‘‘కనీసం మా పిల్లల మృతదేహాలైనా దొరికితే చాలు’’

- రచయిత, ఫన్‌డనుర్ ఓజ్‌తుర్క్, బెర్జీ సిమెస్క్
- హోదా, బీబీసీ న్యూస్
(గమనిక - ఈ కథనంలోని కొన్ని విషయాలు మీ మనసును కలిచివేయొచ్చు)
తుర్కియే, ఉత్తర సిరియాలలో రెండు భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించి వారాలు గడుస్తున్నాయి.
ఇప్పటికీ తన మేనల్లుళ్ల కోసం శిథిలాల కింద ఓర్హాన్ కోస్కెర్ వెతుకుతూనే ఉన్నారు.
భూకంపం వచ్చినప్పుడు ఆగ్నేయ తుర్కియే నగరం గాజియాంటెప్‌లో తమ ఇంట్లోనే 13 ఏళ్ల ఇస్మెత్, తొమ్మిదేళ్ల సిరాక్ నిద్రపోతున్నారు.
వీళ్ల తల్లి, తండ్రి, చెల్లి భూకంపంలో చనిపోయారు. తొమ్మిది రోజుల తర్వాత, వీరి మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు.
కానీ, ఆ ఇద్దరు పిల్లల జాడ మాత్రం కనిపించలేదు.

ఫిబ్రవరి ఆరు నాటి భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైన 11 తుర్కియే నగరాల్లో గాజియాంటెప్ ఒకటి.
ఈ భూకంపం వల్ల ఒక్క తుర్కియేలో దాదాపు 50,000 మంది చనిపోయారు. మరో 6,000 మంది ఉత్తర, పశ్చిమ సిరియాలోని ప్రాంతాల్లో మరణించారు.

ఆప్తుల కోసం గాలింపు...
భూకంప బాధితులకు సాయం అందించేందుకు తుర్కియే ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి.
ఇప్పటికీ శిథిలాల కింద తమ వారి జాడ దొరుకుతుందేమోనని వందల కుటుంబాలు వెతుకుతూనే ఉన్నాయి. సజీవంగా లేదా మృతదేహాలైనా దొరకాలని అన్వేషిస్తూనే ఉన్నాయి.
ఇస్మెత్, సిరాక్ నివసించే భవనం కుప్పకూలిన ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత శిథిలాల కింది నుంచి చాలా మంది ప్రాణాలతో బయటపడినట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు ఓర్హాన్‌తో చెప్పారు.
దీంతో తన ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రాణాలతో బయటపడి ఉండొచ్చని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

