'స్పై' రివ్యూ: మెషీన్ గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించిన నిఖిల్ మరోసారి మెప్పించాడా?

ఫొటో సోర్స్, Twitter/ED Entertainments
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
గూఢచారి కథలంటే... సగటు ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి అందరికీ ఉంటుంది. ఎందుకంటే అది తెలిసీ, తెలియని ప్రపంచం. రా ఏజెంట్లు ఎలా ఉంటారు? ఏం చేస్తుంటారు? ఓ కేసుని ఎలా డీల్ చేస్తారు? అనే విషయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ని పోలిన అంశాలే!
పైగా రా ఏజెంట్ అంటే తెలివితేటల్లోనూ, ధైర్యంలోనూ, దూకుడులోనూ.. మనకంటే ముందుంటారన్న నమ్మకం. అందుకే జేమ్స్ బాండ్ టైపు కథల్ని ఆసక్తిగా తిలకించాం. నిజానికి జేమ్స్ బాండ్లు హాలీవుడ్ సినిమాలకే పరిమితం అనుకొనే తరుణంలో ఈ జోనర్‌ని ఇండియన్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
గూఢచారి సినిమాలతో తెలుగులోనూ ఈ జోనర్ అడుగుపెట్టింది.
ఇప్పుడు నిఖిల్ కూడా `రా ఏజెంట్` అవతారం ఎత్తాడు 'స్పై' సినిమాతో. పైగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ సీక్రెట్ కూడా మేం విప్పబోతున్నాం అని ప్రచారం చేయడంతో అందరి ఆసక్తి ఇటు వైపు మళ్లింది.
జేమ్స్ బాండ్ తరహా సినిమాల్లో 'స్పై'కు ఉండే స్థానం ఏంటి? నిజంగానే నేతాజీ డెత్ సీక్రెట్ తెలిసిందా, లేదా? ఇంతకీ గూఢచారిగా నిఖిల్ ఎంత వరకూ ఆకట్టుకున్నాడు..?
రా ఏజెంట్ 'జై'గా నిఖిల్
ఖాదర్ ఖాన్ (నితిన్ మెహతా) అనే ఉగ్రవాది కోసం భారత్ ఎన్నాళ్ల నుంచో గాలిస్తుంటుంది. ఖాదర్ కోసం భారీ ఎత్తున ఓ ఆపరేషన్ కూడా నిర్వహిస్తుంది. ఆ ఆపరేషన్‌లో సుభాష్ (ఆర్యన్ రాజేష్).. ఖాదర్‌ని హతమారుస్తాడు. ఈ ఫుటేజ్ అంతా రా ఏజెన్సీ లైవ్‌లో చూస్తుంది.
అయితే, ఖాదర్ మరణించిన తక్షణం నుంచి ఆ లైవ్ కట్ అవుతుంది. అంతేకాదు.. సుభాష్‌ని కూడా అక్కడే స్పాట్‌లో చంపేస్తారు. సుభాష్‌ని ఎవరు చంపారో అర్థం కాదు.
కొన్నాళ్లకు ఖాదర్ బతికే ఉన్నాడన్న చేదు నిజం భారత ప్రభుత్వానికి తెలుస్తుంది. ఖాదర్ చనిపోయాడు అని గర్వంగా ప్రకటించిన రా.. తలదించుకొనే పరిస్థితి వస్తుంది.
అంతేకాదు.. ఖాదర్ ప్రతీకార చర్యగా భారతదేశంపై న్యూ క్లియర్ ఎటాక్ ప్లాన్ చేస్తాడు. దాన్ని ఆపడానికి రా తన ఏజెంట్లందరినీ రంగంలోకి దించుతుంది. ఆ ఏజెంట్లలో జై (నిఖిల్) ఒకడు. జై ఎవరో కాదు.. సుభాష్‌కి స్వయానా సోదరుడు.
అన్నయ్య మరణం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలని ఒకవైపు, ఖాదర్‌ని పట్టుకోవాలన్న మిషన్ మరోవైపు.. ఈ ప్రయాణంలో జైకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? దేశాన్ని కాపాడే బాధ్యతని భుజాన వేసుకొన్న జై.. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాడా, లేడా? ఇంతకీ నేతాజీ మిస్టరీకి ఈ కథకీ ఉన్న సంబంధం ఏమిటి? ఇదంతా `స్పై` సినిమా చూస్తే అర్థమవుతాయి.

ఫొటో సోర్స్, Twitter/Nikhil Siddhartha
రొటీన్ స్టోరీయే.. కానీ..
రా ఏజెంట్లకు సంబంధించిన ఫార్ములా కథలు చాలా సింపుల్. దేశానికి ఓ ఆపద వస్తే, దాన్ని గూఢచారి ఎలా కనిపెట్టాడు? ఎలా ఆపాడు? అనేదే సినిమా అవుతుంది. 'స్పై' కూడా అలాంటి కథే.
అయితే.. ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడ్డానికి మరో కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యం ఏదో ఉందని జరిగిన ప్రచారమే.
ట్రైలర్‌లో కూడా హీరో మాటిమాటికీ నేతాజీ డెత్ సీక్రెట్ ఏమిటి? అంటూ ప్రశ్నలు సంధిస్తుంటాడు. ఇక్కడ నేతాజీ అంటే రెండు అర్థాలు. ఒకటి... హీరో అన్నయ్య. రెండోది మనకు తెలిసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్.
ఖాదర్ ఖాన్ గురించిన ఇంట్రో చాలా క్తుప్తంగా ఇచ్చి, నేరుగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఆ తరవాత.. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో లుంగీ కట్టుకుని, శుత్రుమూకని తుపాకీ గుళ్లతో దడదడలాడిస్తూ రా ఏజెంట్‌గా నిఖిల్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఖాదర్ ఖాన్ కేసు నిఖిల్‌కి అప్పగించడంతో మిషన్ మొదలైపోతుంది.
మొదటి పది నిమిషాల్లోనే ప్రేక్షకుల్ని అరెస్ట్ చేసే స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే.. ఆ తర్వాత వెంటనే వేగం తగ్గి, గందరగోళం పెరిగిపోతుంది. ఆపరేషన్‌లో భాగంగా.. హీరో తన గ్యాంగ్‌తో ఎక్కడెక్కడికో వెళ్తుంటాడు. ఏదేదో చేస్తుంటాడు.
రెండు మూడు చోట్ల జరిగే విషయాల్ని సమాంతరంగా చూపిస్తూ, హాలీవుడ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఫాలో అయిన దర్శకుడు... ప్రేక్షకుల్ని చాలా గందరగోళంలోకి నెట్టేస్తుంటాడు. ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే క్లారిటీ ఉండదు.
హీరో మెషీన్ గన్ చేత్తో పట్టుకుని పబ్ జీ.. గేమ్ ఆడుతున్నట్టు బులెట్ల వర్షం కురిపిస్తుంటాడు. తనకు తోడుగా... అభినవ్ గోమటం. తను కూడా రా ఏజెంటే. కానీ... 'ఈ నగరానికి ఏమైంది' టైపు జోకులు వేస్తుంటాడు. రా ఏజెంట్లు తమ ఖర్చులకు బిల్లులు చూపించడం, రూ.70 రూపాయలు తేడా వస్తే జీతంలో కట్ చేస్తానని అకౌంటెంట్ అనడం సిల్లీగా అనిపిస్తాయి.
ఈ సినిమాలో హనీ ట్రాప్ లాంటి ఎపిసోడ్ ఉంది.
ఓ రా ఏజెంట్, మరో రా ఏజెంట్‌ని హనీ ట్రాప్ చేయడం దర్శకుడి సృజనాత్మక శక్తికి నిదర్శనం. హీరోయిన్ కూడా రా ఏజెంటే. ఆమె హీరోకంటే సీనియర్.
కట్ చేస్తే... హీరో వెనుక గ్యాంగ్‌లో ఆమె కూడా తిరుగుతుంటుంది. ఓ సీనియర్‌ని జూనియర్‌లా ట్రీట్ చేయడం 'రా' వ్యవస్థలోనే కాదు, ఇంకెక్కడా లేదు.
ఇలాంటి సీన్లు చూస్తే 'రా' వ్యవస్థపై దర్శకుడికి ఉన్న అవగాహనపై సందేహాలు రాక మానవు.

ఫొటో సోర్స్, Twitter/Nikhil Siddhartha
తప్పుదోవ పట్టించారా?
బ్రదర్ సెంటిమెంట్‌ని ఈ కథలోకి ఎందుకు జొప్పించాల్సి వచ్చిందో అర్థం కాదు. బహుశా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించడానికేనేమో. సుభాష్ మరణం వెనుక రహస్యం తెలుసుకొంటానంటూ హీరో గొంతు చించుకొంటుంటాడు.
సుభాష్ అంటే.. నేతాజీ అని కాదు. తన అన్న సుభాష్ అన్నమాట. చివర్లో నేతాజీకి సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ చెప్పారు. అయితే.. దాన్ని టాప్ సీక్రెట్ అని చిత్ర బృందం అనుకొంటే సరిపోదు. జనం ఫీలవ్వాలి.
నేతాజీకి సంబంధించిన ఓ కీలకమైన విషయాన్ని చెప్పడానికి రానాని అతిథి పాత్రలో రంగంలోకి దింపారు. ఈ సీన్ లో రానా చెప్పిన డైలాగులు ఎఫెక్టివ్‌గా ఉంటాయి.
అయితే.. అప్పటికే నేతాజీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్సాహం ప్రేక్షకుల్లో సన్నగిల్లుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పడం దర్శకుడి ముఖ్య ఉద్దేశం కావొచ్చు. కానీ.. దాన్ని బలోపేతం చేస్తూ ఓ టాప్ సీక్రెట్‌ని (బహుశా అది ఫిక్షనే కావొచ్చు) రివీల్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు.
సమాధానం లేని ప్రశ్నలెన్నో..?
ఈ స్క్రిప్టుపై దర్శకుడు కానీ, రచయిత కానీ పూర్తి స్థాయిలో కసరత్తు చేయలేదేమో అనిపిస్తుంది. అందుకు సాక్ష్యంగా నిలిచే సన్నివేశాలెన్నో.
ఓ దశలో జైని రా నుంచి తొలగిస్తారు. అక్కడితో.. జై దారులన్నీ మూసుకుపోవాలి. తనని ఒంటరివాడ్ని చేయాలి. అక్కడి నుంచి హీరో ఎలా పోరాడతాడు? అనే ఆసక్తి అప్పుడే కలుగుతుంది.
అయితే... 'రా' నుంచి హీరోని డిస్మిస్ చేసినా, చేయకపోయినా... తన ఆటిట్యూడ్‌లో ఎలాంటి తేడా ఉండదు. పైగా రా అంతా తనకి సహకరిస్తూనే ఉంటుంది. ఒక్క చీఫ్ తప్ప.
చివర్లో మిస్సైల్‌ని హీరో ఆపాడు అన్నారే తప్ప.. ఎలా ఆపాడో చూపించలేదు.

ఫొటో సోర్స్, Twitter/ED Entertainments
నిఖిల్ మోయలేని బరువు ఇది
'కార్తికేయ 2' సూపర్ హిట్టయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ పేరు మార్మోగింది. ఆ సినిమాలో నిఖిల్ ఏం సూపర్ హీరో కాదు. మనలో ఒకడిగా చూపించారు కాబట్టే.. నిఖిల్‌ని ఓన్ చేసుకొన్నారంతా. అయితే ఈ సినిమాలో తన ఇమేజ్‌కి మించిన పాత్ర మోయాల్సి వచ్చింది.
