పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరెవరు లింక్ చేయాల్సిన అవసరం లేదు

పాన్ కార్డ్ చూపిస్తున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

మీ పాన్ (PAN) కార్డును ఆధార్‌తో లింక్ చేశారా? ఇంకా చేయకుంటే ఇప్పుడే చేయడం మేలు. ఎందుకంటే లింక్ చేయడానికి ఈ రోజే తుది గడువు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2023 జూన్ 30వ తేదీ పాన్-ఆధార్ లింక్ చేయడానికి తుది గడువుగా ప్రకటించింది.

అంటే 30లోగా మీరు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, 2023 జులై 1వ తేదీ నుంచి మీ పాన్ కార్డు పనిచేయదు.

దీని కారణంగా మీరు బ్యాంకింగ్‌తో సహా పలు సేవల్లో సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే ఈ సేవల్లో పాన్ అవసరం.

షేర్లు, ఇతర పెట్టుబడి మార్కెట్‌లోని ఏ లావాదేవీ అయినా సెబీ (సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పాన్ కార్డుతోనే గుర్తిస్తోంది.

దీంతో పాన్, ఆధార్‌ను లింక్ చేయమని ఇప్పటికే ఉన్నపెట్టుబడిదారులకు సెబీ సూచించింది.

ఇలా చేయకపోతే లావాదేవీలలో సమస్యలు తలెత్తుతాయి.

పాన్, ఆధార్

పాన్-ఆధార్ లింక్ ఎవరు తప్పనిసరిగా చేయాలి?

ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. కానీ, చాలామందికి ఒకే పాన్ కార్డు నంబర్లు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.

పాన్ కార్డు డేటా డూప్లికేషన్‌ను నిరోధించడానికి, అర్హత ఉన్న పన్ను చెల్లింపుదారులు పాన్ దరఖాస్తు ఫారమ్, ఆదాయ రిటర్న్‌లో ఆధార్ నంబర్‌ పొందుపరచడం తప్పనిసరి చేశారు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ నంబర్ కలిగి ఉన్న వారందరు ఆధార్ నంబర్‌ను పేర్కొనడం తప్పనిసరి అని సీబీడీటీ 2022 మార్చిలో ప్రకటన విడుదల చేసింది.

పాన్ కార్డు, ఆధార్- అనుసంధానానికి ఇది తప్పనిసరి.

2023 జూన్ 30 నాటికి లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయడంలో విఫలమైతే పాన్ కార్డు సేవలు నిలిచిపోతాయి.

వీళ్లు పాన్-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు?

కొంతమందికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు.

  • 80 ఏళ్లు దాటిన వ్యక్తి.
  • ఆదాయపు పన్ను చట్టం కింద నాన్-రెసిడెంట్స్ .
  • భారత పౌరుడు కాని వ్యక్తి.
ఆధార్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

లింక్ చేయకపోతే ఏమవుతుంది?

పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయకపోతే ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం కుదరదు.

పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెస్ అవ్వదు.

ఆదాయపు పన్ను రీఫండ్ ప్రక్రియ ప్రాసెస్ కాదు.

ఆదాయపు పన్ను రిటర్న్‌‌లో పొరపాటు జరిగితే దానికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగదు.

పాన్ కార్డు పని చేయని పక్షంలో పన్ను మినహాయింపును పెరిగిన రేటుకు వర్తింపజేస్తారు.

పాన్ కార్డు రద్దయితే బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు సాధ్యం కావు. ఎందుకంటే కేవైసీ కోసం పాన్ అవసరం ఉంటుంది.

మళ్లీ మీ పాన్ కార్డు పునరుద్దరించాలంటే మీ ఆధార్ కార్డు వివరాలతో రూ.1,000 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

సెబీ ఎందుకు తప్పనిసరి చేసింది?

KYC కోసం పాన్ కార్డు అవసరం. సెక్యూరిటీల మార్కెట్‌లో లావాదేవీ కేవైసీ తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది.

సెబీలో రిజిస్టర్డ్ అయిన సంస్థలు, మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్‌లు మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కేవైసీని పొందడం అవసరం.

కాబట్టి, సెక్యూరిటీల మార్కెట్‌లో పనిచేయడానికి పెట్టుబడిదారులకు పాన్-ఆధార్ అనుసంధానం అవసరం.

పాన్ కార్డు

ఫొటో సోర్స్, Getty Images

పాన్, ఆధార్ లింక్ చేయడం ఎలా చేయాలి?

  • www.incometax.gov.in వెబ్‌సైట్ లో మీరు పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయాలి.
  • వెబ్‌సైట్ ఓపెన్ చేసి, 'లింక్ ఆధార్' ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం ఫారమ్‌లో మీ పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
  • మీ ఆధార్ కార్డులో ఉన్నట్లే మీ పేరును ఎంటర్ చేయాలి.
  • మీ ఆధార్ కార్డ్‌లో మీ పుట్టిన తేదీని మాత్రమే పేర్కొన్నట్లయితే, మీరు బాక్స్‌లో సరైన గుర్తును ఉంచాలి.
  • ఇప్పుడు ధృవీకరించడానికి, చిత్రంలో ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను రాయండి.
  • లింక్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్, పాన్‌ కార్డుతో విజయవంతంగా అనుసంధానం అయినట్లు మీ స్క్రీన్‌పై పాప్-అప్ సందేశం వస్తుంది.
  • దృష్టి లోపం ఉన్న వినియోగదారులు OTP ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • క్యాప్చా కోడ్‌కు బదులుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)