సామజవరగమన సినిమా రివ్యూ: కామెడీ పండిందా లేదా?

ఫొటో సోర్స్, Twitter/sreevishnuoffl
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
సినిమా విజయానికి రెండు దారులు. ఒకటి.. కొత్తకథని ఆసక్తికరంగా చెప్పడం. రెండు.. తెలిసిన కథనే కొత్తగా ఆకట్టుకునేలా చూపించడం.
చాలా మంది దర్శకుడు రెండో దారిని అనుసరిస్తుంటారు. ఒక మామూలు పాయింట్‌నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తారు.
‘సామజవరగమన’ చిత్ర బృందం కూడా ఇదే చేసింది. ఒక చిన్న పాయింట్‌తో నవ్వులు పూయించాలని చూసింది.
మరి ఈ ప్రయత్నం ఆకట్టుకుందా? యవ కథానాయకుడు శ్రీవిష్ణుకు మరో విజయాన్ని ఇచ్చిందా?
బాక్సాఫీసు బాలు కథలో గమ్మత్తు ఏమిటి ?
ఓ మల్టీ ప్లెక్స్‌లో పనిచేసే బాలు (శ్రీవిష్ణు) ది ఒక విచిత్రమైన పరిస్థితి. తనది మిడిల్ క్లాస్ కుటుంబం. సంపాయించేది బాలునే.
తనకో విచిత్రమైన ఆశయం కూడా ఉంది. తన తండ్రి ఉమా మహేశ్వరరావు (నరేష్) తో డిగ్రీ పాస్ చేయించాలన్నది బాలు లక్ష్యం.
బాలు మంచోడే కానీ ప్రేమ అంటే గిట్టదు. తనని ఇష్టపడిన ప్రతి అమ్మాయి చేత రాఖీ కట్టించుకుంటాడు.
ఐతే సరయు(రెబా మోనికా జాన్) వచ్చిన తర్వాత బాలు జీవితం మలుపు తీసుకుంటుంది. ఈ దశలో ఏ ప్రేమికుడికీ రాని కష్టం బాలుకి ఎదురౌతుంది.
మరా ఆ కష్టం నుంచి బయటపడి తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడు ? ఉమా మహేశ్వరరావు డిగ్రీ పాసయ్యాడా? ఇంతకీ అంత లేటు వయసులో డిగ్రీ పాసవ్వాల్సిన అవసరం ఏమిటి ? అనేది తెరపై చూడాలి.

ఫొటో సోర్స్, Twitter/AKentsOfficial
తండ్రి కొడుకుల రివర్స్ ఫన్
ఒక కథని కొత్తగా చెప్పాలంటే ప్రతిసారి అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్లి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కథే, మనకు తెలిసిన కథే కొత్తగా, అందంగా చెప్పొచ్చు.
దర్శకుడు రామ్ అబ్బరాజు కూడా అదే చేశాడు. తండ్రికొడుకుల పాత్రలని రివర్స్ చేశాడు.
ప్రతి తండ్రి తన కొడుకు పాస్ అవ్వాలని నానా తంటాలు పడుతుంటాడు. దాదాపు ప్రతి సినిమాలో తండ్రి మనస్తత్వం ఇలానే చూపిస్తుంటారు.
‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాలో ఐతే కొడుకు పాస్ కావడానికి చిట్టీలు అందించే త్రండిని కూడా చూశాం. ఐతే ఇక్కడ అదే సీన్ రివర్స్ చేశాడు దర్శకుడు.
రిటైర్ అయిపోవాల్సిన వయసులో వున్న తండ్రిని డిగ్రీ పాస్ చేయించాలని ప్రయత్నిస్తుంటాడు కొడుకు.
ఈ క్రమంలో వారి మధ్య పుట్టే హాస్యం చాలా సహజంగా నవ్వుల్ని పంచింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ట్రాక్‌పై నడుస్తున్నా ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా హాయిగా సాగిపోతుంది.
ఐతే కేవలం నవ్వించడానికే ఈ ట్రాక్ పెట్టుంటే తేలిపోయేది. దీని వెనుక బలమైన ఎమోషన్‌ని రాసుకున్నాడు దర్శకుడు.
