మాట్లాడటం మానేసిందని యువతిపై వేట కొడవలితో దాడి

- రచయిత, మాన్సీ దేశ్‌పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహారాష్ట్రలోని పుణెలో జూన్ 27న జరిగిన ఓ ఘటన కలకలం సృష్టించింది.
20 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల యువకుడు వేట కొడవలితో దాడి చేశాడు.
బాధితురాలు, నిందితుడు ఇద్దరూ కాలేజీ విద్యార్థులే.
ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది.
బాధితురాలు పుణేలోని కర్వేనగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు.
కాలేజీకి వెళ్తున్న ఆమెపై శంతను జాదవ్ (21 ఏళ్లు) అనే వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడు.
గతంలో వారిద్దరూ ప్రేమించుకున్నారని పోలీసులు తెలిపారు.
అయితే శంతను ఆమెను దుర్భాషలాడటం, కొడుతుండటంతో ఆమె అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది.
దీంతో కోపోద్రిక్తుడైన శంతను ఆమెను చంపేందుకు ప్రయత్నించారు.

చంపేస్తానని బెదిరిస్తున్నాడు: బాధిత యువతి
“నేను కాలేజీకి వెళ్తున్నా. అయితే, దారిలో రెండు నిమిషాలు మాట్లాడమని అడిగాడు. కానీ, నేను ఆగలేదు. ఆ తర్వాత వేట కొడవలితో దాడిచేశాడు. పారిపోతుండగా నా వెనుక రావడం ప్రారంభించాడు. అప్పుడు స్థానికులు అతన్ని పట్టుకున్నారు, కొట్టారు. కానీ, వారి నుంచి తప్పించుకుని, మళ్లీ నాపై దాడి చేశాడు. కాలేజీలో మేం స్నేహితులం. కానీ నేను అతనితో మాట్లాడటం మానేశాను' అని బాధితురాలు మీడియాతో చెప్పారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ “అతను నా ఫ్రెండ్. ఇక స్నేహం వద్దని చెప్పడంతో చంపేస్తానని బెదిరిస్తున్నాడు.
కాలేజీ దగ్గరికి వచ్చి పిలిచి కొట్టేవాడు. వద్దని చెబితే మళ్లీ కొట్టేవాడు. కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశా. వారికి చెప్పినందుకు ఈ రోజు నాపై దాడి చేశాడు. నాకు గాయాలయ్యాయి. తలపై కుట్లు కూడా పడ్డాయి" అని చెప్పారు.
ఈ ఘటనపై బాధితురాలి తల్లి కూడా స్పందించారు. శంతను చాలా కాలంగా వేధిస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశామని ఆమె చెప్పారు.
“ఆమెకు ఫోన్ చేసి బెదిరించేవాడు. మళ్లీ అలా చేస్తే, ఫిర్యాదు చేస్తానని చెప్పాను. దీనిపై అతను కోపంతో అమ్మాయి వెంటపడ్డాడు. ఈరోజు ఆమెను కాలేజీలో దింపాను. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆమె స్నేహితుడిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈరోజు అతను అక్కడ ఉండటం వల్ల నా కూతురు బతికిపోయింది. లేకుంటే ఏం జరిగేదో’’ అని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
సీరియస్‌గా చూడాల్సిందే: రాజ్ థాకరే
యువతిపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెన్నెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ థాకరే స్పందించారు.
“నిన్న పుణేలో యువతిపై దురదృష్టకర ఘటన జరిగింది. చాలామంది చూస్తూ నిలబడిపోయినా, లేష్పాల్ అనే యువకుడు అక్కడికి చేరుకుని బాలికను రక్షించాడు. నేను అతని ధైర్యానికి అభినందిస్తున్నా.
అయితే చుట్టుపక్కల ఉన్న చాలామంది వెళ్లిపోవడం, ప్రేక్షకపాత్ర వహించడం చూసి ఆశ్చర్యపోతున్నా.
తర్వాత జరిగే విచారణపై ప్రజలు ఆలోచించి ఉండవచ్చు, కానీ పోలీసులు దీనిపై ప్రజలకు భరోసా ఇవ్వాలి.
దర్శన పవార్ హత్య ఇటీవలే చోటు చేసుకోగా.. మళ్లీ అలాంటిదే జరగడం సీరియస్‌గా చూడాల్సిందే.
మీ చుట్టుపక్కల ఇలాంటివి జరగడం లేదని నా మహారాష్ట్ర సైనికులకు చెప్పకండి, జాగ్రత్తగా చూసుకోండి, సమయానికి స్పందించండి.'' అని ట్విట్టర్‌లో తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
శంతనను అడ్డగించిన యువకుడు
యువతిని శంతను వేట కొడవలితో చంపడానికి పరిగెత్తుతుండగా అటుగా వెళుతున్న లేష్పాల్ ఖిబ్గే అనే యువకుడు చూశాడు. దీంతో ఆమెకు కాపాడేందుకు పరిగెత్తాడు.
“ఉదయం నేను అటుగా వెళ్తున్నాను. ఇంతలో ఒక వాయిస్ విన్నాను. యువకుడు ఆమెను కొడుతున్నాడు. ఆమె భుజంపై దాడిచేశాడు. దీంతో ఆమె అరుస్తూ పరిగెత్తింది. వేట కొడవలితో ఆ యువకుడు ఆమె వెంట పరిగెత్తుతున్నాడు. జనం దగ్గరికి వస్తుంటే వారిపై అరుస్తున్నాడు.
దీంతో నేను అతన్ని పట్టుకోవడానికి అతని వెంట పరుగెత్తాను. బాలిక దుకాణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, షట్టర్‌ను కిందకు దించారు.
ఆమెను షాపులోకి రానివ్వలేదు. ఆమె భయపడి షట్టర్ దగ్గరే కూర్చుంది. అప్పుడు నేను ఆ యువకుడిని వెనుక నుంచి పట్టుకున్నా. దీంతో జనమంతా వచ్చారు ”అని లేష్పాల్ అన్నారు.
విద్యాసంస్థలకు వెళ్లి అవగాహన కల్పిస్తాం: పుణే పోలీసులు
'ఆ యువతి పుణేలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతోంది. నిందితుడితో ఆమెకు పరిచయం ఉంది. నిందితుడు తనను పదే పదే దుర్భాషలాడుతున్నారని ఆమె తెలిపింది. దాంతో అతన్ని ఆమె పక్కన పెట్టేసింది. కోపంతో యువకుడు దాడి చేశాడు. యువతి క్షేమంగా ఉంది. ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది'' అని పుణే పోలీస్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
మహిళల భద్రత కోసం తీసుకునే చర్యల గురించి సందీప్ సింగ్ గిల్ స్పందిస్తూ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, అయితే దానితో పాటు అవగాహన కల్పించడానికి కూడా ప్రయత్నిస్తామని చెప్పారు.
“మేం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాం. ఇలాంటి ఘటనలు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ప్రమాదకరం. కోపంలో వేసే ఒక్క అడుగు వారి జీవితాన్నే నాశనం చేస్తుంది. భవిష్యత్తు చెడిపోతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఒకసారి ఎఫ్‌ఐఆర్‌ను నమోదైతే విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ పెట్టాలి. కెరీర్‌పై దృష్టి పెట్టండి. మరో విద్యార్థిని ఏ విధంగానూ వేధించకూడదు’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ సింగ్ గిల్ బీబీసీ మరాఠీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- గృహలక్ష్మి పథకం: రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా? బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది,
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














