సీపాప్ - సీపీఏపీ: నిద్రలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాడుతున్న ఈ పరికరం ఏమిటి? ఎలా పనిచేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
మనిషికి నిద్ర చాలా అవసరం. మనసుకు, శరీరానికి విశ్రాంతి, పునరుత్తేజం కలిగించడానికి నిద్ర దోహదపడుతుందనడానికి ఆధారాలున్నాయి. అయితే కొందరికి నిద్ర సరిగా పట్టదు.
భయపెట్టే కలలు, ఛాతీపై ఎవరో కూర్చున్నట్లు అనిపించడం, అనారోగ్యం వంటివి దీనికి కారణాలు కావొచ్చు. ఊపిరాడకపోవడం వల్ల కూడా చాలామందికి నిద్ర సరిగా పట్టదు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇదే రకమైన ఇబ్బందులు పడుతుండేవారు. జో బైడెన్‌కు నిద్రలో ఊపిరాడేది కాదు. ఈ నేపథ్యంలో ఆయన స్లీప్ ఆప్నియా (Sleep Apnea) చికిత్సకు సీపాప్ (కంటిన్యూయెస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్- సీపీఏపీ) అనే వైద్య పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.
80 ఏళ్ల బైడెన్ ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని వైట్‌హౌస్ అధికారికంగా తెలిపింది.
ఇది నిద్రలో శ్వాస తీసుకోవడానికి సాయం చేస్తుంది.
అమెరికా అధ్యక్షుడి ముఖంపై మాస్క్ పెట్టుకున్నప్పుడు నొక్కుకుపోయినట్లుగా చారలు ఉండడాన్ని మీడియా ప్రతినిధులు గమనించడంతో బుధవారం వైట్‌హౌస్ వర్గాల నుంచి వైద్య ప్రకటన వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో దాదాపు 3 కోట్ల మంది స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు.
నిద్రపోతున్నపుడు నోరు, ముక్కులోకి గాలిని పంపుతుంది సీపాప్ పరికరం. వాయుమార్గాలను తెరిచి ఉంచుతుంది.
"ఆయనకు నిద్రలో ఊపిరాడకపోవడమనే సమస్య 2008 నుంచి ఉంది, ఈ విషయాన్ని తన వైద్య నివేదికలో ప్రెసిడెంట్ వెల్లడించారు" అని వైట్‌హౌస్ ప్రతినిధి ఆండ్రూ బేట్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఆయన గత రాత్రి సీపీఏపీ యంత్రాన్ని ఉపయోగించారు. ఆ సమస్య ఉన్న వ్యక్తులకు ఇది సాధారణం" అని బేట్స్ చెప్పారు.
బైడెన్ గత కొన్ని వారాలుగా సీపీఏపీ యంత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్లీప్ ఆప్నియా ఉన్నట్లు ఎలా తెలుస్తుంది?
స్లీప్ ఆప్నియా అనేది ప్రపంచంలో అత్యంత ప్రబలంగా ఉన్న నిద్ర రుగ్మతలలో ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది వరకు దీని బారిన పడుతున్నారు.
వయస్సుతో పాటు ఈ రుగ్మత పెరుగుతోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే స్లీప్ ఆప్నియా యువకులలో కూడా రావొచ్చు.
నిద్రలో తాత్కాలికంగా శ్వాస ఆగిపోవడం, నిద్రలో గాలి పీల్చుకోవడానికి ప్రయత్నించడం, బిగ్గరగా గురక పెట్టడం, రాత్రి పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట రావడం దీని లక్షణాలు.
ఈ సమస్య వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుందని, అలసట వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా అలసట, గురక పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రాత్రి అకస్మాత్తుగా మెలకువ వచ్చినట్లయితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అబ్‌స్ట్రక్టీవ్ స్లీప్ ఆప్నియా
అబ్‌స్ట్రక్టీవ్ అంటే శ్వాసనాళికలో పూడిక ఏర్పడటం. అబ్‌స్ట్రక్టీవ్ స్లీప్ ఆప్నియా (ఓఎస్‌ఏ)కు గురైనప్పుడు గొంతునాళం పూర్తిగా పూడుకుపోతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లలేదు. ఈ స్థితిలో కొంతసమయం పాటు శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది.
ఈ స్థితి 10 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటే దాన్ని 'ఆప్నియా'గా పరిగణిస్తారు. ఇలా జరిగినప్పుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. దీనికి చికిత్స పొందకపోతే, వ్యక్తి ప్రాణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.
ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువ?
బ్రిటీష్ లంగ్ ఫౌండేషన్ ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఓఎస్ఏ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
- మధ్య వయస్సులో ఉన్న మగవారికి
- మెనోపాజ్ స్థితిని ఎదుర్కొన్న మహిళలకు
- ప్రెగ్నెన్సీ చివరి దశల్లో ఉన్నవారికి
- అధిక బరువు లేదా ఒబేసిటీ ఉంటే
- మీ గొంతు పరిమాణం పెద్దదిగా ఉంటే
- డౌన్ సిండ్రోమ్ వంటి కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుంది.
- టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి
- గుండె జబ్బులు ఉన్నవారికి
- సిగరెట్లు, మద్యపానం, నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి గురి కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
స్లీప్ ఆప్నియాను ఎలా నియంత్రించాలి?
- మీరు అధిక బరువుతో ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నించండి.
- మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా పడుకోండి. ప్రత్యేక దిండును వాడుకోండి.
- ధూమపానం మానేయండి.
- పడుకోవడానికి ముందు ఎక్కువగా మద్యం తాగవద్దు.
- వైద్యులు సిఫార్సు చేయనిదే నిద్రమాత్రలు తీసుకోవద్దు.
- స్లీప్ ఆప్నియా సమస్య ఎక్కువుంటే స్లీప్ క్లినిక్ నుంచి చికిత్స అవసరం కావచ్చు. ఇందులో సీపీఏపీ మెషీన్‌ని ఉపయోగించడం కూడా ఉంటుంది. ఇది నిద్రలో నోరు, ముక్కు మీదుగా గాలిని మాస్క్‌లోకి సున్నితంగా పంపుతుంది.
ఇవి కూడా చదవండి
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














