పీరియడ్స్: శానిటరీ ప్యాడ్ ఎవరిదో తెలుసుకోవడానికి మహిళా సిబ్బందిని దుస్తులు విప్పించి చెక్ చేసిన మేనేజర్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎస్తర్ అకెలో ఒగోలా, మటియా బుబాలో
- హోదా, బీబీసీ న్యూస్
ఉద్యోగినుల్లో ఎవరు పీరియడ్స్‌లో ఉన్నారో తెలుసుకోవడం కోసం వారితో బలవంతంగా దుస్తులను విప్పించిన ఘటన ఓ చీజ్ ఫ్యాక్టరీలో జరిగింది.
కెన్యాకు చెందిన ‘బ్రౌన్ ఫుడ్ కంపెనీ’ అనే చీజ్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వాడేసిన శానిటరీ ప్యాడ్‌ను డస్ట్‌బిన్‌లో ఎవరు వేశారో తెలుసుకునేందుకు బ్రౌన్స్ ఫుడ్ కంపెనీలోని ఒక మహిళా మేనేజర్ ఇలాంటి పనికి పాల్పడ్డారు.
అక్కడి మహిళా సిబ్బందిని ఆమె ఒక ప్రదేశంలో సమావేశపరిచి వారితో బలవంతంగా దుస్తులు విప్పించి చెక్ చేసినట్లు అక్కడి ఓ అధికారి చెప్పారు.
డస్ట్ బిన్‌లో ఎవరు చేశారో చెప్పాలంటూ చేసిన ఆమె చేసిన అనేక ప్రయత్నాలు విఫలం కావడంతో సిబ్బందిని దుస్తులు విప్పేలా చేశారు.
సదరు మేనేజర్‌ను సస్పెండ్ చేసినట్లు బ్రౌన్స్ కంపెనీ చెప్పింది. దీనిపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై ‘అసభ్యకర దాడి’ అభియోగాలు మోపినట్లు స్థానిక మీడియాకు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, GLORIA ORWOBA
ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక వీడియోలో కెన్యా సెనెటర్ గ్లోరియా ఒర్వోబా ఈ ఘటన గురించి మాట్లాడారు.
సోమవారం రాత్రి జరిగిన దాని గురించి తనకో ఫోన్ వచ్చిందని ఆమె ఆ వీడియోలో తెలిపారు.
‘‘నాకు అందిన సమాచారం ప్రకారం, డస్ట్ బిన్లలో ఒక దానిలో వాడేసిన శానిటరీ ప్యాడ్‌ను ఒక మేనేజర్ చూశారు. ఆ డస్ట్ బిన్ శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించినది కాదు.
ఆ శానిటరీ ప్యాడ్‌ను ఎవరు వేశారో అడిగేందుకు మొదట మహిళలు అందర్నీ ఆమె పిలిపించారు. కానీ, ఆమెకు సరైన సమాధానం దొరకలేదు. దీంతో ఎవరికి పీరియడ్స్ వచ్చాయో తెలుసుకొని, తద్వారా ఆ బిన్‌లో ప్యాడ్‌ను పడేసిన మహిళను శిక్షించాలని ఆమె అనుకున్నారు’’ అని పీరియడ్ షేమింగ్‌పై పోరాడే గ్లోరియా ఒర్వోబా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇది విచారించదగిన ఘటన. కానీ, కంపెనీ విధానాలకు ఇది విరుద్ధం’’ అని బ్రౌన్స్ ఫుడ్ కంపెనీ తన వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది.
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడానికంటే ముందే బాధితుల వాంగ్మూలాలను రికార్డు చేయడంతో పాటు సమగ్ర విచారణ జరిపినట్లు స్థానిక మీడియాతో పోలీసులు చెప్పారు.
ఆ ప్రాంతంలోని ఇతర కంపెనీల్లో కూడా ఈ తరహా ఘటనలు గతంలో జరిగినట్లు వారు చెప్పారు.
‘‘ ఇలాంటి అవమానకర, కించపరిచే ఘటనలు చాలా కాలంగా ఉనికిలో ఉన్నట్లు మా దృష్టిలోకి వచ్చింది. బాధితులందరికీ త్వరలో న్యాయం జరుగుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే యాజమాన్యాలను హెచ్చరిస్తున్నాం’’ అని స్థానిక పోలీస్ చీఫ్ ఫిలిప్ వానియా తెలిపారు.
కెన్యాలో పీరియడ్ షేమింగ్ అనేది ఒక ప్రధాన సమస్య అని కార్యకర్తలు అంటున్నారు.
సెనెటర్ గ్లోరియా ప్యాంట్‌కు రక్తపు మరకలు ఉండటంతో పార్లమెంట్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆమెను ఆదేశించారు. ఫిబ్రవరి నెలలో ఇది జరిగింది.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