బాలు తాత వీలునామా ప్రకారం తండ్రికి డిగ్రీ వస్తేనే ఆస్తి వస్తుంది. అప్పటికే తన పిన్ని బాబాయిలు డిగ్రీ పాసై ఆస్తిని అనుభవిస్తుంటారు.
బాలు తండ్రిని చిన్న చూపు చూస్తుంటారు. ఈ కథలో యూనిక్ పాయింట్ ఇది. బాలు ప్రయత్నం అంతా ఆస్తి రావడానికి కాదు.
తన తండ్రిని ఒక ఫెయిల్యూర్‌గా ఏ కొడుకు చూడలేడు. డిగ్రీ సంపాదించి తన కుటుంబంలో తండ్రి తలెత్తుకొని వుండాలన్నా తాపత్రయం బాలులో కనిపిస్తుంది. ఈ ఎమోషన్ చాలా వర్క్ అవుట్ అయ్యింది.

ఫొటో సోర్స్, Twitter/Sreevishnuoffl
ప్రేమకథలోని కొత్తదనం అదే
సామజవరగమనలో ప్రేమ కథ సింపుల్‌గా వుంటుంది. ఐతే ఆ సింప్లీసిటీలోనే కొత్తదనం చూపించాడు దర్శకుడు.
బాలు, సరయుల మధ్య ప్రేమ పుట్టడానికి రొటీన్ రూట్‌నే ఎంచుకున్న దర్శకుడు.. ఆ ప్రేమ కథలోని ఘర్షణకి మాత్రం కొత్తదారిలో వెళ్ళాడు.
నిజానికి ఈ కోణం ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో రాలేదనే చెప్పాలి. ఇది చాలా మందికి తెలిసిన పాయింటే.
పెళ్లి సంబంధాలు చూస్తున్నపుడు ఫలానా వారు ఫలానా వారికి ఏ వరుస అవుతారు ? అనేది జనరల్‌గా చెక్ చేసుకునేది.
అయితే ఇదే పాయింట్ తెరపైకి చాలా హిలేరియస్‌గా తీసుకొచ్చాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి డిగ్రీ చుట్టూ నడిస్తే సెకండ్ హాఫ్ అంతా ఈ వరసలో నడుస్తుంది.
అన్నయ్య సన్నిధి
కేవలం నవ్వించడమే ఉద్దేశంగా తీసిన సినిమా ఇది.
ఫస్ట్ హాఫ్ వరకూ నవ్వులు సహజంగానే పూశాయి.
ఐతే సెకండ్ హాఫ్ ఆరంభంలో కూడా హిలేరియస్ ఎపిసోడ్స్‌తోనే మొదలౌతుంది.
ఐతే కథ ముందుకువెళ్ళే క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రాఖీ కట్టించుకోకుండా తిరిగే ఎపిసోడ్‌ని చాలా సాగదీశారు.
అలాగే ‘’అన్నయ్య.. అన్నయ్యా’’ అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ ఫ్యామిలీ చేసే కామెడీ కూడా ఒక దశలో మరీ సాగదీత అనిపిస్తుంది.
సెకండ్ హాఫ్‌లో కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

ఫొటో సోర్స్, Twitter/Sreevishnuoffl
కులశేఖర్ మెరుపులు
బాలు, ఉమా మహేశ్వరరావు తర్వాత ఈ సినిమాలో గుర్తుపెట్టుకునే మరో పాత్ర కులశేఖర్‌గా వెన్నెల కిశోర్.
నవ్వుల మోతాదు తగ్గిపోతుందనుకునే సమయంలో ప్రవేశించిన ఆ పాత్ర ఒక్కసారిగా టాప్ గేర్‌లోకి తీసుకెళుతుంది.
కులపిచ్చిపై సెటైర్‌గా నడిచే ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.
ఆ పాత్ర చెప్పే డైలాగులు సోషల్ మీడియా పోస్టుల్లో నిత్యం కనిపించినవే అయినప్పటికీ.. తనదైన రైమింగ్ టైమింగ్ వినోదం పంచాడు కులశేఖర్.
