తెలంగాణ: దళితులు ప్రవేశించారని గుడినే బహిష్కరించారా?

- రచయిత, ప్రవీణ్ కుమార్ శుభం
- హోదా, బీబీసీ కోసం
‘ఊరిలో అందరితో కాకుండా, వెలివేసినట్టు ఊరి బయటి చెట్టు కింద మేమెందుకు క్షవరం చేసుకోవాలి? ఇది మాకు చాలా అవమానకరంగా ఉంది. గ్రామంలో సఫాయి పనికి మాత్రమే మేం వారికి కావాలి. మేమూ మనుషులమే, మాకు సమానత్వం కావాలని అడుగుతున్నాం’.
తెలంగాణలోని గజ్వేల్ నియోజకవర్గం తిమ్మాపూర్ కు చెందిన దళిత యువకుడు పోసానిపల్లి శేఖర్ బీబీసీతో మాట్లాడుతూ అన్న మాటలివి.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్.
గత నెల రోజులుగా తిమ్మాపూర్‌లో దళితులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. దశాబ్ధాలుగా తమ గ్రామంలో నెలకొన్న కులవివక్షను ప్రశ్నిస్తూ అక్కడి దళిత యువకులు పోరాడుతున్నారు.

తిమ్మాపూర్ గ్రామం :
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ జనాభా (2011 జనాభా లెక్కల ప్రకారం) 1,360. గ్రామంలో అక్షరాస్యత 47.3 శాతం.
ప్రస్తుతం ఈ గ్రామ జనాభా 2 వేలకు చేరువగా ఉంటుంది. గ్రామంలో సుమారు 500 మంది దళిత వర్గానికి చెందిన మాదిగ కులస్తులు నివసిస్తున్నారు. ప్రధాన గ్రామానికి దళితవాడ అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది.
దళితుల ఆలయ ప్రవేశంపై ఇక్కడ దశాబ్ధాలుగా నిషేధం కొనసాగుతోంది.
వివాదం ఎక్కడ మొదలైంది?
గత నెలలో(జూన్) తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు’ సందర్భంగా కులవివక్ష వివాదం వెలుగుచూసింది.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ‘చెరువుల పండగ’ సందర్భంగా గ్రామస్తులకు ఏర్పాటు చేసిన సామూహిక భోజనాల కార్యక్రమంలో కుల విభేదాలు పొడచూపాయి.
‘మా గ్రామ దళిత యువకులు కొంతమంది కేటరింగ్ పనులతో ఉపాధి పొందుతున్నారు. చెరువుల పండగ సందర్భంగా సామూహిక భోజనాలు ఆర్డర్ చేయాలని వారికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇది అవమానంగా భావించి ఆ కార్యక్రమానికి మేం వెళ్లలేదు. బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఫోన్ చేసి ఎందుకు రావడం లేదని అడిగితే, విషయం చెప్పాం. వస్తే రండి , లేకపోతే లేదు అని అవమానపరిచేలా మాట్లాడారు’ అని తిమ్మాపూర్‌కు చెందిన దళిత యువకుడు పోసానిపల్లి రమేష్ బీబీసీతో చెప్పారు.
‘అవమానభారంతో ఆ రోజు నుంచి మేం గ్రామంలోకి వెళ్లడం మానేశాం’ అని రమేష్ వివరించారు.

దళితుల ఆలయ ప్రవేశంతో మరో గొడవ
జూలై 1 న తిమ్మాపూర్ గ్రామం మధ్యలో ఉండే హనుమాన్ ఆలయంలోకి సుమారు 40 మంది దళిత యువకులు ప్రవేశించారు. ఈ ఘటన తర్వాత ఈ ఆలయానికి గ్రామస్తులు రావడం మానేశారని దళిత యువకులు చెబుతున్నారు.
‘ మేం అడుగుపెట్టామని గ్రామస్తులు గుడిలోకి రావడమే మానేశారు. ఎలాంటి పూజలు చేయడం లేదు. వేరుగా గుడి కట్టుకుంటామని అంటున్నారు. గుడిలోని మైక్ వైర్లు కట్ చేశారు, కరెంట్ తీసేశారు. ఆ తర్వాత మేం గుడిని శుభ్రం చేశాం’ అని దళిత యువకుడు పోసానిపల్లి శేఖర్ బీబీసీతో చెప్పారు.
''15 ఏళ్ల క్రితం ఇలాగే కొంతమంది దళితులు హనుమాన్ గుడిలోకి వస్తే, ఆ తర్వాత గుడికి తాళం వేశారు. మీరు కింది జాతి వారు, గుడిలోకి రావొద్దని బెదిరించారు. వారి భయానికి ఆ తర్వాత మా కులానికి చెందిన వాళ్లు గుడిలోకి పోలేదు’’ అని శేఖర్ వివరించారు.

