ఎలుగుబంటి ఎదురుపడితే ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫీ హర్డాచ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు కనిపించడం సర్వసాధారణం. ఒక్కోసారి పరిసరాల్లోని పొలాలపైకి కూడా ఇవి వస్తుంటాయి. కొన్నిసార్లు కొందరిపై దాడులు కూడా చేస్తుంటాయి. మరి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?
ఆల్ప్స్ పర్వతాల్లో ‘బ్రౌన్ బేర్స్’ దాదాపు అంతరించిపోయే దశకు వచ్చేశాయి. ప్రస్తుతం మళ్లీ వాటి సంఖ్య పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం ‘లైఫ్ యూర్సుస్’ ప్రాజెక్టులో భాగంగా పొరుగునున్న స్లొవేనియా నుంచి ఇటాలియన్ష్ ఆల్ప్స్‌లోని ట్రెంటినోకు పది ఎలుగుబంట్లను తీసుకొచ్చారు.
ఎలుగుబంట్లను సంఖ్యను పెంచేందుకు తీసుకున్న ఈ చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎలుగుబంట్ల సంఖ్య దాదాపు 100కు పెరిగింది.
నేడు ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్‌తోపాటు చాలా ప్రాంతాల్లో ఈ ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. అయితే, కొన్నిసార్లు ఈ ఎలుగుబంట్లు మనుషులతో ఘర్షణకు దిగుతున్నాయి. ట్రెంటినోలోనూ ఇటీవల కాలంలో ఎలుగుబంటి దాడుల వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు పశువులు, తేనె తుట్టలపైనా ఇవి దాడులు చేస్తున్నాయి.
నేడు ఆల్ప్స్‌లో జీవించే వారితోపాటు చాలా మందిని తొలచివేస్తున్న ప్రశ్న ఏమిటంటే.. ‘‘ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఏం చేయాలి?’’. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుగుబంటిని రెచ్చగొట్టొద్దు
పెద్దపెద్ద జంతువులు నివసించే ప్రాంతాల్లో జీవించేటప్పుడు కొన్ని ముప్పులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా చేపట్టిన అధ్యయనాలు చెబుతున్నాయి.
‘‘మనుషులు, ఎలుగుబంట్లు ఒకే ప్రాంతాల్లో జీవించేటప్పుడు.. ఎలుగుబంటి దాడుల వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. వీటిపై మనం కచ్చితంగా దృష్టిపెట్టాల్సిందే.’’ అని ఇటలీలోని ద సైన్స్ మ్యూజియంలోని హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ నిపుణురాలు జియూలియా బాంబీరీ చెప్పారు.
2019లో బాంబేరీ, ఆమెతోపాటు పనిచేసేవారు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 600కుపైగా ఎలుగుబంటి దాడులపై అధ్యయనం చేపట్టారు. వీటిలో ఎలుగుబంట్లు ఎక్కువగా ఆత్మరక్షణ కోసమే దాడులు చేస్తాయని తేలింది. ఒక్కసారిగా మనుషులు ఎదురుపడటంతో ఇవి షాక్‌కు గురవుతాయని, ఆ తర్వాత తమను తాము కాపాడుకొనే క్రమంలో దాడులు చేస్తాయని వెల్లడైంది.
2023లో చేపట్టిన విశ్లేషణలోనూ ఎలుగుబంటి జాతులు (అమెరికన్ బ్లాక్‌బేర్స్, ఆసియాటిక్ బ్లాక్ బేర్స్, బ్రౌన్ బేర్స్, స్లోత్ బేర్స్, పోలార్ బేర్స్) దాడుల్లో చాలావరకు ఆత్మరక్షణ దాడులే ఉంటాయని తేలింది.
మనుషులు-జంతువుల మధ్య దాడులను అర్థం చేసుకోవడంలో ఇలాంటి అధ్యయనాలు కీలకంగా పనిచేస్తాయని బాంబేరీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఎలుగుబంట్లు పెద్ద జీవులు.. కానీ, అవి మనుషులను వేటాడవు.’’ అని యూటాలోని బ్రింగ్హమ్ యంగ్ యూనివర్సిటీలోని వైల్డ్‌లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ టామ్ స్మిత్ చెప్పారు. ‘‘మనం వాటిని షాక్‌కు గురిచేయడం లేదా ఆశ్చర్యానికి గురిచేయడమే చాలావరకు దాడులకు కారణం.’’ అని ఆయన అన్నారు.
