మియన్మార్: ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జైలులో ఖైదీల నరకయాతన

మౌంగ్ పొ

ఫొటో సోర్స్, MAUNG PHO

ఫొటో క్యాప్షన్, ఇన్సీన్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో మౌంగ్ పో అక్కడి పరిస్థితులను డ్రాయింగ్ రూపంలో వేశారు
    • రచయిత, జొనాథన్ హెడ్
    • హోదా, ఆగ్నేయాసియా ప్రతినిధి

ప్యో వీ హ్లైయింగ్ వయస్సు 21 ఏళ్లు. ఆయన వైఫై టెక్నీషియన్‌గా పనిచేస్తారు. 2021 జూలైలో ఆయన ఒక వారం పాటు కనిపించకుండా పోయారు.

అప్పుడే ఆయన తండ్రికి ఒక గుర్తుతెలియని ఫోన్ కాల్ వచ్చింది. మియన్మార్‌లోని అతిపెద్ద నగరమైన యాంగాన్ పరిసర ప్రాంతాల్లోని ఒక బ్రిడ్జి వద్దకు వెళ్లాలంటూ ఆయన తండ్రికి ఫోన్‌కాల్‌లో చెప్పారు.

అక్కడే తన కుమారుడు అరెస్ట్ అయినట్లు ఆయనకు తెలిసింది. హ్లైయింగ్ తండ్రి వీధిలో చిరుతిండి వ్యాపారం చేస్తారు.

కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రభుత్వ వార్తాపత్రికలో దీని గురించి చదివారు.

మియన్మార్ మిలిటరీ ప్రభుత్వంతో పోరాడుతున్న పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ తిరుగుబాటుదారులకు మద్దతుగా తీవ్రవాద దాడులకు పాల్పడేందుకు పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారంటూ 29 మందిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల ఆధారంగా వారిని అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అయిన 29 మందిలో ప్యో వీ హ్లైయింగ్ కూడా ఒకరు.

ఆ బృందంలో 19 ఏళ్ల సి థు ఆంగ్ కూడా ఉన్నారు. ఆయన ఇంజినీరింగ్ విద్యార్థి. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఆంగ్‌ను పోలీసులు తీసుకువెళ్లినట్లు ఆయన తల్లికి ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ప్యో వీ హ్లైయింగ్ కనిపించకుండా పోయిన మరుసటి రోజే ఆంగ్ అరెస్ట్ జరిగింది.

‘‘మియన్మార్ గులాగ్’’ అని పిలిచే జైళ్లు, విచారణ కేంద్రాల నెట్‌వర్క్‌లోకి ఈ యువకులు ఇద్దరినీ తీసుకెళ్లారు. ఈ నెట్‌వర్క్‌ను దశాబ్దాల పాటు అసమ్మతివాదులను నిర్బంధించి, హింసించేందుకు ఉపయోగించారు.

ఈ నెట్‌వర్క్‌లో ‘‘ఇన్సీన్ ప్రిజన్’’ ఉంటుంది. వరుస మిలటరీ ప్రభుత్వాల అణచివేతకు గుర్తుగా దీనికి ఈ పేరు వచ్చింది. ఏడేళ్ల జైలు శిక్ష పడిన తర్వాత తొలిసారిగా ఈ జైలులోకి ప్యో వీ హ్లైయింగ్, సి థు ఆంగ్‌లు వెళ్లారు.

ఈ జైలులో నిర్బంధానికి గురైన వ్యక్తుల కుటుంబాలతో పాటు మౌంగ్ పో అనే ఒక ఆర్టిస్టుతో బీబీసీ మాట్లాడింది.

మౌంగ్ పో ఆరు నెలల పాటు ఆ జైలులో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ భయంకరమైన జైలులోని పరిస్థితులపై చిత్రాలు గీసి వాటిని థాయ్‌లాండ్‌లోని ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు.

