చంద్రశేఖర్ ఆజాద్: భీమ్ ఆర్మీ చీఫ్‌పై కాల్పులు జరిపింది ఎవరు? యోగి ఆదిత్యనాథ్ పాలనలో శాంతిభద్రతలు కరవయ్యాయా

ఫొటో సోర్స్, TWITTER/BHIMARMYCHIEF
ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పుల ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చంద్రశేఖర్‌తో పాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ మనీష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు పోలీసులు.
‘‘చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఎస్‌సీ-ఎస్టీ చట్టం సహా పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని చంద్రశేఖర్ న్యాయవాది రాజేష్ కుమార్ తెలిపారు.
తమకు ఎఫ్ఐఆర్ కాపీ అందినట్లు చెప్పారు.
దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు పట్టుకుంటారని, తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
అసలేం జరిగింది?
బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఆయుధాలతో కారులో వచ్చిన కొందరు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
దేవ్‌బంద్‌లో ఆయన మద్దతుదారుల్లో ఒకరి ఇంటికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ దాడి జరిగింది.
ఈ సమయంలో ఆయన ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారు.
‘పార్టీ కార్యకర్త ఒకరు ఇటీవల మరణించడంతో దేవ్‌బంద్‌లో ఉండే మృతుడి తల్లిని పరామర్శించడానికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాం. నేను కారు నడుపుతున్నాను. సాయంత్రం 4.50 గంటలవుతుంది. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో కారును నెమ్మది చేశాను. మా ఎడమవైపు తెల్లటి రంగు స్విఫ్ట్ కారు ఒకటి వచ్చి ఆగింది. ఆ తర్వాత టైర్ పేలిపోయిన శబ్దం వచ్చింది. ఆ తర్వాత మనపై కాల్పులు జరుగుతున్నాయని చంద్రశేఖర్ భయ్యా గట్టిగా అరిచారు’ అని డ్రైవర్ మనీష్ కుమార్ తెలిపారు.
‘‘మా ఫార్చ్యూనర్ కారులో చంద్రశేఖర్ భయ్యా నా పక్కన కూర్చున్నారు. పార్టీ నేషనల్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ బ్రజ్‌పాల్ సింగ్, పార్టీ కార్యకర్తలు కాశీ మౌర్య, సుఖ్విందర్ సింగ్ వెనుకవైపు కూర్చున్నారు. మొత్తంగా మేం ఐదుగురం ఉన్నాం’’ అని డ్రైవర్ చెప్పారు.
పట్టపగలు ఈ దాడి జరగడంతో విపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను ప్రశ్నిస్తున్నాయి.
చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై మరో వాహనంలో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారని సహరాన్‌పూర్ ఎస్ఎస్‌పీ డాక్టర్ విపిన్ తాడా చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఎస్ఎస్పీ ఏం చెప్పారు?
‘‘చంద్రశేఖర్‌కు తగిలిన తర్వాత బుల్లెట్ బయటికి దూసుకెళ్లింది. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. చికిత్స కోసం ఆయన్ని దేవ్‌బంద్ సీహెచ్‌సీకి తరలించాం. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు’’ అని ఎస్ఎస్‌పీ తెలిపారు.
ఈ సంఘటన దేవ్‌బంద్ ప్రాంతంలో జరిగిందని, దగ్గర్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నట్లు సహరాన్‌పూర్ ఎస్‌ఎస్‌పీ చెప్పారు.
చంద్రశేఖర్ ఆజాద్ కారుపై సాయంత్రం 5.15 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు.
ఈ ప్రమాదంలో ఆయన కడుపుపై తగిలిన తర్వాత బుల్లెట్ బయటికి దూసుకెళ్లింది. ఆయన సురక్షితంగా ఉన్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.
సంఘటన ప్రాంతానికి చేరుకున్న తర్వాత, పోలీసులు దీనిపై విచారణ చేయడం ప్రారంభించారని చెప్పారు.
డాక్టర్లు, ఫోరెన్సిక్ టీమ్ కూడా సంఘటనా స్థలికి చేరుకున్నాయని తెలిపారు.
చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు జరిగాయని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషాకి చంద్రశేఖర్ సహాయకుడు ధ్రువీకరించారు.
చంద్రశేఖర్‌తో ఉన్న మరో వ్యక్తికీ బుల్లెట్ గాయలయ్యాయి.

ఫొటో సోర్స్, VIVEKSEN
అటాక్ తర్వాత చంద్రశేఖర్ ఏమన్నారు
''నాకు సరిగ్గా గుర్తు లేదు. కానీ మా వాళ్లు వారిని గుర్తించారు. వాళ్ల కారు సహరాన్‌పూర్ వైపు వెళ్లింది. మేం యూ-టర్న్ తీసుకున్నాం. ఘటన జరిగినప్పుడు కారులో మా తమ్ముడు సహా ఐదుగురం ఉన్నాం'' అని చంద్రశేఖర్ తెలిపారు.
‘‘నాకు అంతగా గుర్తులేదు. ఎందుకంటే, నేను చాలా ఆందోళనకు గురయ్యాను. సహరాన్‌పూర్‌లో ఒక సీనియర్ అధికారికి ఫోన్ చేశాను. నాపై దాడి జరిగిందని ఆయనకు చెప్పాను.’’ అని తెలిపారు.
ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, సహరాన్‌పూర్ ఎస్‌ఎస్‌పీకి కాల్ చేసి, ఈ సంఘటన గురించి తెలియజేసినట్లు చెప్పారు.
ఎవరిపైనన్నా మీకు అనుమానం ఉందా? అని చంద్రశేఖర్‌ను ఎస్‌ఎస్‌పీ అడిగారు. కానీ, తనకు ఎవరితో తగాదాలు లేవని చంద్రశేఖర్ తెలిపారు.

ఫొటో సోర్స్, VIVEKSEN
అటాకర్ల గురించి పోలీసులు ఏం చెప్పారు?
ఎస్‌యూవీలో ప్రయాణిస్తోన్న చంద్రశేఖర్ ఆజాద్‌పై కారులో వచ్చిన దుండుగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఆయన ఎస్‌యూవీపై పలు సార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
దుండగులు తుపాకీతో కాల్చగా కారు అద్దం నుంచి బుల్లెట్ దూసుకెళ్లి ఆయన్ను తాకింది.
ఎస్‌యూవీ కారు అద్దం పగిలిపోయింది. సీట్లలో ఒకదానిపై బుల్లెట్ మార్క్‌లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దుండగులు వాడిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ హర్యానాకు చెందిందని తెలిసిందని ఎస్‌పీ అభిమాన్యు మాంగలిక్ తెలిపారు.
జిల్లా సరిహద్దులను మూసివేశామని, దాడి చేసిన దుండగులు, వారి కారు కోసం పెద్ద ఎత్తున వెతుకుతున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
‘యూపీలో జంగిల్ రాజ్’.. ఆరోపిస్తోన్న విపక్షాలు
చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి జరగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు యోగి ప్రభుత్వంలోని శాంతి, భద్రతల సమస్యపై విమర్శలు చేస్తున్నాయి.
‘‘యూపీలో జంగిల్ రాజ్?’’ అంటూ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
‘ప్రభుత్వం అండదండలున్న నేరగాళ్లు చేసిన పని ఇది. ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. పిరికిపంద చర్య. బీజేపీ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేనప్పుడు, ఇక సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి ఉంటుంది?’’ అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
యూపీలోని విపక్షాలను లక్ష్యంగా చేసుకోవడంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతూ సీనియర్ ఎస్‌పీ నేత శివ్‌పాల్ యాదవ్ ట్వీట్ చేశారు.
‘‘రాష్ట్రంలో నేరగాళ్లకు ధైర్యం చాలా ఎక్కువగా ఉంది. యూపీలో ప్రభుత్వం, నేరగాళ్లు ప్రస్తుతం విపక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్‌పై జరిగిన ఈ హత్యాయత్నం రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదకరంగా మారాయని చెబుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి!’’ అని తెలిపారు.
చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
‘‘యూపీలో నేతలపై దాడుల ఆగడం లేదు. అణగారిన సమాజం కోసం ధైర్యంగా ముందుకొచ్చిన పోరాడిన యువ నేత చంద్రశేఖర్ ఆజాద్‌పై హత్యాయత్నం జరగడం, యూపీలో జంగిల్ రాజ్ వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాకేష్ తికాయత్ కూడా ట్వీట్ చేశారు.
ఉత్తర ప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్యపై గత కొంత కాలంగా యూపీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా మారిన అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు పోలీసుల కస్టడీలోనే కాల్పులకు గురై హత్య కావడంపై కూడా విపక్షాలు అంతకుముందు పలు ప్రశ్నలను లేవనెత్తాయి. ఇది చాలా పెద్ద సమస్యగా మారింది.
ముఖ్తర్ అన్సారికి సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా కూడా ఈ నెల ప్రారంభంలో లక్నో కోర్టులో కాల్పులకు గురై, చనిపోయాడు. అప్పుడు కూడా విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు వేశాయి.
ఏడాదిన్నర వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రముఖ నేత కాన్వాయ్‌పై దాడి జరగడం ఇది రెండోసారి.
మీరుట్ నుంచి దిల్లీ తిరుగు ప్రయాణమైన ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై 2022 ఫిబ్రవరిలో కాల్పులు జరిగాయి.
ఇవి కూడా చదవండి
- ఇంట్లో నమాజ్ చేసినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారు? - గ్రౌండ్ రిపోర్ట్
- పాకిస్తాన్ అమ్మాయి, ఇండియా అబ్బాయి - లూడో గేమ్‌లో పరిచయం, ప్రేమ, పెళ్లి.. చివరకు ఏమైందంటే...
- ఉత్తరప్రదేశ్: బుల్డోజర్తో ఇంటిని కూల్చేందుకు ప్రయత్నం... మంటల్లో కాలిపోయిన తల్లి, కూతురు... అసలు ఏం జరిగింది
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- మథుర కారిడార్: ఇక్కడ ఆలయాలను కూలగొడతారా... బృందావన వాసులు ‘రక్తం’తో లేఖలు ఎందుకు రాస్తున్నారు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














