కెన్యాలో కూతురి హంతకుల జాడ కోసం అక్కడికి 100 సార్లు వెళ్ళారు, 16 కోట్లు ఖర్చు చేశారు

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, కేట్ స్కాటర్, సుసీ ఫోవ్లర్ వాట్
- హోదా, బీబీసీ న్యూస్
కెన్యాలో తన కూతురిని చంపిన హంతకులు ఎవరో తెలుసుకోవడం కోసం ఓ తండ్రి దశాబ్దాల పాటు వెదుకులాట సాగించారు.
హంతకుల కోసం ఇన్నేళ్లు అన్వేషణ సాగించిన తన తండ్రి ఒక హీరో అని ఆయన కుమారుడు అంటున్నారు.
ఆ తండ్రి పేరు జాన్ వార్డ్ కాగా మరణించిన కూతురి పేరు జూలీ వార్డ్.
సఫోల్క్‌లోని బరీ సెయింట్ ఎడ్మండ్స్‌కు చెందిన 28 ఏళ్ల వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫర్ జూలీ వార్డ్ మృతదేహం మాసాయ్ మారా రిజర్వ్‌లో దొరికింది. 1988 సెప్టెంబర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, ఆమె హత్య కేసులో దోషులుగా ఇప్పటికీ ఎవరినీ నిర్ధారించలేదు.
ఈ కేసు దర్యాప్తు కోసం రూ. 16 కోట్ల (2 మిలియన్ డాలర్లు) సొంత డబ్బును ఖర్చు చేసిన జాన్ వార్డ్, ఈ నెల ఆరంభంలో మరణించారు. ఆయన వయస్సు 89 ఏళ్లు.
ఆయన మరణించడానికి రెండు వారాల ముందు ఆయన భార్య జేన్ కూడా చనిపోయారు.

ఫొటో సోర్స్, BOB WARD
జూలీకి తన తండ్రి న్యాయం చేయలేకపోయారనే వాస్తవాన్ని తమ కుటుంబం అంగీకరించిందని బాబ్ వార్డ్ చెప్పారు.
"ప్రధాన అనుమానితుడు చనిపోతే, ఏ రకంగా విచారించినా న్యాయం దక్కదు. ఈ సంగతి మాకు తెలుసు’’ అని ఆయన అన్నారు.
"జూలీ విషయంలో అసలు ఏం జరిగిందనేది కచ్చితంగా మా నాన్నకు తెలుసు. మాక్కూడా తెలుసు. కానీ, ఇది ఎందుకు జరిగింది? దాన్ని ఎందుకు దాస్తున్నారో తెలుసుకోవడమే ఇక్కడ సమస్యగా మారింది’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, WARD FAMILY
సఫారీలో ఫోటోగ్రఫీ ముగింపు సమయంలో జూలీ వార్డ్ అదృశ్యమయ్యారు. ఆమె చివరగా 1988 సెప్టెంబర్ 6న ప్రాణాలతో కనిపించారు. ఆమె శరీరం కాలిపోయి, ఛిద్రమైన వారం రోజుల తర్వాత జూలీ మృతదేహాన్ని ఆమె తండ్రి జాన్ వార్డ్ గుర్తించారు.
ఆమెపై జంతువులు దాడి చేశాయని ఆ సమయంలో కెన్యా అధికారులు పేర్కొన్నారు.
కానీ, జాన్ వార్డ్ మరిన్ని సాక్ష్యాలను బయటపెట్టడంతో ఆమె హత్యకు గురైనట్లు తర్వాత అధికారులు ఒప్పుకున్నారు.

ఫొటో సోర్స్, BOB WARD
ఈ విషయంలో తన తండ్రి చాలా నిజానిజాలను గ్రహించి, ఒక తార్కికమైన ముగింపుకు రాగలిగారని బాబ్ అన్నారు.
"ఇది కుటుంబ జీవితంపై ప్రభావం చూపింది. కానీ, ఇది మా కుటుంబ జీవితంలో ఒక భాగమైంది.
ఓవైపు జూలీ కోసం పని చేయడం, మరోవైపు తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడం, ఇతర పనులను కూడా మా నాన్న చక్కగ నిర్వర్తించారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, BOB WARD
తన కూతురి అవశేషాలను కనుగొన్న క్షణంలో వచ్చిన కోపమే ఆయనకు ఈ కేసు గురించి పనిచేయడానికి నిరంతర స్ఫూర్తిని కలిగించిందని బాబ్ తెలిపారు.
"అది కోపమో లేదా తండ్రి ప్రేమో నాకు నిజంగా తెలియదు. నాకు తెలిసిందల్లా ఆ భయంకర క్షణాలే ఆయనను ఇన్నేళ్లుగా దీనిపై పోరాడేలా చేశాయి’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, BOB WARD
ఆమె చావు చాలా భయంకరమైనదని బాబ్ గుర్తు చేసుకున్నారు. ఆమె చనిపోయాక తమ కుటుంబ జీవితం ముందులా ఎప్పుడూ లేదని చెప్పారు.
"అప్పటి వరకు, నేను ఆదివారం ఉదయం పూట స్థానిక క్లబ్‌లో ఫుట్‌బాల్ ఆడుకునేవాడిని. తర్వాత పబ్‌కు వెళ్లేవాడిని. అందరిలాగే మా కుటుంబం కూడా గడిపేది.
ఈ ఘటన కొంతకాలం పాటు మా జీవితాలను తలకిందులు చేసింది. కానీ, మేం దాన్నుంచి బయటపడే మార్గాన్ని కనుగొన్నాం’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, BOB WARD
బాబ్ వార్డ్ తన తండ్రితో కలిసి పనిచేస్తున్నారు. పుస్తకం రాయడంలో తన తండ్రికి ఆయన సహాయపడ్డారు. జూలీ చావుకు కారణం ఎవరో తెలుసుకోవడానికి వారు 100 సార్లకు పైగా కెన్యాకు వెళ్లొచ్చారు. జాన్ మరణించడానికి ఆరేళ్ల ముందు వరకు ఇలా వెళ్లొస్తూనే ఉన్నారు.
ఆ పుస్తకాన్ని ప్రచురించాలని, దీనిపై డాక్యుమెంటరీని రూపొందించాలని బాబ్ అనుకుంటున్నారు.
"తను ఎంత ప్రత్యేకమైన వ్యక్తి అనే సంగతి మా నాన్నకు తెలియదు. ఆయనకు ఉన్న ధైర్యం, పట్టుదల, దర్యాప్తు చేసే విధానం అందరికీ ఉండవనే సంగతి మానాన్నకు తెలియదు.
ఆయనను మేం ఒక హీరోలా చూస్తాం. కానీ, ఈ విషయం ఆయనకు అర్థం కాదు. తనను తాను హీరోలా ఆయన చూడలేదు. కానీ, నేను అలా చూడగలను.
ఆయన నాకు, టిమ్‌కు, జూలీకి, మా అమ్మకు హీరో. ఆయన చేసిన పని నిజంగా నమ్మశక్యం కానిది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, BOB WARD
తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 1992లో ఆమె హత్య కేసులో ఇద్దరు గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు.
కెన్యా పోలీసు అధికారుల కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది. 1999లో ఒక గేమ్‌కీపర్‌ని ఈ కేసులో విచారించారు. కానీ, ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు.
2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