ముగింపులో బలం ఉందా ?
నిజానికి ఈ ప్రేమకథలో చాలా మంచి సంఘర్షణ పెట్టాడు దర్శకుడు. ఐతే దానిని ముగించే విధానంలో మాత్రం కొంచెం ఎక్కువ లిబర్టి తీసుకున్నాడు.
అప్పటివరకూ లేని ఒక ట్రాక్‌ని చొప్పించి ఈ కథకు ముగింపు ఇచ్చాడు. ఈ ముగింపు కూడా ప్రేక్షకులకు ఊహకు ముందే అందిపోతుంది.
కాకపోతే ఇలాంటి కథకి ఇంతకు మించిన ముగింపు కూడా దొరకదేమో అనిపిస్తుంది. ఓ కథని సరదాగా మొదలెట్టి, ఊహించని ట్విస్ట్ ఇచ్చి, అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు ఇచ్చి.. సింపుల్‌గా నడిపించేశాడు దర్శకుడు.
ఈ సినిమాని ప్రేక్షకుడు ఏ మూడ్‌లోకి వెళ్లి చూశాడో.. అదే.. మూడ్‌ని చివరి వరకూ కొనసాగించడం, అదే ఉత్సాహంతో ఆడిటోరియం నుంచి పంపించడం అంత తేలికైన విషయాలేం కావు.
వాటిని దర్శకుడు సరిగా హ్యాండిల్ చేశాడనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Twitter/sreevishnuoffl
శ్రీ విష్ణుకి శ్రీరామ రక్ష
శ్రీ విష్ణు చాలా రకాలైన జోనర్లు టచ్ చేశాడు. అన్ని రకాల సినిమాలూ చేయడానికి ప్రయత్నించాడు.
కానీ, తనకు అచ్చొచ్చిన జోనర్ మాత్రం.. ఎంటర్‌టైన్‌మెంట్.
ఈమధ్య కాలంలో వరుస వైఫల్యాలు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి తనకు సెంటిమెంట్‌గా కలిసొచ్చిన జోనర్‌లోకి వెళ్లి ఈ సినిమా చేశాడు.
తన పాత్రని తీర్చిదిద్దిన విధానం, అందులో.. శ్రీ విష్ణు ఇమిడిపోయిన పద్ధతి ఆకట్టుకొంటాయి.
అమ్మాయిల మనసత్వాన్ని వర్ణిస్తూ, సింగిల్ టేక్‌లో చెప్పిన, సుదీర్ఘమైన డైలాగ్.. థియుటర్లో ఫన్ పండిస్తుంది.
నిజానికి... ఈ డైలాగ్ అప్రస్తుతం అనిపించినా, ఫన్ కోసం రాసుకొంది కాబట్టి.. బాగానే వర్కవుట్ అయ్యింది.
నాన్న డిగ్రీ ఎందుకు పాస్ అవ్వాలో చెప్పిన సీన్.. నాన్మమ్మని తన ఇంటికి తీసుకొచ్చే సందర్భం.. ఇవి రెండూ శ్రీ విష్ణు నటనలోని ప్రతిభని మరోసారి బయట పెడతాయి.
ఈ సినిమాలో మరో హీరో.. నరేష్. షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడానికి ఆపసోపాలు పడే క్యారెక్టర్‌లో ఆయన పడే పాట్లు నవ్విస్తాయి.
నరేష్‌లోని కామెడీ యాంగిల్‌ని పూర్తి స్థాయిలో వాడుకొన్నారు.
జెర్సీ సీన్‌ని రిపీట్ చేసినప్పుడు ఆయన మరింత ఫన్ అందించారు. శ్రీకాంత్ అయ్యంగార్‌కి మరోసారి మంచి పాత్ర దొరికింది.
ఆయన కామెడీ టైమింగ్ ఆ పాత్రని నడిపించింది. సెకండాఫ్ కాస్త బోర్‌గా వెళ్తోంది అనుకొంటున్న దశలో.. కుల శేఖర్‌గా రంగ ప్రవేశం చేసి, ఆ పది నిమిషాలూ ఆడిటోరియాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకొన్నాడు వెన్నెల కిషోర్.
