ఆన్‌లైన్ గేమ్స్: ఇద్దరు పిల్లలను నీళ్ల సంప్‌లో పడేసి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి, రూ. 15 లక్షలు పోగొట్టుకోవడంతో బలవన్మరణం

ఆత్మహత్య

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భర్త, ఇద్దరు బిడ్డలతో సాఫీగా సాగాల్సిన రాజేశ్వరి జీవితం ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అర్ధంతరంగా ముగిసిపోయింది.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కి చెందిన రాజేశ్వరి జూన్ 27న తన ఇద్దరు కొడుకులను నీళ్ల సంప్‌లో పడేసి, తానూ ఆత్మహత్య చేసుకున్నారు.

మొబైల్ ఫోన్‌లో ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని, అప్పుల పాలవ్వడమే ఆమె ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటనలు ఇటీవల ఏపీ, తెలంగాణలో తరచూ జరుగుతున్నాయి.

ఆన్లైన్‌లో రమ్మీ ఆడుతూ రూ.78 వేలు పోగొట్టుకుని కోనసీమ జిల్లాకు చెందిన సాత్విక్ అనే బాలుడు జూన్ 6న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆ డబ్బును తన మామయ్య చికిత్స కోసం దుబాయి నుంచి అత్తయ్య పంపించింది. ఆ డబ్బు ఆన్లైన్ రమ్మీ ఆటలో పోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

అలాగే, వరంగల్ జిల్లాలో ఐటీఐ చదివే విద్యార్థి బి.ఉదయ్ భాస్కర్ ఇదే తరహాలో డబ్బులు పోగొట్టుకున్నారు.

అతని తల్లికి చెందిన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడుతూ రూ.46 వేలు పోగొట్టారు. విషయం ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అనే భయంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఇప్పుడు చౌటుప్పల్‌కి చెందిన రాజేశ్వరి. ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అందుకు దారితీసిన పరిస్థితులపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్..

ఈ ఘటనలో అసలు నిజాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రతినిధి చౌటుప్పల్ వెళ్లారు.

అప్పటికే ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌లో రాజేశ్వరి, ఆమె పిల్లలు ఐదేళ్ల అనిరుధ్, మూడేళ్ల హర్షవర్ధన్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది.

మృతదేహాలను అంబులెన్సులోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు బంధువులు తప్ప ఆ సమయంలో అక్కడెవరూ లేరు.

అక్కడి నుంచి రాజేశ్వరి కుటుంబం నివాసం ఉండే మల్లికార్జున నగర్ వెళ్లాం.

కాలనీలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద రోడ్డు మలుపు తిరిగిన తర్వాత రేకులతో నిర్మించి ఇల్లు ఉంది. అది మూడు గదులతో ఉంది.

ఇంటి ముందు భాగంలో నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఆ కాలనీలో ఆ ఇంటి తర్వాత ఇక నిర్మాణాలు లేవు.

రాజేశ్వరి ఇంటి ముందు టెంటు వేసి ఉంది.

ఆత్మహత్య చేసుకున్న రాజేశ్వరి బంధువులు రోదిస్తున్నారు

రాజేశ్వరి, పిల్లల మృతదేహాలు ఇంటికి చేరుకోగానే దాదాపు వంద మంది కుటుంబీకులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు వచ్చారు.

అంబులెన్స్‌లోని మృతదేహాలను దించుతూ రాజేశ్వరి, ఆమె పిల్లలను తలచుకుంటూ బంధువులు, చుట్టుపక్కల ఉండేవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘‘అయ్యో నా బిడ్డా.. నీకు ఎంత కష్టం వచ్చింది. పిల్లలను కూడా చంపుకున్నావు. ప్రాణాల కంటే అప్పులు ఎక్కువా..? మమ్మల్ని అందర్నీ విడిచివెళ్లి పోయావే.’’ అంటూ రాజేశ్వరి పెద్దమ్మ కేతమ్మ రోదించారు.

భర్త సాధారణ లారీ డ్రైవర్

యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామానికి చెందిన అవిశెట్టి మల్లేష్‌కి చౌటుప్పల్‌కి చెందిన రాజేశ్వరితో 2014లో వివాహమైంది. మల్లేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

చౌటుప్పల్‌లోని మల్లికార్జున నగర్‌లో మల్లేష్ కుటుంబం నివాసముంటోంది. స్థలం కొనుక్కుని ఏడాది కిందట ఇల్లు కట్టుకుని అందులోనే ఉంటున్నారు.

మొబైల్‌లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల పాలవ్వడమే ఈ మరణాలకు కారణమని కుటుంబీకులు చెప్పిన వివరాలను బట్టి తెలిసింది.

మూడు నెలల నుంచి రాజేశ్వరి ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యారు.

మొదట్లో డబ్బులు రావడంతో ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది.