సాయం కోసం హెల్ప్‌లైన్
ఆ భూకంపాల తర్వాత, దాదాపు 2,000 మంది చిన్నారులను శిథిలాల నుంచి సిబ్బంది కాపాడారు. వీరి పేర్లను తుర్కియేలోని కుటుంబం, సామాజిక వ్యవహారాల సంక్షేమ శాఖలోని అధికారులు నమోదు చేశారు.
వీరిలో దాదాపు 200 మంది పిల్లలు ఏ కుటుంబాలకు చెందినవారో, వారి బంధువులు ఎవరో ఇప్పటికీ తెలియడం లేదు.
కనిపించకుండాపోయిన తమ బంధువులు, భూకంప బాధితుల కోసం తుర్కియే ఆరోగ్య శాఖ ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేసింది.
ఆ హెల్ప్‌లైన్‌కు తానురోజూ ఫోన్ చేస్తున్నానని, అక్కడకు వస్తున్న పిల్లల వివరాలు తెలుసుకుంటున్నానని, తన మేనల్లుళ్లు అక్కడకు ఏమైనా వచ్చారేమో చూస్తున్నానని ఓర్హాన్ చెప్పారు.
ఆయన కుటుంబం తమ డీఎన్ఏ నమూనాలను కూడా అధికారులకు ఇచ్చింది.
‘‘మా పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. చనిపోయినా ఫర్వాలేదు. కనీసం వారి ఎముకల కోసమైనా మేం వెతుకుతూనే ఉంటాం. దేవుడు మాకు సాయం చేయాలి’’అని ఆయన అన్నారు.
భూకంపాల అనంతరం తుర్కియేలో కనిపించకుండాపోయిన వారి సంఖ్య ఎంత ఉంటుందో అధికారిక అంచనాలేవీ లేవు.
1400 మృతదేహాలు ఇప్పటికీ ఎవరివో తెలియడం లేదు.
నెల రోజుల నుంచి...
అబ్దుల్‌కుదుస్ కజాన్ కూడా తన సోదరి హిక్రాన్ కోసం ఇలానే వెతికారు.
భూకంపం తర్వాత కొన్ని గంటలకు ఒక భవనం శిథిలాల నుంచి 44 ఏళ్ల హిక్రాన్ కరదాగ్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఆమెను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కానీ, ఆమె ఎక్కడున్నారో నెల రోజులపాటు ఆమె కుటుంబానికి తెలియలేదు.
ఆమె కోసం దాదాపు 12 నగరాల్లో ఆమె కుటుంబం వెతికింది.
అంతాక్యా నగరం శివార్లలో నర్లికా అనే ప్రాంతంలోని ఒక సమాధిలో దాదాపు వెయ్యి మంది భూకంప బాధితులను పూడ్చిపెట్టినట్లు ఆమె కుటుంబానికి సమాచారం అందింది.
వెంటనే అక్కడకు అబ్దుల్‌కుదుస్ వెళ్లారు. అక్కడ పూడ్చిపెట్టిన వారి వివరాలను పరిశీలించారు.
అక్కడ అంత్యక్రియలు నిర్వహించే ముందు, తుర్కియే అధికారులు మృతులకు ఫోటోలు తీశారు, డీఎన్ఏ నమూనాలు, వేలిముద్రలు సేకరించారు. గుర్తుతెలియని మృతదేహాల సమాధులపై నంబర్లు వేశారు.
మొత్తంగా 1500 ఫోటోలను అబ్దుల్‌కుదుస్ చూశారు. కొన్ని మృతదేహాల బ్యాగ్‌లను కూడా ఆమె పరిశీలించారు.
ఇక్కడ పూడ్చిపెట్టిన ఒక మృతదేహం డీఎన్ఏ వీరి కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోలింది. దీంతో వీరికి హిక్రాన్ ఆచూకీ దొరికింది.
భూకంపం అనంతరం కార్డియాక్ అరెస్టు వల్ల ఆసుపత్రిలో హిక్రాన్ మరణించినట్లు మరణ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో ఆమెకు ఏమైనా చికిత్స అందిందా? లేదా అనే వివరాలు ఎక్కడా లభించలేదు.
హాస్పిటల్ కార్‌పార్కింగ్ ప్రాంతంలో ఆమె మృతదేహం రెండు రోజులపాటు అలానే వదిలేసినట్లు ఆ ధ్రువపత్రంలో పేర్కొన్నారు. ఆమె ఎవరో తెలియనప్పటికీ, మృతదేహం పాడైపోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు.
‘‘కనిపించకుండాపోయిన మీ తోబుట్టువులను వెతకడం ఎంతో కష్టంగా ఉంటుంది’’ అని అబ్దుల్‌కుదుస్ చెప్పారు.
‘‘వారు బతికి ఉన్నారో లేదో తెలియదు. బతికి ఉంటారనే ఆశతోనే మనం ముందుకు వెళ్లాలి’’ అని ఆమె అన్నారు.
‘‘డీఎన్ఏ నమూనాలు సరిపోయాయని అధికారులు చెప్పారు. కానీ, వారి పరీక్షల ఫలితాలు తప్పయి, మా అక్క బతికి వస్తే బావుండేదని అనిపిస్తుంటుంది. కానీ, కనీసం ఆమె సమాధైనా కనిపించింది. ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం’’అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
- 90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు
- ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’
- రాహుల్ గాంధీ: రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’
- ‘రామ్‌జీ నగర్ గ్యాంగ్’: లాయర్లను పెట్టుకుని మరీ దొంగతనాలు చేసే ముఠా కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