క్షవరం చేసే దగ్గర వివక్ష
సంప్రదాయ వృత్తిగా క్షవరం పనులు చేసే మంగలివారు తిమ్మాపూర్ గ్రామంలో లేరు. దీంతో పక్క గ్రామం ‘తీగుల్’ నుంచి ఒ వ్యక్తి వచ్చి గ్రామంలో సెలూన్ పెట్టాడు. అతనికి డబ్బులతో పాటూ, సంవత్సరానికి కొంత ధాన్యం ఇచ్చే పద్దతి అనుసరిస్తారు గ్రామస్తులు.
‘’వారంలో అన్ని రోజులూ గ్రామస్తులకు క్షవరం చేస్తుండగా, దళితులకు మాత్రం వారంలో ఒక్క రోజు (శుక్రవారం) మాత్రమే చేస్తున్నారు’’ అని దళిత యువకులు ఆరోపిస్తున్నారు.
గ్రామం మధ్యలో ఏర్పాటు చేసిన సెలూన్‌లో మిగితా అన్ని కులాల వారికి హెయిర్ కట్ చేస్తుండగా, దళిత వర్గానికి చెందిన వారికి మాత్రం గ్రామం బయట చింతచెట్టు కింద చేస్తున్నారు.
ఈ ఆనవాయితీ కొన్నితరాల నుంచి ఇలానే కొనసాగుతోందని తిమ్మాపూర్ దళితులు వివరించారు.
‘చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఊరవతల క్షవరం చేస్తున్నారు. మాకు ఇజ్జత్ (పరువు) పోయినట్లు అనిపిస్తుంది. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఇలా లేదు’ అని పోసానిపల్లి శేఖర్ బీబీసీతో ఆవేదన వ్యక్తంచేశారు.
జూలై 5న కొంతమంది దళిత యువకులు, తమకూ హెయిర్ కట్ చేయాలని సెలూన్‌లోకి వెళ్లారు. దానికి అక్కడివారు నిరాకరించడంతో దళిత యువకులు జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కులవివక్ష ఆరోపణలతో ఫిర్యాదు చేశారు.
‘’మేమూ మనుషులమే, సెలూన్‌లోనే మాక్కూడా కటింగ్ చేయాలని గంట సేపు బతిమాలాం. ఊరు వారు వద్దన్నారని, వారిని అడిగి చెబుతానని అన్నాడు. మా ముందే దళితేతర వ్యక్తికి షేవింగ్ చేశాడు. ఆ తర్వాత సెలూన్‌కు తాళం వేసుకుని వెళ్లిపోయాడు’’ అని శేఖర్ వివరించారు.

ఇది ఊరి సమస్య: బీఆర్ఎస్ పార్టీ నేత
తిమ్మాపూర్ దళితుల ఆరోపణలపై బీబీసీ కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వివరణ కోరింది.
ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న తిమ్మాపూర్ గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాయిని మహేందర్ మాట్లాడుతూ..
‘దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 'చెరువుల పండగ' రోజు గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలు కలిసే చెరువు దగ్గరికి బోనాలతో వచ్చాయి. అందరం కలిసి వంటలు వండినం. ఆ రోజు ఎలాంటి కులవివక్ష జరగలేదు. వారందరూ మాకు స్నేహితులే’ అని వివరించారు.
దళితుల వద్దకే వెళ్లి హెయిర్ కట్ చేయడం అనేది తన బాల్యం నుంచి ఉందని, ఊరి సమస్యను కావాలనే తనకు వ్యక్తిగతంగా అంటగడుతున్నారని మహేందర్ ఆరోపించారు.
దళితులపై వివక్ష అంశంపై తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌ను బీబీసీ సంప్రదించే ప్రయత్నం చేయగా సర్పంచ్ సమీప బంధువు శ్రీశైలం మాట్లాడారు.
‘దళితులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. మాది చిన్న ఊరు, అందరం కలిసే ఉంటాం. గ్రామంలోకే వచ్చి క్షవరం చేసుకోమని చెప్పాం’ అని ఆయన తెలిపారు.