'ఈ దేశాన్ని కాపాడే బాధ్యత నీపైనే ఉంది' అని రా చీఫ్.. అన్నప్పుడు 'నిఖిల్ తప్పకుండా ఈ మిషన్‌లో గెలుస్తాడు' అనే భరోసా ప్రేక్షకులకూ కలగాలి. కానీ ఆ సీన్ తేలిపోయింది.
నిఖిల్ తన వంతుగా కష్టపడ్డాడు. యాక్షన్ సీన్లలో బాగా రాణించాడు. కానీ.. ఎందుకో `రా` ఏజెంట్ పాత్ర తన వయసుకి, ఇమేజ్‌కీ పెద్దదిగా అనిపించింది.
మకరంద్ దేశ్ పాండే బేస్ వాయిస్‌లో అరవడం మినహా ఏం చేయలేదు. నితిన్ మెహతా గాంభీర్యం.. ఇంటర్వెల్ తరవాత బాడీ డూప్ స్థాయికి పడిపోయింది.
అభినవ్ గోమటం తను రా ఏజెంట్ పాత్ర పోషిస్తున్నానన్న సంగతి మర్చిపోయి.. తన పాత సినిమాల్లోలానే కామెడీ పంచ్‌లు వేసుకొంటూ తిరుగుతుంటాడు. రా ఏజెంట్లు సరదాగా ఉండరని కాదు. కానీ... ఈ పాత్రని డిజైన్ చేయడంలో దర్శకుడు మరింత లిబర్టీ తీసుకున్నాడు.
కథానాయికతో కూడా పరుగులు పెట్టాంచారు. ఫైట్లు చేయించారు. తప్పదు.. ఎందుకంటే ఆమె కూడా ఓ రా ఏజెంటే కాబట్టి.
తేలిపోయిన గ్రాఫిక్స్
ఇలాంటి సినిమాలకు సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం. ముఖ్యంగా స్టైలిష్ మేకింగ్ కనిపించాలి. అక్కడక్కడా ఆ ఛాయలున్నా.. ఓవరాల్‌గా మేకింగ్‌లో ఈ సినిమాకి యావరేజ్ మార్కులే పడతాయి. నేపథ్య సంగీతంలో హోరెక్కువ. పాటలకు చోటు ఇవ్వకపోవడం మంచి ఆలోచన. గ్రాఫిక్స్ మరీ తక్కువ స్థాయిలో ఉన్నాయి.
తొలి సగంలో విషయం లేకపోయినా, ఏదో జరుగుతోందన్న ఆసక్తి ఉంటుంది. రెండో సగంలో అది కూడా ఉండదు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి చెబుతున్నాం అని ప్రకటించుకుని, ఆ ప్రస్తావన ఎక్కడో ద్వితీయార్థంలో తీసుకురావడం, దానికీ సరైన న్యాయం చేయకపోవడం పెద్ద లోటు.
దర్శకుడి అనుభవలేమి, స్క్రీన్ ప్లే లోపాలు, ఏ పాత్రనీ సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఎత్తుకొన్న పాయింట్ ఒకటి, చెప్పిన పాయింట్ ఒకటి అవ్వడంతో ఈ 'స్పై...' ప్రేక్షకుల అంచనాలకు చాలా దూరంలో నిలబడిపోవాల్సి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....
- నిర్మలా సీతారామన్: 'ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబులు వేశారు'
- అనుప్‌గిరి గోసైన్: ఈ నగ్న నాగా సాధువు ఒక 'భయంకర' యుద్ధ వీరుడు
- ఇంజినీరింగ్ విద్యార్థులకు అద్భుత అవకాశం... కోటి మందికి ఉచితంగా ఇంటర్న్‌షిప్
- తూర్పు గోదావరి: ‘అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.. విగ్రహాన్ని తొలగించి తహసీల్దార్ ఆఫీసులో పడేశారు’














