5 W's of Financial Planning: ఈ విషయాలు తెలుసుకుంటే మీకు డబ్బు సమస్యలు ఉండవు

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

డాక్టర్ విమల్ కృష్ణ రాజ్‌పుత్ కంటి వైద్యులు. బెంగళూరు నారాయణ నేత్రాలయలో ఆయన పనిచేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి మన దేశాన్ని కుదిపేసిన సమయంలో ఎంతో మంది పేషెంట్ల కష్టనష్టాలు ప్రత్యక్షంగా ఆయన చూశారు. ఆ గడ్డు పరిస్థితులలో పేషెంట్ల ఆవేదన నుంచి పుట్టిన పుస్తకం '5 W's of Financial Planning'.

ఆర్థిక స్వావలంబన ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్క వ్యక్తికీ సులభంగా అర్థం కావడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.

ఎలాంటి ఫైనాన్స్ లేదా ఎకనామిక్స్ అనుభవం లేకుండా కేవలం తను స్వయంగా చేసిన రీసెర్చ్ నుంచి తెలుసుకున్న పాఠాలు అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో రాసిన పుస్తకం ఇది. డాక్టర్ విమల్ ఇదే విషయాన్ని తన ముందుమాటలో పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనాన్స్ అంటే కష్టమైన పదాలు, కఠినమైన సూత్రాలు అనే భావన మన సమాజంలో ఉంది. ఈ రకమైన ఆలోచనలను ఎదుర్కొనేందుకు ఆయన చేసి కృషి ఈ పుస్తక రూపంలో వచ్చింది.

నేషనల్ కమిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే ప్రకారం మన దేశంలో ఆర్థిక అంశాల మీద నిరక్ష్యరాస్యత 72% ఉంది. ఈ పుస్తకం ఎంత అవసరమో చెప్పడానికి ఈ గణాంకం ఒక్కటి చాలు.

పర్సనల్ ఫైనాన్స్ సాహిత్యం దాదాపు శతాబ్ద కాలం నుంచి అందుబాటులో ఉంది. కానీ ఇవన్నీ ఆర్థిక శాస్త్రం చదువుకున్నవారు లేదా స్టాక్ మార్కెట్లో ఎంతో అనుభవం ఉన్నవారు రాసినవి.

పుస్తకం పేరులో చెప్పినట్టుగా పర్సనల్ ఫైనాన్స్ అంశాన్ని వై, వాట్, వెన్ లాంటి ప్రశ్నలు-సమాధానాల రూపంలో వివరించారు. ఇలా విడివిడిగా చెప్పడం వల్ల పాఠకులకు అవసరమైన విషయాన్ని నేరుగా చదివే వీలుంటుంది. ఇప్పుడు ఈ ప్రశ్నావళి ద్వారా రచయిత చెప్పిన విషయాన్ని స్థూలంగా పరిశీలిద్దాం.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి?

మొదటి చాప్టర్ మొత్తం పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి? అనే విషయం మీద రచయిత దృష్టి సారించారు. ఫైనాన్స్ అనుభవం లేని వారికి అర్థం అయ్యే విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంశాన్ని బాడి బిల్డింగ్ లాంటి విషయంతో పోలుస్తూ చాలా సరళంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే సమయంలో ఉన్న వివిధ కార్యక్రమాలను వివరించారు.

ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మదుపు మార్గాన్ని ప్లాన్ చేయడం కాదని సవివరంగా చెప్పారు. ఈ పుస్తకం ప్రత్యేకతలలో ఇది కూడా ఒకటి.

పర్సనల్ ఫైనాన్స్ సాహిత్యంలో చాలామంది రచయితలు ఏదో ఒక అంశాన్ని సుదీర్ఘంగా వివరిస్తారు లేదా ఆర్థిక అంశాల పట్ల తమ ఆలోచనా విధానాన్ని ప్రతిపాదిస్తారు.

విన్ విత్ స్టాక్స్, రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి పుస్తకాలలో ఈ ధోరణి కనిపిస్తుంది. కానీ ఈ పుస్తకంలో పర్సనల్ ఫైనాన్స్ అంశంలోని అన్ని విషయాలను రచయిత స్పృశించారు.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ ఎందుకు చేయాలి?

రెండవ చాప్టర్ మొత్తం పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరం అనే ప్రశ్న మీద సాగుతుంది. ఆర్థిక స్వావలంబన గురించి ఎన్నో విషయాలను రచయిత ప్రస్తావించారు.

వారెన్ బఫెట్, బెంజమిన్ గ్రాహం లాంటి ప్రముఖులు చెప్పిన సూక్తులను తరుచుగా ఇస్తూ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరమో చెప్పారు.

కోవిడ్ వల్ల వచ్చిన ప్రత్యేక పరిస్థితులను ఉటంకిస్తూ రిటైర్మెంట్ ప్లానింగ్, ఎమర్జెన్సీ ఫండ్ లాంటి విషయాల ప్రాముఖ్యతను వివరించారు.

చాలామంది పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెప్పినట్టుగా ద్రవ్యోల్బణం వల్ల సంపద ఎలా తగ్గిపోతుందో వివరించారు. సినిమా పాటలు, ఉదాహరణల ద్వారా ద్రవ్యోల్బణం మన జీవితాన్ని ఎలా చిన్నాభిన్నం చేయగలదో విపులంగా చెప్పారు.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు చేయాలి?

మూడవ చాప్టర్ పూర్తిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు చేయాలో వివరించారు. వయసును బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా కలిగే లాభాలను చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళిక అనేది పర్సనల్ ఫైనాన్స్ మూల సూత్రం. చక్రవడ్డి వల్ల మనం చేసే మదుపు ఎలా పెరుగుతుంది అనే మౌలికమైన అంశాన్ని ప్రస్తావించారు.

ఇదే విషయాన్ని వివిధ పట్టికల ద్వారా ఉదాహరణలు ఇస్తూ సులభంగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పారు. ఈ చాప్టర్ మొత్తంలో ఒకే ఒక్క చోట చక్రవడ్డీ సూత్రాన్ని ప్రస్తావించారు. మిగిలిన చాప్టర్ అంతా ఫైనాన్స్ పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్థం చేసుకునే విధంగా చెప్పారు.

రూల్ ఆఫ్ 72 సూత్రాన్ని వాడుకుని మదుపు నిర్ణయాలు తీసుకోవడం ఎలాగో వివరించారు. అలాగే పర్సనల్ ఫైనాన్స్ ప్రయాణాన్ని మొదలు పెట్టే సమయంలో మదుపరులకు కలిగే కొన్ని సందేహాలను కూడా ప్రస్తావించి వాటికి తగిన సమాధానాలు కూడా ఇచ్చారు.

ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశం ఇలాంటి మదుపరులే కాబట్టి ఈ విషయం మొత్తం వారికి ఉపయోగపడేలా ఉంది.

వీడియో క్యాప్షన్, రిటైర్ అయిన తరువాత కూడా నెలనెలా తగినంత డబ్బు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?

ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే సమయంలో ఏం చేయాలి?

నాలుగో చాప్టర్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసే సమయంలో ఏం చేయాలో వివరించారు. మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఆదాయానికి సంపదకు మధ్య తేడా ఏమిటి లాంటి మౌలికమైన విషయాలను ప్రధానంగా ప్రాస్తావించారు.

ఇలా చేయడం ద్వారా ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రక్రియకు పునాది మన ప్రస్తుత పరిస్థితి మీద అవగాహన ఉండటం అని తెలియచెప్పినట్టుగా ఉంది.

ఇంతకుమునుపు కూడా చాలామంది నిపుణులు మన సంపదను మించిన ఖర్చులు చేయడం ద్వారా మన జీవితం ఎలా సంక్షోభంలో పడుతుందో చెప్పారు.

ఈ చాప్టర్లో రచయిత కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 50-30-20 రూల్, సరైన బడ్జెట్ తయారు చేసుకోవడం లాంటి చర్యల వల్ల ద్వారా కలిగే ప్రయోజనాన్ని ఉదాహరణల ద్వారా వివరించారు.

ఇదే విషయానికి కొనసాగింపుగా సాగిన తర్వాత చాప్టర్లో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అనేక చోట్ల కోవిడ్-19 సంక్షోభాన్ని ప్రస్తావించారు. సదరు పాలసీలలో ఉండే వివిధ రైడర్లు, ఇతర ముఖ్యమైన విషయాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ విషయంలో ఇన్సూరెన్స్ అనేది ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే అంశం. ఇది సరైన ఆలోచనా విధానం కాదు. బహుశా అందువల్లే రచయిత కూడా పదే పదే సరైన ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కలిగే కష్టనష్టాలను ప్రస్తావించారు. పర్సనల్ ఫైనాన్స్ తొలి అడుగు ఇన్సురెన్స్ తీసుకోవడం అనే విషయాన్ని రచయిత ఇలా ప్రస్తావించడం హర్షణీయం.

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

బిహేవియర్ ఫైనాన్స్

‘ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కేవలం 20% కార్యక్రమం. మిగిలిన 80% మన ప్రవర్తన.’ అని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు డేవ్ రాంసే పేర్కొన్నారు.

ఉదాహరణకు మన ఇంటి పక్కన ఉండే హోటల్లో మనం వెళ్ళి తింటే 5% జీఎస్టీ కడతాం అదే స్విగ్గీ, జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తే 18% జీఎస్టీ కట్టాలి. ఒకే అవసరానికి తక్కువ ఖర్చు చేసే అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోకుండా ఉండటం ఫైనాన్షియల్ సూత్రాలకు విరుద్ధం. దీన్నే బిహేవియర్ ఫైనాన్స్ అంటారు.

అనేక పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఈ విషయాలు ఉన్నప్పటికీ ఇలా ఒక సెక్షన్ మొత్తం బిహేవియర్ ఫైనాన్స్ కోసం కేటాయించడం ఈ పుస్తకం ప్రత్యేకత. భావోద్వేగలకు లోనయ్యి ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయాలలో మనం చేసే తప్పులను రచయిత ప్రస్తావించారు.

ఫైనాన్స్ బిహేవియర్ మన జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే లాభాలను ఉదాహరణలతో వివరించారు. సగటు మధ్య తరగతి మనుషులు ఎక్కువగా ఉపయోగపడే ఈ అంశం గురించి మరింత ప్రచారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫైనాన్షియల్ ప్లానింగ్

ఫొటో సోర్స్, Getty Images

రిటైర్మెంట్ ప్లాన్ వర్సెస్ ఎస్టేట్ ప్లానింగ్

ఎస్టేట్ ప్లానింగ్ తమకు అవసరం లేదు అనేది చాలామంది ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి ఉన్న అపోహ. రచయిత ఇలాంటి అపోహల వల్ల కలిగే నష్టాలను సూటిగా చెప్పారు.

రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంత అవసరమో ఎస్టేట్ ప్లానింగ్ కూడా అంతే అవసరం. ఎందుకంటే మన తదనంతరం ఎలాంటి కోర్టు కేసులు లేకుండా మన కుటుంబానికి మనం చేసిన మదుపు తాలూకు లాభాలు అందటం చాలా ముఖ్యం.

రచయిత ఇదే విషయాన్ని సరళమైన రీతిలో వివరించారు. సాధారణంగా పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఇలాంటి విషయం ఉండటం అరుదు. రచయితే ఈ విషయాన్ని కూడా చర్చిడం ద్వారా ఈ పుస్తకం ఒక సమగ్రమైన రూపాన్ని సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)