ఓటొమన్: ఉంపుడుగత్తెలు, బానిసలు... ఈ రాజ్య వారసత్వ రక్త చరిత్రలో వీరిదే కీలక పాత్ర

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ కథనం చదివిన తర్వాత ఓటొమన్ అంత:పురం గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోవచ్చు. ఎందుకంటే ఆ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన మహిళలు కొందరు ఉన్నారు.

''సుమారు 600 ఏళ్లకు పైగా సాగిన ఓటొమన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు అందరు సుల్తాన్‌ల తల్లులు బానిసలే'' అని యేల్ యూనివర్సిటీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్ ఎలన్ మిఖైల్ బీబీసీ ముండోతో చెప్పారు.

గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన ఓటొమన్ పాలనా వ్యవహారాల్లో మహిళల ప్రభావం ఉండేది. వారిలో చాలా మందిని అంత:పురం దాటనిచ్చేవారు కాదు.

''వారిని శృంగార సాధనాలుగా, లేదంటే కేవలం సుల్తాన్‌లకు పిల్లలను కనిచ్చే యంత్రాలుగా మాత్రమే చూసేవారు'' అని ఓటొమన్ ఉమెన్ ఇన్ పబ్లిక్ స్పేస్ పుస్తకంలో ఎబ్రు బోయర్ రాశారు.

''అయితే, కొన్ని కీలక సమయాల్లో రాజకీయ వ్యవహారాలను మలుపులు తిప్పడంలో వారు బలమైన పాత్ర పోషించారు.''

బానిసలతో సుల్తాన్‌ల సంతానం

ఓటొమన్ సామ్రాజ్యపు కొందరు యువరాజులు, సుల్తానుల వివాహాల్లో ప్రేమ ఉన్నప్పటికీ, కొందరితో సాంగత్యం కేవలం రాజకీయ, వ్యూహాత్మక కారణాలతోనే జరిగేది.

''ఉదాహరణకు, పొరుగు రాజ్యంతో పొత్తు పెట్టుకునేందుకు అవతలి రాజ్యపు రాజుల కూతుళ్లను భార్యలుగా చేసుకునేవారు.'' అని తుర్కియేలోని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మిడిల్ ఈస్ట్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ ప్రొఫెసర్ బోయర్ బీబీసీ‌తో ప్రత్యేకంగా చెప్పారు.

అలా, ఒక ప్రత్యేకమైన ధోరణి ఏర్పడింది.

రాజ్యాలతో ఎలాంటి సంబంధాలు లేని స్త్రీలతో తమ వారసులను కనేందుకు సుల్తాన్‌లు ప్రాధాన్యం ఇచ్చేవారు.

''రాజ్యానికి కాబోయే యువరాజులు, భవిష్యత్తు సుల్తానులను భార్యలతో కాకుండా ఉంపుడుగత్తెలతో కనేందుకు సుల్తానులు ఇష్టపడేవారు'' అని మిఖైల్ చెప్పారు.

వాళ్లు సంతానం పొందాలని అనుకుంటే, బానిసలు ఉండే అంత:పురంలోని ఒక స్త్రీని ఎంపిక చేసుకునేవారు. వారిలో ఇతర రాజ్యాలకు చెందిన రాజుల కూతుళ్లు ఉంటే వారిని పక్కనబెట్టేవారని బోయర్ చెప్పారు.

దానికి తోడు, వివాహ బంధంలో ఉన్న స్త్రీతో బిడ్డ పుట్టినా, లేదా అలాంటి సంబంధం లేని మహిళతో బిడ్డ పుట్టినా ఇస్లామిక్ చట్టం ప్రకారం చట్టబద్ధమే. అయితే కొన్ని చిక్కులు ఉంటాయి.

''ఒక బిడ్డ భార్యకు, మరో బిడ్డ ఉంపుడుగత్తెకు పుట్టిన సందర్భంలో , సింహాసనం అధిష్టించేందుకు ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి''.

''తమతో బిడ్డను కన్న ఉంపుడుగత్తెలను వివాహం చేసుకోవాలనే ఆలోచన సుల్తానులకు ఉండేది కాదు.''

చట్టప్రకారం సుల్తానులు నలుగురు భార్యలు, మరికొందరు ఉంపుడుగత్తెలను పెట్టుకునే వీలుంది.

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

బానిసలుగా అంత:పురానికి..

ఓటొమన్ రాజ్యం ఆక్రమణల ద్వారా, లేదా ఇతర పద్ధతుల్లో అనేక మంది స్త్రీలను బలవంతంగా రాజధానికి తరలించారు.