అప్పటికే కుటుంబానికి అప్పులు ఉన్నాయని, గేమ్స్ ఆడేందుకు మరిన్ని అప్పులు చేసినట్లు భర్త మల్లేష్ చెబుతున్నారు.

ఇతర అవసరాల కోసం సమకూర్చుకున్న రూ.4.15 లక్షలు బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయని, అవి పోవడంతో ఆన్లైన్ గేమ్స్ విషయం తెలిసిందని మల్లేష్ చెప్పారు.

ఆత్మహత్య

‘‘మొబైల్‌లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్న విషయం నాకు నెల తర్వాత తెలిసింది. వేరే అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బులు రూ.4.15 లక్షలు అకౌంట్‌లో పడ్డాయి. రెండు, మూడు నెలల్లోనే ఆ డబ్బులన్నీ పోయి అప్పుల పాలయ్యాం. గేమ్స్ ఆడటం ఎలా అలవాటు అయ్యిందో నాకూ తెలీదు.’’ అని మల్లేష్ బీబీసీతో అన్నారు.

తను అడిగిందని రూ.18 వేలు పెట్టి ఫోన్ కొని ఇచ్చినట్లు చెప్పారు మల్లేష్.

రాజేశ్వరి పదో తరగతి వరకు చదువుకున్నట్లు సోదరుడు నర్సింహ చెబుతుండగా.. డిగ్రీ వరకు చదువుకుందని భర్త మల్లేష్ చెప్పారు.

చాలా ఏళ్ల నుంచి ఆమె ఫోన్ వాడుతున్నట్లు మల్లేష్ చెప్పారు.

‘‘రూ.15 లక్షల దాకా పోయాయి. తెచ్చిన అప్పుల్లో కొన్నింటిని ఇచ్చుకుంటా వచ్చాం. ఇంకా ఇద్దామని ప్లాటు అమ్మాం. ఒకటో తేదీన డబ్బులు వస్తాయి. ఇద్దామనుకునేలోపు ఇలా జరిగింది.’’ అని మల్లేష్ అన్నారు.

ఇల్లు కట్టడం, లారీ కొని అమ్మివేయడం, మల్లేష్ తమ్ముడికి పెళ్లి చేయడం, ప్లాటు కొనడం.. ఇలా ఒకదాని తర్వాత మరోటి రావడంతో అప్పులు మరింత ఎక్కువయ్యాయని బంధువులు చెప్పారు.

ఎలాగైనా గెలవాలనే పంతం

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీనికితోడు విచ్ఛలవిడిగా గేమింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి. సరదాగా వాటిని మొదలు పెట్టిన కొందరు ఆ తర్వాత వాటికి బానిసలుగా మారిపోతున్నారు.

ఎందుకు ఇలా జరుగుతోంది? వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటోందనే విషయాలపై కౌన్సిలింగ్ సైకియాట్రిస్ట్ ఆరె అనిత బీబీసీతో మాట్లాడారు.

‘‘మొబైల్ గేమింగ్ లో తొలుత గెలిచేకొద్దీ ఆనందం ఇస్తుంది. దానివల్ల మళ్లీ మళ్లీ ఆడాలనిపిస్తుంది.

ఆ తర్వాత ఓడిపోతుంటే, ఎలాగైనా గెలవాలనే పంతం మొదలవుతుంది. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవాలనే పంతంతో అలవాటు కాస్త వ్యసనంగా మారుతుంది.’’ అని ఆమె చెప్పారు.

‘‘ఆ రోజు సాయంత్రం రాజేశ్వరి నాకు ఫోన్ చేసింది. అప్పులోళ్లు ఇంటికి వచ్చారన్నా.. లొల్లి పెడుతున్నారు. ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. సరే వస్తానని చెప్పి.. ఒకసారి బావ(మల్లేష్)కు ఫోన్ ఇవ్వమని చెప్పా. తను ఆ సమయంలో మాట్లాడలేదు. దాంతో మల్లేష్ తమ్ముడు శ్రీశైలానికి ఫోన్ చేసి ఇంటి వద్ద గొడవ పెట్టవద్దు. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం.. అని చెప్పాను.'' అని రాజేశ్వరికి వరుసకు సోదరుడైన నర్సింహ బీబీసీకి చెప్పారు.

శ్రీశైలం వీరికి అప్పు ఇచ్చినట్లు బంధువులు చెప్పారు.

''ముందు నాకు 5.48కి ఫోన్ కాల్ వచ్చింది. చిన్న పని ఉండి వేరొక చోటకు వెళ్లి.. 6.15 గంటలకు బయల్దేరాను. ఈలోపు రాజేశ్వరి చనిపోయిందని ఫోన్ వచ్చింది’’ అని నర్సింహ బీబీసీతో చెప్పారు.

ఆత్మహత్య

ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపు లోతు సుమారు 12 అడుగులు. మంచినీరు సరిగ్గా రాక ఎప్పుడూ నాలుగు అడుగుల లోతుకే నీరు ఉండేదని బంధువులు చెప్పారు.

అనుకోకుండా రెండు రోజుల ముందే తాగునీరు ఎక్కువ సేపు రావడంతో సంపు పూర్తిగా నిండింది.

ముందుగా అనిరుధ్, హర్షవర్ధన్‌లను సంపులో పడేసి, ఆ తరువాత రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఆ సమయంలో అప్పుల విషయంపై మాట్లాడేందుకు రాజేశ్వరి భర్త మల్లేష్ సమీపంలోని వేరొక బంధువు ఇంటికి వెళ్లాడు.

‘‘ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పిల్లలు, రాజేశ్వరి కనిపించలేదు. సంపు మూత తెరిచి ఉంది. అనుమానంతో తొంగి చూస్తే ముగ్గురూ పైకి తేలుతున్నారు’’ అని మల్లేష్ బీబీసీతో అన్నారు.

‘‘ఇంటి దగ్గరకు అప్పులోళ్లు వచ్చారు. ప్లాటు అమ్మాం.. మూడు రోజుల్లో డబ్బులు వస్తాయి.. ఇచ్చేస్తామని నా భార్య చెప్పింది. అయినా వినకుండా ఆమెను టార్చర్ చేశారు. అది తట్టుకోలేక ముగ్గురూ సంపులో పడి చనిపోయారు’’ అని ఆయన చెప్పారు.

ముందుగా పిల్లలను సంపులో పడేసి తను కూడా దూకి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

పెద్దబ్బాయి అనిరుధ్‌ను నాలుగు రోజుల కిందటే స్కూల్లో జాయిన్ చేశారని రాజేశ్వరి సోదరుడు నర్సింహ చెప్పారు.

‘‘నర్సింహ చెల్లెలు గతేడాది జూన్ 9న భువనగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె పిల్లలు అనాథలయ్యారు. ఆ ఆలోచనతో తాను లేకపోతే పిల్లలు ఎలా బతుకుతారో అనుకుని తనతోపాటు చంపుకుని ఉంటుంది.’’ అని రాజేశ్వరి బంధువు వెంకటేశ్వర్లు బీబీసీకి చెప్పారు.

రాజేశ్వరి చనిపోయే ముందు తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మల్లేష్ తమ్ముడు శ్రీశైలం బాగా ఒత్తిడి చేశాడని బంధువులు చెబుతున్నారు.

శ్రీశైలంతో మాట్లాడటానికి బీబీసీ ప్రయత్నించింది. అయితే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నాక వారు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యగా కేసు నమోదు

అప్పుల బాధలు తట్టుకోలేక రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజేశ్వరి తల్లి రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవిశెట్టి శ్రీశైలం, వెలుగు లలిత, వెలుగు రాజేశ్వరిపై కేసు పెట్టారు.

అప్పు తీర్చకపోతే ఇంటికి తాళం వేయడంతోపాటు గొర్రెలు, పశువులను తీసుకెళతామని బెదిరించారని ‌‍‌ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయంపై చౌటుప్పల్ ఏసీపీ వై.మొగలయ్య బీబీసీతో మాట్లాడారు.

‘‘రాజేశ్వరి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. మల్లేష్ తమ్ముడు శ్రీశైలం(రాజేశ్వరి మరిది), మరో ఇద్దరు మహిళలు వచ్చి అప్పు చెల్లించాలని బాగా ఒత్తిడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని కుటుంబీకులు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. రాజేశ్వరి ఆన్లైన్ గేమ్స్ ఆడారా.. అప్పులు ఎలా అయ్యాయనేది సమగ్ర విచారణ తర్వాతనే తెలుస్తుంది.’’ అని ఆయన చెప్పారు.

ఆత్మహత్య

ఆమె ఫోన్ డిస్ ప్లే కూడా సరిగ్గా రావడం లేదన్నారు.

ఆన్లైన్ గేమింగ్ యాప్‌ల పరంగా తప్పులుంటే చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటామని మొగులయ్య చెప్పారు.

ఈ ఆన్లైన్ గేమింగ్‌ వ్యసనం నుంచి బయటపడే మార్గాలను సైకియాట్రిస్ట్ అనిత వివరించారు.

'' మొబైల్ గేమింగ్ వల్ల కలుగుతున్న ఆనందాన్ని వేరొక పనిచేయడం ద్వారా సాధించాలి. రోజువారీ ప్రణాళికను తయారు చేసుకోవాలి. వాకింగ్, జాగింగ్, యోగా వంటివి రోజూ సాధన చేయాలి. పాజిటివ్ థింకింగ్ ఉన్న వారితో మాట్లాడుతుండాలి. భవిష్యత్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని వాటిని సాధించాలి.'' అని ఆమె సూచించారు.

ఇవి కూడా చదవండి: