పసూరీ: పాకిస్తాన్ పాటను బాలీవుడ్ సినిమాలో వాడడంపై భారత్‌లో ఏమంటున్నారు

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ

ఫొటో సోర్స్, KARTIK AARYAN VIA INSTAGRAM

    • రచయిత, జోయా మతీన్
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

సంచలన విజయం అందుకున్న పసూరి పాటను బాలీవుడ్ రీమేక్ చేయడంపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

పాకిస్తాన్ పాప్ సాంగ్ అయిన ‘పసూరి’ పాట గత ఏడాది భారత్, పాకిస్తాన్ దేశాల్లో బాగా పాపులర్ అయింది.

పాకిస్తాన్‌‌లో ‘కోక్ స్టూడియోస్’ రూపొందించిన పసూరి ఒరిజినల్ పాటను అలీ సేథీ, షే గిల్ పాడారు.

ఇండియన్ వర్షన్ ‘పసూరి’ పాటను ఇటీవల విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి.

కొంతమంది శ్రోతలు కొత్త వర్షన్ బాగుందని చెప్పగా, మరికొంతమంది పెదవి విరిచారు.

‘సత్యప్రేమ్ కి కథ’ సినిమాలో ‘పసూరి ను’ పేరిట రూపొందించిన ఈ రీమేక్ పాటకు బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ అభినయించారు.

సోమవారం విడుదలైన ఈ పాటను యూట్యూబ్‌లో ఈ కథనం రాసే సమయానికి 2 కోట్ల మంది చూశారు.

భారతీయ వర్షన్ పాటను అర్జిత్ సింగ్ పాడటంతో ఈ పాట ఎలా ఉంటుందనే దానిపై చాలా ఉత్కంఠ నెలకొంది.

పాకిస్తాన్ వర్షన్‌లోని కోరస్‌తో పాటు క్యాచీ పాప్ హుక్‌ను కొత్త వర్షన్‌లో అలాగే ఉంచారు. కానీ, ఓవరాల్‌గా భారతీయ వర్షన్ పాట కాస్త రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తుంది.

అలీ సేథీ, షే గిల్

ఫొటో సోర్స్, COKE STUDIO PAKISTAN

ఫొటో క్యాప్షన్, పసూరి ఒరిజినల్ పాటను అలీ సేథీ, షే గిల్ పాడారు

అయితే, సోమవారం చాలామంది భారతీయులు ఈ తాజా మ్యూజిక్ వీడియోను విమర్శించారు. ఒరిజినల్ పాటను పూర్తిగా నాశనం చేశారంటూ ఈ పాట మేకర్స్‌పై ఆరోపణలు చేశారు.

‘‘మంచి ప్రయత్నం. కానీ, ఇంకోసారి ప్రయత్నించకండి’’ అంటూ ఒక యూజర్ రాశారు.

‘‘అర్జిత్ సింగ్ ఒక అద్భుతమైన గాయకుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మీరు మంచి పాటలను నాశనం చేయడాన్ని ఆపాలి’’ అంటూ మారో యూజర్ పేర్కొన్నారు.

పాత సినిమాలను, పాటలను కొత్త కంటెంట్‌గా మార్చే బాలీవుడ్ అలవాటుతో తాము విసిగిపోయినట్లు మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘మీరు ఒరిజినల్ పాటలను, సినిమాలను ముట్టుకోకుండా ఉండలేరా?’’ అని ఒక యూజర్ ప్రశ్నించారు.

అయితే, మరికొందరు మాత్రం ఈ పాటను సమర్థించారు. విమర్శకులు అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

‘‘పసూరి కొత్త వర్షన్ నాకు నచ్చింది’’ అని ఒక అభిమాని రాశారు.

‘‘అర్జిత్ సింగ్ పాడిన పసూరి వర్షన్, సంగీత ప్రియులందరికీ దక్కిన ఉత్తమ బహుమతి’’ అంటూ మరో అభిమాని అన్నారు.

‘పసూరి’ అనేది పంజాబీ పదం. గందరగోళం అని దీనికి అర్థం. కోక్ స్టూడియో పాకిస్తాన్ 14వ సీజన్‌లో పసూరి పాటను నిరుడు విడుదల చేశారు.

ఈ పాట భారత్‌లో కూడా సంచలన విజయాన్ని సాధించింది. లక్షలాది మంది భారతీయులు ఈ పాటను విన్నారు. కొన్ని వారాల పాటు సంగీత చార్టులలో ఈ పాట అగ్రస్థానంలో నిలిచి అనేక రీమేక్‌లను ప్రోత్సహించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)