సామ్రాజ్య మనుగడలో ఉన్న కాలంలో, అంత:పురంలో ఉన్న స్త్రీలలో ఎక్కువ మంది దక్షిణ, తూర్పు యూరప్ నుంచి వచ్చిన వారేనని మిఖైల్ వివరించారు.

ఇప్పటి రొమేనియా, యుక్రెయిన్, దక్షిణ రష్యా, నల్ల సముద్రం, కాస్కాసస్ పర్వత శ్రేణుల ప్రాంతాలకు చెందిన స్త్రీలు వారిలో ఉండేవారు.

''ఒక్కసారి అంత:పురంలో అడుగుపెడితే, ఇక వారు సుల్తాన్ ఆస్తులుగా మారినట్టే. వారితో లైంగిక సంబంధం పెట్టుకునే హక్కు సుల్తాన్‌కు ఉంటుంది.''

ఒకవేళ ఉంపుడుగత్తెకు సుల్తాన్ ద్వారా బిడ్డ పుడితే ఆమె శక్తిమంతంగా మారేది. ''అది కూడా మగబిడ్డ అయితేనే'' అని బోయర్ చెప్పారు.

చాలా మంది ఆరోగ్య సమస్యలతో చిన్న వయస్సులోనే చనిపోతుండడంతో ఎక్కువ మంది వారసులను కనేవారు.

ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లలను యుద్ధానికి పంపేవారు. అక్కడ కూడా వారు చనిపోయే అవకాశం ఉండేది" అని మిఖైల్ అన్నారు.

''ఓటొమన్ రాజ్య వారసత్వం వంశపారంపర్యంగా వస్తుంది. మగపిల్లలు లేకపోతే రాజవంశం ముగిసిపోతుంది.''

''అందువల్ల ఎక్కువ మంది పిల్లలు ఉండడం చాలా అవసరం. వారిలో ఒకరికి ఏదైనా జరిగితే మరొకరు ఉండేవారు.''

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

బానిస స్త్రీ నుంచి రాజమాత వరకు..

బిడ్డ పుట్టిన తర్వాత తల్లి, కొడుకులు అంత:పురంలోనే నివసించేవారు. వారిద్దరూ ఒక జట్టుగా మారేవారు అని ప్రొఫెసర్ చెప్పారు.

సుల్తాన్ తర్వాత ఆ స్థానం కోసం పోటీ ఏర్పడితే తల్లి కీలకంగా మారేది. తన బిడ్డను సింహాసనంపై కూర్చోబెట్టడంలో తల్లి ప్రధాన పాత్ర పోషించేది.

''ఏ కొడుకంటే తండ్రికి ఎక్కువ ఇష్టం? ఎవరు బాగా చదువుకున్నారు? పెద్దవాడయ్యే క్రమంలో రాజ్యంలో ఏ కొడుకు కీలక పదవి పొందారు?''....ఇలాంటి ఒక పోటీ నెలకొని ఉంటుంది. అది కేవలం వారసుల మధ్య మాత్రమే కాదు, వారి తల్లుల మధ్య కూడా ఉండేది.

ఎదుగుతున్న క్రమంలో, సుమారు పది నుంచి పదిహేనేళ్ల వయస్సులో తండ్రి తర్వాత ఆ స్థానం పొందేందుకు వారసులు అర్హతను నిరూపించుకోవాల్సి వచ్చేది. అలా అర్హత నిరూపించుకున్న వారికి రాజ్యంలో ఒక పట్టణానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించేవారు.

అప్పుడు వాళ్లు తమ తల్లులు, కొందరు గురువులు, సలహాదారులతో కూడిన చిన్న పరివారంతో బయలుదేరేవారని మిఖైల్ వివరించారు.

సుమారు 11, 12, 13 ఏళ్ల పిల్లాడిని ఒక నగరానికి గవర్నర్‌ను చేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఆ బాధ్యతలు తీసుకునేందుకు అంత సిద్ధంగా ఉండరు. అలాంటి సమయాల్లో ఆ నగరాల బాధ్యతల్లో వారి తల్లులు ప్రధానపాత్ర పోషించేవారు.

అధికారికంగా యువరాజే గవర్నర్ అయినప్పటికీ వాస్తవాలు వేరు. ధ్రువపత్రాలు, న్యాయ సంబంధిత రికార్డులు, లేఖల ఆధారంగా ఈ విషయాలను చరిత్రకారులు గుర్తించారు. ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో తల్లి కీలకపాత్ర పోషించేది.