రెబా మోనికకు ఇదే తొలి సినిమా. తన క్యారెక్టర్‌ని సైతం దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. సరస్వతి పేరు పెట్టుకొన్న మొద్దమ్మాయిగా తనకు కూడా నవ్వుల్ని పంచే బాధ్యత తీసుకొంది.

ఫొటో సోర్స్, Twitter/Sreevishnuoffl
పాటలు బాగుంటేనా..?
గోపీ సుందర్ సంగీతం అందించిన సినిమా ఇది.
స్వతాహాగా గోపీ సుందర్ మంచి పాటలే ఇస్తాడు.
ఆల్బమ్ లో ఒక్క పాటైనా గుర్తుండిపోతుంది.
అయితే, ఈ సినిమాలో ఆయన ఇచ్చిన ట్యూన్లేవీ ఆకట్టుకోవు.
ఆ పాటలు స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది.
ముఖ్యంగా ఫస్టాఫ్ చకచక సాగిపోయింది. ద్వితీయార్థంలో కాస్త లాగ్ కనిపించినా, అది ఎడిటర్ లోపం కాదు.
మాటలు చిన్నవే. కానీ ప్రభావవంతంగా పని చేశాయి.
మల్టీప్లెక్స్‌కి ఓ మధ్యతరగతి వాడు వెళ్తే.. ఇంట్రవెల్ కి బయటకు రాకూడదు. వచ్చినా.. చుట్టు పక్కల చూడకూడదు.. అని చెప్పడం ఫన్నీగానే ఉన్నా, నిజంగానే సగటు జీవి ఇబ్బందిని ఆవిష్కరించింది.
సన్నివేశం నుంచి హాస్యం పుట్టుకొస్తే.. చిన్న చిన్న పదాలైనా నవ్విస్తాయి. పంచ్‌లు అవసరం లేదు. ఈ విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.
దర్శకుడిలో విషయం ఉంది. ఏమీ లేని చోట.. ఏదో ఉందన్న భ్రమ కల్పిస్తూ.. ప్రేక్షకుల్ని వాచ్‌ల వంకో, సెల్‌ఫోన్ల వంకో చూడకుండా తెరకే రెండు కళ్లూ కేంద్రీకరించేలా కథనం రాసుకొని ఆకట్టుకొన్నాడు.
ఈమధ్య ఓటీటీల హవా ఎక్కువైపోయింది. దాని పుణ్యమా అని సెక్స్, బూతులూ విచ్చల విడిగా బుల్లితెరపై రాజ్యం ఏలుతున్నాయి.
ప్రేక్షకుల్ని నవ్వించాలన్నా ద్వంద్వార్థాలు వెదుక్కోవాల్సిందేమో అన్న భ్రమలు కలిగిస్తున్నాయి.
ఇలాంటి దశలో స్వచ్చమైన వినోదంతో, క్లీన్ ఇమేజ్‌తో ఈ సినిమా వచ్చింది. కాసేపు బాధలన్నీ మర్చిపోయి, థియేటర్ కి వెళ్లి, సకుటుంబ సమేతంగా ఓ మంచి సినిమా చూడాలనుకొనేవారికి.. ఈవారం దొరికిన మంచి ఆప్షన్.. సామజవరగమన.
ఇవి కూడా చదవండి:
- 2018 సినిమా రివ్యూ: కేరళ ప్రళయంపై తీసిన ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాల వరదలో ముంచెత్తుతోందా?
- మళ్లీ పెళ్లి రివ్యూ: భార్య వల్ల మనశ్శాంతి లేని భర్త... భర్త వల్ల సుఖం లేని భార్య... వీరి కథ ఆకట్టుకుందా?
- ఈ బాలీవుడ్ నటిని డ్రగ్స్ స్మగ్లర్‌గా సినీ ఫక్కీలో ఇరికించారు
- శరత్‌బాబు: ఓ విజయవంతమైన నటుడి ఫెయిల్యూర్ స్టోరీ
- ‘అన్నీ మంచి శకునములే’ రివ్యూ: నందినీ రెడ్డి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














