లక్షల జీతం వచ్చే పైలట్ కావాలంటే ఏంచేయాలి? ఇంజినీరింగ్ చేయకుండానే విమానం నడిపేయొచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అష్ఫాక్
- హోదా, బీబీసీ తమిళ్
విమానంలో ఒక్కసారైనా ప్రయాణించాలని చాలా మంది కల కంటారు. మరి ఆ విమానం నడపాలంటే ఏం చేయాలి?
చిన్నప్పుడు ఏం కావాలని అడిగితే, చాలా మంది ‘పైలట్’ అవుతానని చెబుతుంటారు. మరి లక్షలు జీతం వచ్చే పైలట్ కావాలంటే ఏం చేయాలి?
పైలట్ అయ్యేందుకు ఏం చదువుకోవాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఒక ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా పనిచేస్తున్న ప్రియా విగ్నేశ్ చెప్పిన వివరాల ఆధారంగా ఈ కథనం రాశాం.
ఈ ఐదు అంశాలు ముఖ్యం..
- ప్రొఫీషియన్సీ ఇన్ బేసిక్ సబ్జెక్ట్స్
- ఫిట్‌నెస్ టెస్టులో ఉత్తీర్ణత
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరీక్షలోనూ ఉత్తీర్ణత
- 200 గంటల ఫ్లైట్ ట్రైనింగ్
- రైప్ రేటింగ్

ఫొటో సోర్స్, Getty Images
పైలట్ అవ్వడానికి ఏం చదువుకోవాలి?
విమానాన్ని నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైలట్ కావాలంటే కొన్ని నైపుణ్యాలు, అర్హతలు తప్పనిసరి.
వీటిలో మొదటిది కనీస అర్హత. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి. మీరు డిప్లమా లేదా ఇతర కోర్సులను చేసుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దూర విద్య ద్వారా వీటిని పూర్తిచేసినా సరిపోతుంది.
ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివినంత మాత్రాన పైలట్ అవుతారని అనుకోకూడదు.
ఇంజినీరింగ్ పూర్తిచేయకుండానే ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్స్‌లో చేరి, పైలట్ అవ్వాలనే కలను నిజం చేసుకోవచ్చని కో-పైలట్ ప్రియా విగ్నేశ్ చెప్పారు.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయ్యేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఎంత ముఖ్యమో, పైలట్ అయ్యేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) పరీక్ష కూడా అంతే ముఖ్యం.

డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాలి
పైలట్ కావాలని భావించే వారు మొదట డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం మార్క్‌షీట్లు, ఇతర ధ్రువపత్రాలను డీజీసీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఒక యూనీక్ డిజిటల్ నంబర్ (యూనీక్ ఐడీ) ఇస్తారు.
ఏవియేషన్ రంగంలో ఈ నంబరు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని సాయంతోనే మిగతా ట్రైనింగ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫిట్‌నెస్ ఎలా ఉండాలి?
ఫిట్‌నెస్ టెస్టులో క్లాస్ 1, క్లాస్ 2 అనే రెండు దశలు ఉంటాయి. ఈ రెండింటినీ డీజీసీఏ గుర్తింపు పొందిన ల్యాబొరేటరీల్లో వైద్యులు నిర్వహిస్తారు. వివరాలను డీజీసీఏ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
దృష్టి, షుగర్, బీపీ లాంటి పరీక్షలు వీటిలో ఉంటాయి. ఒకసారి ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇస్తారు.
పరీక్షల్లో ఏదైనా సమస్యలు ఎదురైతే, వైద్యుల సూచనలపై చికిత్స తీసుకొని మళ్లీ పరీక్షలకు హాజరుకావచ్చు.
ఈ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేకుండా పైలట్ కావడం సాధ్యంకాదు.
ఒకసారి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, స్టూడెంట్ పైలట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీని తర్వాత ఫ్లైట్ ట్రైనింగ్ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంపిక ఎలా ఉంటుంది?
పైలట్ ట్రైనింగ్ కోసం రెండు దశల్లో పరీక్షలు ఉంటాయి. వీటిలో ఒకటి థియరీ, రెండోది ప్రాక్టికల్స్. ఈ రెండింటిలోనూ మీరు ప్రతిభ చూపించాల్సి ఉంటుంది.
సబ్జెక్టుల విషయానికి వస్తే, మెటియోరాలజీ, ఎయిర్ రెగ్యులేషన్, ఎయిన్ నావిగేషన్, టెక్నికల్ జనరల్, రేడియో టెలిఫోనీ లాంటి ఐదు సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో మొదటి నాలుగు సబ్జెక్టుల పరీక్షలను డీజీసీఏ నిర్వహిస్తుంది. చివరి పరీక్షను టెలికాం శాఖ నిర్వహిస్తుంది.
ఈ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఐదేళ్లలోనే ఫ్లైట్ ట్రైనింగ్‌ను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.
థియరీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే, ఫ్లైట్ ట్రైనింగ్ మొదలుపెట్టాలి. సబ్జెక్టుల్లో పరిజ్ఞానం లేకుండా ఫ్లైట్ ట్రైనింగ్ పూర్తిచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఫ్లైట్ ట్రైనింగ్ విషయానికి వస్తే, ట్రైనింగ్ స్కూల్‌లోనే 200 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనే విమానాన్ని టేకాఫ్ చేయడం, ల్యాండ్ చేయడం, ఆపరేట్ చేయడం లాంటివన్నీ ఉండాలి.
ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్స్‌తో..
డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు పొందిన 30కిపైగా స్కూల్స్ భారత్‌లో నడుస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలు కూడా పైలట్ అయ్యేందుకు శిక్షణ ఇస్తున్నాయి. వివరాలను డీజీసీఏ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
ఫ్లైట్ ట్రైనింగ్‌లో చాలా మోసాలు కూడా జరుగుతుంటాయి. విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు తీసుకొని ఎలాంటి శిక్షణా ఇవ్వని సంస్థలపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయి. కాబట్టి పూర్తిగా వాటి గురించి తెలుసుకోవడం, పూర్వ విద్యార్థులతో మాట్లాడటం లాంటివి తప్పనిసరిగా చేయాలి.
మొత్తం ఫీజును ఒకేసారి కట్టడం మంచిదికాదు. నాలుగు లేదా ఐదు దఫాలుగా ఫీజును కట్టాలి.
ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా స్కూల్స్ దగ్గరకే వెళ్లాలని డీజీసీఏ సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఖర్చవుతాయి?
భారత్ విషయానికి వస్తే, ఒక గంట ఫ్లైట్ ట్రైనింగ్‌కు రూ.15,000 వరకూ ఖర్చు అవుతుంది. ఇది స్కూల్‌ను బట్టి మారుతూ ఉంటుంది. మొత్తానికి ఫ్లైట్ ట్రైనింగ్‌కు రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.
మొత్తం థియరీతోపాటు మిగతా టెస్టులు పూర్తయిన తర్వాత, మీరు విమానయాన సంస్థలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక్కడ విమానయాన సంస్థలు తమ దగ్గరున్న విమానాలకు అనుగుణంగా ప్రకటనలు ఇస్తుంటాయి. దీనికి తగినట్లుగా మనం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ‘టైప్ రేటింగ్’గా చెబుతారు.
ఉదాహరణకు ఏదైనా విమానయాన సంస్థ ఎయిర్‌బస్ విమానం నడిపేందుకు కో-పైలట్ కావాలని ప్రకటన ఇస్తే, ఆ ప్రత్యేక విమానం ఎలా నడపాలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం ఆ ఎయిర్‌లైన్ దగ్గరకు వెళ్లేందుకు బదులుగా దీనికంటూ ప్రత్యేకంగా నెలకొల్పే స్కూల్స్‌లోనూ శిక్షణ తీసుకోవచ్చు. ఈ ట్రైనింగ్‌కు రూ.11 లక్షల నుంచి రూ.21 లక్షల వరకూ ఖర్చు అవుతుంది.
పైలట్ అయ్యేందుకు మీకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మరోవైపు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ కూడా ఉపకారవేతనాలు ఇస్తుంది.
ఇది సులువైన విధానం
మీ దగ్గర రూ.1 కోటి వరకూ డబ్బులు ఉంటే క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా మీరు నేరుగా పైలట్ కావచ్చు.
భారత్‌లోని ప్రముఖ ఎయిర్ లైన్స్ అన్నీ కొత్త పైలట్‌ల కోసం ఈ ప్రోగ్రామ్‌ను నడిపిస్తున్నాయి. మీరు పైలట్ కావాలనుకునే ఎయిర్‌లైన్‌కు మీరు దీని ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తిచేసిన అభ్యర్థులకు దీనిలో నేరుగా శిక్షణ, ఉద్యోగాలు ఇస్తారు.
ఉద్యోగం ఎలా?
ఒకసారి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) పొందిన తర్వాత ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి మీరు నేరుగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీపీఎల్ కోసం ఐదు దశల్లో పరీక్షలు ఉంటాయి. వీటిలో రాత పరీక్ష, పైలట్ ఆప్టిట్యూడ్ టెస్ట్, మెంటల్ లెవల్ టెస్ట్, గ్రూప్ ఇంటర్వ్యూ, ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
ఇవి పాసైన తర్వాత జూనియర్ కో-పైలట్, కో-పైలట్, సీనియర్ కో-పైలట్, ట్రైనీ చీఫ్ కో-పైలట్, జూనియర్ చీఫ్ కో-పైలట్, సీనియర్ చీఫ్ కో-పైలట్ లాంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు కావాలంటే ట్రైనర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ కో-పైలట్లకు రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ జీతం ఇస్తారు. చీఫ్ పైలట్లకు కనీస వేతనం రూ.3 లక్షలు. అయితే, ఇది విమానయాన సంస్థను బట్టి మారుతుంటుంది.
పైలట్లకు శిక్షణ ఇచ్చేవారికి నెలకు రూ.10 లక్షల వరకు వేతనం ఇస్తారు.
మరోవైపు విదేశీ సంస్థల కోసం పనిచేసే కో-పైలట్లకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వేతనం ఇస్తారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















