మద్రాస్ హైకోర్టు తీర్పు: 'భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా... గృహిణి ఇంటిపని, భర్త చేసే 8 గంటల ఉద్యోగం కన్నా తక్కువేమీ కాదు'

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు భర్త ఆస్తిలో భార్య సమాన వాటా పొందే మార్గాన్ని సుగమం చేసింది.

భార్యాభర్తల ఆస్తి వివాదానికి సంబంధించిన ఒక కేసులో మద్రాస్ హైకోర్టు జూన్ 21న తీర్పు ప్రకటిచింది. భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా పొందే హక్కు ఉంటుందని, గృహిణి చేసే ఇంటి పని, భర్త చేసే 8 గంటల ఉద్యోగానికి తక్కువేమి కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

భర్త సంపాదనలో గృహిణి అందించే సహకారానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వడం భారత్‌లో ఇదే మొదటిసారని నిపుణులు అంటున్నారు.

భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా

ఫొటో సోర్స్, Getty Images

అసలు కేసు ఏంటి?

భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించిన ఒక కేసులో మద్రాసు హైకోర్టు ఈ రకమైన తీర్పును వెలువరించింది.

1965లో వీరికి పెళ్లి జరిగింది. 1982 తర్వాత భర్త ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లిపోగా, భార్య ఇక్కడే భారత్‌లో ఉన్నారు. ఆమెకు స్వతహాగా ఎలాంటి సంపాదన లేదు.

సౌదీ నుంచి తన భర్త పంపించే సంపాదనతో ఆమె భారత్‌లో అనేక ఆస్తులు, ఆభరణాలు కొన్నారు.

1994లో భర్త భారత్‌కు తిరిగొచ్చారు. తమ ఆస్తులన్నింటినీ తన భార్య సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

బంగారు ఆభరణాలను సైతం ఆమె దాచిపెట్టిందని ఆయన అన్నారు.

ఆస్తులకు సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీని కూడా మరో వ్యక్తికి కట్టబెట్టి వాటిని అమ్మాలని తన భార్య చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆమెకు మరో వ్యక్తితో అఫైర్ ఉన్నట్లు భర్త ఆరోపణలు చేశారు.

మొత్తం అయిదు ఆస్తులకు సంబంధించి ఆ దంపతుల మధ్య గొడవలు జరిగాయి. వాటిలో నాలుగు ప్రాపర్టీలు భార్య పేరు మీద ఉన్నాయి. ఇందులో ఒక ఇల్లుతో పాటు భూమి కూడా ఉంది. ఇక వివాదాస్పదంగా మారిన మరో ప్రాపర్టీ కింద బంగారు బిస్కెట్లు, ఆభరణాలతో పాటు భార్యకు బహుమతిగా ఇచ్చిన విలువైన చీరలు ఉన్నాయి.

ఈ అయిదు ఆస్తులపై యాజమాన్య హక్కులను పొందేందుకు భర్త 1995లో ఒక ట్రయల్ కోర్టులో కేసు నమోదు చేశారు. తన భార్యకు ఇచ్చిన బహుమతులను కూడా ఈ జాబితాలో ఆయన చేర్చారు.

ఆస్తులన్నీ తన డబ్బుతోనే కొనుగోలు చేశారని, వాటిని తన భార్య ట్రస్టీ మాత్రమే అని కేసులో ఆయన పేర్కొన్నారు.

2007లో ఆయన మరణించారు. ఈ కేసును ఆయన పిల్లలు చూస్తున్నారు.

భర్త ఆస్తిలో భార్యకు సమాన వాటా

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ఏం చెప్పింది?

సంపదను కూడబెట్టడంలో భర్తతో సమానంగా భార్య కూడా దోహదపడ్డారని తన తీర్పులో కోర్టు పేర్కొంది. ఇంటిపనులు చేయడం ద్వారా తన భర్తకు భార్య అండగా నిలిచారని తెలిపింది.

బయటికెళ్లి సంపాదించడం ద్వారా భర్త, ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటు పిల్లల బాగోగులు చూడటం ద్వారా భార్య... ఇలా ఇద్దరూ సమష్టి కృషితో సంపదను సృష్టిస్తారు. ఇందులో ఇద్దరికీ సమాన వాటా ఉంటుంది.

ఆస్తులు ఎవరి పేరు మీద కొన్నా పర్వాలేదు. కానీ, కుటుంబ సభ్యుల బాగోగులు చూసే భార్య, ఆ ఆస్తుల్లో సమాన వాటా పొందడానికి అర్హురాలు.

మహిళలు ఇంట్లో పనులు చేస్తూ పరోక్షంగా భర్త సంపాదనకు సహాయపడతారు. ఈ సంపాదన వల్లే వారు ఆస్తులు కొనగలుగుతారని, గృహిణి ఇంట్లో బాధ్యతలు చూసుకోవడం వల్లే భర్త హాయిగా బయట పనిచేసుకోగలుగుతారని వ్యాఖ్యానించింది.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఇంట్లో చెఫ్, హోమ్ డాక్టర్, హోమ్ ఎకనమిస్ట్‌ రూపంలో గృహిణి ఎన్నో పాత్రలను పోషిస్తూ 24 గంటల పాటు నిరంతరం పని చేస్తారు. ఒకవేళ ఇంట్లో గృహిణి లేకపోతే, ఆమె చేసే ఎన్నో పనుల కోసం భర్త డబ్బులు వెచ్చించి వాటిని పొందాల్సి వచ్చేదని కోర్టు పేర్కొంది.

‘‘ఈ పనులన్నీ చేయడం ద్వారా భార్య ఇంటి వాతావరణాన్ని హాయిగా మార్చుతుంది. కుటుంబానికి ఆమె చేసే సేవ, అందించే సహకారాన్ని కచ్చితంగా కొలువలేం. కానీ, సెలవు లేకుండా 24 గంటల పాటు ఆమె ఈ విధులను నిర్వర్తిస్తారు. రోజూ 8 గంటల పాటు పనిచేసి భర్త సంపాదించే దాని కంటే ఇది తక్కువేమీ కాదు’’ అని కోర్టు పేర్కొంది.

భర్తకు గృహిణి అందించే సహకారాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానే గుర్తించే చట్టమేదీ లేనప్పటికీ, న్యాయమూర్తులు దీన్ని గుర్తించకుండా నిరోధించే చట్టం కూడా లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

దీన్ని కారణంగా చూపుతూ, అయిదు ఆస్తుల్లోని మూడింటిలో భార్యభర్తలకు సమాన హక్కులు ఉంటాయని తీర్పులో చెప్పింది.

నాలుగో ఆస్తి గురించి ప్రస్తావిస్తూ, వివాహ సమయంలో తన తండ్రి ఇచ్చిన ఆభరణాలను తనఖా పెట్టి దాన్ని కొనుగోలు చేసినందున హిందూ చట్టం ప్రకారం దానిపై హక్కులన్నీ ఆమెకే ఉంటాయని తెలిపింది.

ఇక, అయిదో ఆస్తి గురించి భర్త చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఇష్టానుసారంగా తాను ఈ బహుమతులను ఇవ్వలేదని భార్య డిమాండ్ మేరకే కొనివ్వాల్సి వచ్చిందిని ఆయన వాదించారు. ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఈ తీర్పును ఎందుకు ప్రశంసిస్తున్నారు?

ఇది చాలా సానుకూలమైన తీర్పు అని, మహిళలు ఇంట్లో చేసే పనికి ఇది గర్తింపునిస్తుందని మహిళా హక్కుల న్యాయవాది ఫ్లావియా ఆగ్నెస్ అన్నారు.

కుటుంబ, ఆస్తుల కేసులను వాదించే లాయర్ మాళవిక రాజ్‌కోటియా మాట్లాడుతూ, ఇదొక కీలక మైలురాయి అని అన్నారు.

మోటారు వాహనాల ప్రమాదాల కేసుల్లో కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇచ్చే అంశంలో గృహిణులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గతంలో భారత న్యాయమూర్తులు అంచనా వేశారని మాళవిక చెప్పారు.

కొన్ని కేసుల్లో గృహిణుల ఇంటి పనికి ఇచ్చే మొత్తం రూ. 5,000 నుంచి రూ. 9,000గా నిర్ణయించారని, ఇది ఏమాత్రం సరైన విలువ కాదని ఆమె తెలిపారు.

గృహిణుల హక్కుకు తొలిసారి ఈ తీర్పుతో అర్థవంతమైన గుర్తింపు దక్కిందని ఆమె అన్నారు.

భవిష్యత్‌లో ఈ తీర్పు సానుకూల ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నారు.

‘‘భారత్‌లో విడాకుల కేసులకు వచ్చేసరికి ‘‘లైఫ్ స్టయిల్ నిబంధన’’ ఉంటుంది. మహిళ జీవనశైలికి అనుగుణంగా ఆమెకు లభించే మెయింటనెన్స్, భరణం ఉంటే మిగతా దావాలన్నీ అర్థరహితం అవుతాయి.

భర్త ఆస్తిలో భార్యకు ఉన్న హక్కు గురించి సాధారణంగా చట్టాలు ప్రత్యేకంగా పేర్కొనవు. భార్య ఇంటి పని చేయడం వల్లే భర్త సంపాదించగలుగుతున్నాడనే అంశాన్ని గుర్తించరు.

జీవనశైలి నిబంధనకు మించి గృహిణులు ఆస్తిని పొందే హక్కును ఈ తీర్పు అందిస్తుంది’’ అని మాళవిక వివరించారు.

దేశంలోని ఇతర హైకోర్టులు దీనికి విరుద్ధమైన వైఖరిని తీసుకునే అవకాశం ఉందని ఆగ్నెస్ హెచ్చరించారు. అయితే, ఈ తీర్పునుఇతర కేసులకు ఎలా ఆపాదించగలమో చూడాల్సి ఉందని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)