తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల నమోదు చుట్టూ అనేక సందేహాలు... 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందా?

ఫొటో సోర్స్, twitter/TelanganaCMO
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం హడావుడి అప్పుడే మొదలైంది. వరంగల్, సిద్ధిపేట జిల్లాల్లో ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను కొత్తగా రాబోయే ధరణి వెబ్‌సైట్‌లో ఎక్కించడం కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు ప్రభుత్వ సిబ్బంది.
అయితే, జనాల ఆస్తుల వివరాలతో పాటూ, ఆధార్ వివరాలను కూడా ఆ సిబ్బంది కోరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
తెలంగాణలో రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కొత్తగా ధరణి అనే వెబ్‌సైట్‌ను తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులను యథాతథంగా ఎక్కిస్తారని అంతా భావించారు. కానీ, వ్యవసాయేతర భూముల వివరాలను ఇంటింటికీ తిరిగి రాసుకుని ఆ వెబ్‌సైట్‌లో పెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇందుకోసం ఆస్తుల యజమానులు నుంచి చాలా వివరాలు సేకరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. భూమికి సంబంధించిన వివిధ కాలమ్స్‌తో పాటూ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు... ఇలా 53 రకాల వివరాలను ఇందులో అడిగారు. సమాచార సేకరణ కోసం స్థానిక సంస్థల శాఖలైన పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. వ్యవసాయేతర భూములకు కొత్తగా కుంకుమ రంగు పాస్ పుస్తకాలు కూడా ఇవ్వననున్నారు.
దసరా నుంచే కొత్త ధరణి వెబ్‌సైట్ ప్రారంభిస్తామన్న ప్రభుత్వ ప్రకటన కొందరికి ఆశ్చర్యాన్నీ, ప్రభుత్వ ఉద్యోగులకు అయోమయాన్నీ కలిగించింది. దీనిపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన కేసీఆర్, 15 రోజుల్లోగా కట్టడాల వివరాలన్నీ నమోదు చేయాలన్నారు. ఇంత తక్కువ సమయంలో రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ, గుడీ, బడీ, ఇలా అన్ని వివరాలూ ప్రభుత్వానికి చేరడం సాధ్యమేనా అన్న సంశంయాన్ని రెవెన్యూ అధికారులు వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, twitter/TS_DHARANI
వివాదం ఏంటి?
ఆస్తుల వివరాలు నమోదు చేయడం, ఆ పని ఇంత వేగంగా చేయడం సంగతి అటుంచితే, ఆ వివరాల కోసం అడిగే ప్రశ్నలు ఇక్కడ చట్టపరమైన చిక్కులు తెచ్చేలా ఉన్నాయి.
ఆస్తి నమోదుకు పేరూ, ఊరూ వంటి మామూలు వివరాలతో పాటూ, ఆధార్ నంబర్, సెల్ నంబర్, ఆస్తి ఎలా వచ్చింది? ఇంట్లో ఎందరుంటారు? వంటి వివరాలు కూడా అడుగుతున్నారు.
ఇలాంటి సర్వేలు జరిగినప్పుడు, తమకు ప్రభుత్వం నుంచి అందుతోన్న పథకాలు పోతాయేమోనన్న భయం ప్రజల్లో ఉండటం, వారు సరైన సమాచారం ఇవ్వకపోవడం అనే సమస్య తరచూ దేశవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సమస్య రావచ్చని బీబీసీతో అన్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక తహసీల్దార్.
దానికితోడు ఆధార్ విషయంలో ఎన్నో చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. అప్పుడు ఆధార్ విషయంలో అభ్యంతరాలు వస్తే, ఆధార్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
కానీ, ఇప్పుడు కచ్చితంగా ఆధార్ వివరాలు ఆస్తి వివరాలతో పాటూ రాయాలి. ఆస్తుల వివరాలకు ఆధార్ లింక్ అయితే తెల్ల రేషన్ కార్డు పోతుందనే భయం కొందరిలో ఉంది. ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుందనే భయం ఇంకొందరిలో ఉంది.
మరోవైపు ఆధార్ ఇవ్వడం తప్పనిసరి కాదు అని అంటున్నారు నిపుణులు.
''సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆధార్ నంబర్ ఇవ్వడం, ఇవ్వకపోవడం వ్యక్తిగతం. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఏ అవసరం కోసమూ ఆధార్ నంబర్ కోసం ఒత్తిడి చేయజాలదు'' అని బీబీసీకి చెప్పారు సీనియర్ న్యాయవాది పట్టాభి.
కానీ ప్రభుత్వ నిబంధనను కాదని, తమ ఆధార్ నంబర్ చెప్పకుండా ఎందరు ఉంటారన్నది ప్రశ్నార్థకం.

ఫొటో సోర్స్, Dharani
తప్పుల సంగతి?
రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లు ఉండటం ఓ పెద్ద సమస్య. సాధారణంగా ఆస్తుల విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ పత్రాల్లో చిన్న అక్షరం తప్పు జరిగినా, ఏళ్ళ తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వారు చాలా మంది కనిపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో హడావుడిగా ఈ ఆస్తుల వివరాల సేకరణ చేస్తే తరువాత ఇంకా ప్రమాదం జరగొచ్చని యజమానులు భయపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు చాలా తక్కువ గడవు ఇవ్వడం వల్ల ఎక్కువ పొరపాట్లు జరగొచ్చన్న ఆందోళనలు కూడా ఉన్నాయి.
''వాళ్లు హడావుడిగా రాసుకునివెళ్తారు. కంప్యూటర్లో ఇంకా హడావుడిగా ఎక్కిస్తారు. చిన్న అక్షరం తేడా పోయిందంటే, అంతే సంగతి'' అన్నారు జహీరాబాద్ కి చెందిన ఆంజనేయులు అనే రైతు. గతంలో పాస్‌బుక్ తప్పుల విషయంలో తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఇలాగే జనం తిరగాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.
నిజానికి భూమి రికార్డులు చాలా పెద్ద సమస్య అని స్వయంగా కేసీఆరే శాసన సభలో చెప్పారు. ఆ సమస్యను ఇంత హడావుడిగా ఎలా పరిష్కరిస్తారన్న ప్రశ్నే ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.
''తెలంగాణలో వ్యవసాయేతర భూముల మ్యాపులు, సర్వే సరిగ్గా లేవు. చాలా మంది దగ్గర పత్రాలు ఉండవు. పంచాయతీ రసీదులే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇంకా మాకేం చెప్పలేదు'' అని పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ అధికారి బీబీసీతో అన్నారు.
''రికార్డులకీ, వాస్తవానికీ భూమి విస్తీర్ణంలో తేడా ఉంటుంది. అలానే కుటుంబ సభ్యులు పేర్లు నమోదు కూడా ఇబ్బందే. ఎందుకంటే పెళ్లైన ఆడపిల్లల పేర్లు చేర్చే విషయంలో చాలా తగాదాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం కట్టడాలను సర్వే చేస్తున్నారు, కానీ ఖాళీ స్థలాల సంగతి చెప్పలేదు'' అని వ్యాఖ్యానించారు సదరు అధికారి.
ఈ సందేహాలన్నింటి మధ్యే ఇంటింటి సర్వేకు సిద్ధమయ్యారు అధికారులు. మరోవైపు, ధరణి వెబ్‌సైట్‌ను కూడా రకరకాలుగా పరీక్షించి చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








