మణిపుర్: భద్రతా బలగాలను అడ్డుకుంటున్న ఈ మహిళలు ఎవరు... వారికి ఎందుకంత ధైర్యం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ఆర్మీ ఇటీవల షేర్ చేసిన ఒక వీడియోలో మణిపుర్‌లో జరిగిన నాటకీయ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
2 నిమిషాల 14 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో మణిపుర్ మహిళలు రద్దీగా ఉన్న ఒక వీధిలో భారత సైనికులను అడ్డుకోవడం కనిపిస్తుంది.
ధ్వంసమైన రోడ్డు మీద ఉన్న ఒక జేసీబీ చుట్టూ మహిళలు గుమిగూడటం, లోయ మార్గంలో ఎస్‌యూవీలు, కార్లు, ఒక అంబులెన్స్ వేగంగా వెళ్లిపోవడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.
మణిపుర్‌లో తెగల మధ్య హింస కొనసాగుతూనే ఉంది. అక్కడి మెజారిటీ వర్గమైన మెయితెయ్, కుకీ తెగ మధ్య దాదాపుగా రెండు నెలలుగా జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో 100 మంది చనిపోయారు. 60 వేల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
మెయితెయ్ వర్గం వారు నివసించే లోయ ప్రాంతంలో, కుకీ తెగ వారి నిలయమైన కొండ ప్రాంతాల్లో వేల సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించి ఉన్నప్పటికీ ఈ పరిస్థితి తలెత్తింది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, వీడియోలో కనిపిస్తున్నట్లుగా అపనమ్మకం, వర్గ వైషమ్యాలు పెరిగిపోయిన ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. చాలా కష్టమైనది కూడా.
ఆర్మీ షేర్ చేసిన ఈ వీడియోలో కొన్ని నేరారోపణలు ఉన్నాయి.
‘‘అల్లర్లకు పాల్పడేవారు పారిపోవడానికి మహిళా ఆందోళనకారులు సహాయ పడుతున్నారు’’ అనే ఆరోపణ అందులో ఒకటి. ఈ మహిళలు అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాల్లో వెళుతూ వారికి సహాయపడ్డారు అని ఆ వీడియోలో ఆర్మీ పేర్కొంది.
అంతేకాకుండా, భద్రతా ఆపరేషన్లను లాజిస్టిక్ కార్యక్రమాలను ఈ మహిళలు అడ్డగిస్తున్నారని, పారామిలిటరీ ప్రయాణించే మార్గాల్లో రహదారులను తవ్వేసి ఆలస్యానికి కారణం అవుతున్నారనే ఆరోపణలు కూడా చేసింది.
రాష్ట్రంలో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి రాత్రీ పగలు పనిచేస్తోన్న భద్రతా బలగాలకు స్థానికులు సహాయపడాలనే ఆర్మీ అభ్యర్థనతో ఆ వీడియో ముగుస్తుంది.

ఫొటో సోర్స్, AFP
ఆర్మీ షేర్ చేసిన రెండో వీడియోలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఆందోళన చేస్తోన్న మహిళల సమూహంతో ఒక సైనికుడు ఓపికగా మాట్లాడటం కనిపిస్తుంది.
‘‘పర్వాలేదు, నువ్వు వెళ్లిపో’’ అని సైనికుడిని ఉద్దేశించి ఒక మహిళ మాట్లాడుతుండగా, ఆమె చుట్టూ చాలామంది మహిళలు గుమిగూడి ఉన్నారు.
గత వారం కూడా ఆర్మీ ఒక ట్వీట్ చేసింది.
ఇంఫాల్ తూర్పు జిల్లాలో కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా పట్టుకున్న 12 మంది స్థానిక మిలిటెంట్లను మహిళల కారణంగా విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆ ట్వీట్‌లో ఆర్మీ పేర్కొంది. దాదాపు 1500 మందితో కూడా మహిళల గుంపు తమను అడ్డుకున్నట్లు ఆర్మీ వెల్లడించింది.
అల్లకల్లోలంగా ఉన్న లోయ ప్రాంతంలో భద్రతా బలగాలను సవాలు చేస్తోన్న అనేక మంది మహిళలను మీరా పైబీస్ అని భావిస్తున్నారు. వీరినే టార్చ్ బేరర్లు లేదా, మదర్స్ ఆఫ్ మణిపుర్ అని పిలుస్తారు.
2004లో ఇంఫాల్లోని ఒక మిలిటరీ క్యాంప్ బయట దుస్తుల్లేకుండా ఒక బ్యానర్ పట్టుకొని నిలబడిన ఈ మహిళలు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశారు.
32 ఏళ్ల స్థానిక మహిళపై సామూహిక అత్యాచారం, హత్యకు నిరసనగా ‘‘భారత ఆర్మీ మమ్మల్ని రేప్ చేయండి’’ అని రాసి ఉన్న బ్యానర్‌తో వారు దుస్తుల్లేకుండా బయటకు వచ్చారు. ఆ మహిళపై పారామిలిటరీ సైనికులు దురాగతానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
మీరా పైబీస్ అనే సంస్థకు చెందిన ఈ మహిళలు వివాహితులు. 30 నుంచి 65 ఏళ్ల వారు ఇందులో ఉంటారు.
చరిత్రకారుడు లైష్రమ్ జితేంద్రజిత్ సింగ్ చెప్పినదాని ప్రకారం, మీరా పైబీస్ అనేది చాలా క్రమశిక్షణతో కూడిన క్యాడర్.

ఫొటో సోర్స్, Getty Images
1949లో భారత్‌లో మణిపుర్ విలీనం అయినప్పటి నుంచి మాదకద్రవ్యాలు, ఆల్కహాల్‌కు వ్యతిరేకంగా వారు నిర్వహించిన అవిశ్రాంత ప్రచారాల వల్ల మీరా పైబీస్‌కు మరింత ప్రాముఖ్యత దక్కింది.
1980లో మణిపుర్‌లో జాతి సంఘర్షణలు, తిరుగుబాటు ఏర్పడినప్పుడు కూడా ఈ మహిళలు ముందుకొచ్చి తమ వంతు పాత్ర పోషించారు.
1958లో భారత్ వివాదాస్పద సాయుద బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఆక్ట్ -ఏఎఫ్‌ఎస్‌పీఏ) తెచ్చింది. అనివార్య పరిస్థితుల్లో లేదా పొరపాటున పౌరులను చంపిన భద్రతా దళాలను ఈ చట్టం రక్షిస్తుంది.
1979-2012 మధ్య మణిపుర్‌లో భద్రతా బలగాల వల్ల 1,528 మంది పౌరులు అన్యాయంగా చనిపోయారని మానవహక్కులు గ్రూపులు చెబుతుంటాయి. వీటిని ఫేక్ ఎన్‌కౌంటర్లుగా పిలుస్తారు.
1980లో మీరా పైబీస్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చొరబాటుదారుడు అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసిన మెయితెయ్ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తిని విడిపించారు.
ఈ మహిళలు రాత్రిపూట కాగడాలతో జాగరణ చేసేవారిని, తమ కుటుంబాలకు చెందిన పురుషులను పోలీసులు తీసుకెళ్లకుండా ఆర్మీని అడ్డుకునేవారని జితేంద్రజిత్ సింగ్ చెప్పారు.
నాలుగు దశాబ్దాలుగా తిరుగుబాటుతో కొట్టుమిట్టాడుతున్న మణిపుర్‌లో భద్రతా బలగాలకు, ప్రజలకు మధ్య అపనమ్మకం పేరుకుపోయింది.
మే నెల ప్రారంభంలో జరిగిన హింసాత్మక అల్లర్లలో కూడా స్థానిక ర్యాపిడ్ యాక్షన్ పోర్స్‌కు చెందిన ముగ్గురు పోలీసులపై ఇంటిని తగులబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్ పట్ల సైన్యం తీరుపై మహిళలు సంతోషంగా లేరని మీరా పైబీ నాయకురాలు తొంగమ్ జోమాలా అన్నారు.
‘‘వారు సాయుధులైన కుకీ దుండగులను ఆపలేరు. అందుకే లోయ ప్రాంతంలో సైన్యం కదలికలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. హింసను ఆపేయాలి. లోయ, కొండ ప్రాంతాల్లోని దుండగులను ఏరి వేసే ఆపరేషన్లను చేపట్టాలి. లేకపోతే మేం సైన్యం ఆపరేషన్లకు ఎలాంటి మద్దతు ఇవ్వం’’ అని ఆమె అన్నారు.
సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడానికి బదులుగా భారత సైన్యం, మీరా పైబీ నాయకులతో చర్చించడానికి ధైర్యం చూపించి ఉండాల్సిందని, శాంతి పునరుద్ధరణకు తమతో పాటు కుకీ మహిళలతో పనిచేసి ఉండాల్సిందని మరో మహిళ బినాలక్ష్మి నెప్రం అన్నారు.
మాతృస్వామ్య సమాజం కానప్పటికీ, మణిపుర్‌లో ప్రజా వ్యవహారాలలో మహిళలు చురుగ్గా పాల్గొంటారు.
ఇంఫాల్‌లో వారు దక్షిణాసియాలోనే అతిపెద్ద మహిళలను మార్కెట్‌ను నడుపుతున్నారు.
సాయుధ బలగాల దురాగతాలను నిరసిస్తూ ఇరోమ్ షర్మిలా అనే కార్యకర్త 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేశారు.
సంఘర్షణాత్మక ప్రాంతాల్లో మిలిటరీ బఫర్ జోన్లలో ఇప్పుడు మహిళలు పెట్రోలింగ్ చేస్తున్నారు.
మణిపుర్ మహిళలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1904, 1939లలో రెండు ప్రధాన ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. వీటిని మహిళల యుద్ధం లేదా ‘నుపి లాన్’ అని పిలుస్తారు.
మణిపుర్ టార్చ్ బేరర్లకు ఇది మూడో అహింసాయుత, సాహసోపేత మహిళల యుద్ధం అని నెప్రమ్ అన్నారు.
మీరా పైబీలు శాంతిని కోరుకుంటారని జోమాలా వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















