‘ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడు చూడలే’.. విశాఖ ప్రజల ఆశ్చర్యం

విశాఖ రోడ్డు నిర్మాణ పనులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

విశాఖ నగర పరిధిలో జరుగుతున్న రోడ్ల పనుల తీరు విమర్శలకు తావిస్తోంది.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు వార్డుల్లో గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయడం, పాడైపోయిన పాత రోడ్లపై మళ్లీ కొత్తరోడ్లు వేయడం వంటి పనులు చేపడుతున్నారు.

అలాగే 44వ వార్డులోని అబీద్ నగర్‌లో పాత రోడ్లపై కొత్తగా తారు రోడ్లు వేస్తున్నారు.

ఈ పనులు సాగుతున్న తీరు ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

ఈ ఫోటోలు ఉన్న కారుతో పాటు ఇంకో చోట ద్విచక్రవాహనం, మరో చోట చాలాకాలంగా ఉపయోగంలో లేని కారు, మరో చోట ఒక చిన్న తోపుడు బండి ఇలా ఏవి ఎలా ఉంటే అలా వాటిని వదిలేసి మిగతా చోటంతా రోడ్లు వేసుకుంటూ వెళ్లిపోయారు.

ఇది చూసిన స్థానికులు రోడ్లు చాలా విచిత్రంగా వేస్తున్నారే అనుకుంటున్నారు.

ఈ కారు చాలా నెలలుగా ఇక్కడే ఉందని స్థానికుడైన రామానుజన్ తెలిపారు.

“కారు ఎవరిదో తెలియదు కానీ, పాడైపోవడంతో ఎవరూ తీసుకెళ్లలేదు.

అయితే ఆ కారు తీసేసి రోడ్లు వేయాలి. కానీ కారును అలాగే వదిలేసి రోడ్డు వేశారు.

దీని వలన ఏం ఉపయోగం? ఏదో ప్యాచ్ వర్క్ చేసినట్లు ఉంది, పూర్తిగా రోడ్డు వేసినట్లు లేదు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా రోడ్ల పనులు జరుగుతున్నాయి అనుకున్నాం. కానీ ఇలా సగం సగం పనులు చేయడం వలన ఉపయోగం ఏం ఉంది?” అని రామానుజన్ అన్నారు.

విశాఖ రోడ్డు నిర్మాణ పనులు

వదిలేసిన రోడ్డును ఎప్పుడు పూర్తి చేస్తారు?

రోడ్డుకు రెండు వైపులా చెట్లు ఉంటేనే.. వాహనాలకు ఇబ్బంది అవుతుందని తీసేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ వాహనాలను పక్కకు తీయకుండా ఈ రోడ్డు వేయడం ఏంటో అర్థం కావడం లేదు.

పైన ఫోటోలో కనిపిస్తున్నట్లు ఎడమ వైపున తారు రోడ్డుని చివర వరకు వేశారు. అంటే ఇంటి హద్దు వరకు వేశారు. కానీ కుడి వైపున దాదాపు ఆరడుగుల మేర వెడల్పున వాహనాలు నిలిపి ఉన్నాయి. వాటి స్థానంలో రోడ్డు వేయకుండా, మిగతా పార్కుకి ఉన్న రోడ్డు పొడవునా కొత్తగా రోడ్డు వేసేశారు. అంటే 40 అడుగుల రోడ్డుపై చెరో వైపు ఒకటిన్నర అడుగులు.. మొత్తంగా మూడు అడుగులు వదిలేయాలి. కానీ ఒక వైపు ఆరు అడుగులు మరో వైపు అరడుగు వదిలి పెట్టి రోడ్డు వేసేశారు.

కొన్నిచోట్ల కొత్త రోడ్డుకి, పాత రోడ్డుకి తేడా స్పష్టంగా కనిపిస్తోందని, రోడ్డు వేయని పాత రోడ్డుపై బ్లాక్ కలర్ బిటుమినస్ అయిల్ (తారు)ను స్ప్రే చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా అబీద్‌నగర్‌లో జరుగుతున్న రోడ్డు పనుల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకున్నాయి.

ఇలా చేయడం వలన రోడ్డు వేసినట్లు అవ్వదని, కేవలం ప్యాచ్ వర్క్ చేసినట్లు ఉందని, మరి వదిలేసిన రోడ్డును ఎప్పుడు పూర్తి చేస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాలను రోడ్డు వేసిన జీవీఎంసీ కాంట్రాక్టర్, ఆ వార్డు కార్పొరేటర్లను బీబీసీ అడిగింది.

విశాఖ రోడ్డు నిర్మాణ పనులు

ఇంకా వర్క్ ఉంది కదా అని..

అబీద్ నగర్ రోడ్డు మరమ్మతు పనులు జీవిఎంసీ కాంట్రాక్టర్ కూర్మనాథ్ చేస్తున్నారు. ఈ విచిత్రమైన రోడ్డు పనులపై బీబీసీ ఆయనతో మాట్లాడింది.

“అబీద్ నగర్ రోడ్డు పనులు చేసేందుకు మాకు మూడు, నాలుగు రోజులు పడుతుంది. నిన్ననే (22.06.23) పనులు మొదలు పెట్టాం. మేం పనులు మొదలు పెట్టే సమయానికి ఈ రోడ్లపై అనేక వాహనాలు అడ్డంగా ఉన్నాయి. ఆ వాహనాలను వాటి యాజమానులతో తీయించి వేశాం. కానీ అబీద్ నగర్ రోడ్డుపై పార్క్ చేసిన రెండు కార్ల యాజమానులు ఫోన్‌లో కూడా మాకు అందుబాటులోకి రాలేదు.

వాళ్లు వచ్చే లోపు కొంత పని చేయవచ్చు కదా అని వాటిని వదిలేసి రోడ్డు వేసుకుంటూ వెళ్లాం. సాయంత్రమైనా వారు రాలేదు. వెంటనే స్థానిక నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వాళ్లు స్పాట్‌కి వచ్చారు. వారు కూడా ఆ కార్ల యాజమానుల కోసం ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు.

దీంతో ఎలాగు మరో రెండు రోజులు పనులున్నాయి కాబట్టి, ఈలోగా యాజమాని వస్తారని, అప్పుడు వాటిని తీసివేసి పనులు చేయవచ్చని అనుకున్నాం.” అని జీవీఎంసీ కాంట్రాక్టర్ కూర్మనాథ్ బీబీసీతో చెప్పారు.

“వాహనాలు రోడ్డుకి ఇరువైపులా పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇళ్లలో పార్కింగ్ లేకపోవడంతో బయట పెట్టేస్తున్నారు. రోడ్డు పనులు చేసే సమయంలో వీరంతా అందుబాటులో ఉండరు. అలాగని మా పనిని ఆపలేం. వదిలేసిన ప్రాంతంలో కూడా రోడ్డు పనులు పూర్తి చేసిన తర్వాత మేం బిల్లులు పెట్టగలం. లేదంటే మాకు నయాపైసా బిల్లు రాదు. రేపటిలోగా వాహనదారులను కనుక్కొని వాటిని తొలగించి, రోడ్డు పనులు పూర్తి చేస్తాం.” అని కూర్మనాథ్ సమాధానం ఇచ్చారు.

స్కూటర్ ఉన్న చోట వదిలేసి మిగతా ప్రాంతంలో రోడ్డు వేశారు
ఫొటో క్యాప్షన్, స్కూటర్ ఉన్న చోట వదిలేసి మిగతా ప్రాంతంలో రోడ్డు వేశారు

సగం సగం పనులు చేస్తే ఊరుకోం: కార్పొరేటర్

ఈ పనులు జరుగుతున్నప్పుడు పరిశీలనకు వెళ్లానని, అయితే వాహనాలు ఉన్న చోట రోడ్డు వేయకుండా వదిలేసినట్లు గమనించలేదని 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

“అబీద్ నగర్ లో చాలా రోజులుగా రోడ్లు పాడైపోయాయి. ఎట్టకేలకు నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభమయ్యాయి. కానీ, ఇలా సగం సగం పనులు చేస్తే ఊరుకోం. అక్కడ వాహనాలను తీయిస్తాం. యాజమానులు అందుబాటులోకి రాకపోతే వాటిని అక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలిస్తాం. అంతే కానీ రోడ్డు పనులు అసంపూర్ణంగా వదిలేయడం జరగదు.” అని బాణాల శ్రీనివాసరావు అన్నారు.

విశాఖ రోడ్డు నిర్మాణ పనులు

స్థానికులు ఏమంటున్నారు?

ఇలా సగం సగం పనులు చేయడంతో జీవీఎంసీ పనితీరులో నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు.

‘’ఎంతో కాలంగా.. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం, రోడ్డు పనులు ఎప్పుడు జరుగుతాయా అని, ఎన్నికలకు ఒక ఏడాది ఉందనగానైనా పనులు జరుగుతుండటంతో సంతోషించాం. కానీ ఇలా చిత్రమైన రోడ్డు పనులు జరుగుతుంటే ఏం అనాలో కూడా తెలియడం లేదు’’ అబీద్ నగర్ నివాసి శ్రవణ్ బీబీసీతో తెలిపారు.

ఇంత అస్తవ్యస్తంగా, అతుకుల బొంతలా రోడ్లు వేసి జీవీఎంసీ ఏం సాధిస్తుందని ఆయన ప్రశ్నించారు.

వదిలేసిన వర్క్ ని మళ్లీ చేస్తామని చెప్తున్నారు, మరి అది డబుల్ వర్క్ కదా... దాని కోసం మళ్లీ ఇన్ని వాహనాలను, సిబ్బందిని తీసుకుని వస్తారా? లేదంటే ప్యాచ్ వర్కే కదా అని వదిలేస్తారా? వీటికి కూడా అధికారులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంపై జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)