'కారు ఆపలేదని నా ఒక్కగానొక్క కుమారుడిని కాల్చి చంపేస్తారా?' - వీడియోలో పోలీసులను నిలదీసిన నహెల్ తల్లి

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో ర్యాలీ దృశ్యం
    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పదిహేడేళ్ల నహెల్ ఎం పోలీసు కాల్పుల్లో చనిపోవడంతో అతని స్వస్థలమైన ఫ్రాన్స్‌లోని నాంటెర్రె పట్టణంతో పాటు ఆ దేశంలోని ఇతర నగరాల్లోనూ అల్లర్లు చెలరేగాయి.

నహెల్ తల్లికి అతనొక్కడే సంతానం. పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. రగ్బీ ఆటగాడు కూడా అయిన నహెల్ లీగ్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.

అతని విద్యాభ్యాసం అంత సజావుగా సాగలేదని తెలుస్తోంది. ఎలక్ట్రీషియన్‌గా శిక్షణ పొందేందుకు సమీపంలోని సురెస్నెస్‌ పట్టణంలోని ఒక కాలేజీలో చేరాడు.

తన తల్లి మౌనియాతో కలిసి నివసించేవాడని, నాంటెర్రెలో అందరికీ బాగా తెలుసని అతనికి తెలిసిన వారు చెప్పారు. అయితే అతని తండ్రి గురించి తెలియదని అన్నారు.

కాలేజీలో అతని హాజరు కూడా చాలా తక్కువగా ఉంది. ఎలాంటి నేరచరిత్ర లేకపోయినప్పటికీ అతను పోలీసులకు కూడా తెలుసు.

పనికి వెళ్లేముందు అతను తల్లికి ముద్దు పెట్టి ''ఐ లవ్ యూ మమ్'' అని చెప్పాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే, ఉదయం 9 గంటల సమయంలో తనిఖీలు జరుపుతుండగా కారు ఆపలేదని అతడిని పోలీసులు ఛాతిలో కాల్చారు.

నహెల్ తల్లి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నహెల్ తల్లి మౌనియా

'కారు ఆపలేదని చంపేస్తారా?'

''నేను ఇప్పుడేం చేయాలి'' అని అతని తల్లి ప్రశ్నిస్తున్నారు.

''తనే సర్వస్వం అనుకున్నా. నాకు ఒక్కడే కొడుకు. పది మంది లేరు. నా కొడుకే నా జీవితం. నా బెస్ట్ ఫ్రెండ్'' అంటూ ఆమె వాపోయారు.

అతను ''చాలా మంచివాడు'' అని అతని అమ్మమ్మ చెప్పారు.

''కారు ఆపలేదని చంపే అధికారం ఎవరికీ లేదు'' అని సోషలిస్ట్ పార్టీ లీడర్ ఒలివియెర్ ఫార్ అన్నారు.

''ఈ దేశంలోని పిల్లలందరికీ న్యాయం అడిగే హక్కు ఉంది'' అని అన్నారు.

నహెల్ గత మూడేళ్లుగా పైరేట్స్ ఆఫ్ నాంటెర్రె రగ్బీ క్లబ్‌ తరఫున ఆడుతున్నాడు. స్కూల్‌‌కి వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీనేజర్ల కోసం ఒవాలె సిటొయెన్ సంస్థ నిర్వహిస్తున్న ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్‌లోనూ అతను భాగస్వామిగా ఉన్నాడు.

వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన టీనేజర్లకు అప్రెంటిస్‌‌షిప్ ఇప్పించడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. అందులో భాగంగా నహెల్ ఎలక్ట్రీషియన్‌గా శిక్షణ పొందుతున్నాడు.

అతని గురించి బాగా తెలిసిన పెద్దమనుషుల్లో ఒవాలె సిటొయెన్ సంస్థ అధ్యక్షుడు జెఫ్ ప్యూచ్ ఒకరు. ఆయన కొద్దిరోజుల కిందటే నహెల్‌ను చూశారు. రగ్బీ బాగా ఆడుతున్నాడని కూడా చెప్పారు.

France

ఫొటో సోర్స్, Reuters

చెలరేగిన హింస

''అతను కొందరు పిల్లల్లా డ్రగ్స్ వంటి వాటితో సంబంధాలుండి, లేదా బాల్య నేరాలకు పాల్పడి బయటపడిన వ్యక్తి కాదు. సామాజికంగా, వృత్తిపరంగా ఎదిగే అవకాశం ఉన్న వ్యక్తి'' అని ప్యూచ్ ఫ్రెంచ్ వార్తా సంస్థ లే పారిసియన్‌‌తో అన్నారు.

సోషల్ మీడియాలో చిత్రీకరించినవి నిజం కాదని, అతను మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు.

నాంటెర్రె‌లోని వియక్స్ పాంట్ ప్రాంతంలో తల్లితో కలిసి నివాసం ఉంటున్న సమయంలోనే నహెల్ గురించి ప్యూచ్‌కి తెలుసు. ఆ తర్వాత వారు పాబ్లో పికాసో ఎస్టేట్‌కి మారారు.

అతని కుటుంబం అల్జీరియన్ మూలాలున్న కుటుంబమనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, ప్యారిస్ రింగ్ రోడ్ సమీపంలోని పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియం బయట ''అల్లా అంతనికి ముక్తిని ప్రసాదించు'' అని బ్యానర్ ప్రదర్శించడం కనిపించింది.

నహెల్ 2021 నుంచి ఐదుసార్లు పోలీసు తనిఖీలకు సహకరించలేదని చెబుతున్నారు.

ఇటీవల ఒక వీకెండ్‌లో కూడా పోలీసు తనిఖీలకు సహకరించనందుకు నిర్బంధానికి గురయ్యాడు. సెప్టెంబర్‌లో అతను జువైనెల్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కార్ల కారణంగా ఇటీవల అతను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

నహెల్ మరణంతో చెలరేగిన అల్లర్లు 2005లో ఫ్రాన్స్‌లో జరిగిన ఘటనను గుర్తు చేస్తున్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి వస్తున్న జయద్ బెన్నా, బౌనా ట్రావోర్ పోలీసు తనిఖీల నుంచి తప్పించుకుని పారిపోతూ పారిస్‌కి సమీపంలోని క్లిచీ - సౌస్ - బయోస్‌ ప్రాంతంలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఢీకొట్టి విద్యుదాఘాతంతో చనిపోయారు. అప్పటి ఘటనలను ఈ అల్లర్లు గుర్తు చేస్తున్నాయి.

''అది నేనే కావొచ్చు. లేదా నా తమ్ముడు కూడా కావొచ్చు'' అని క్లిచీకి చెందిన టీనేజర్ మొహమ్మద్ ఫ్రెంచ్ వెబ్‌సైట్ మీడియాపార్ట్‌తో అన్నారు.

''పోలీసుల హింస ప్రతిరోజూ జరుగుతోంది. మరీముఖ్యంగా అరబ్, నల్ల జాతీయులపై'' అని నహెల్‌కి న్యాయం జరగాలని పోరాడుతున్న ఒక యువకుడు అన్నారు.

ఫ్రాన్స్‌లో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

అతను ఇంకా చిన్న పిల్లాడే..

నహెల్ తల్లి విడుదల చేసిన ఒక వీడియోలో ''వాళ్లు నా కొడుకును బలి తీసుకున్నారు.

అతను ఇంకా చిన్న పిల్లాడు. అతనికి తల్లి అవసరం ఉంది.

ఈ రోజు ఉదయం నాకు ముద్దు ఇచ్చాడు.

నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు.

నేను జాగ్రత్త అని చెప్పాను. నేను కూడా ప్రేమిస్తున్నా అని చెప్పాను.

ఇద్దరం ఒకేసారి ఇంటి నుంచి బయటికి వెళ్లాం.

వాడు మెక్‌డొనాల్డ్స్‌కి వెళ్లాడు.

అందరూ వెళ్లినట్టే నేను కూడా విధులకు వెళ్లిపోయాను.

ఆ తర్వాత నా కొడుకుని కాల్చి చంపారని చెప్పారు.

నేనేం చేయాలి?

నాకు వాడొక్కడే. పది మంది లేరు.

వాడే నా సర్వస్వం. నా బెస్ట్ ఫ్రెండ్.

వాడు నాకొడుకు. నాకు అన్నీ వాడే.

మద్దతుగా నిలిచిన వారందరికీ నా ధన్యవాదాలు.

థాంక్యూ వెరీ వెరీ మచ్.

ఇంకా చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, థాంక్యూ.'' అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)