అయితే, రాజధానిని అప్పగించడం అన్నింటికంటే అతిపెద్ద బహుమతి.

''కొడుకు సుల్తాన్ అయితే తల్లి స్థానం కూడా మారుతుంది. ఆమె రాజమాత అవుతుంది. తద్వారా రాజవంశంలో ఉన్నతమైన వ్యక్తి అవుతారు.''

''అది చాలా శక్తిమంతమైన స్థానం. ఓటొమన్ చరిత్రలో సుల్తాన్‌ల తల్లులు రాజభవనంలో విశేష అధికారాన్ని చెలాయించారు.'' అని చరిత్రకారుడు వివరించారు.

''600 ఏళ్లకు పైబడిన ఓటొమన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు సుల్తానుల తల్లులందరూ అంత:పురం బానిసలే. వారి మూలాలు ఓటొమన్ సామ్రాజ్యానికి చెందినవి కావు. క్రిస్టియన్‌గా పుట్టి, అంత:పురంలో అడుగుపెట్టిన తర్వాత ఇస్లాంకు మారిన వారే ఎక్కువ.''

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

సుల్తాన్‌కు దగ్గరయ్యాక..

ఇస్తాంబుల్‌లోని పర్యటక ప్రదేశాల్లో తొప్కాపి ప్యాలెస్ ఒకటి. ఇది 1478 నుంచి 1856 మధ్య ఓటొమన్ సామ్రాజ్యపు అధికారిక కేంద్రంగా, ఓటొమన్ అత్యున్నత న్యాయస్థానంగా ఉండేది.

''రాజభవనంలోకి ప్రవేశించిన తర్వాత, ఓటొమన్ సామ్రాజ్యపు అధికారిక భవనాలకు కుడివైపున ఉన్న అంత:పురాన్ని చూడొచ్చు.'' అని చరిత్రకారుడు చెప్పారు.

ఈ మహిళలు సుల్తాన్‌, ఆయన సలహాదారులు, పాలనలో కీలక స్థానాల్లో ఉన్న వారితో సన్నిహితంగా ఉంటూ అధికార కేంద్రంగా ఉండేవాళ్లు. అంటే ఇప్పుడు ప్రధాన మంత్రితో సమానం. పాలనా వ్యవహారాల్లో వారి జోక్యం ఉండేదనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

ఎవరు శక్తిమంతులైతే వారికే స్థానం అన్నట్లు ఈ వ్యవహారాలు ఉండేవని మిఖైల్ అభిప్రాయపడ్డారు.

''ఏ తల్లి అయితే అన్ని విషయాలను త్వరగా నేర్చుకుని, తన కొడుక్కి నేర్పిస్తుందో, అలాంటి వారే అధికారానికి దగ్గరయ్యేవారు''

అలా అంత:పురం క్రమంగా భవిష్యత్తులో సుల్తానులు కాబోయే వారికి శిక్షణ ప్రదేశంగా మారిపోయిందని సుల్తాన్ సలీమ్ - 1 జీవిత చరిత్ర గాడ్స్ షో పుస్తకంలో పరిశోధకుడు వివరించారు. 1470 - 1520 మధ్య కాలంలో సుల్తాన్ సలీమ్ - 1 పాలన సాగించారు.

''అంత:పురం కలలు, ఊహల ప్రపంచంలా ఉండేది. ఒక సామాన్యుడు ఊహించిన దానికంటే సంపన్నంగా, మెరుగైన సదుపాయాలున్నదిగా అనిపించేది. కానీ నిజానికది ముస్లిం మహిళలు నివసించే ప్రాంతంగా కంటే ఒక పాఠశాలలాగే నడిచేది'' అని ప్రొఫెసర్ రాశారు.

సుల్తాన్ బయెజిద్ - II తర్వాత ఆ స్థానానికి పోటీ పడిన వారసులందరూ ఉంపుడుగత్తెలకు పుట్టినవారేనని, వారంతా అంత:పురంలో భాషలు, తత్వశాస్త్రం, మతపరమైన వ్యవహారాలు, సైనిక కళల్లో ఒకే విధమైన విద్యను అభ్యసించారని ఆయన చెప్పారు.

సలీమ్ I బలమైన శక్తిగా ఎదిగాడు. ఆయన కాలంలోనే ఓటొమన్ సామ్రాజ్యం భారీగా విస్తరించింది.

ఒట్టోమన్

ఫొటో సోర్స్, Getty Images

పట్టం కోసం పోరాటం

వారసత్వం కోసం జరిగే ప్రయత్నంలో సగం మంది సోదరులు ప్రత్యర్థులుగా, మరికొంత మంది శత్రువులుగా మారేవారు.

''వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వారు తండ్రితో తమ ఆలోచనలు పంచుకున్నా, మిగిలిన వారికి ఎప్పటికీ ప్రత్యర్థులుగానే ఉండిపోతారు''. అని ప్రొఫెసర్ బీబీసీకి చెప్పారు.

''అంత:పురంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సైతం, సింహాసనం కోసం తాము కూడా పోటీదారులమే అన్నట్లుగా అక్కడ శిక్షణ ఉండేది.''

కొన్నేళ్ల తర్వాత యుక్తవయస్సు వచ్చేప్పటికి వారిని వేర్వేరు నగరాలకు పంపించడంతో వారి మధ్య సన్నిహిత సంబంధాలు పెంపొందేందుకు అవకాశం ఉండేది కాదు.

''ఒక కొడుకు సింహాసనం దక్కించుకుంటే తన స్థానం పదిలం చేసుకోవడం కోసం ప్రత్యర్థులను హతమార్చేవారు. అందులో సగం అతని సవతి సోదరులే ఉండేవారు. ప్రత్యర్థులను చంపేయడం సర్వసాధారణంగా ఉండేది.''

సలీమ్ I సింహాసనం అధిష్టించిన వెంటనే తన ఇద్దరు సవతి సోదరులను హతమార్చడమే అందుకు ఉదాహరణ.

''ఓటొమన్ రక్తచరిత్రలో యువరాజులు ఒకరితో మరొకరు విభేదించేవారు. అందుకోసం వారికి పరివారం అవసరం. మొదట వారికి రక్షణ కల్పించాలి. ఆ తర్వాత సింహాసనం ఎక్కేందుకు సహాయపడాలి. ఇలాంటి వాటిలో వారి తల్లులే ప్రధాన వ్యూహకర్తలుగా ఉండేవారు. అందుకు తల్లికి తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. కొడుకు విజయం సాధిస్తే ఆమె కూడా సాధించినట్టే'' అని యేల్ యూనివర్సిటీలో ఒక ఇంటర్వ్యూలో మిఖైల్ చెప్పారు.

సాధారణంగా సింహాసనాన్ని పెద్దకొడుకు వారసత్వంగా పొందినప్పటికీ, ఒస్మాన్‌‌కి పుట్టిన మగబిడ్డ ఎవరైనా వారసుడు అయ్యేందుకు అర్హత ఉంటుంది. అందువల్ల సుల్తాన్‌‌ వారసత్వం పొందే విషయంలో రక్తపాతం జరిగింది.

(ఒస్మాన్: ఓటొమన్ సామ్రాజ్యపు మొదటి సుల్తాన్. వారసత్వం పొందిన వారికి వంశపారంపర్యంగా ఆ పేరు సంక్రమిస్తుంది.)

ఏ యువరాజు తల్లి కూడా తన కొడుకు చనిపోవాలని కోరుకోదు. అలాగే సుల్తాన్‌ వల్ల వచ్చే ప్రతిష్ట, అదృష్టాన్ని కోల్పోవాలని అనుకోదు.

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

రొక్సెలెనా ప్రేమలో సుల్తాన్

సుల్తాన్‌‌కి ఇష్టమైన ఉంపుడుగత్తెలే పాలనా వ్యవహారాల్లోనూ కీలకంగా తయారవుతారని ప్రొఫెసర్ బోయర్ చెప్పారు.

''సుల్తాన్ మనసులో స్థానం సంపాదించడం ద్వారా వారు అధికారం కూడా చేజిక్కించుకుంటారు''

అందుకు యుక్రెయిన్‌కి చెందిన రొక్సెలెనా ఒక ఉదాహరణ. చక్రవర్తి సులేమాన్ ప్రేమ పొందిన రొక్సెలెనా, ఓటొమన్ సామ్రాజ్య అధినేత్రిగా చరిత్రకెక్కింది.

కిడ్నాప్‌కి గురైన ఆమెను ఇస్తాంబుల్‌లో బానిసగా అమ్మేశారు. అలా ఆమె సులేమాన్ అంత:పురానికి చేరింది.

సులేమాన్‌కి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారిన ఆమె, ఆ తర్వాత ఆయన భార్యగా మారింది. ఆయన పిల్లలకు తల్లి అయింది.