ఇన్సీన్ ప్రిజన్

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో బ్రిటిష్ వలస పాలనకు చెందిన దుర్మార్గపు వారసత్వాలలో ఈ ఇన్సీన్ ప్రిజన్ ఒకటి.

1877లో ఈ జైలును నిర్మించారు. మియన్మార్‌లోని అతిపెద్ద జైలు ఇదే. చాలామంది రాజకీయ ఖైదీలు తమ శిక్షలో కొంతకాలం ఈ జైలులోనే అనుభవించారు.

విచారణకు ముందు కొన్ని నెలల పాటు వారిని ఈ జైలులోనే నిర్బంధిస్తారు. అక్కడి అనుభవాన్ని కొందరు తట్టుకోలేరు.

‘‘యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్‌గా పట్టా అందుకున్న తర్వాత అతనిపై ఆధారపడి జీవించాలని నేను అనుకున్నా’’ అని ఆంగ్ తల్లి చెప్పారు.

‘‘నా పొరుగు వారు నన్ను ఓదార్చేందుకు ప్రయత్నించారు. నా భర్త అనారోగ్యంతో మంచం మీదే ఉంటున్నారు. ఇక నాకు ఇప్పుడు సహాయం చేసేవారు ఎవరూ లేరని నాకు అర్థమైంది. నా భర్తతో పాటు చిన్న కుమారుడిని నేనే చూసుకోవాలి. అలాగే జైలులో ఉన్న నా కుమారునికి కూడా నా మద్దతు అవసరం’’ అని ఆమె చెప్పారు.

ప్రపంచంలోని అత్యంత అనాగరిక, క్రూరమైన జైలు వ్యవస్థగా భావించే ఇన్సీన్ జైలులోని తమ కుమారులకు అండగా నిలిచేందుకు ఆ కుటుంబాలు శ్రమించాల్సి ఉంటుంది.

సి థు ఆంగ్ అరెస్ట్ అయిన మూడు వారాల తర్వాత ఇన్సీన్ జైలు నుంచి ఆంగ్ తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆంగ్ కోసం ఆహారంతో పాటు డబ్బు పంపించాల్సిందిగా ఆమెకు చెప్పారు.

కుటుంబం నుంచి ఇలాంటి మద్దతు లభించకపోతే జైలులో ఉన్నవారి పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. జైలు లోపల పరిస్థితులు, ఆహారం ఏమాత్రం బావుండదు. వారి ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుంది.

ఆంగ్‌కు పంపించే ఆహార ప్యాకెట్ల కోసం నెలకు రూ. 5,497 (67 డాలర్లు) వెచ్చిస్తున్నట్లు ఆమె చెప్పారు. వీధుల్లో ఉడికించిన సోయా బీన్లను అమ్ముతూ, వచ్చిన డబ్బులో మూడో వంతు దీని కోసమే కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు.

మౌంగ్ పొ

ఫొటో సోర్స్, MAUNG PHO

ఫొటో క్యాప్షన్, మౌంగ్ పో జైలులో కొన్ని ప్రత్యేక వసతులను వాడుకున్నారు. వార్డెన్ల బాత్రూం‌ను వాడుకునేందుకు ఆయనకు అనుమతి ఇచ్చారు. అందులో చిన్న అద్దం ఉండేది. అలాంటి సమయంలోనే అద్దంలో చూస్తూ ఆయన తన చిత్రాన్ని వేశారు

ప్యో వీ హ్లైయింగ్‌పై జరిగిన రెండు విచారణలు మూడు నెలల పాటు సాగాయి. తీర్పు రావడానికి ఒక నెల రోజుల ముందు ఆయన తండ్రి మాత్రమే హ్లైయింగ్‌ను చూడగలిగారు. మొత్తంగా రెండుసార్లు ఆయన హ్లైయింగ్‌ను చూశారు. హ్లైయింగ్ అనుభవిస్తున్న పరిస్థితుల గురించి మొదటిసారి విన్నారు.

విచారణ సందర్భంగా యాంగాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని అత్యంత క్రూరమైన ‘‘యి కై ఐ’’ సెంటర్‌తో సహా అయిదు విచారణ కేంద్రాల్లో అతన్ని క్రూరంగా హింసించారు.

‘‘అతనిని శవాగారానికి తీసుకెళ్లి అక్కడ కుళ్లిపోతున్న శవాలన్నింటినీ చూపించారు. ‘నీ ప్రాణానికి ఇప్పుడు విలువ లేదు. ఒక బొగ్గు బస్తాకు ఉన్నంత విలువ కూడా ఉండదు నీ ప్రాణం. మేం నిన్ను చంపగలం’ అని అతనిని బెదిరించారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కాలుపై పిస్టల్‌తో కాల్చారు. కాలుకు ఆ గాయం ఇంకా ఉంది. కాలు పిక్కలకు ఇనుప రాడ్లను కట్టారు. అతని తల వెనుక భాగం బాగా వాచిపోయింది. వెన్నులో ఒక డిస్క్ తొలగిపోయింది. చేయి కూడా విరిగింది. అతనికి ఏదీ సరిగా గుర్తు లేదు. కనీసం వ్యక్తుల పేర్లను కూడా చెప్పలేకపోతున్నాడు’’ అని ఆయన తండ్రి వివరించారు.

జైలులో ఉన్న కుమారునికి మద్దతుగా నిలవడం కోసం తమ కుటుంబం వద్ద ఉన్న ఆభరణాలు అన్నింటినీ ఆయన తండ్రి అమ్మేశారు.

ఇక మిగిలి ఉన్న కొంతపాటి భూమిని కూడా అమ్మాల్సి ఉంటుంది. తర్వాత తాను సంపాదించే డబ్బుతోనే ఆయన తన కుమారుడిని కాపాడుకోవాల్సి ఉంటుంది. చేపలతో తయారు చేసిన సూప్ ‘మోహింగా’ను విక్రయిస్తూ ఆయన జీవనోపాధి పొందుతున్నారు. మియన్మార్‌లో అల్పాహారంలో మోహింగాను తీసుకుంటారు.

యువకుల తరఫున వాదిస్తున్న లాయర్లు పెద్దగా వారి నుంచి ఫీజును ఆశించడం లేదు. ఆ కుటుంబాలకు సహాయం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. అయితే, తమ క్లయింట్లను నిర్దోషులుగా బయటకు తీసుకొచ్చే అవకాశం లేదని వారు చెబుతున్నారు.

‘‘మేం చేయగలిగిందల్లా మా క్లయింట్లకు కాస్త ఓదార్పును, ఉపశమనాన్ని కలిగించడం మాత్రమే. తమ కుటుంబాలను కలిసేందుకు కూడా వారికి చాలా అరుదుగా అవకాశం వస్తుంది’’ అని ఒక లాయర్ చెప్పారు.

మౌంగ్ పో

ఫొటో సోర్స్, MAUNG PHO

ఫొటో క్యాప్షన్, జైలులో సహ ఖైదీల డ్రాయింగ్‌లను మౌంగ్ పో వేశారు. యి థు ఆంగ్ (పై వరుసలో ఎడమ వ్యక్తి)కి ఆయన చిత్రలేఖనం నేర్పించారు. వా టో (కిందవరుసలో ఎడమ వ్యక్తి) వయస్సు 18 ఏళ్లు. వీరిద్దరూ జైలులో ఉన్నవారిలో పిన్న వయస్కులు.

మ్యో మయంట్ కూడా వీధి వ్యాపారం చేస్తారు. ఇన్సీన్ జైలులో తన కుమారుడు లిన్ లిన్ టెట్ అనుభవించిన పరిస్థితులను స్వయంగా ఆయన చూడగలిగాడు. లిన్‌తో పాటు మ్యో మయంట్‌ను కూడా 2021 అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. అయితే, 10 నెలల తర్వాత మయంట్ విడుదలయ్యారు.

‘‘ మా జైలు గదిలో 100 మంది ఉండేవారు. అది 5*6 మీటర్ల విస్తీర్ణమే ఉండేది. మేమంతా ఒకేవైపుకు తిరిగి పడుకోవాల్సి వచ్చేది. నెలకు రూ. 4,000- 5,861 చెల్లించేవారికి నిద్రపోవడానికి కాస్త మెరుగైన ప్రదేశం లభించేది’’ అని ఆయన చెప్పారు.

జైలులో ఉన్న తన కుమారుని కోసం గార్డులకు ఇచ్చేందుకు కాస్త డబ్బును పొదుపు చేసినట్లు ఆయన తెలిపారు.

లిన్ లిన్ టెట్‌ను అయిదు నుంచి ఆరు రోజుల పాటు విచారించారు.

‘‘లిన్‌ను చాలా దారుణంగా కొట్టారు. విచారణ కేంద్రం నుంచి బయటకు వచ్చినప్పుడు అతను నడవలేకపోయాడు. కనీసం నిలబడలేకపోయారు. ఇద్దరు వ్యక్తులు అతన్ని సెల్‌లోకి ఈడ్చుకొచ్చారు. అతని శరీరంపై చాలా గాయాలను నేను చూశారు. కాళ్లపై, చెక్కిళ్లపై కాలిన గాయాలు ఉన్నాయి. రెండు కాళ్ల బొటనవేలి గోళ్లను బయటకు లాగేశారు. అతని శరీరం మొత్తం గాయాల పాలైంది. నేను చేయగలిగిందల్లా నా దగ్గర ఉన్న నొప్పిని తగ్గించే క్రీమ్‌ను అతనికి రాయగలగడం మాత్రమే. తన జుట్టును పట్టుకొని తలను గోడకు, బల్లకేసి కొట్టినట్లు నా కుమారుడు చెప్పాడు. అతని చెవులు కూడా సరిగా పనిచేయడం లేదు. అతను ఇకపై శబ్ధాలను వినలేడు’’ అని మ్యో మయంట్ చెప్పారు. జైలుకి వెళ్లిన తొలి వారం వారిద్దరూ ఒకే సెల్‌లో ఉన్నారు.

మౌంగ్ పొ

ఫొటో సోర్స్, MAUNG PHO

ఫొటో క్యాప్షన్, 2021 తిరుగుబాటు ప్రదర్శనల్లో అరెస్ట్ అయిన బ్యూరోక్రాట్ థాంట్ జిన్ టో (ఎడమ వైపు), ఎరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి క్యాన్ మిన్ టున్ చిత్రాలు

మ్యో మయంట్ కంటే ఆర్టిస్ట్ మౌంగ్ పో మరింత అదృష్టవంతుడు. 2021 ఏప్రిల్ 7వ తేదీన యాంగాన్‌లోని తన ఇంటి నుంచి మౌంగ్‌ను సైనికులు బయటకు ఈడ్చుకొచ్చారు. తాను వేసిన ఒక గ్రాఫిటీ పెయింటింగ్ కారణంగా సైనికులు తనను పట్టుకున్నట్లు ఆయన భావించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పక్కన నిలబడి తిరుగుబాటు నాయకుడు మిన్ ఆంగ్ హ్లైయింగ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఆయన ఒక గ్రాఫిటీ పెయింటింగ్‌ను వేశారు.

‘‘వారు నా తలపై తన్నారు. నన్ను పరిగెత్తమని చెప్పారు. నేను పరిగెత్తితే కాల్చేయాలని అనుకున్నారు’’ అని ఆయన మౌంగ్ చెప్పారు.

‘‘మనం ఇప్పుడు హై హీల్స్ (ఆంగ్ సాన్ సూకీ) పాలనలో లేము. ఇది మిలిటరీ బూట్ల పాలన’’ అంటూ సైనికులు అరిచినట్లు ఆయన తెలిపారు. ‘‘నాకు ఇక అవే చివరి క్షణాలని అనుకున్నా’’ అని మౌంగ్ గుర్తు చేసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత తనపై మోపిన నేరం తీవ్రత చిన్నదేనని అర్థమైనట్లు ఆయన తెలిపారు. తన పొరుగువారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనను అరెస్ట్ చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు.