31 ఏళ్లపాటు ఎలుగుబంట్ల ప్రవర్తనపై స్మిత్ అధ్యయనం చేశారు. ‘‘నేను దాదాపు వందల ఎలుగుబంట్లకు ఎదురుపడ్డాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. మీరు దగ్గరగా వస్తున్నారనే విషయాన్ని ఎలుగుబంటి వినగలదు. మీరు మీ జాడను ముందుగానే వాటిని వినిపించేటట్లు చేయగలిగితే, మీకు అవి ఎదురుపడే అవకాశం తక్కువ. అంటే మీ అలికిడి విని అదే దూరంగా వెళ్లిపోతుంది.’’ అని ఆయన చెప్పారు.
‘‘మీరు అటు వైపుగా వెళ్తున్నట్లు ఎలుగుబంటికి ముందుగానే తెలియజేయడం ఇక్కడ చాలా ముఖ్యం. అంటే ఒక్కసారిగా దానికి ఎదురుపడి షాక్‌లు ఇవ్వకూడదు.’’ అని ఆయన సూచించారు.
ఈ సూచన అమెరికాలోని దాదాపు మూడు ఎలుగుబంటి జాతులకూ వర్తిస్తుంది. ‘‘బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, పోలార్ బేర్.. మూడింటి నుంచీ మనం ఇలా తప్పించుకోవచ్చు. ఈ మూడు జాతులూ చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఒక్కసారిగా వాటికి ఎదురుపడటం వల్లే ఎక్కువగా దాడులు జరుగుతుంటాయి.’’ అని స్మిత్ చెప్పారు.
ఎలుగుబంటి సమీపంలోకి వెళ్లినప్పుడు గట్టిగా మాట్లాడటం, లేదా చప్పట్లు కొట్టడంతో మనం వాటిని అప్రమత్తం చేయొచ్చని స్మిత్ చెప్పారు. ‘‘కొన్నిసార్లు మీ నడక శబ్దాన్ని కూడా ఎలుగుబంటి వినగలదు. అయితే, అన్నీసార్లు ఆ శబ్దం వాటికి వినిపించకపోవచ్చు.’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Autonomous Province of Trento
2018లో స్మిత్, ఆయనతోపాటు పనిచేసేవారు కలిసి 682 మనుషులు-ఎలుగుబంటి ఘర్షణలను విశ్లేషించారు. దీంతో ఎలుగుబంటికి సమీపించినప్పుడు మీరు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం లేదా శబ్దాలు చేయడంతో అవి దూరంగా వెళ్లిపోతాయని తేలింది. అయితే, చుట్టుపక్కల పరిసరాలు స్పష్టంగా కనిపించనప్పుడు, మీరు మరీ దగ్గరగా వెళ్లేంతవరకూ ఎలుగుబంటి గుర్తించకపోవడంతోనే ఎక్కువ ఘర్షణలు జరుగుతుంటాయని దీనిలో వెల్లడైంది.
ఇక్కడ ఎలుగుబంట్ల రోజువారీ చర్యల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆస్ట్రియాలోని టైరోల్‌లో వైల్డ్‌లైఫ్ బయాలజిస్టు మైఖేలా స్కూబన్ చెప్పారు. స్లొవేకియాలో దాదాపు 16 ఏళ్లపాటు ఆమె ఎలుగుబంట్లపై అధ్యయనం చేపట్టారు.
ఎక్కువగా ఎలుగుబంట్లు రాత్రిపూట క్రియాశీలంగా ఉంటాయి. ఉదయం ఆరు నుంచి 7 మధ్యలో అవి నిద్రలోకి జారుకుంటాయి.
‘‘అయితే, సాధారణంగా ఇదే సమయానికి మనుషులు కూడా వాకింగ్‌కు వెళ్తుంటారు. మీరు ఎలుగుబంటిని చూడాలని అనుకుంటే కూడా ఇదే మంచి సమయం. ముందుగానే మీరు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పరిసరాలోని పొదలను తొలగించండి. ఫలితంగా మీరు ఒక్కసారిగా వాటి వెనుక నుండి ఎలుగుబంటికి ఎదురుపడే అవకాశం తగ్గుతుంది.’’ అని ఆమె చెప్పారు.
స్మిత్ తరహాలోనే స్కూబన్ కూడా ముందుకు వెళ్లేటప్పుడు గట్టిగా మాట్లాడాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్దనోరు పెట్టి అరవొద్దని, దీని వల్ల ఎలుగుబంట్లు గందరగోళానికి గురవుతాయని చెప్పారు. ఒక్కోసారి గట్టిగా వినిపించే మొబైల్ ఫోన్ రింగ్‌టోన్ కూడా దాడికి కారణం కావచ్చని తెలిపారు.
‘‘ఎలుగుబంటి మీకు ఎదురుపడినప్పుడు కలిసికట్టుగా ఉండటమే అత్యుత్తమ వ్యూహం. వీలైతే దానికి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించండి. అంతేకానీ, ఎదురుగా అలానే నిలబడి ఉండొద్దు. ఎందుకంటే ఆ ఎలుగుబంటికి పిల్లలు ఉండొచ్చు. లేదా ఆహారాన్ని దగ్గర్లో అది దాచుకొని ఉండొచ్చు. మీరు వాటి కోసం వచ్చేరేమో అనుకొని అది దాడి చేయొచ్చు.’’అని స్మిత్ చెప్పారు.
ఎలుగుబంటి మీపై దాడిచేసేందుకు దగ్గరగా వచ్చిందంటే యాంటీ-బేర్ పెప్పర్ స్ప్రై ఉపయోగించాలని స్మిత్ సూచిస్తున్నారు.
‘’98 శాతం ఈ చిట్కా పనిచేస్తుంది. అంతేకాదు దీన్ని ఉపయోగించడం కూడా తేలికే. అయితే, ఈ అవకాశం కొన్ని దేశాలకే పరిమితం. ఎందుకంటే చాలాదేశాల్లో జంతువులపై ఇలాంటి స్ప్రేలను ఉపయోగించకూడదు.’’ అని స్మిత్ అన్నారు.
ఇక్కడ కొన్ని చర్యలు కూడా మనపై దాడి చేసే ముప్పు పెంచుతాయి. అవేమిటో తెలుసుకుందాం.
స్పోర్ట్స్ ప్రమాదకరమా?
కొన్ని మౌంటెయిన్ స్పోర్ట్స్ వల్ల ఎలుగుబంటికి ఎదురుపడే ముప్పు పెరుగుతుందని స్మిత్ చెబుతున్నారు. ‘‘ఎందుకంటే వీటి వల్ల మనం ఒక్కసారిగా ఎలుగుబంటికి ఎదురుపడిపోతాం. ఇక్కడ పరిగెత్తడమే ప్రధాన సమస్య. మౌంటెయిన్ బైకింగ్ వల్ల కూడా మనం ఒక్కసారిగా ఎలుగుబంటి ముందుకు వెళ్లిపోతాం.’’ అని ఆయన అన్నారు.
పర్వతారోహణతో అంత ముప్పులేమీ ఉండవు. ‘‘అయితే, పర్వతాలను ఎక్కేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంటీ-బేర్ స్ప్రేలను వారు దగ్గర పెట్టుకోవాలి. ముందుకు వెళ్లేటప్పుడు కాస్త గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్లాలి. మరోవైపు పర్వతాలను ఎక్కేటప్పుడు ఎలుగుబంట్లు కూడా పెద్దగా దాడిచేయవు. పర్వతాలు ఎక్కుతున్నప్పుడు ఎలుగుబంట్లు దాడిచేసిన ఘటనలు మీకు పెద్దగా కనిపించవు.’’ అని ఆయన చెప్పారు.
పుట్టగొడుగులను సేకరించేటప్పుడు కూడా ఒక్కోసారి అనుకోకుండా ఎలుగుబంట్లకు ఎదురుపడే అవకాశముంటుందని స్కూబన్ చెప్పారు. ‘‘చల్లగా, బురదతో ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగులు ఎక్కువగా పెరుగుతాయి. అయితే, ఇదే ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా నిద్రపోతుంటాయి.’’ అని ఆమె వివరించారు.
‘‘సాధారణంగా మిమ్మల్ని చూసిన వెంటనే ఎలుగుబంటి పరిగెడుతుంది. అయితే, ఒక్కోసారి అది గందరగోళంలో మీపై దాడిచేసే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఎలుగుబంటి పిల్లలతో ఫోటోలు తీసుకునే సాహసం కూడా చేయకూడదు.’’ అని ఆమె హెచ్చరించారు.
ట్రెంటినోలోనే పనిచేసే బాంబేరీ మాత్రం పరిస్థితులకు ముందుగా మనం అలవాటు పడాలని సూచించారు. ‘‘ఎలుగుబంట్లు జీవించే ప్రాంతాల్లో మనకు నచ్చినట్లుగా తిరగడం కుదరదని మీరు మొదటగా తెలుసుకోవాలి.’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















