‘నా కోరిక తీర్చకపోతే నీ భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు’ - చిత్తూరు పోలీసులపై తమిళనాడు మహిళల తీవ్ర ఆరోపణ.. దర్యాప్తు జరుపుతున్నామన్న ఎస్పీ

Victims
    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జూన్ 11.. ఆ రాత్రి సుధకు (పేరు మార్చాం) అసాధారణంగా గడిచింది.

ఆ రాత్రి తన ఇంటికి అకస్మాత్తుగా పోలీసు వాహనాలు రావడం చూసి ఆమె కంగారుపడ్డారు.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పులియాండపట్టి గ్రామంలో నివాసముంటున్న సుధ కురవ తెగకు చెందిన మహిళ.

‘పోలీసులు మమ్మల్ని ఏమీ అడగలేదు. లేవండి, లేవండి అంటూ బెదిరించారు. నా భర్తపై నగల దొంగతనం కేసు ఉంది. కానీ నాతో ఎవరూ ఇలా ప్రవర్తించలేదు. ఏం అడగక ముందే మా కుటుంబసభ్యులను కొట్టి జీపు ఎక్కించారు’’ అని సుధ చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పోలీసులు ఆభరణాల చోరీ కేసుల్లో అయ్యప్పన్‌ను విచారణకు తీసుకెళ్లారు.

ఆయన కుటుంబంలోని ఐదుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులను విచారించారు.

విచారణలో తమపై తీవ్ర శారీరక, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అయ్యప్పన్ కుటుంబానికి చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు.

విచారణకు హాజరైన మహిళలతో బీబీసీ తమిళ్‌ మాట్లాడింది.

వాళ్లు కృష్ణగిరి ఊతంగరైలోని అటవీ ప్రాంతంలో ఉంటున్నారు.

మహిళలు

పిల్లలనూ తీసుకెళ్లారు

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పులియండపట్టి గ్రామానికి చెందిన అయ్యప్పన్‌పై కృష్ణగిరి జిల్లాలో మూడు చోరీ కేసులు ఉన్నాయి.

గత జనవరిలో ఏపీలోని చిత్తూరు జిల్లాలో నమోదైన ఆభరణాల చోరీ కేసులో అయ్యప్పన్‌‌ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 11న పులియండపట్టి గ్రామానికి వెళ్లారు.

అయ్యప్పన్‌ని అరెస్టు చేసిన సమయంలో అతనితో పాటు కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లారు.

అయ్యప్పన్ బంధువైన మరో మహిళ జూన్ 12న ఆన్‌లైన్‌లో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు.

ఆ రాత్రి మళ్లీ ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ కోసం తీసుకెళ్లారు.

ఈ రెండు రోజుల్లో అయ్యప్ప కుటుంబాన్ని తీసుకెళ్తున్నారనే సమాచారం ఏపీ పోలీసులు తమకు తెలియజేయలేదని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు బీబీసీ తమిళ్‌తో తెలిపారు.

బాధిత మహిళలు

చెప్పినట్లు వినకపోతే ఉరేస్తామన్నారు: మహిళలు

ఆభరణాల చోరీ కేసులో అయ్యప్పన్ సహా 10 మందిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించిన విషయం బయటికి తెలిసింది.

అయ్యప్పన్, ఆయన కోడలు, మరో 8 మందిని జూన్ 17న విడుదల చేశారు.

విచారణ పేరుతో తమను అత్యంత కిరాతకంగా హింసించారని, లైంగికంగా వేధించారని మహిళలు ఆరోపిస్తున్నారు.

ఐదు, ఏడు సంవత్సరాల వయస్సు గల వారి ఇద్దరు పిల్లలు భయాందోళనకు గురైనట్లు చెప్పారు.

'‘నా కోరిక తీర్చితేనే నీ భర్తను వదులుతా.. లేదంటే ఉరేసి చంపేస్తాం’' అని పోలీసులు బెదిరించినట్లు సుధ ఆరోపించారు.

వాళ్లు నా వెనుక భాగంపై కాలితో తన్నారు. నువ్వు నాకు సహకరిస్తేనే నీ భర్తను ప్రాణాలతో విడిచిపెడతా అని ఓ సీనియర్ పోలీసు అధికారి నాతో అనుచితంగా ప్రవర్తించాడు" అని ఆమె విచారణలో తెలిపారు.

దొంగతనం కేసులో తనను ఎందుకు విచారిస్తున్నారని ఎన్నిసార్లు అడిగినా వేధింపులు ఆపలేదని ఆమె ఆరోపించారు.

జూన్ 11న కూడా పోలీసులు తనను ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పలేదని, ముఖాలకు వస్త్రం చుట్టి తీసుకెళ్లారని సుధ తెలిపారు.

‘‘మా గ్రామంలో ఎవరూ ఇలా సోదాలు చేయలేదు, అరెస్టు చేయలేదు. ఈ పోలీసులు మాత్రమే ఇలా చేశారు. మా ఛాతీ మీద, నడుము మీద చేతులు వేశారు" అని మహిళలు బీబీసీతో చెప్పారు.

