల్‌కు చెందిన చాలా మంది మాజీ సైనికులు, విద్యార్థులు ప్రస్తుతం రష్యా సైన్యంలో చేరేందుకు ఆయన సాయం కోరుతున్నారు.
రోజులో రాజ్‌కు 40 నుంచి 50 ఫోన్ కాల్స్ వస్తుంటాయి.
రష్యా సైన్యంలో ఎలా చేరాలో వారు తనని అడుగుతూ ఉంటారు.
రష్యా ఆర్మీలో చేరాలంటూ కొందరు నేపాలీ యువత వీడియోలు పోస్ట్ చేయడంతో, రాజ్ దీని వివరాలను బీబీసీకి తెలియజేశారు.
నేపాలీలు అక్రమంగా రష్యా ఆర్మీలో చేరుతున్నారో లేదో తనకి తెలియదని రాజ్ చెప్పారు.
తాను ఈ సలహాలు ఇస్తున్నందుకు ఎలాంటి డబ్బులను తీసుకోవడం లేదని మాత్రం రాజ్ చెప్పారు.
తన సర్వీసులు తీసుకున్న కొందరు నేపాలీలు మాత్రం డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలిపారు.

నేపాల్ ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పశ్చిమ దేశాలు మాదిరిగానే యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడాన్ని నేపాల్ ప్రభుత్వం ఖండిస్తోంది.
కానీ, తమ పౌరులు రష్యా ఆర్మీలో చేరుతున్నారన్న విషయంపై మాత్రం అవగాహన లేదంది.
‘‘మా విధానాలకు ఇవి ఏ మాత్రం సరిపోవు’’ అని నేపాల్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సేవా లామ్సాల్, బీబీసీ నేపాలీతో చెప్పారు.
నేపాల్, భారత్, బ్రిటన్‌ల మధ్య 1947లో ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం నేపాలీ పౌరులు విదేశీ ఆర్మీలో చేరొచ్చు. అయితే, దీనిలో స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, భారత ఆర్మీలో, బ్రిటన్ ఆర్మీలో నేపాలీ పౌరులను రిక్రూట్ చేసుకునేలా ఈ ఒప్పందం ఉంది.
ఈ దళాలలో చేరిన నేపాలీలను కిరాయి సైనికులుగా పరిగణించరని ఈ ఒప్పందంలో స్పష్టంగా చెప్పారు.
ఈ ఒప్పందం కేవలం భారత్, బ్రిటన్‌లతో మాత్రమే జరిగింది. మరే ఇతర దేశ ఆర్మీలో నేపాలీను నియమించుకోవడంపై ఎలాంటి పాలసీ లేదు.
ఈ విషయంపై మాట్లాడేందుకు బీబీసీ రష్యాలోని నేపాల్ రాయబారి అయిన మిలాన్ రాజ్ తులాధార్‌ని సంప్రదించింది.
‘‘రష్యాలో చదువుకునేందుకు లేదా పర్యటించేందుకు వచ్చిన నేపాలీ పౌరులెవరూ కూడా ఇతర పనులు చేయడానికి వీలు లేదు. నేపాలీ పౌరులు కేవలం భారత్, బ్రిటన్ ఆర్మీలో మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఇది కూడా ఎందుకంటే, మూడు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. రష్యాతో నేపాల్‌కు అలాంటి ఒప్పందమేమీ లేదు’’ అని తులాధార్ చెప్పారు.
రష్యా ఆర్మీలో చేరుతున్నట్లు నేపాల్ ప్రజలు టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసే వీడియాల్లో నిజమెంతన్నది నిర్ధరించలేమని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ విచారణలో ఏం తేలింది?
బీబీసీ కొన్ని వీడియోలను పరిశీలించింది. రష్యా సైనిక స్థావరాలున్న ప్రాంతాల నుంచి అవి పోస్ట్ అయినట్లు గుర్తించింది.
కొన్ని అకౌంట్ల నుంచి పోస్ట్ అయిన డాక్యుమెంట్లను బీబీసీ రష్యన్ సర్వీసు వెరిఫై చేసింది.
రష్యన్ మిలటరీ డాక్యుమెంట్ ఫోటోలను పోస్ట్ చేసిన రెండు అకౌంట్లను బీబీసీ రష్యా సర్వీస్ జర్నలిస్ట్ ఆండ్రే కొజెంకో పరిశీలించారు.
‘‘రష్యా సైన్యంలో పనిచేస్తూనే ఈ డాక్యుమెంట్లను ఆ ఇద్దరు వ్యక్తులు పోస్ట్ చేసినట్లు ఇవి చూపిస్తున్నాయి’’ అని కొజెంకో చెప్పారు.
దీనిలో వారి మిలటరీ ర్యాంకు, పూర్తి పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు రికార్డయ్యాయి. ఏ మిలటరీ యూనిట్లలో వారు పనిచేస్తున్నారో కూడా ఇవి తెలియజేస్తున్నాయి.
ఈ విషయంపై స్పందించాలని బీబీసీ రష్యా రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించింది.
అలాగే నేపాల్‌లో ఉన్న రష్యన్ రాయబార కార్యాలయాన్ని కూడా కాంటాక్ట్ చేసింది.
ఈ కథనం ప్రచురితమయ్యే సమయానికి, వారి నుంచి ఎలాంటి స్పందనలు రాలేదు.

ఫొటో సోర్స్, Official Publication of Legal Acts/Russia
ఎందుకు నేపాలీ యువత రష్యా ఆర్మీలో చేరుతుంది?
నేపాల్‌లో మంచి అవకాశాలు లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో నేపాలీ యువత విదేశీ ఆర్మీలో చేరాల్సి వస్తుందని నిపుణులంటున్నారు.
‘‘నేపాలీలు పనిచేసుకునేందుకు, సందర్శించేందుకు విదేశాలకు వెళ్లొచ్చు. కానీ, అక్కడికి వారు వెళ్లే ఉద్దేశం పనిచేయడం, డబ్బులు సంపాదించడమే. నేపాలీ యువత రష్యన్ ఆర్మీకి ఆకర్షితులవుతుండొచ్చు. భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉండడమే దానికి కారణం. ’’ అని త్రిభువన్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజిస్ట్ టికారం గౌతమ్ అన్నారు.
యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వివిధ పనుల కోసం 1729 మంది నేపాలీలు రష్యాకు వెళ్లారని నేపాల్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
నేపాల్ ప్రభుత్వానికి చెందిన ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ గణాంకాల ప్రకారం 749 మంది నేపాలీలు చదువుల కోసం రష్యాకు వెళ్లగా, 356 మంది ఉపాధి కోసం వెళ్లారు.
రష్యా ఆర్మీలో చేరిన వారితో తాము మాట్లాడినట్లు బీబీసీ తెలిపింది. రాజ్ చెప్పిన విషయాలే వారు కూడా చెప్పినట్లు పేర్కొంది.
‘‘మేం ఇక్కడికి డబ్బుల కోసమే వచ్చాం. ఇక్కడ సంపాదించే మొత్తాన్ని మేం నేపాల్‌లో పొందలేం. ఇతర దేశాల్లో కూడా ఇంత సంపాదించలేం. గుండె సంబంధిత వ్యాధులు లేని ఎవరైనా ఇక్కడకు రావొచ్చు’’ అని రష్యా ఆర్మీలో పనిచేస్తున్నట్లు తెలుపుతూ టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి, బీబీసీ నేపాలీ సర్వీస్‌తో చెప్పారు.

రష్యా సైన్యంలో నేపాలీలకు ఎంత వేతనం లభిస్తుంది?
యుక్రెయిన్ యుద్ధంలో తమ తరఫున పోరాడే వారికి రష్యా ప్రభుత్వం పెద్ద మొత్తంలో వేతనాలను అందిస్తుంది.
శిక్షణలోనే 60 వేల నేపాలీ రూపాయలకు సమానమైన వేతనాన్ని నేపాలీలు అక్కడ పొందుతున్నారని రాజ్ చెప్పారు.
ట్రైనింగ్ తర్వాత నెలకు 1,95,000 రుబుల్స్ పొందే కాంట్రాక్ట్‌పై తాను సంతకం చేసినట్లు రష్యా మిలటరీ క్యాంపులో శిక్షణ పొందుతున్న ఒక వ్యక్తి చెప్పారు.
‘‘ఈ వేతనం 3 లక్షల నేపాలీ రూపాయలకు సమానం. ఏడాది కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత, సైనికులకు రష్యా పాస్‌పోర్ట్ కూడా ఇస్తారని ఒప్పందంలో ఉంది. ఆ తర్వాత రష్యాకు వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్లొచ్చు’’ అని రాజ్ చెప్పారు.
నోట్ : రష్యా వెళ్లిన నేపాలీ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ కథనంలో వారి గుర్తింపును, ఫోటోలను ఇవ్వడం లేదు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














