ఆంధ్రప్రదేశ్-చిత్తూరు: మిస్బా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన పదో తరగతి బాలిక మిస్బా ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. సోడా దుకాణం నిర్వహించే వజీర్ అహ్మద్ కుమార్తె మిస్బా, బ్రహ్మర్షి ప్రైమరీ అండ్ హైస్కూల్లో చదువుతోంది. మార్చి 22న ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
తమ ఆర్థిక పరిస్థితి కారణంగా బడిలో మరో విద్యార్థిని అవమానించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మిస్బా కుటుంబం ఆరోపిస్తోంది. మిస్బాను వేధించారని, ఆమెను వేధించడం వెనుక అధికార పార్టీ నేత ఒకరు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను వైసీపీ ఖండించింది.
బ్రహ్మర్షి స్కూల్‌ను రమేశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన భార్య పేరు మీద నిర్వహిస్తున్నారు. అందులో పదో తరగతి చదివే పూజిత, మిస్బా ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా కష్టపడి చదువుతారు. పండుగలకు ఒకరిళ్లకు ఒకరు వెళుతుంటారని పూజిత తల్లి గీతాంజలి చెప్పారు. దీపావళికి కూడా తమ ఇంటికి మిస్బా వచ్చిందని కూడా ఆమె వెల్లడించారు. మార్చి 14న మిస్బా తనకు ఫోన్ చేసి పూజితను జాగ్రత్తగా చూసుకోవాలని తనతో చెప్పిందని పూజిత తల్లి బీబీసీతో చెప్పారు.
''మార్చి 14వ తేదీన రాత్రి 10.30 గంటలకు మిస్బా నాకు ఫోన్ చేసింది. మీ అమ్మాయి పూజితను స్కూల్లో కొందరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆమెకు చదువు విషయంలో ఇబ్బంది రావచ్చు. పూజిత కోసం నేను దర్గాలో కూడా చూపించాను. ఆమెకు ఇబ్బంది ఎదురుకావచ్చు. కాబట్టి పూజితను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది''అని పూజిత తల్లి గీతాంజలి వెల్లడించారు.

స్కూల్ దగ్గర ఏం జరిగింది.?
మిస్బా కాల్ వచ్చిన మరుసటి రోజు బ్రహ్మర్షి స్కూలుకు వెళ్లి కరస్పాండెట్‌గా వ్యవహరించే రమేశ్ తో తాను మాట్లాడానని గీతాంజలి తెలిపారు. మిస్బా తనకు ఫోన్ చేసి పూజిత గురించి చెప్పిన విషయాన్ని రమేశ్‌కు వివరించానని చెప్పారు. తర్వాత మిస్బాను పిలిచి రమేశ్ కౌన్సెలింగ్ ఇచ్చారని ఆమె అన్నారు.
''స్కూల్‌కు వెళ్లి వాళ్ల క్లాస్ టీచర్, ప్రిన్సిపల్ తో మాట్లాడాను. వేరే పిల్లులు మా అమ్మాయిని ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నారా అని నేను అడిగాను.దీంతో మిస్బాని మా పాపని ఇద్దర్ని పిలిపించారు. నేనే ఆంటీకి ఫోన్ చేశాను, పూజిత భయపడుతోంది అని చెప్పానని చెప్పింది. మా దర్గాలో పూజితకు, నాకు ఎలా ఉంది అని తెలుసుకున్నాను. పూజితకు టైమ్ బాగాలేదు, ఆమె ఫెయిల్ అవుతుందని చెప్పారు. అదే ఆంటీకి చెప్పాను అని చెప్పింది. స్కూల్ టీచర్లు ఆమెను మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు'' అని పూజిత తల్లి గీతాంజలి వివరించారు.

చదువులో పోటీవల్లే వివాదమా?
పరీక్షల్లో మిస్బాకు తక్కువ మార్కులు వచ్చాయని, దాని గురించి కరస్పాండెంట్ రమేశ్‌ను మిస్బా ప్రశ్నించిందని, దానికి రమేశ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, తాము కూడా స్కూల్‌కు వెళ్లి అడిగామని మిస్బా తల్లిదండ్రులు అంటున్నారు.
''మార్కుల గురించి మాట్లాడొద్దు. పూజిత వాళ్లు పాలిటిక్స్‌లో ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా చేస్తారు. మీరు చెట్టు కింద సోడాలు అమ్ముకునే వాళ్లు, నువ్వు ఒకటిన్నర నెల రాకుండా ఇంటి దగ్గర ఉండి చదివావు. నీకు పర్సంటేజ్ ఇవ్వలేను అని రమేశ్ అన్నారు’’ అని మిస్బా తండ్రి వజీర్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.