1520 నుంచి 1566 వరకూ పాలించిన సులేమాన్‌కి, అప్పటికే మరో మహిళ ద్వారా పుట్టిన కొడుకు ఉన్నాడు. అతని పేరు ముస్తఫా. సులేమాన్ తర్వాత సింహాసనం అధిష్టించేందుకు బలమైన వారసుడిగా ఎదిగాడు.

''అయితే, ఒక తల్లిగా రొలెక్సెనాకి పోటీపడే మనస్తత్వం బలంగా ఉండేది.'' అని పరిశోధకులు చెప్పారు.

సుల్తాన్‌ను పదవి నుంచి కూలదోసేందుకు ముస్తఫా కుట్ర పన్నాడని ఆమె సులేమాన్‌ని నమ్మించింది. దీంతో రాజద్రోహం కింద అతన్ని సుల్తాన్ చంపేశాడు.

ఆ తర్వాత రొక్సెలెనా కుమారుల్లో ఒకరైన సలీమ్ II సింహాసనాన్ని అధిష్టించాడు.

ఓటొమన్

ఫొటో సోర్స్, Getty Images

బానిసత్వం

''16వ శతాబ్దం మధ్య నుంచి 17వ శతాబ్దం మధ్య కాలంలో బానిసలుగా వచ్చి శక్తిమంతంగా మారిన స్త్రీల ఆధిపత్యం రాజభవనంలో కనిపించేది.'' అని బోయర్ చెప్పారు.

''కానీ ఇది పాశ్యాత్య దేశాల్లో మనకు కనిపించిన బానిసత్వం లాంటిది కాదని మనం గుర్తుంచుకోవాలి.'' అని ఆయన అన్నారు.

''అంత:పురంలో ఉండే స్త్రీలకు స్వేచ్ఛ లేనప్పటికీ, కొందరు అధికారాన్ని, సంపదను చేజిక్కించుకోగలిగారు.''

''మనం బానిస అనే పదం వింటే, ఆఫ్రికా నుంచి అమెరికాకి అమ్మేసిన బానిస వ్యాపారం గుర్తొస్తుంది'' అని మిఖైల్ అన్నారు.

''ఓటొమన్ సామ్రాజ్యంలో కూడా బానిసత్వం అలాగే ఉండేది. కానీ వ్యత్యాసం ఉంది.''

''అమెరికాలో ఉన్న వంశపారంపర్య బానిసత్వం కోణంలో చూస్తే ఇది భిన్నంగా ఉంటుంది. మీ జీవితం ఎప్పటికీ అలాగే ఉండాలని లేదు''

''ఓటొమన్ సామ్రాజ్యంతో పాటు, ఇతర ముస్లిం సామ్రాజ్యాల్లో ఎవరైనా బానిసత్వం నుంచి బయటపడే అవకాశం ఉంది.''

అంత:పురంలో ఉండే మహిళలకు స్వేచ్ఛ లేనప్పటికీ, ''వారికి వేరే మార్గం లేదు. సుల్తాన్‌ లైంగిక అవసరాలకు అందుబాటులో ఉండాలి''.

కానీ, వారి పిల్లలు పుట్టుకతోనే స్వేచ్ఛను పొందుతారు. దాని తర్వాత వారి పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది.

సలీం I తల్లి గుల్బహర్ హతున్ తండ్రి ఓటొమన్ సైన్యంలో చేరేందుకు తన మతం మార్చుకున్నాడని, తన కూతురిని సుల్తాన్‌కు ఉంపుడుగత్తెగా పంపించడం ద్వారా సంఘంలో గౌరవం పెంచుకోవాలని భావించాడని మిఖైల్ తన పుస్తకంలో గుర్తు చేశారు.

గుల్బహర్ హతున్‌కి తన సొంత ఊళ్లో కంటే రాజభవనంలో మరింత విలాసవంతమైన జీవితం గడపొచ్చని తెలియడమే కాదు, సుల్తాన్‌కి తల్లి కావొచ్చని, ఆ తర్వాత ఓటొమన్ సామ్రాజ్యంలో శక్తివంతమైన మహిళ అవ్వొచ్చని, తద్వారా ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్లో ఒకరు కావొచ్చని ఆమెకు ముందే తెలుసు.

అది అలాగే జరిగింది కూడా. ఓటొమన్ రాజమాతగా ఆమె ప్రభుత్వంపై తనదైన ముద్ర వేశారు.

ఇవి కూడా చదవండి: