సిరియా భూకంపం: శిథిలాల్లో జన్మించిన శిశువును ఎవరు దత్తత తీసుకున్నారంటే...

చిన్నారి ఆఫ్రా

ఫొటో సోర్స్, Reuters

సిరియాలో భూకంపం శిథిలాల్లో జన్మించిన శిశువును ఆమె పిన్ని, బాబాయిలు దత్తత తీసుకున్నారు.

ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపంలో ఇద్రిస్ ప్రావిన్స్‌లోని జిందేరిస్ పట్టణంలో కుప్పకూలిన భవనాల్లో ఈ చిన్నారి కుటుంబం కూడా కన్నుమూసింది.

ఆ శిథిలాల్లో చనిపోయిన తల్లికి బొడ్డు పేగుతో అలాగే అనుసంధానమై ఉన్న ఆడపిల్లను సహాయ సిబ్బంది రక్షించారు.

భూకంపం వచ్చిన వెంటనే ఆమె తల్లికి పురిటినొప్పులు వచ్చాయని, ఆమె శిథిలాల కిందే బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూశారని ఒక బంధువు చెప్పారు.

భూకంపంలో ఈ శిశువు తల్లిదండ్రులతో పాటు.. నలుగురు తోడబుట్టువులు, ఒక పిన్ని అందరూ చనిపోయారు.

చిన్నార ఆఫ్రాను దత్తత తీసుకున్న కుటుంబం

ఫొటో సోర్స్, Reuters

అయితే ఈ శిశువు తల్లి సోదరి హాలా కుటుంబం ఈ భూకంపం నుంచి బయటపడింది. ఆమెకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, ఈ శిశువుతో రక్తసంబంధం ఉందని నిర్ధారించుకున్న అధికారులు శిశువును వారికి అప్పగించారు.

దీంతో ఆ శిశువు తన పిన్ని, బాబాయిల దగ్గరికి చేరినట్లయింది. ఈ శిశువుకు చనిపోయిన ఆమె తల్లి పేరైన ఆఫ్రా అని పేరు పెట్టారు.

శిథిలాల నుంచి బయటకు తీసినపుడు ఈ శిశువుకు అధికారులు అయా అని పేరు పెట్టారు. ఆ అరబిక్ పేరుకు అర్థం ‘అద్భుతం’ అని.

ఈ శిశువును వెలికితీసే సమయానికి శిథిలాల కింద 10 గంటల కన్నా ఎక్కువ సేపు ఉందని.. ఆమె ఒంటి నిండా గాట్లు, దోక్కుపోయిన గాయాలతో పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, సిరియా భూకంపం: శిధిలాల్లో పుట్టిన సిరియా చిన్నారి అయా

శిథిలాల నుంచి ఈ శిశువును వెలికితీస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచీ వేలాది మంది ఈ శిశువును తాము దత్తత తీసుకుంటామంటూ ముందుకు వచ్చారు.

ఈ పాపను శిథిలాల నుంచి వెలికి తీస్తున్నపుడు ఆమె బాబాయ్ ఖలీల్ అల్-సవాది కూడా అక్కడే ఉన్నారు.

ఆమెను దత్తత తీసుకుంటామని ప్రపంచం నలుమూలల నుంచీ వినతులు వెల్లువెత్తటంతో.. ఆ పాపను ఆస్పత్రి నుంచి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతారేమనని తను ఆందోళన చెందినట్లు ఆయన వార్తా సంస్థలతో చెప్పారు.

శిథిలాల్లో హలా, ఖలీల్‌ల నివాసం కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం వారు తమ బంధువుల వద్ద ఉంటున్నారు.

ఆఫ్రా, మరో చిన్నారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఆఫ్రా (కుడివైపు ఉన్న చిన్నారి) పిన్ని, బాబాయిలకు.. భూకంపం వచ్చిన మూడు రోజుల తర్వాత కూతురు (ఎడమవైపు ఉన్న చిన్నారి) పుట్టింది

ఈ శిశువును బంధువులమైన తమకే అప్పగించాలని వారు కోరారు. భూకంపంలో తమ నివాసం దెబ్బతిన్నా, తమ పరిస్థితి ఎలా ఉన్నా.. ఆ శిశువు తన బంధువుల దగ్గర ఉండటమే మంచిదన్నారు.

దీంతో ఈ బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఆమె రక్తసంబంధీకులకు అప్పగించారు. ప్రస్తుతం బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ చిన్నారి.. ఆమె తల్లిదండ్రులు, ఆమె కుటుంబానికి జ్ఞాపకంగా తమకు, తమ ఊరి వారందరికీ మిగిలిపోతుందని.. ఆమెను అపురూపంగా చూసుకుంటామని పిన్ని, బాబాయ్ చెప్తున్నారు.

వీడియో క్యాప్షన్, భూకంపం వచ్చినప్పుడు ఎవరైనా ఇలా చేయగలుగుతారా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)