వాగ్నర్ లాంటి 'ప్రైవేట్ ఆర్మీలు' ప్రపంచమంతటా ఎలా పని చేస్తుంటాయి... హైదరాబాద్ నిజాం మీదకు విజయనగర సామ్రాజ్యం కిరాయి సైనికులను పంపించిందా?

ఫొటో సోర్స్, CONCORD PRESS SERVICE
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యాలో గతవారం ఒకరోజు తిరుగుబాటు విఫలమైన తరువాత వాగ్నర్ అనే ప్రైవేట్ ఆర్మీకి చీఫ్ అయిన యెవ్‌గోనీ ప్రిగోజిన్ బెలారూస్‌కు వెళ్లిపోయారు.
బెలారూస్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో మంగళవారం ప్రిగోజిన్ అక్కడికి వచ్చిన విషయాన్ని ధ్రువీకరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం మిలిటరీని ఉద్దేశించి మాట్లాడుతూ, వాగ్నర్ తిరుగుబాటు విఫలమైన తర్వాత తాను అంతర్యుద్ధాన్ని ఆపివేసినట్లు చెప్పారు.
వాగ్నర్ గ్రూప్ చేసిన తిరుగుబాటు, యుక్రెయిన్‌తో యుద్ధంలో నిమగ్నమై ఉన్న పుతిన్‌ను క్లిష్ట పరిస్థితిలోకి నెట్టింది. దీంతో, యుద్ధాల్లో ప్రైవేట్ సైన్యాల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కిరాయి సైనికుల అస్తవ్యస్త ప్రపంచంపై అందరూ దృష్టి సారించడం మొదలైంది.
కిరాయి సైనికుల ప్రపంచం యుద్ధభూమే. ఎక్కడ యుద్ధం జరుగుతుంటే అక్కడ వారుంటారు. ప్రపంచంలోని అగ్ర దేశాల కోసం వారు పని చేస్తారు. కొన్ని ప్రభుత్వేతర సంస్థలు కూడా వీరి సేవలను వాడుకుంటాయి.
చాలా దేశాల్లో ప్రైవేట్ సైన్యాలు చురుకుగా పనిచేస్తున్నాయి. అయితే, వాటి సంఖ్య తగ్గుతూనే ఉంది.
రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్, అమెరికా కోసం పనిచేసే అకాడమీ (గతంలో దీన్ని బ్లాక్‌వాటర్ పేరుతో పిలిచేవారు) అనే ప్రైవేట్ ఆర్మీ కంపెనీ (పీఎంసీ)లు చాలా ప్రముఖమైనవి. అయితే, ఇటీవలి కాలంలో ఇవి రెండు వివాదాల్లో చిక్కుకున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సీన్ మెక్‌ఫీట్ గతంలో కొన్నేళ్ల పాటు ప్రైవేట్ ఆర్మీలో భాగంగా ఉన్నారు. తర్వాత ఆయన కిరాయి సైనికుల ప్రపంచంపై రెండు పుస్తకాలు, అనేక నవలలు రాశారు.
ప్రైవేట్ సైన్యం లేదా కిరాయి సైన్యం అనేది ఒక పరిశ్రమ అని బీబీసీతో ఫోన్ సంభాషణలో ఆయన చెప్పారు.
“ఎన్నో ప్రమాదాలతో నిండి ఉండే కిరాయి సైనికుల జీవితాల గురించి ప్రజలకు చెప్పడం కోసం నేను పుస్తకాలు రాశాను. వీరిని పెద్ద దేశాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు.
1990 దశకంలో కిరాయి సైన్యాల వాడకం మొదలైంది. కానీ, ప్రభుత్వాలు వీటి నియంత్రణలో తాత్సారం చేస్తున్నాయి. ఒకవేళ ఇది ఇలాగే ముందుకు సాగితే దీని ప్రభావం అంతర్జాతీయ సంబంధాలపై పడుతుంది. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రజలకు వస్తుంది. రేపు ట్విటర్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్ కూడా తన సొంత ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచం తీరు మారుతుంది. అంతటా అరాచకం విస్తరిస్తుంది’’ అని ఆయన వివరించారు.
62 ఏళ్ల ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడు. పుతిన్ 2014లో వాగ్నర్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా పూర్వ వైభవాన్ని తిరిగి స్థాపించాలనే ఉద్దేశంతో వాగ్నర్‌ను పుతిన్ స్థాపించారు.

ఫొటో సోర్స్, Getty Images
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు కారణంగా పుతిన్ పాలన ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోందని దిల్లీలోని రాజకీయ, విదేశీ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ సువ్రోక్మల్ దత్తా అన్నారు.
వాగ్నర్ గ్రూపు యోధుల సంఖ్య 20-35 వేల మధ్య ఉంటుంది. యుక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతంలో యుక్రెయిన్ సైనికులపై ఈ గ్రూపు విజయాన్ని సాధించింది.
2014లో క్రిమియాను రష్యా ఆక్రమించినప్పుడు కూడా ఈ గ్రూపు రష్యాకు ప్రధాన సహకారం అందించింది.