బాధిత మహిళలు

జననాంగంలో ఇనుపరాడ్లు చొప్పించి చిత్రహింసలు

విచారణ నిమిత్తం తీసుకెళ్లిన మహిళలను మొదట కృష్ణగిరి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లి, అక్కడి నుంచి మరో రెండు ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు.

ఇలా వేర్వేరు ప్రదేశాల్లో చిత్రహింసలకు గురిచేసి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లారని సెల్వి (పేరు మార్చాం) తెలిపారు.

“మమ్మల్ని బెంగుళూరులో ఉంచారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు తీసుకెళ్లారు’ అని చెప్పారు సెల్వి.

‘ఇనుప రాడ్డుకు మిరపకాయలు రాసి దాన్ని నా జననాంగంలో చొప్పించారు. రించలేకపోయాను” అని సెల్వి తనను హింసించిన తీరును వివరించారు.

ఆ హింస భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నా లేడీ కానిస్టేబుల్ అక్కడే ఉండడంతో సాధ్యం కాలేదని చెప్పారు.

ఈ కేసు గురించి తనకేమీ తెలియదని పదే పదే చెబుతున్నా.. చోరీకి గురైన నగలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను తీవ్రంగా కొట్టారని ఆమె చెప్పారు.

మాతో మాట్లాడిన వేణి (పేరు మార్చాం) ఒకానొక సమయంలో నొప్పిని తట్టుకోలేక పోలీసులు చెప్పిన నేరాలన్నింటినీ అంగీకరించి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశానన్నారు.

“ఆ రోజు రాత్రంతా కొట్టారు. ‘నాలుగు కిలోల నగలు కొనిచ్చి వెళ్లిపో నిన్ను వదిలేస్తాం’ అన్నారు.

బెంగళూరులో ఉంచి, మమ్మల్ని కొట్టి హింసించారు.

దెబ్బలకి భయపడి కొంటాం అన్నాం. అయినా, ఆ ఊరుతో మాకు సంబంధం లేదు. మాకు వ్యవసాయ భూమి ఉంది. మేం వ్యవసాయం చేసుకుని బతుకుతాం.

పనిలేకుండా ఉన్న మమ్మల్ని నగలు కొనివ్వమని చిత్రహింసలు పెట్టారు. అందుకే వాళ్లు చెప్పిన నేరాలన్నీ మేమే చేసినట్లు అంగీకరించాం’’ అన్నారు వేణి.

బాధిత మహిళలు

మేమే వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాం

జూన్ 16న చిత్తూరు జిల్లా పోలీసులు పలు డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారని చెప్పారు.

‘‘కొన్ని తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. మాలో ఎవరికీ చదువు రాదు, మాలో ఒకరికి సంతకం పెట్టడం కూడా తెలియదు. వారు తెలుగులో కొన్ని పేజీలలో మాత్రమే రాశారు. సంతకం ఎందుకని ప్రశ్నించగా వివరణ ఇవ్వలేదు. ‘మీ ఊరికి వెళ్లాలంటే సంతకం పెట్టండి’ అన్నారు. అందుకే సంతకం చేశాం’’ అని మహిళలు చెప్పారు.

జూన్ 17న కృష్ణగిరి జిల్లా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యామని బాధితులు తెలిపారు.

వైద్య నివేదిక ప్రకారం అయ్యప్పన్ కుటుంబంలోని ఆరుగురికి మూడు రోజుల పాటు చికిత్స అందించారు వైద్యులు.

‘‘మాకు సరైన వైద్యం అందించలేదు. అంతా బాగానే ఉందని వారు మాకు చెప్పారు. లైంగిక వేధింపులు జరిగాయని చెప్పిన తర్వాత కూడా మేం బాగానే ఉన్నామని అన్నారు’’ అని సుధ చెబుతోంది.

బీబీసీ తమిళ్‌కి లభించిన వైద్య నివేదికలో బాధితులు లైంగిక వేధింపులకు గురయ్యారా లేదా అని నిర్ధరించడానికి పరీక్షలు నిర్వహించినట్లు ఉంది.

ఆ పరీక్షల ఫలితాలు ఇంకా వెలువడలేదు.

బాధితులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిని వ్యక్తిగతంగా కలిసిన ఆలిండియా డెమోక్రటిక్ మదర్ సంఘ్‌కు చెందిన రాధతో బీబీసీ మాట్లాడింది.

వారికి తగిన చికిత్స అందడం లేదని ఆమె ఆరోపించారు.

‘‘మేం ఆసుపత్రి లోపలికి వెళ్లగానే అందరూ బాగున్నారని డాక్టర్లు చెప్పారు. గర్భాశయం వరకు పరీక్షలు చేశామని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వారిని తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. నడవలేని స్త్రీకి మాత్రమే వసతి కల్పిస్తారా అని నేను అడిగితే, అంత అవసరం లేదన్నారు. అక్కడ మహిళలకు సరైన వైద్యం అందడం లేదు’’ అని రాధ ఆవేదన వ్యక్తంచేశారు.