ఇన్సీన్ జైలులోని పరిస్థితులను చూసిన తర్వాత వాటిని పేయింటింగ్ వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

‘‘మేం నిద్రపోయిన గది సాధారణంగా అయితే 150 మందికి సరిపోతుంది. కానీ, అందులో మేం 474 మంది వ్యక్తులం పడుకున్నాం. దాన్ని మీరు ఊహించగలరా?

కళాకారుడిగా జైలులో ఆయనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు లభించాయి. జైలులో ఉన్న ఒక గార్డు చిత్రాన్ని ఆయన గీశారు. దానికి బదులుగా ఆ గార్డు ఆయనకు తాజా పళ్ల రసాన్ని ఇచ్చేవారు.

జైలులో వేసిన స్కెచ్‌లను ఆయన దాచిపెట్టేవారు. జైలులో ఉన్నవారి కోసం కుటుంబాలు పంపించిన ఆహారపదార్థాల కాగితాలపై ఆయన చిత్రాలను గీసేవారు. వాటిని జైలు నుంచి విడుదలయ్యేవారి సామగ్రిలో ఉంచి రహస్యంగా బయటకు పంపించేవారు.

ఆరు నెలల తర్వాత మౌంగ్ పో జైలు నుంచి విడుదలయ్యారు. మియన్మార్‌కు చెందిన ఇతర అసమ్మతివాదుల్లానే ఆయన భద్రత కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లారు.

మౌంగ్ పో

ఫొటో సోర్స్, MAUNG PHO

లిన్ లిన్ టెట్, ప్యో వీ హ్లైయింగ్, సి థు ఆంగ్ కుటుంబాలు తమవారికి క్షమాభిక్ష లభిస్తుందని, లేదా శిక్షను తగ్గిస్తారనే ఆశతో జీవిస్తున్నారు.

లిన్ లిన్ టెట్‌కు విధించిన ఏడేళ్ల శిక్షలో ఆరు నెలలు తగ్గించారు.

‘‘అతను అరెస్ట్ అయినప్పటి నుంచి నేను చాలా అవస్థలు పడ్డాను. ఆంగ్ నాకు చాలా సహాయకంగా ఉండేవాడు. అతనికి చదువుకోవడం అంటే ఇష్టం. యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా అతనికి టాప్ గ్రేడ్ వచ్చింది. అతను పెద్ద చదువులు చదువుకోవాలనేది నా కోరిక. నా జీవితంలాగా కష్టాల్లో, పేదరికంలో అతని జీవితం ముగిసిపోకూడదు’’ అని ఆమె అన్నారు.

ఇన్సేన్ జైలు

ఫొటో సోర్స్, MAUNG PHO

ఫొటో క్యాప్షన్, 150 మందికి మాత్రమే సరిపడే జైలు గదిలో 400 మంది ఖైదీలను ఉంచేవారు

ప్యో వీ హ్లైయింగ్ తమ్ముని వయస్సు ఎనిమిదేళ్లు. అవకాశం ఉన్నప్పుడల్లా అతను హ్లైయింగ్‌ను చూడటం కోసం జైలుకు వెళ్తారు.

హ్లైయింగ్ కోసం నెలకు రెండుసార్లు ఫుడ్ పార్సిల్స్‌ను పంపుతామని ఆయన తండ్రి చెప్పారు. వాటిని తన సహచరులతో హ్లైయింగ్ పంచుకుంటారని తెలిపారు.

మిలిటరీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు హ్లైయింగ్ తన కుటుంబంతో అన్నారు. కానీ, తన తమ్ముడిని రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

‘‘ఒకసారి ఇందులోకి దూరితే, బయటకు రావడం అంత సులభం కాదు’’ అని హ్లైయింగ్ తన తమ్ముడికి సూచించారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)