కాప్టగాన్ పిల్: డ్రగ్స్ అక్రమ రవాణాతో ‘అసద్‌’ కుటుంబీకుల సంబంధాలు.. బీబీసీ పరిశోధనలో బయటపడిన రహస్యాలు

మహెర్ అల్ అసద్ (ఎడమ), బషర్ అల్ అసద్ (కుడి)

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2000లో తీసిన మహెర్ అల్ అసద్ (ఎడమ), బషర్ అల్ అసద్ (కుడి)‌ ఫొటో
    • రచయిత, ఎమిర్ నాడెర్
    • హోదా, బీబీసీ న్యూస్ అరబిక్ ఇన్వెస్టిగేషన్స్

మల్టీ బిలియన్ డాలర్ల కాప్టగాన్ డ్రగ్ వ్యాపారంతో సిరియా ఆర్మీ బలగాలకు చెందిన ప్రముఖులకు, అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబీకులకు ఉన్న ప్రత్యక్ష సంబంధాలు బయటపడ్డాయి.

బీబీసీ న్యూస్, పరిశోధనాత్మక జర్నలిజం నెట్‌వర్క్ ఓసీసీఆర్పీ చేసిన సంయుక్త పరిశోధనలో ఇవి బయటపడ్డాయి.

ఇటీవలి సంవత్సరాల్లో మధ్య ప్రాచ్య దేశాలను పట్టి పీడిస్తున్న డ్రగ్ కాప్టగాన్.

సిరియా నుంచి సరిహద్దుల మీదుగా ఈ మత్తు పదార్థ అక్రమ రవాణాను ఆపడానికి జోర్డాన్, లెబనాన్ ఆర్మీ చేస్తోన్న ప్రచారాలను బీబీసీ పరిశీలించింది.

ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో కూడా ఈ డ్రగ్‌ను గుర్తించారు.

కాప్టగాన్ వర్తకంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ అధ్యక్షుడు అసద్‌కు చెందిన ఇద్దరు కజిన్స్ సహా కొంత మందిపై బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు మార్చిలో ఆంక్షలను విధించాయి.

ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నవారితో పాటు సిరియాకు చెందిన ఇతర సీనియర్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సూచించే సాక్ష్యాలను బీబీసీ కనుగొంది.

దీనిపై స్పందించాల్సిందిగా సిరియా ప్రభుత్వాన్ని బీబీసీ సంప్రదించింది. కానీ, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

అయితే, డ్రగ్స్ వాణిజ్యంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని గతంలోనే సిరియా ప్రభుత్వం కొట్టిపారేసింది.

కాప్టగాన్

ఫొటో సోర్స్, BBC AND OTHER

ఫొటో క్యాప్షన్, రాజీ ఫాల్హట్‌తో అబు హంజా (కుడివైపు)

2022 జులైలో దక్షిణ సిరియాలోని సువైదా నగరంలో ఉన్న రజీ ఫాల్హట్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యర్థి సమూహం సోదాలు చేసినప్పుడు పంపిణీకి సిద్ధంగా ఉన్న కాప్టగాన్ మాత్రల సంచులు కనిపించాయి.

వాటితో పాటు ఈ మాత్రలను తయారు చేసే ఒక యంత్రం, రజీ ఫాల్హట్ సిరియన్ మిలిటరీ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ను అక్కడ కనుగొన్నారు.

ఆ మొబైల్ ఫోన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా అందులో రజీ ఫాల్హట్, అబు హంజా అనే లెబనీస్ కాంటాక్ట్‌కు మధ్య జరిగిన వరుస మెసేజ్‌లను బీబీసీ కనుగొంది.

ఆ మెసేజ్‌లలో మాత్రలను తయారుచేసే యంత్రం కొనుగోలుకు సంబంధించిన చర్చ కనిపించింది.

ఆ మెషీన్‌ను లెబనాన్ నుంచి సిరియాకు తరలించాలని కూడా వారిద్దరూ మాట్లాడుకోవడం ఆ చాట్‌లో ఉంది.

ఆ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి అబు హంజా ఎవరో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఈ క్రమంలో అబు హంజా అసలు గుర్తింపు ‘హుస్సేన్ రియాద్ అల్ ఫైట్రోని’ అని బీబీసీ తెలుసుకుంది.

సిరియా ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండే మిలిటెంట్ గ్రూపు, లెబనీస్ రాజకీయ పార్టీ అయిన హిజ్బుల్లాతో హుస్సేన్ రియాద్ అల్ ఫైట్రోనికి సంబంధాలు ఉన్నాయని స్థానిక జర్నలిస్టులు బీబీసీకి చెప్పారు.

బీబీసీ బృందం
ఫొటో క్యాప్షన్, అలెప్పొ ప్రావిన్సులోని సిరియా మిలిటరీ బ్యారెక్స్‌ను బీబీసీ బృందం సందర్శించింది

సిరియా అంతటా హిజ్బుల్లా ఫైటర్లు ఉన్నారని చెబుతుంటారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో వీరికి ప్రమేయం ఉన్నట్లు చాలా కాలంగా ఆరోపణలున్నాయి. అయితే, ఈ ఆరోపణల్ని వారు తరచుగా ఖండిస్తుంటారు.

సువైదా ప్రాంతానికి చెందిన ఒక సిరియా జర్నలిస్టు మాతో మాట్లాడారు.

‘‘ఇందులో హిజ్బుల్లా ప్రమేయం ఉంది. కానీ, సరకు అక్రమ రవాణాలో తమ సభ్యులు కీలక పాత్ర పోషించకుండా హిజ్బుల్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది’’ అని చెప్పారు.

హుస్సేన్ రియాద్ అల్ ఫైట్రోని గురించి చెప్పాల్సిందిగా హిజ్బుల్లాను బీబీసీ సంప్రదించగా, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కాప్టగాన్ ఉత్పత్తి, అక్రమ రవాణాలో తమకు ఎలాంటి పాత్ర లేదంటూ గతంలో హిజ్బుల్లా ఖండించింది.

దీనిపై స్పందన కోసం రజీ ఫాల్హట్, ఫైట్రోనీలను మేం చేరుకోలేకపోయాం.

నెలల తరబడి ప్రయత్నించిన తర్వాత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సిరియా సాయుధ బలగాలను బీబీసీ కలుసుకోగలిగింది.

గుర్తింపు బయట పెట్టడానికి ఇష్టపడని ఒక సైనికుడు, బీబీసీతో మాట్లాడుతూ ఇలా అన్నారు.

‘‘నా సహ సైనికుల నెల జీతం లక్షన్నర సిరియన్ పౌండ్లు (రూ. 4,895) కంటే తక్కువే ఉంటుంది. దీంతో అదనపు ఆదాయం కోసం వారిలో చాలామంది స్థానికంగా డ్రగ్స్ డీలర్లుగా మారారు. ఇది వారికి అలవాటుగా మారింది’’ అని ఆయన వెల్లడించారు.

స్థానికంగా కాప్టగాన్ వాణిజ్యంలో మీ యూనిట్ పాత్ర ఎలా ఉంటుంది అని మేం అడగగా ఆయన బదులిచ్చారు.

‘‘ఫ్యాక్టరీకి వెళ్లడానికి మాకు అనుమతి లేదు. వారు ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటారు. అక్కడ హిజ్బుల్లా నుంచి దాన్ని కొంటారు. సరకును అందుకున్న తర్వాత, ఫోర్త్ డివిజన్‌తో కలిసి మేం సమన్వయం చేసుకుంటాం’’ అని ఆయన చెప్పారు.

అంతర్గత, బాహ్య ప్రమాదాల నుంచి ప్రభుత్వాన్ని రక్షించే ఎలీట్ సిరియా ఆర్మీనే ఫోర్త్ డివిజన్‌గా పరిగణిస్తారు.

అధ్యక్షుడు అసద్ తమ్ముడైన మహెర్ అల్ అసద్ నాయకత్వంలో 2018 నుంచి ఫోర్త్ డివిజన్ పనిచేస్తుంది.

మహెర్ అల్ అసద్‌పై రసాయన ఆయుధాల వాడకానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి.

కాప్టగాన్

ఫొటో సోర్స్, EPA

సిరియా ఆర్మీ నుంచి ఫిరాయించిన మాజీ సైనిక అధికారితో మేం మాట్లాడాం.

‘‘సిరియా యుద్ధ సమయంలో అధికారులు ఎదుర్కొన్న కఠిన ఆర్థిక పరిస్థితుల వల్ల ఫోర్త్ డివిజన్‌లోని చాలామంది సభ్యులు స్మగ్లింగ్ బాట పట్టారు.

ఫోర్త్ డివిజన్ అధికారుల కార్లను తీవ్రవాదులను, ఆయుధాలు, డ్రగ్స్‌ను తీసుకెళ్లడానికి వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే, సిరియా చెక్‌పోస్టుల మీదుగా వెళ్లగలిగే ఏకైక వ్యవస్థ ఫోర్త్ డివిజన్ మాత్రమే’’ అని ఆయన చెప్పారు.

ఆంక్షలు, యుద్ధం కారణంగా సిరియా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి చాలా చేరువలో ఉంది.

అయితే, ఈ ఆర్థిక వ్యవస్థ ‘కాప్టగాన్ పిల్‌’పైనే ఎక్కువగా ఆధారపడుతుందని విశ్లేషకులు మాతో చెప్పారు.

కాప్టగాన్‌తో వచ్చే ఆదాయం ఆగిపోయినా లేదా దానికి ఏదైనా అంతరాయం కలిగినా అసద్ ప్రభుత్వం మనుగడ సాగించగలదని తాను అనుకోవట్లేదని జోయెల్ రేబర్న్ అన్నారు. జోయెల్ రేబర్న్ సిరియాలో అమెరికా మాజీ ప్రత్యేక రాయబారి.

ఈ వ్యాపారంలో అసద్ కుటుంబ ప్రమేయానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను బీబీసీ కనుగొంది.

2021లో ‘‘కింగ్ ఆఫ్ కాప్టగాన్’’ అని పేరున్న నేరపూరిత లెబనీస్-సిరియా బిజినెస్ మ్యాన్ హసన్ డక్కో మీద లెబనీస్ ప్రెస్ విచారణను మొదలుపెట్టింది.

మలేసియాలో భారీ డ్రగ్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కాప్టగాన్ అక్రమ రవాణాలో హసన్ డక్కో దోషిగా తేలారు.

సౌదీ అరేబియాకు పంపిచడం కోసం సిద్ధం చేసిన ఈ సరకు విలువ రూ. 8,198 కోట్ల నుంచి 16,397 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చరిత్రలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల రవాణాలో ఇది ఒకటిగా నిలిచింది.

కాప్టగాన్

ఫొటో సోర్స్, BH TV

ఈ కేసు విచారణ ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగింది. కానీ, మా బృందం ఆ న్యాయమూర్తిని కలుసుకుంది.

డక్కో, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల మధ్య జరిగిన ఫోన్ కమ్యూనికేషన్‌పై నిఘా పెట్టడం ద్వారానే తమకు చాలా సాక్ష్యాలు లభించాయని ఆ న్యాయమూర్తి మాకు చెప్పారు.

సిరియా ఆర్మీకి చెందిన ఫోర్త్ డివిజన్‌తో కలిసి కాప్టగాన్ అక్రమ రవాణాదారులపై పోరాడుతున్నట్లు విచారణ సందర్భంగా డక్కో చెప్పారు. అంతేకాకుండా ఫోర్త్ డివిజన్ ఐడీ కార్డును కూడా సాక్ష్యంగా చూపించారు.

తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నానని, కాప్టగాన్ రవాణాలో తన ప్రమేయం ఉన్నట్లు చూపించే సాక్ష్యాలేవీ కోర్టుకు లభించలేదని బీబీసీతో డక్కో చెప్పారు.

డక్కో డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడినప్పటికీ, ఈ కాప్టగాన్ వ్యాపారంలో సిరియా అధికారుల పాత్రను నిర్దారించే ఎలాంటి ఆధారాలు లభించలేదని బీబీసీతో ఆ న్యాయమూర్తి తెలిపారు.

కానీ, 600 పేజీల కోర్టు డాక్యుమెంట్‌లో ఉన్న ఒక విభిన్నమైన కథనాన్ని మా పరిశోధనలో మేం గుర్తించాం.

‘‘ద బాస్’’ అని పిలిచే ఒక కాంటాక్ట్‌కు డక్కో వరుసగా వాట్సాప్ స్క్రీన్ షాట్లను పంపించడాన్ని మేం కనుగొన్నాం.

దీని గురించి సిరియాలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో బీబీసీ మాట్లాడింది. ఆ కాంటాక్ట్ మేజర్ జనరల్ ఘసన్ బిలాల్‌కు చెందినదని వారంతా ధ్రువీకరించారు. మేం ఆ నంబర్‌కు చాలాసార్లు ఫోన్ చేశాం. కానీ, అటునుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.

మహెర్ అల్ అసద్ (ఎడమ), ఘసన్ బిలాల్ (కుడి)

ఫొటో సోర్స్, SOURCE

ఫొటో క్యాప్షన్, మహెర్ అల్ అసద్ (ఎడమ), ఘసన్ బిలాల్ (కుడి)

మహెర్ అల్ అస్సద్‌కు చెందిన ఫోర్త్ డివిజన్‌లో జనరల్ బిలాల్‌ను నంబర్ టూ అని పరిగణిస్తారు.

సరకును సిరియాలోని సబూరా అనే పట్టణానికి రవాణా చేయడం గురించి ‘‘ద బాస్’’ అనే కాంటాక్ట్‌తో డక్కో చర్చించడం వాట్సాప్ మెసేజ్‌లలో ఉంది. ఇక్కడ సరకు అంటే కాప్టగాన్ అని నమ్ముతున్నాం. సబూరాలో ఫోర్త్ డివిజన్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ ఇక్కడ ‘‘ద బాస్’’ అనే కాంటాక్ట్ నిజంగానే జనరల్ బిలాల్ అయితే, సిరియాలోని అత్యంత సీనియర్ ఆర్మీ అధికారికి కాప్టగాన్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు ఈ వాట్సాప్ మెసేజ్‌లు సూచిస్తున్నాయి.

దీని గురించి స్పందించాల్సిందిగా మేం బిలాల్‌ను సంప్రదించాం. కానీ, ఆయన నుంచి స్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)