కలెక్టర్ సరయు

ఫొటో సోర్స్, PRO

ఫొటో క్యాప్షన్, కలెక్టర్ సరయు

విచారణకు ప్రత్యేక కమిటీ: కృష్ణగిరి జిల్లా కలెక్టర్

లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మహిళలకు సరైన వైద్య సహాయం అందించామని, ప్రత్యేక పరీక్షలు చేశామని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు బీబీసీతో చెప్పారు.

వేధింపులు జరిగినట్లు నిర్ధరణ అయితే వారికి నష్టపరిహారం అందేలా చేస్తామన్నారు. మహిళల ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు.

విచారణ కమిటీ సభ్యురాలు, కృష్ణగిరి జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి బాధిత మహిళలను రెండుసార్లు కలిశారు.

ఆరోపణలు చేస్తున్న మహిళలతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇచ్చారని ఆమె చెప్పారు.

అలాగే ‘‘వారి వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ వారికి అవసరమైన సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. లైంగిక వేధింపులు వాస్తవమేనని తేలితే మహిళలకు న్యాయం చేస్తాం'' అని అన్నారు.

పులియండపట్టి గ్రామస్తులు ఏమంటున్నారు?

మేం ప్రత్యక్షంగా పులియండపట్టి గ్రామాన్ని సందర్శించినప్పుడు, అయ్యప్పన్ కుటుంబం గురించి మాట్లాడటానికి గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు.

అయ్యప్పన్ కుటుంబం ఇక్కడ ఎక్కువగా ఉండకపోవటంతో వారితో పెద్దగా పరిచయం లేదని వారంటున్నారు.

మహిళలను అర్ధరాత్రి తీసుకెళ్లడం గురించి అడిగితే “ రాత్రి జరిగింది కాబట్టి మాకు తెలియదు. రెండు రోజుల తర్వాత టీవీలో చూసి తెలుసుకున్నాం. ఇంతకుముందు పోలీసులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండటంతో పెద్దగా పట్టించుకోలేదు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని గ్రామస్తుడు తెలిపారు.

లాయర్ పుగహేంది

'ఇది అక్రమ అరెస్ట్'

ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఏపీ పోలీసులు తమిళనాడు నుంచి ఒక కుటుంబాన్ని విచారణ నిమిత్తం ఎలా తీసుకెళ్లారని మద్రాసు హైకోర్టు న్యాయవాది పుగహేంది ప్రశ్నిస్తున్నారు.

‘‘అయ్యప్పన్‌ను, ఆయన కుటుంబాన్ని విచారణకు తీసుకెళ్లారని అనడం కంటే.. వారిని అక్రమంగా అరెస్టు చేశారనే చెప్పాలి. అనుమానం అంటే సంబంధిత వ్యక్తులకు విచారణ తేదీ, స్థలం ముందుగానే తెలియజేయాలి. పోలీసులు అకస్మాత్తుగా గ్రామానికి వచ్చి వారిని ఈడ్చుకెళ్లడం మానవ హక్కుల ఉల్లంఘన" అని లాయర్ ఆరోపించారు.

అరెస్టుల విషయంలో పాటించాల్సిన నిబంధనల్లో ఏ ఒక్కటీ అనుసరించలేదని ఆయన అంటున్నారు.

‘‘మహిళలను సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేయకూడదనే నిబంధన ఉంది. మహిళలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు.

అర్ధరాత్రి అరెస్టు చేసి సమీపంలోని క్రిమినల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీన్ని తమిళనాడు పోలీసులు ఎందుకు చూడలేకపోయారో తెలియడం లేదు.

దొంగతనం, గొర్రెల స్మగ్లింగ్‌కు సంబంధించిన అనేక కేసుల్లో తమిళనాడుకు చెందిన వారిని అధికార యంత్రాంగానికి తెలియజేయకుండా అరెస్ట్‌ చేస్తున్నారు'' అని లాయర్ తెలిపారు.

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి

బాధితుల ఆరోపణలపై చిత్తూరు పోలీసులు ఏమంటున్నారు?

ఈ విషయంపై చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డితో ‘బీబీసీ తెలుగు’ మాట్లాడింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేశామని, వారిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు.

అయితే తమిళనాడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అయ్యప్పన్ కుటుంబాన్ని తీసుకెళ్లారా? అని ప్రశ్నించగా ఎస్పీ సమాధానం దాటవేశారు.

ఈ కేసుకు సంబంధించి తమిళనాడు పోలీసులు, హోం శాఖ అధికారులను బీబీసీ సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.

''అయ్యప్పన్ కుటుంబానికి చెందిన ఓ మహిళ మాకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశాం. ఆ తర్వాత లైంగిక వేధింపులు, అరెస్టుల గురించి మరింత సమాచారాన్ని సేకరించి, కేసులోని సెక్షన్లను సవరించాం’’ అని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సరయు చెప్పారు.

లైగింక వేధింపులపై విచారణ ప్రారంభించామని, మెడికల్ రిపోర్టు వచ్చాక విచారణ వేగవంతం చేస్తామని కలెక్టర్ సరయు తెలిపారు.

వీడియో క్యాప్షన్, 'కోరిక తీర్చకపోతే నా భర్తను ఉరేసి చంపుతామని ఆంధ్రా పోలీసులు బెదిరించారు'

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)