చెట్టు కింద క్షవరం ఏళ్లుగా జరుగుతోంది: పంచాయతీ సెక్రటరీ
‘ చెట్టు కింద దళితులకు క్షవరం చేస్తుండటాన్ని కొన్నేళ్లుగా చూస్తున్నా. గతంలో చోటుచేసుకున్న ఘటనల కారణంగా చాలా ఏళ్లుగా హనుమాన్ ఆలయంలోకి దళితులు రావడం లేదని గ్రామస్తులు చెప్పారు. దళిత యువకులు గుడిలోకి వెళ్లారని ఇతరులు ఆ గుడిలో పూజలు చేయడం లేదన్నది వాస్తవం కాదు. ఈ మధ్యే ఆ గుడిలో పనిచేయని విద్యుత్ బల్బులను గ్రామ పంచాయితీ సిబ్బంది మార్చారు. చెరువుల పండగ రోజు అన్ని వర్గాలను ఆహ్వానించాం’ అని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ వేణు తెలిపారు.
దళితులకు క్షవరం చేసేందుకు నిరాకరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్యాం సుందర్, బీబీసీతో మాట్లాడారు.
‘మా పెద్దల కాలం నుంచి ఇక్కడ వేర్వేరు ప్రదేశాల్లో క్షవరం చేసే పద్దతి ఉంది. గత 25 ఏళ్లుగా నేనూ చూస్తున్నా. ప్రతి నాలుగేళ్లకు ఇక్కడ క్షవరం చేసే కుటుంబాల వంతులు మారుతాయి. వారం క్రితమే నా వంతు వచ్చింది. క్షవరం పని చేసినందుకు ప్రతిఫలంగా పంట కాలంలో గ్రామస్తులు ఇచ్చే ధాన్యం తీసుకుంటాం. గ్రామంలోనే కటింగ్ చేయాలని దళిత యువకులు అడిగితే ఊరి వారిని అడిగి చెబుతానన్నా. వారి గ్రామ సమస్యను నేను ఒక్కడినే ఎలా మారుస్తాను. నా వల్ల అవుతుందా? నేను ఎవరికైనా, ఎక్కడైనా క్షవరం చేయడానికి సిద్దమే’ అని శ్యాం సుందర్ చెప్పారు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం
సమస్య పెద్దది కావడంతో జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఇరు వర్గాల వారిని అధికారులు సమావేశపరిచారు.
‘ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా పోలీస్ సిబ్బందిని ఆదేశించాం. చట్ట ప్రకారం కుల వివక్ష నేరం. గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంటరానితనంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తాం’ అని జగదేవ్‌పూర్ తహసిల్దార్ రఘువీర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ ఘటనపై జగదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
‘'క్షవరం చేయడానికి నిరాకరించిన వ్యక్తి తో సహా మొత్తం ఏడుగురు గ్రామస్తులపై కేసులు పెట్టాం. గ్రామంలో చాలా ఏళ్లుగా వేర్వేరుగా క్షవరం చేస్తున్నారు. గ్రామంలో జనరేషన్ గ్యాప్ కనిపిస్తోంది. అంటరానితనం లేదని గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేశాం. గ్రామంలోని హనుమాన్ ఆలయం తెరిచే ఉంది’' అని జగదేవ్‌పూర్ సీఐ రాజశేఖర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘’భవిష్యత్ తెలంగాణలో దళితుల పరిస్థితిపై దళిత అస్తిత్వ ఉద్యమాలు లేవనెత్తిన ప్రశ్నలను తెలంగాణ సాధనే ఏకైక ఎజెండా అనే నినాదంతో జేఏసీ, వివిధ రాజకీయ పార్టీలు మింగేశాయి. ప్రత్యేక తెలంగాణే అన్ని సమస్యలకు ‘జిందా తిలిస్మాత్’ అని అనుకున్నారు. తెలంగాణ గ్రామాల్లో కొన్ని కులాల వారు మళ్లీ పటేల్ గిరికి పూనుకుంటున్నారు’’ అని కవి, పరిశోధకుడు అరుణాంక్ లత బీబీసీతో అన్నారు.
‘’తెలంగాణ ఉద్యమం అన్ని ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను మింగేయడం ఈ పరిస్థితికి కారణం. ఊర్ల నుంచి ఏనాడో పట్నాలకు పారిపోయిన దొరలు, జేఏసీ జెండా కప్పుకుని తిరిగి తెలంగాణ ఉద్యమ కాలంలో ఊర్లకు వచ్చారు. పాలక కులాలు, పార్టీ ఈ నిందితుల వెనుక ఉన్నది'’ అని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
- పాకిస్తాన్ సరిహద్దు దాటి ప్రియుడి కోసం భర్తను వదిలి నలుగురు పిల్లలతో భారత్ వచ్చిన ప్రేమిక... ఒక పబ్జీ ప్రేమకథ
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