‘‘తనకు మార్కులు ఎందుకు సరిగా రాలేదని మిస్బా కరస్పాండెంట్‌ను ప్రశ్నించింది. ఆయన పూజిత భారం మొత్తం తీసుకున్నారు. మీ నాన్నను ఎవరైనా చంపేస్తే ఏం చేస్తావ్ అని అడిగేసరికి మా పాప డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. మా ఆవిడ స్కూలుకు వెళ్లి అడిగితే అసలు ఎగ్జామ్స్ కూడా రాయనీయకుండా చేస్తాననని కరస్పాండెంట్ అన్నారు’’ అని వజీర్ అహ్మద్ వెల్లడించారు.
‘‘కరస్పాండెంట్ కాళ్లు పట్టుకొని సార్ ఒక నెల రోజులు ఎగ్జామ్స్ రాసుకొని వెళ్లిపోతామని అడుక్కుంది. అయితే, మీ పాపను తీసుకుని వెళ్లిపోండని కరెస్పాండెంట్ అన్నారు. పూజిత వాళ్ల ఫాదర్‌ను అడిగి మీ పాప స్కూల్‌కు రావాలా వద్దా అని డిసైడ్ చేసి పిలుస్తాననని పంపించేశారు'' అని మిస్బా తండ్రి వజీర్ అహ్మద్ చెప్పారు.
ముక్కుకు ఆపరేషన్ జరగడంతో కొన్నిరోజులు మిస్బా స్కూల్ కి వెళ్లలేదని పూజిత తల్లి గీతాంజలి చెప్పారు.

ఆత్మహత్య ఎలా చేసుకుంది?
మిస్బాను మరో ప్రైవేటు పాఠశాలకు తీసుకెళ్లాలని రమేశ్ చెప్పారని, ఆ కొత్త బడికి రెండు రోజులు మాత్రమే వెళ్లిందని మిస్బా తండ్రి వజీర్ అహ్మద్ తెలిపారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఇంటికి తీసుకొచ్చానని, దుస్తులు మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని మిస్బా తండ్రి అన్నారు. ఆత్మహత్యకు ముందు రాసిందంటూ రెండు లేఖలను వజీర్ చూపించారు.
ఒక లేఖలో తండ్రికి మిస్బా జాగ్రత్తలు చెప్పింది. క్షమాపణ కూడా చెప్పింది. తన స్నేహితురాలు పూజిత తనకు దూరమైందనే బాధను అందులో ఆమె వ్యక్తం చేసింది. తన మరణానికి పూజిత కారణమని మిస్బా రాసినట్లు తల్లిదండ్రులు చూపిస్తున్న లేఖలో ఉంది.
''రమేశ్ ఫోన్ చేసి నన్ను పిలిపించారు. మీ పాపకి వేరే స్కూల్ మాట్లాడాను అక్కడికి వెళ్లమని చెప్పారు. సోమవారం కొత్త స్కూల్ కి వెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు నాయుడు నాకు ఫోన్ చేశారు. మీ పాప ఇక్కడ చదవలేకపోతోంది, మీరు బ్రహ్మర్షీ స్కూల్‌కే తీసుకెళ్లండని చెప్పారు. మా పాపకి బ్యాగు, బాక్స్ అన్ని ఇచ్చి పంపించేశారు. మా పాపను ఇంటికి తీసుకొస్తుంటే,నన్ను రమేశ్ సార్ స్కూలుకు పంపొద్దు అని ఏడ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకుంటానని గదిలోకి వెళ్లి ఉరివేసుకొని చనిపోయింది'' అని మిస్బా తండ్రి వజీర్ అహ్మద్ వివరించారు.
రాజకీయాలు ఎలా ప్రవేశించాయి?
పూజిత తండ్రి వైసీపీలో ఉన్నారని, ఆయన అధికార పార్టీ తరపున ఒత్తిడి పెట్టడం వల్లే మిస్బాను స్కూల్ నుంచి పంపించేశారని టీడీపీ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అమరనాథ రెడ్డి-మిస్బా కుటుంబాన్ని పరామర్శించి, రూ. 50వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
మిస్బా తల్లిదండ్రులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఫోన్‌లో మాట్లాడారు. టీడీపీ మీకు అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు.
''మానసికంగా వేధించడం వల్లనే చనిపోయిందని ఆ అమ్మాయి సూసైడ్ నోట్లో రాసింది. ఎవరి వల్ల ఈ రకమైన పరిస్థితులు అనేది క్లియర్‌గా సూసైడ్ నోట్లో రాశారు. మొన్నటి వరకు బయటకు రాలేదు. నేను వాళ్ల ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల ఫాదర్ ద్వారా బయటికి వచ్చింది. దీనికి కారణం వైసీపీలో ఉంటున్న సునీల్ కూతురు పూజిత అని ఆ లేఖలో రాసి ఉంది. ఇదంతా రాజకీయ పలుకుబడి వల్లే జరిగింది. పిల్లల చదువులలోనూ రాజకీయ ఒత్తిడి ఏంటి''అని టీడీపీ మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి బీబీసీతో అన్నారు.
టీడీపీ ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ స్పందిస్తూ, పూజిత తండ్రి సునీల్ ఎవరో తనకు తెలియదన్నారు. ఇదంతా అమర్‌నాథ్ రెడ్డి చేస్తున్న శవ రాజకీయమని ఆయన ఆరోపించారు. బ్రహ్మర్షి స్కూల్ కరస్పాండెంట్ రమేశ్ టీడీపీకి చెందిన వ్యక్తి అని, అయినా అమర్‌నాథ్‌రెడ్డి ఎందుకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
''కొద్దిగా అయినా మానవత్వం ఉండాలి. స్కూల్ పిల్లలపైన ఎవరైనా రాజకీయం చేస్తారా? ముస్లింలంతా వైసీపీ వైపు ఉన్నారని వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవడానికి ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నాడు. మిస్బా కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడాను. వారికి ప్రభుత్వం నుంచి కోటి రూపాయలు ఇప్పిస్తామని చంద్రబాబుతో ఫోన్ చేయించి మభ్య పెడుతున్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం'' అని ఎమ్మెల్యే వెంకటె గౌడ బీబీసీతో చెప్పారు.
తాము రాజకీయాల్లో లేమని, ఎప్పుడూ పార్టీల్లో తిరగలేదని, మధ్య తరగతి రైతులమని పూజిత తల్లి గీతాంజలి చెప్పారు.
''మేం ఏ పార్టీలో లేము. పూజిత, మిస్బా మంచి ఫ్రెండ్స్. వారి మధ్య గొడవలు ఏమి జరగలేదు. సడన్ గా ఎందుకు ఇలా చేసుకుందో అర్థం కాలేదు. ఆ అమ్మాయి కూడా మాకు బిడ్డ లాంటిదే ఇలా చేసుకుంటుందని అనుకోలేదు'' అని పూజిత తల్లి గీతాంజలి అన్నారు.
మిస్బా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలంటూ పలమనేరులో మార్చి 22న స్థానిక ముస్లింలు రోడ్డుపై బైఠాయించారు. ఇదే డిమాండ్‌తో మార్చి 24న కొన్ని ముస్లిం సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. ఇందులో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి స్కూల్‌ను ముట్టడించి స్కూల్ యాజమాన్యాన్ని, పూజిత తండ్రి సునీల్‌ను అరెస్టు చేయాలంటూ పలమనేరు డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
కరస్పాండెంట్ రమేశ్ ను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఆయనను పోలీసులు తమిళనాడులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలేది లేదని పలమనేరు డీఎస్పీ గంగయ్య బీబీసీకి చెప్పారు.
''తమిళనాడులోని రామేశ్వరంలో రమేశ్‌ను అరెస్ట్ చేశాం. అక్కడే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ కు పెడతాం. కేసును ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం'' అని గంగయ్య బీబీసీతో చెప్పారు.

సూసైడ్ నోట్లో ఏముంది ?
ఆ బాలిక రాసిన ఆత్మహత్య లేఖలు రెండింటినీ పోలీసులు తీసుకెళ్లారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. మిస్బా తండ్రి చూపుతున్న సూసైడ్ లెటర్ల ప్రకారం..రెండు సూసైడ్ నోట్లలో కంటెంట్ కాస్త వేరుగా ఉంది. ఇంగ్లీషులో రాసిన లేఖలను చూస్తే మిస్బాకు తన స్నేహితురాలు పూజిత దూరం అయిందన్న బాధ కనిపిస్తుంది. మరో లేఖలో తన చావుకు తన ప్రాణ స్నేహితురాలు పూజిత కారణమని స్పష్టంగా రాసింది మిస్బా.
వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చారంటూ చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మిస్బా కుటుంబానికి లక్ష రూపాయలు అందించారు.
ఇవి కూడా చదవండి:
- దానిశ్ ఆజాద్ అన్సారీ: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని ఏకైక ముస్లిం మంత్రి ఎవరు?
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- యుక్రెయిన్: భారత అలీన విధానం ఒత్తిడిని ఎదుర్కొంటోందా? తటస్థ వైఖరి భారత్‌కు ఇబ్బందికరంగా మారిందా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- కుమ్రం భీము: ఈ ఆదివాసీల దేవుడ్ని నిజాం పోలీసులు నేరుగా ఎదుర్కోలేక వెనక నుంచి వెళ్లి చంపారు
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














