కారు ఆపనందుకు ఫ్రాన్స్ పోలీసులు కాల్చిచంపిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుండేవాడు?

ఫొటో సోర్స్, Supplied
- రచయిత, పాల్ కిర్బీ
- హోదా, బీబీసీ న్యూస్
17 ఏళ్ల నహెల్ ఎంను ఫ్రాన్స్ పోలీసులు కాల్చి చంపడంతో అతడు పెరిగిన పశ్చిమ పారిస్‌లోని నాంటెరెతోపాటు ఫ్రాన్స్‌లోని చాలా నగరాల్లో అల్లర్లు జరుగుతున్నాయి.
తల్లి దగ్గర పెరిగిన నహెల్ డెలివరీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. రగ్బీ లీగ్‌లోనూ ఆడేవాడు.
నహెల్ చదువు సరిగ్గా సాగలేదు. తన ఇంటికి సమీపంలోని సరెసెన్స్‌లో ఒక కాలేజీలో అతడు చేరాడు. ఎలక్ట్రిషియన్‌గా పనిచేసేందుకు అక్కడ శిక్షణ తీసుకున్నాడు.
అల్జీరియా సంతతికి చెందిన నహెల్‌తో పరిచయమున్న కొందరు బీబీసీతో మాట్లాడారు.
‘‘నాంటెరెలో తల్లి మోనియాతోపాటు అతడు ఉండేవాడు. అందరూ వారిని ప్రేమించేవారు. అతడికి తన తండ్రి ఎవరో తెలియదు’’ అని చెప్పారు.
కాలేజీలో అతడి హాజరు చాలా తక్కువగా ఉంది. నహెల్ ఇదివరకు కూడా పోలీసులకు తెలుసు. అయితే, అతడికి ఎలాంటి నేర చరిత్రా లేదని అతడి కుటుంబ న్యాయవాదులు చెబుతున్నారు.
తన తల్లి ఉద్యోగానికి వెళ్లేముందు ‘ఐ లవ్ యూ, మామ్’ అని చివరగా అతడు చెప్పాడు.
తర్వాత కొద్దిసేపటికే స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఆగకుండా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినందుకు అతడి ఛాతీపై పోలీసులు కాల్పులు జరిపారు. 17 ఏళ్లకు ఫ్రాన్స్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు.

ఫొటో సోర్స్, Assa.traore_
‘‘ఇప్పుడు నేను ఏం చేయాలి’’ అని నహెల్ మృతితో కన్నీరుమున్నీరవుతున్న అతడి తల్లి ప్రశ్నించారు. ‘‘నా ఆశలన్నీ అతడిపైనే పెట్టుకున్నాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. నాకేమీ పది మంది పిల్లలు లేరు. అతడే నా జీవితం, నా ఆప్త మిత్రుడు’’ అని ఆమె చెప్పారు.
నహెల్ అమ్మమ్మ మాట్లాడుతూ.. ‘‘మా బాబు చాలా మంచివాడు’’ అన్నారు.
‘‘కారు ఆపడానికి నిరాకరిస్తే, ఏకంగా కాల్చి చంపేస్తారా’’ అని సోషలిస్టు పార్టీ నాయకుడు ఒలివియెర్ ఫారే అన్నారు. ‘‘ఈ దేశంలో పిల్లలందరికీ సమాన హక్కులు ఉంటాయి’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నహెల్ గత మూడేళ్లుగా పైరేట్స్ ఆఫ్ నాంటెరె రగ్బీ క్లబ్ కోసం ఆడుతున్నాడు. స్కూలులో ‘ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీనేజర్స్ స్ట్రగ్లింగ్’ పేరుతో ఓవల్ సిటోయెన్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలోనూ అతడు సభ్యుడు.
వెనుకబడిన నేపథ్యమున్న పిల్లలకు ప్రత్యేక అప్రింటీస్‌షిప్‌లను ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే అతడు ఎలక్ట్రిషియన్‌గా శిక్షణ తీసుకున్నాడు.
నహెల్‌తో మంచి పరిచయమున్న వారిలో ఓవల్ సిటోయెన్ ప్రెసిడెంట్ జెఫ్ ప్యూచ్ ఒకరు. కొన్ని రోజుల క్రితమే నహెల్‌ను ఆయన చూశారు. ‘‘తను రగ్బీ చాలా బాగా ఆడేవాడు’’అని ఆయన చెప్పారు.
‘‘సామాజికంగా, వృత్తిపరంగా మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి తను. డ్రగ్స్ తీసుకుని, నేరాలకు పాల్పడే వ్యక్తికాదు తను’’ అని ఆయన మీడియాతో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నహెల్ వ్యక్తిత్వంపైనా ప్యూచ్ ప్రసంశలు కురిపించారు. సోషల్ మీడియాలో అతడి వ్యక్తిత్వంపై వస్తున్న ప్రశ్నలను ఆయన ఖండించారు.
‘‘నాంటెరెలోని వీక్స్-పాంట్‌లో తల్లితో కలిసి ఉంటున్నప్పటి నుంచీ అతడు మాకు తెలుసు. ఆ తర్వాత వారు పాబ్లో పికాసో ఎస్టేట్‌కు వచ్చారు’’ అని ఆయన తెలిపారు.
నహెల్ మరణం అనంతరం అంబులెన్స్‌లో పనిచేసే ‘మారోనే’ అనే వ్యక్తి ఓ పోలీసు అధికారిపై మీడియా ఎదుట ఆరోపణలు చేశారు. ‘‘తను నాకు తమ్ముడు లాంటివాడు. తను నా ముందే పెరిగాడు. తను ఎప్పుడూ ఎవరికీ ఎదురు చెప్పేవాడు కాదు. ఎప్పుడూ హింసకూ పాల్పడలేదు’’ అని రిపోర్టర్లతో అతడు చెప్పాడు.
నహెల్‌ను కాల్చి చంపిన వ్యక్తి ‘‘ఒక అరబ్ పిల్లాడి మొహాన్ని చూసి, కావాలనే హత్య చేయాలని భావించాడు’’ అని అతడి తల్లి ఆరోపించారు. ఫ్రాన్స్ 5 టీవీతో ఆమె మాట్లాడారు.
‘‘కాల్చి చంపిన ఆ అధికారి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మొత్తం పోలీసుల గురించి కాదు. నాకు కొంత మంది పోలీసు అధికారులు తెలుసు. వారు నాతో చాలా మంచిగా ఉంటారు’’ అని ఆమె చెప్పారు.
‘‘మే అల్లా గ్రాంట్ హిమ్ మెర్సీ’’ అని రాసివున్న బ్యానర్లు పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియం బయట ప్యారిస్ రింగ్ రోడ్డుపై కనిపించాయి.

ఫొటో సోర్స్, Reuters
‘‘పోలీసుల హింస రోజూ కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మీరు అరబ్ లేదా నల్లజాతీయులైతే మరీ ఎక్కువగా ఉంటుంది.’’ అని ఒక యువకుడు బీబీసీతో చెప్పారు. నహెల్‌కు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, నహెల్ కుటుంబ న్యాయవాది యాసిన్ బౌజ్రో మాట్లాడుతూ.. ‘‘ఇది జాత్యాహంకారం గురించి కాదు.. న్యాయం కోసం’’ అన్నారు.
‘‘ఇక్కడ చట్టాలు, న్యాయ వ్యవస్థ పోలీసులకు రక్షణగా నిలుస్తాయి. ఫలితంగా ఇక్కడి అధికారులు ఎలాంటి శిక్షలూ పడకుండా తప్పించుకుంటారు’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.
2021 నుంచి ఐదుసార్లు నహెల్ పోలీస్ చెక్‌పోస్టుల్లో ఆగకుండా వేగంగా దాటివెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి.
తాజాగా పోలీసులు ఆగాలని సూచించినప్పుడు అతడు పోలండ్ నంబరు ప్లేటువున్న మెర్సిడిజ్ నడుపుతున్నాడు. అతడికి లైసెన్స్ లేదు. కారులో మరో ఇద్దరు కూడా ఉన్నారు.
గత వారంతంలోనూ ఇలానే ఆగకుండా వెళ్లినందుకు అతడిని నిర్బంధంలోకి తీసుకున్నారని, ఈ కేసుకు సంబంధించి ఒక జువెనైల్ కోర్టులో సెప్టెంబరులో అతడు హాజరు కావాల్సి ఉందని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.
పోలీసుల రికార్డుల్లో అతడి పేరు ‘తాజ్’గా పేర్కొన్నారు. అధికారుల దర్యాప్తుల సమయంలో ఇదే పేరుతో అతడిని పిలుస్తున్నారు.
గత డిసెంబరులో ఒక కేసులో నహెల్‌కు ఒక న్యాయమూర్తి క్రమశిక్షణ చర్యలను సూచించారు. అతడు ఎదుర్కొన్న సమస్యల్లో చాలావరకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇన్సురెన్స్ లేకుండా కార్లు నడపడం, తప్పుడు నంబరు ప్లేట్లతో వెళ్లడం లాంటి కేసులే ఉన్నాయి.
అయితే, ఈ కేసులో ఎప్పుడూ నహెల్ దోషిగా నిరూపితం కాలేదని కుటుంబ న్యాయవాది జెన్నిఫర్ కాంబ్లా చెప్పారు. అతడికి ఎలాంటి నేర చరిత్రా లేదని వివరించారు. ‘‘పోలీసులకు తెలిసినంత మాత్రాన రికార్డుల్లో పేరున్న నేరస్థుడిలా చూడకూడదు. ఎందుకంటే పోలీసుల ఫైల్‌లోని నేరాలకు సంబంధించి అతడిపై ఎప్పుడూ విచారణ జరగలేదు’’ అని ఫ్రెంచ్ టీవీతో ఆమె తెలిపారు.
‘‘నహెల్ ఉంటున్న ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకోవడం, నిర్బంధంలోకి తీసుకోవడం సర్వసాధారణం’’అని కాంబ్లా చెప్పారు.
అతడి మరణం తర్వాత చెలరేగిన అల్లర్లు చాలా మందికి 2005నాటి టీనేజర్ల మృతులను గుర్తుకుతెస్తున్నాయి. నాడు పారిస్‌లో ఫుట్‌బాల్ గేమ్ అనంతరం పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇద్దరు టీనేజర్లు విద్యుదాఘాతానికి గురై మరణించారు.
ప్రస్తుత కేసుపై మొహమ్మద్ అనే టీనేజర్ మాట్లాడుతూ.. ‘‘నాపై లేదా మా తమ్ముడిపై వారు ఇలానే కాల్పులు జరపొచ్చు’’ అని ఫ్రెంచ్ వెబ్‌సైట్ మీడియాపార్ట్‌తో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















