చిరుతపులి మచ్చల కప్పలు: ఈ అరుదైన జీవుల సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే...

కప్పలు

ఫొటో సోర్స్, ISIS IBAÑEZ

చిరుతపులి మచ్చలతో ఉండే కప్పలను ఎప్పుడైనా చూశారా? ఇలాంటి కప్పలు ఉంటాయని చాలా ప్రాంతాల్లో తెలియదు.

ఈ కప్పల పునరుత్పత్తి ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఒక మహిళా పరిశోధకుల బృందం ప్రయత్నించింది. ఈ మహిళలు 50 డిగ్రీల ఎండ వేడిని, విషపూరిత పాములను ధైర్యంగా ఎదుర్కొంటూ తమ పరిశోధనను కొనసాగించారు.

ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉండే ఉష్ణమండల అడవుల్లో ఒకటైన డ్రై చాకో అడవుల్లో కనిపించే ఈ అరుదైన శాంటా ఫె ఫ్రాగ్స్ (కప్పలు) అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అవి అంతరించిపోకుండా కాపాడేందుకు అర్జెంటీనాకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తలు పోరాడుతున్నారు.

తన భాగస్వామిని పిలిచేందుకు మాత్రమే బయటికి వచ్చే ఈ కప్పలు గుహల్లో ఎలా దాక్కుంటాయో మహిళా పరిశోధకుల బృందం గుర్తించింది.

ఈ జాతికి చెందిన తోకకప్పలను (గుడ్ల దశ నుంచి కప్పలుగా మారే క్రమంలో తోకలాంటి నిర్మాణం) కూడా తొలిసారి గుర్తించారు మహిళా పరిశోధకులు.

''ఇది అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ అద్భుతమైన ఉభయచర జీవి మనుగడకు చేయగలిగినదంతా చేయాలని మేము నిశ్చయించుకున్నాం.'' అని శాంటా ఫె ఫ్రాగ్ ప్రాజెక్ట్‌‌కు నేతృత్వం వహిస్తున్న ఇసిస్ ఇబనెజ్ చెప్పారు.

వందేళ్ల కిందటే శాంటా ఫె ఫ్రాగ్‌ (లెప్టోడక్టిలస్ లాటిసెప్స్ - ఈ కప్పల శాస్త్రీయ నామం)‌ను గుర్తించినా ఇప్పటికీ దాని గురించిన శాస్త్రీయ సమాచారం పెద్దగా అందుబాటులో లేదు.

అర్జెంటీనా, బొలీవియా, పరాగ్వేలో ఈ జాతి కప్పలు కనిపిస్తాయి. అయితే, ఇక్కడ ఉన్న ఉష్ణమండల అడవులు కూడా తగ్గిపోతుండడంతో చిరుతపులి మచ్చలను పోలి ఉండే ఈ కప్పలు కూడా అరుదుగా మారాయి.

కప్పలు

ఫొటో సోర్స్, CAMILADEUTSCH

ఈ కప్పలను, వాటి కదలికలను గుర్తించేందుకు పరిశోధకులు కెమెరాలను ఏర్పాటు చేశారు.

భూగర్భంలో నివసించే ఈ జాతి ఉభయచరాల్లో ఎక్కువ శాతం కప్పలు నీటి ప్రవాహం ఉన్న చోటుకు లేదా చిత్తడి ప్రాంతాలకు వచ్చి గట్టిగా అరవడం ద్వారా తమ భాగస్వాములను ఆకర్షిస్తున్నాయి.

మగ కప్పలు రాత్రివేళల్లో తమ బొరియల నుంచి బయటకు వచ్చి తమ ఉనికి తెలిపేలా శబ్దాలు చేస్తాయని, ఆ తర్వాత ఆడ కప్పలతో కలిసి తిరిగి బొరియల్లోకి వెళ్లిపోతాయని మహిళా పరిశోధకుల బృందం గుర్తించింది.

రాత్రివేళలో గంటల తరబడి తవ్విన తర్వాత తొలిసారి వారు కప్ప గుడ్లను, తోక కప్పలను గుర్తించారు.

ఈ జాతి కప్పలు అంతరించిపోకుండా కాపాడడంలో భాగంగా మొదట వాటి సంతానోత్పత్తి ప్రక్రియపై పరిశోధనలు చేస్తున్నారు.

కప్పల దుస్థితిపై అందరి దృష్టిని ఆకర్షించడం ద్వారా డ్రై చాకో అడవుల్లో జీవవైవిధ్యాన్ని, ఇతర జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎత్తిచూపాలని పర్యావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

"డ్రై చాకో అడవులను ఎందుకు సంరక్షించుకోవాలో చెప్పేందుకు అంతరించిపోతున్న ఈ కప్పలే నిదర్శనం'' అని పరిశోధకుల బృంద సభ్యురాలు క్యామిలా డ్యూష్ అన్నారు. ''మాకు ఎక్కువ సమయం లేదు'' అని ఆమె అన్నారు.

కప్పలు

ఫొటో సోర్స్, I IBANEZ

ఈ జాతి కప్పల గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, వాటిని రక్షించేందుకు అనుసరించాల్సిన ఉత్తమ మార్గాల కోసం పరిశోధకుల బృందం అక్కడి స్థానిక సంఘాల నేతలు, రైతులు, వేటగాళ్లను సంప్రదించి వివరాలు సేకరిస్తోంది.

బొలీవియా, అర్జెంటీనా, పరాగ్వేలలో గ్రాండ్ చాకో అడవులు భారీగా విస్తరించి ఉన్నాయి. ఇవి పొడి మట్టితో కూడిన అడవులు.

పంట భూములు, పశుగ్రాసం పెంపకం కోసం కొన్ని దశాబ్దాలుగా చాకో అడవులు క్రమంగా తగ్గిపోతున్నాయి.

భూమిపై వేగంగా అంతరించిపోతున్న అడవుల్లో అమెజాన్ పక్కనే ఉండే ఈ చాకో అడవులు ఉన్నప్పటికీ అంతగా ఎవరూ పట్టించుకోరు.

ఈ ప్రాంతం తీవ్రమైన ఉష్ణోగ్రతలతో, అగమ్యగోచరంగా ఉండడంతో భూమిపై ఉన్న నరకంగా దీన్ని అభివర్ణిస్తారు. ఇక్కడ పగలు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉష్ణోగ్రత ఉంటుంది. వర్షాలు చాలా తక్కువ.

ఇక్కడ కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వందలాది రకాల పక్షులు, క్షీరదాలు, ఉభయచరాలు, రెప్టైల్స్ వృద్ధి చెందుతున్నాయి.

''ఇవి అద్భుతమైన జీవవైవిధ్యం కలిగిన పొడి అడవులు'' అని గాబ్రియేలా అగోస్టిని అన్నారు.

ఇక్కడ కప్పలు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. నివాసానికి అనుకూలమైన స్థలం కరువవుతుండడం, వేట కారణంగా జంతువులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది.

ఇవి కూడా చదవండి: