సూది రంధ్రంలో దూరేటంత చిన్న హ్యాండ్ బ్యాగ్, ధర మాత్రం..

హ్యాండ్‌బ్యాగ్

ఫొటో సోర్స్, MSCHF

ఉప్పు రేణువు కంటే చిన్నదైన ఈ బ్యాగ్ వేలంలో 63,750 డాలర్ల ధర పలికింది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 52 లక్షల రూపాయలన్నమాట.

సుమారు 0.657 మిల్లీ మీటర్ల పొడవు, 0.222 మిల్లీ మీటర్ల వెడల్పు, 0.7 మిల్లీ మీటర్ల ఎత్తుతో రూపొందించిన ఈ అతిచిన్న బ్యాగ్‌ డిజైన్ చూడాలంటే మైక్రోస్కోప్‌ కావాల్సిందే.

''సూది మొనలో నుంచి కూడా దూరిపోయే ఈ అతి చిన్న బ్యాగును చూడడానికి మైక్రోస్కోప్ అవసరం'' అని ఈ బ్యాగ్‌ను సేకరించిన సంస్థ తెలిపింది.

అమెరికాలోని బ్రూక్లిన్‌కి చెందిన ఎంఎస్‌సీహెచ్ఎఫ్ సంస్థ వివాదాస్పద డిజైన్లకు ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ కళాఖండాలను సేకరిస్తుంది.

ఈ సంస్థ సేకరించిన వివాదాస్పద డిజైన్లలో మానవ రక్తం అద్దిన, అరికాలి భాగంలో పవిత్ర జలంతో రూపొందించిన ఎర్రని రబ్బరు బూట్లు కూడా ఉన్నాయి.

ఈసారి చిన్న హ్యాండ్‌బ్యాగ్స్‌‌తో ట్రెండ్ సృష్టించాలని ఆ సంస్థ నిర్ణయించింది.

''పెద్ద హ్యాండ్‌బ్యాగ్స్ ఉంటాయి, సాధారణ హ్యాండ్‌బ్యాగ్స్, చిన్న హ్యాండ్‌బ్యాగ్స్ కూడా ఉంటాయి. కానీ ఇది అతి చిన్న హ్యాండ్‌బ్యాగ్'' అని బ్యాగ్ విడుదల సందర్భంగా ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థ తెలిపింది.

లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్ తయారీ కంపెనీ లూయిస్ వ్యూటన్ బ్రాండ్ తరహాలో ఈ బ్యాగ్ ఉన్నప్పటికీ, ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు.

చిన్న చిన్న వస్తువులు తయారు చేసేందుకు ఉపయోగించే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగించి, నీటిలో కరగని ఫొటోపాలిమర్‌ పదార్థంతో ఈ బ్యాగ్‌ను తయారు చేశారు.

ఈ అతి చిన్న బ్యాగ్ రూపొందిస్తున్న సమయంలో చాలా చిన్న చిన్న బ్యాగులు ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్ పరిశీలనకు వచ్చినప్పటికీ వాటిని సంస్థ తిరస్కరించిందని స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ తెలిపింది.

అయితే ఈ చిన్న బ్యాగ్ పోతుందన్న భయం కూడా యజమానికి అవసరం లేదు. డిజిటల్ డిస్‌ప్లే కలిగిన మైక్రోస్కోప్‌తో సహా దీన్ని వేలం వేశారు.

హ్యాండ్‌బ్యాగ్

ఫొటో సోర్స్, MSCHF

డిజిటల్ డిస్‌ప్లే ఉన్న మైక్రోస్కోప్‌లను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

వాటి ధర సుమారు 60 డాలర్ల నుంచి 1000 డాలర్ల (సుమారు రూ.5 వేల నుంచి రూ.82 వేలు) వరకూ ఉంటుంది.

వేలంలో మైక్రోస్కోప్ ధర ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

ఈ బ్యాగ్ వేలం ధర 15 వేల డాలర్ల (సుమారు రూ.12.30 లక్షలు) నుంచి మొదలైంది.

బ్యాగ్‌పై లూయిస్ వ్యూటన్ బ్రాండ్ గుర్తు వాడేందుకు ఆ కంపెనీ అనుమతి కోరలేదని ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ కెవిన్ వీస్నర్ ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

''మేం క్షమాపణ కోరుతాం. కానీ పాఠశాలలో మాదిరిగా అనుమతి అడగం'' అని ఆయన అన్నారు.

గతంలోనూ మానవ రక్తం అద్దిన బూట్ల విషయంలో షూ కంపెనీ నైక్‌ వేసిన వ్యాజ్యాన్ని ఎంఎస్‌సీహెచ్‌ఎఫ్ సంస్థ 2021లో సెటిల్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి: