కిడ్నీ కాజేయాలనుకున్న కోటీశ్వరుడిని జైల్లో వేయించిన 'వీధి వ్యాపారి'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మార్క్ లోబెల్, కేట్ వెస్ట్, మెలానీ స్టీవర్ట్-స్మిత్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హీత్రూ విమానాశ్రయం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోకి ఓ వ్యక్తి రావడంతో బ్రిటన్‌లో 'మానవ అవయవాల తొలగింపు, అక్రమ రవాణా'పై తొలిసారి దర్యాప్తు జరిగింది.
ఈ కేసును పరిశోధించిన అక్కడి మెట్రోపాలిటన్ పోలీసు బృందం నుంచి సమాచారం సేకరించడానికి బీబీసీకి అవకాశం లభించింది.
నైజీరియాలోని లాగోస్‌కు చెందిన డేనియల్ తన జీవితంలో అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కోబోతున్న క్షణమది.
డేనియల్ లండన్‌లో రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లోని కన్సల్టింగ్ రూమ్‌లో కూర్చుని, తనకు తెలిసిన కొద్దిపాటి ఇంగ్లిష్‌లో వైద్యులతో మాట్లాడుతున్నారు.
"జీవితాన్ని మార్చే అవకాశం" అని చెప్పడంతో లాగోస్‌కు చెందిన ఈ 21 ఏళ్ల వీధి వ్యాపారి బ్రిటన్ వచ్చారు. మంచి ఉద్యోగం ఇస్తారని అనుకున్నారు.
కానీ, ఇప్పుడు వైద్యులు ఆపరేషన్ చేస్తే ఎదురయ్యే ప్రమాదాల గురించి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డేనియల్‌తో మాట్లాడుతున్నారు.
ఆ ఘటనను డేనియల్ గుర్తుచేసుకుంటూ అధికారులతో.. తనకు ఉద్యోగ అవకాశం లేదని, అపరిచిత వ్యక్తికి కిడ్నీని ఇవ్వడానికి బ్రిటన్ తీసుకొచ్చారని తెలుసుకున్నానని చెప్పారు.
ఆసుపత్రిలో ఏం జరగబోతుందో డేనియల్‌కు ఏమీ తెలియదని వైద్యులకు అనుమానం కలిగింది. దీంతో ఆపరేషన్ నిలిపివేశారు.
"అతన్ని మాంసం ముక్కలాగా నరికి వేయాలనుకున్నారు. అతన్నుంచి వారికి ఏం కావాలో తీసుకుని, ఆపై తిరిగి కుట్లు వేయాలనుకున్నారు" అని 'జస్టిస్ అండ్ కేర్' సంస్థకు చెందిన క్రిస్టినా హడిల్‌స్టన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'డేనియల్ వెంటపడిన ఇద్దరు వ్యక్తులు'
డేనియల్‌ను ట్రాఫికర్లు (అక్రమ రవాణాదారులు) వదిలిపెట్టలేదు.
అతను ఉంటున్న ఫ్లాట్‌లోకి ఇద్దరు వచ్చారు. తనను తిరిగి నైజీరియాకు పంపి, అక్కడే కిడ్నీని తీయాలని ఇద్దరూ మాట్లాడుకోవడం డేనియల్ విన్నారు.
దీంతో డేనియల్ అక్కడి నుంచి పారిపోయారు. రెండు నిద్రలేని రాత్రులు గడిపిన అనంతరం హీత్రూ సమీపంలోని ఒక పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు.
ఇది 'అవయవ తొలగింపు కోసం మానవ అక్రమ రవాణా'పై బ్రిటన్ మొదటి ప్రాసిక్యూషన్‌కు దారితీసింది. కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది.
ఈ ఘటన 2022 మేలో జరిగింది. డేనియల్ (అతని అసలు పేరు కాదు) ఇప్పుడు పోలీసు రక్షణలో ఉంటున్నారు.
అవయవ అక్రమ రవాణాకు సంబంధించిన ఇతర సందర్భాల్లో కూడా డేనియల్ కేసు బ్రిటన్ అధికారులను అప్రమత్తం చేసిందని 'బీబీసీ ఫైల్ ఆన్ 4' తెలుసుకుంది.
నకిలీ హామీలతో ప్రజలను బ్రిటన్ రప్పించడానికి ట్రాఫికర్లు ఉపయోగించే వ్యూహాలను డేనియల్ కేసు వెల్లడిస్తుంది.
బ్రిటన్ వెళ్లడానికి డేనియల్‌కు మొదటిసారి అవకాశం వచ్చింది. అతన్ని రక్త పరీక్షలకంటూ పంపించారు. ఆ పరీక్షలను వీసా కోసం అనుకున్నారు డేనియల్.
కానీ, ఆయన కిడ్నీ తొలగించేంత ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికే ఆ పరీక్ష. అనంతరం అతన్ని విమానం ఎక్కించి, లండన్ పంపారు.
అయితే అతని వద్ద డబ్బులు లేవు. చేతికి పాస్‌పోర్టు కూడా ఇవ్వలేదు. అతని ప్రతి కదలికను ట్రాఫికర్లు పర్యవేక్షించారు.
నైజీరియన్ అమ్మాయి సోనియాను డేనియల్‌కు పరిచయం చేశారు. సోనియా తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.
ఆమెకు రోజులో ఐదు గంటలు, వారంలో మూడు లేదా నాలుగు సార్లు డయాలసిస్ చేయవలసి ఉంటుంది. దీంతో ఆమెకు కిడ్నీ మార్పిడి అవసరం అయింది.
వారిద్దరు కలిశాక తీసుకున్న ఫోటోను కుట్రలో వాడుకున్నారు అక్రమ రవాణాదారులు. సోనియాకు డేనియల్ కజిన్ అని, అతనే కిడ్నీ దానం చేస్తున్నట్లు ఫోటోను ఆధారంగా చూపించారు.
బ్రిటన్‌లో వేరొకరికి ఉచితంగా అవయవాన్ని అందించవచ్చు. కానీ, డబ్బులు ఇచ్చి తీసుకోవడం చట్ట విరుద్దం.

ఫొటో సోర్స్, METROPOLITAN POLICE
కుట్రలో నైజీరియా ప్రముఖుడు
ఆర్గాన్ హార్వెస్టింగ్ అంటే వాణిజ్య ప్రయోజనాల కోసం బాధితుడి సమ్మతితో లేదా లేకుండా శరీరంలోని భాగాలను మార్పిడి చేయడానికి అక్రమంగా తొలగించడం.
బాధితులు దోపిడీకి అంగీకరించరు, వారికి బహుమతులు ఇచ్చి లేదా బలవంతంగా, మోసపూరితంగా చేయించుకుంటారు.
బ్రిటన్ మోడరన్ స్లేవరీ యాక్ట్ 2015 ప్రకారం ఆ దేశంలో మానవ అక్రమ రవాణా చేస్తే గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
లండన్‌లోని రాయల్ ఫ్రీ హాస్పిటల్‌కు డేనియల్‌ను తీసుకెళ్లారు. అక్కడి ప్రైవేట్ పేషెంట్స్ యూనిట్‌లో డేనియల్‌తో మెడికల్ కన్సల్టెంట్‌లు మాట్లాడారు.
కన్సల్టెంట్స్ చెప్పేది డేనియల్‌కు అర్థం కావడానికి ఒక అనువాదకుడిని సైతం పెట్టారు. అప్పుడే మోసం బయటపడింది. డేనియల్ పోలీసులను ఆశ్రయించారు.
ఆ కేసులో తీగ లాగిన పోలీసులకు నైజీరియాలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులలో ఒకరైన ఇకే ఎక్వెరెమడు వద్దకు విచారణ చేరింది. ఎక్వెరెమడు ఒక సీనియర్ సెనెటర్, కోటీశ్వరుడు, అంతేకాదు సోనియాకు తండ్రి కూడా.
యూకేలో తన కూతుర్ని చదివిస్తున్నాడు సెనెటర్. అయితే తనను తప్పుదారి పట్టించారని, డేనియల్‌ను మోసం చేయాలని అనుకోలేదని మొదట పోలీసుల విచారణలో చెప్పారు సెనెటర్.
ఆ సమయంలో నైజీరియాలో డబ్బుల కోసం అవయవ దానం చేయడం క్రిమినల్ నేరంగా పరిగణించే చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ఈ సెనెటర్ ప్రముఖ పాత్ర పోషించారని జ్యూరీ తెలుసుకుంది.

ఫొటో సోర్స్, METROPOLITAN POLICE
ముఖ్యమైన సాక్ష్యం అప్పుడే దొరికింది..
కిడ్నీ మార్పిడికి బ్రిటన్‌కు కేవలం డేనియల్‌ను మాత్రమే తీసుకురాలేదని కోర్టు విచారణలో తేలింది. 2021లో చట్టవిరుద్ధంగా మరో మార్పిడి జరిగిందని తెలిసింది.
ఆ కిడ్నీ తీసుకుంది డా. ఒబెటా. ఆయనే డేనియల్ కిడ్నీ అక్రమ రవాణాలో మధ్యవర్తిగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రక్రియ గురించి వివరంగా తెలుసు.
మొదటి ఆపరేషన్‌లో రాయల్ ఫ్రీ ఆసుపత్రి వైద్యులకు అబద్దం చెప్పి, ఆపరేషన్ చేయించుకున్నారని కోర్టు అభిప్రాయపడింది. 2021లో జరిగిన ఆ మార్పిడిలో దాత, గ్రహీతలు బంధువులు కాదని తేలింది.
డేనియల్ కిడ్నీ మార్పిడి ఆపివేసినప్పటికీ రాయల్ ఫ్రీ నుంచి ఎవరూ పోలీసులకు తెలియజేయలేదని విచారణలో తెలుసుకున్నారు. దీంతో డేనియల్ ఇంకా ప్రమాదంలో ఉన్నాడని అర్థమైంది.
డేనియల్ విషయంలో అధికారిక మార్గదర్శకాలను అనుసరించిందని, నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని నిర్ణయించినట్లు రాయల్ ఫ్రీ హాస్పిటల్ తెలిపింది.
"అవయవ అక్రమ రవాణా చట్టం గురించి మా మార్పిడి విభాగంలో పనిచేస్తున్న వారందరికీ తెలుసు. తప్పు జరిగిందని అనుమానించినట్లయితే ఏం చేయాలో తెలుసుకోవడం కోసం పోలీసులతో కలిసి పని చేస్తాం" అని ఆసుపత్రి తెలిపింది.
ఆధునిక బానిసత్వ కేసులు రుజువు చేయడం కష్టంతో కూడుకున్నది. డేనియల్ కేసులో నిందితులు దేశం విడిచి పారిపోవడంతో విచారణ ఏళ్లు పడుతుందని అనుకున్నారు.
కానీ, 2022 జూన్ 21న సెనేటర్ ఎక్వెరెమడు, అతని భార్య విమానంలో లండన్ చేరుకుంటున్నారని డిటెక్టివ్ ఆండీ ఓవెన్‌కు సమాచారం అందింది.
దీంతో వెంటనే హీత్రో విమానాశ్రయానికి తన బృందంతో కలిసి వెళ్లారు, అక్కడి సెక్యూరిటీని అలెర్ట్ చేశారు.
కేసును చేధించడానికి నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లలో దాతకు ఇవ్వాల్సిన రూ. 4.5 లక్షల గురించి చర్చించిన మెసేజ్‌లు ఉన్నాయి.
ఇది చాలా ముఖ్యమైన సాక్ష్యమని, ఈ కేసులో ఇంకా చాలా కనుగొన్నట్లు ఓవెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, MET POLICE
రాజకీయ ఒత్తిళ్లు
కానీ అంత శక్తివంతమైన నిందితుడితో వ్యవహరించడం సులువుగా సాగలేదు. నైజీరియన్ సెనేటర్లు విచారణను ఆ దేశానికి మార్చే ప్రయత్నం చేశారు.
వాళ్లు కూడా బాధితుడితో మాట్లాడాలనుకున్నారని ఆండీ ఓవెన్ గుర్తుచేసుకున్నారు. ఇది హెచ్చరికలాంటిదని, దీంతో బాధితుడు సురక్షితం కాదని భావించామని చెప్పారు.
న్యాయ సలహా అనంతరం పోలీసులు బాధితుడి వివరాలు గోప్యంగా ఉంచారు.
జైలులో ఐకే ఎక్వెరెమడును కలిసిన ప్రతినిధుల బృంద నాయకుడు సెనేటర్ అదాము బల్కచువాతో 'ఫైల్ ఆన్ 4' మాట్లాడింది.
ఈ కేసులో బ్రిటిష్ ప్రభుత్వంపై దౌత్యపరమైన, కార్యనిర్వాహక ఒత్తిడిని తీసుకురావాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఐకే తిరిగి రావడం అంత సులభంగా జరగదని, "అంతర్జాతీయంగా మానవ అక్రమ రవాణా చట్టాలపై మేం కూడా సంతకం చేశాం" అని బుల్కచువా గుర్తుచేసుకున్నారు.

నిందితులకు శిక్ష పడిందా?
డేనియల్ కేసులో మార్చి 23న ముగ్గురిని దోషులుగా నిర్ధరించింది కోర్టు.
ఐకే ఎక్వెరెమడుకు తొమ్మిది సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష పడింది. ఆయన భార్య బీట్రైస్‌కు నాలుగున్నరేళ్లు శిక్ష విధించింది.
మధ్యవర్తి డాక్టర్ ఒబెటాకు 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో సోనియాను నిర్దోషిగా పరిగణించింది కోర్టు.
డేనియల్‌తో కలిసి ఓవెన్ కోర్టులో ఉన్న సమయంలో.. గిల్టీ అంటే ఏమిటీ? అని డేనియల్ అడిగారని, న్యాయవ్యవస్థపై అతనికున్న అవగాహన స్థాయి అదని ఓవెన్ గుర్తుచేసుకున్నారు.
అంతేకాకుండా నేరస్థుల నుంచి నష్టపరిహారాన్ని స్వీకరించడానికి కూడా బాధితుడు నిరాకరించాడు.
డేనియల్‌ను నమ్మినందుకు సంతోషంగా ఉన్నాడని, అతను తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాడని బీబీసీతో ఓవెన్ చెప్పారు.

నైజీరియాకు వెళ్లలేకపోతున్న డేనియల్
ఈ ఘటన నైజీరియాలో డేనియల్ దగ్గరి వ్యక్తులకు హృదయ విదారకంగా మారింది.
జైలులో ఉన్న శక్తివంతమైన నైజీరియన్ రాజకీయవేత్త, ఆయన మిత్రుల నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయేమోనని వారు నిరంతరం భయపడుతున్నారు.
బిజీగా ఉన్న లాగోస్ మార్కెట్‌లో డేనియల్ సోదరుడిని కలుసుకుంది బీబీసీ. అక్కడ గతంలో డేనియల్ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన వస్తువులను విక్రయించేవారు.
2022 ఫిబ్రవరిలో అకస్మాత్తుగా అదృశ్యమైనప్పటి నుంచి డేనియల్‌తో మాట్లాడలేదన్నారు ఆయన సోదరుడు. కొన్ని నెలల తర్వాత విచారణ వార్త గురించి తెలిశాకే ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నానని చెప్పారు.
"మేం ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నాం. నా తండ్రి చాలా బాధపడ్డారు, ఆయన అనారోగ్యంతో ఉన్నారు. డేనియల్‌ను మోసగించి తీసుకెళ్లారు" అని అతని సోదరుడు చెప్పాడు.
డేనియల్ తన కిడ్నీని విక్రయించడానికి ఎంతమాత్రం అంగీకరించడని ప్రతిరోజు అతనితో మాట్లాడే యజమాని అన్నారు.
"ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు ఉన్నాయని అతనికి తెలుసు. రూ. 10 కోట్లు ఇచ్చినా అతను ఆ పని చేయడు" అని చెప్పారు.
అయితే, ఇప్పుడు తన భద్రత గురించి భయపడుతున్నారు డేనియల్. ఆయన బ్రిటన్ పోలీసుల రక్షణలో ఉన్నారు.
డేనియల్ నైజీరియాకు తిరిగి వెళ్లలేనని, తన కుటుంబాన్ని మళ్లీ చూడలేనని అనుకుంటున్నారు.
డేనియల్ తన కిడ్నీని కాపాడుకున్నారు. చట్టపరమైన చరిత్ర సృష్టించారు. కానీ ఆయన జీవితం చెల్లాచెదురైంది.
ఇవి కూడా చదవండి
- గృహలక్ష్మి పథకం: రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా? బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది,
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