ప్రైవేట్ సైన్యాల కార్యకలాపాలు వివాదాస్పదం కూడా అయ్యాయి. ఉదాహరణకు, 2007 సెప్టెంబర్‌లో ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఊచకోత జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన ప్రైవేట్ భద్రతా సేవల కంపెనీ ‘‘బ్లాక్ వాటర్ వరల్డ్ వైడ్’’కు చెందిన సైనికుల పాత్ర కూడా ఉంది. ఇరాక్‌లో భద్రతా సేవలను అందించడానికి అమెరికా ప్రభుత్వం, బ్లాక్ వాటర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
తమకు ఎదురుగా వస్తున్న వాహనంతో ముప్పు పొంచి ఉన్నట్లు భావించిన బ్లాక్‌వాటర్ సైనికులు... రద్దీగా ఉండే కూడలిలో కాల్పులు జరిపారు. ఈ క్రమంలో అక్కడి వాహనాలు, పాదచారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి.
ఈ కాల్పుల్లో 17 మంది ఇరాక్ పౌరులు మరణించగా, అనేక మందికి గాయాలు అయ్యాయి.
బాధితుల్లో పురుషులు, మహిళలతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో చాలామంది వద్ద ఆయుధాలేమీ లేవు. వారివల్ల బ్లాక్‌వాటర్ కాన్వాయ్‌కు ఎలాంటి ముప్పు లేదని స్పష్టంగా తెలిసింది.
దీంతో, ఈ ఘటనపై ఇరాక్ సర్కారు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ ఊచకోతపై అమెరికా చేసిన విచారణలో బ్లాక్ వాటర్ సైనికులు మితిమీరిన బలప్రయోగం చేయడంతో పాటు అన్యాయంగా వ్యవహరించినట్లు నిర్ధారణ అయింది.
ఈ ఘటనతో ప్రమేయం ఉన్న అనేక మంది బ్లాక్‌వాటర్ ఉద్యోగులపై అమెరికా న్యాయశాఖ హత్యా నేరాన్ని మోపింది.
ఈ సంఘటన ఇరాక్‌లోని ప్రైవేట్ భద్రతా కాంట్రాక్టర్ల వివాదాస్పద పాత్రను హైలైట్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కిరాయి సైనికుల చరిత్ర
కిరాయి సైనికుల పాత్రకు మన ఇతిహాసాలకు ఉన్నంత చరిత్ర ఉంది. శతాబ్దాలుగా వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ లేదా సైద్ధాంతిక లాభాల కోసం యుద్ధాల్లో ఈ కిరాయి సైనికులను వాడుకుంటున్నారు.
చరిత్ర అంతటా, ప్రైవేట్ సైన్యాలను వివిధ కారణాల కోసం ఉపయోగించుకున్నారు.
దేశానికి చెందిన సాధారణ సైన్యానికి సహాయం చేయడం, వాణిజ్య ప్రయోజనాలను రక్షించడం, ప్రత్యేక సైనిక కార్యకలాపాలను నిర్వహించడం వంటి వివిధ కారణాల కోసం ఈ సైన్యాలను వాడుకున్నారు.
పురాతన ఈజిప్టులో పొరుగు ప్రాంతాల నుంచి కిరాయి సైనికులను ఫారో నియమించుకున్నారు. వారితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
పురాతన గ్రీస్‌లోని ఏథెన్స్, స్పార్టా వంటివి కూడా తమ సైనిక బలగాలను బలోపేతం చేయడానికి "హాప్లైట్స్" అని పిలిచే కిరాయి సైనికులను తరచుగా నియమించుకున్నాయి.
పురాతన రోమన్ సామ్రాజ్యం తన సైన్యాలకు అనుబంధంగా జర్మన్ తెగలకు చెందిన వారిని కిరాయి సైనికులుగా నియమించుకుంది. చక్రవర్తులు వ్యక్తిగత అంగరక్షక విభాగాలను కూడా ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వలసవాద యుగం
యూరోపియన్ ఇన్నోవేషన్: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వంటి ప్రైవేట్ సంస్థలు తమ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
ఇటలీ పునరుజ్జీవనం: తమ తరఫున యుద్ధాలు చేయడానికి వెనిస్, ఫ్లోరెన్స్ వంటి శక్తిమంతమైన రాజ్యాలు కిరాయి సైన్యాన్ని నియమించుకున్నాయి.
సామ్రాజ్యవాద యుగం
యూరోపియన్ సామ్రాజ్యాలు: వలసవాద పాలన ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో, యూరోపియన్ రాజ్యాలు తమ కాలనీలను విస్తరించడానికి, వాటిపై నియంత్రణ కోసం ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాయి.
బ్రిటిష్ సౌత్ ఆఫ్రికా కంపెనీ, కాంగో ఫ్రీ స్టేట్ ఫోర్సెస్ పబ్లిక్ వంటి కంపెనీలు తమ సొంత ప్రైవేట్ సైన్యాలను కలిగి ఉండేవి.
అమెరికా విప్లవం: అమెరికా రివల్యూషనరీ వార్ సమయంలో అమెరికా వలసవాదులు, బ్రిటిష్ సామ్రాజ్యం కిరాయి సైనికులను ఉపయోగించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆధునిక యుగంలో కిరాయి సైనికుల వాడకం
వలసవాదం అనంతర ఘర్షణలు: ప్రైవేట్ మిలిటరీ కంపెనీలు (పీఎంసీ) 20వ శతాబ్దం చివర్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇవి ప్రభుత్వాల తరఫున, ప్రభుత్వేతర సంస్థల తరపున అనేక యుద్ధాల్లో భాగమయ్యాయి.
ఇరాక్, ఆఫ్గానిస్తాన్ యుద్ధాలు: ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల సమయంలో అమెరికా, దాని మిత్రదేశాలు బ్లాక్‌వాటర్ వంటి పీఎంసీలపై ఎక్కువగా ఆధారపడ్డాయి. భద్రత, లాజిస్టికల్ మద్దతు, ఇతర సేవలను పీఎంసీలు అందించాయి.
సమకాలీన కార్యకలాపాలు: ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణల సమయంలో, వాటి తర్వాత కూడా పీఎంసీలు పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. అయితే, వీటి జవాబుదారీతనం, పారదర్శకత, సంభావ్య మానవ హక్కుల ఉల్లంఘనల వంటి వాటి విషయంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో ప్రైవేట్ సైన్యం చరిత్ర
డాక్టర్ సువ్రోక్మల్ దత్తా ప్రకారం, విజయనగర సామ్రాజ్యం సైన్యంలో కొంత ప్రైవేటు సైన్యం ఉండేది. ఇందులో ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు చెందిన యోధులు ఉండేవారు.
పని చేసినందుకుగానూ వారికి తగిన ఫీజును చెల్లించేవారు. అహ్మద్‌నగర్ సుల్తానులకు, గోల్కొండ, హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా ఈ సైన్యాన్ని విజయనగర సామ్రాజ్యం బాగా ఉపయోగించింది.
"చోళ సామ్రాజ్య విస్తరణలో కూడా మధ్య ఆసియా యోధులతో కూడిన ప్రైవేట్ సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. దిల్లీ, మొఘల్ సామ్రాజ్య కాలంలో కూడా ప్రైవేట్ సైనికులను వాడుకోవడం చాలా సాధారణ విషయం’’ అని సువ్రోక్మల్ దత్తా అన్నారు.
ఈ ప్రైవేట్ సైన్యాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమా, వాటిని నియంత్రిస్తున్నారా?
ఈ సైన్యాలను పర్యవేక్షించడం అవసరమని దత్తా చెప్పారు. ఇందుకోసం అంతర్జాతీయ సదస్సు అవసరం ఉందని, ఒక చట్టం కూడా చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
"21వ శతాబ్దంలో అమెరికా, యూరప్, రష్యాలు ఇతర దేశాలను ఆక్రమించుకోవడానికి, ఇతర దేశాల ప్రభుత్వాలను అస్థిరపరచడానికి ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించిన విధానంతో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరిగింది. వియన్నా ఒప్పందం ఉల్లంఘన జరిగింది.
ఇందుకు సజీవ ఉదాహరణ అమెరికా. ఇరాక్‌లో అమెరికా ప్రైవేట్ సైన్యాన్ని ఉపయోగించిన విధానం అన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది. ఫలితంగా దారుణ రీతిలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ప్రైవేట్ సైన్యం వాడకాన్ని నిలిపివేయడానికి ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వీటిని నిలిపేయాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని సువ్రోక్మల్ దత్తా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొఫెసర్ సీన్ మెక్‌ఫీట్ దీనిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
"ప్రైవేట్ సైన్యాలు, కిరాయి సైనికులను నియంత్రించడానికి లేదా చట్టం చేయడానికి రెండు అడ్డంకులు ఉన్నాయి.
ఒకటి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలు ప్రపంచంలోని అగ్రదేశాలు. అవి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ సైన్యాలను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు, ప్రైవేట్ సైన్యాలను అమెరికా ఎక్కువగా ఉపయోగిస్తుంది.
రెండవ అడ్డంకి ఏంటంటే, మీరు ఒక మంచి అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించినప్పటికీ ఉదాహరణకు, బెలారూస్ లోపలికి వెళ్లి అక్కడున్న కిరాయి సైనికులను ఎవరు అరెస్టు చేస్తారు? లిబియా, యెమన్, ఇరాక్‌లకు వెళ్లి అక్కడున్న కిరాయి సైన్యాన్ని అరెస్ట్ చేయగలరా? ఈ పనిని ఐక్యరాజ్యసమితి చేయదు. కొందరు వ్యక్తులు అంతర్జాతీయ చట్టాలను డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఇది కేవలం ఊహ మాత్రమే" అని ఆయన వివరించారు.
ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన సీన్ మెక్‌ఫాట్ వంటి నిపుణులు చెప్పినదాని ప్రకారం, ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు.
శక్తిమంతమైన దేశాలు ఈ సైన్యాన్ని ఉపయోగించుకోవడం ఆందోళనకర అంశమని మెక్ ఫాట్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














