పాకిస్తాన్ సరిహద్దు దాటి ప్రియుడి కోసం భర్తను వదిలి నలుగురు పిల్లలతో భారత్‌ వచ్చిన ప్రేమిక... ఒక పబ్జీ ప్రేమకథ

సీమా హైదర్
    • రచయిత, రియాజ్ సుహైల్, షుమాయిలా ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ఇస్లామాబాద్

ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో సీమా హైదర్ అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్నారు.

రెండు రోజుల క్రితం హరియాణాలోని బల్లభ్‌గడ్‌లో సీమాతో పాటు ఆమె ప్రియుడు సచిన్ మీణాను పోలీసులు అరెస్ట్ చేశారు.

సచిన్‌ను కలవడం కోసం నేపాల్ టూరిస్ట్ వీసా తీసుకున్న సీమా హైదర్, షార్జా మీదుగా కాఠ్మండూ చేరుకున్నారు. అక్కడ నుంచి బస్సులో భారత్‌కు వచ్చారు. ఆమెతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.

సీమా గులామ్ హైదర్, పాకిస్తాన్‌ మహిళ అని పోలీసులు తెలిపారు.

గ్రేటర్ నోయిడా డీసీపీ సాద్ మియాన్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘సీమా స్వస్థలం సింధ్. ఆమె కరాచీలో ఉంటారు. యూట్యూబ్ వీడియో చూసి ట్రావెల్ ఏజెంట్ ద్వారా నేపాల్‌కు టికెట్ తీసుకున్నారు. అక్కడ నుంచి సచిన్‌ను కలవడం కోసం బస్సులో ఇక్కడికి వచ్చారు.

సీమాకు ఒక ప్లాట్ ఉండేది. భారత్‌లో పూర్తిగా స్థిరపడటం కోసం దాన్ని ఆమె 12 లక్షలకు విక్రయించారు’’ అని చెప్పారు.

సరిహద్దు దాటి పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్న సీమా హైదర్ భర్త, మామతో బీబీసీ మాట్లాడింది.

సీమ భర్త గులాం హైదర్ జఖ్రానీ, ఆమె మామ మీర్ జాన్ జఖ్రానీ ఈ మొత్తం వ్యవహరం గురించి బీబీసీకి వివరంగా చెప్పారు.

గులామ్

సౌదీ అరేబియాలో ఉంటున్న సీమ భర్త ఏం చెప్పారు?

సీమ భర్త గత మూడేళ్లుగా సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడే పనిచేస్తున్నారు.

ప్రస్తుతం సౌదీ అరేబియాలో నివసిస్తున్న గులాం హైదర్ జఖ్రానీ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.

సీమాతో తనది ప్రేమ వివాహమని, తొలుత ఈ వివాహానికి పెద్దలు అంగీకరించలేదని బీబీసీకి గులాం చెప్పారు.

‘‘సీమా రింద్‌తో నా పరిచయం ఒక మిస్డ్ కాల్ వల్ల జరిగింది. తర్వాత మూడు నాలుగు నెలల పాటు మేం ఇద్దరం ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

కానీ, దీనికి సీమ రింద్ కుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో కోర్టులో పెళ్లి చేసుకున్నాం.

ఆ తర్వాత రింద్ వంశ పెద్దలు మా పెళ్లిని సమ్మతించడంతో కరాచీలో ఉండటానికి వెళ్లిపోయాం. అక్కడే సీమా తండ్రితో పాటు సోదరి నివసించేవారు’’ అని ఆయన వివరించారు.

సీమా

ఫొటో సోర్స్, ANI

"సీమా పబ్‌జీ ఆటతో మోసపోయింది’’

అక్కడ తాను ఆటో రిక్షా నడిపేవాడినని, ఇంట్లో పేదరికం ఉన్నప్పటికీ తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని హైదర్ జఖ్రానీ చెప్పారు.

ఆ తర్వాత సౌదీ అరేబియా వెళ్లి అక్కడ కూలీగా కష్టపడి పనిచేస్తూ ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు పంపించినట్లు ఆయన తెలిపారు. సౌదీ నుంచి తరచుగా ఫోన్‌లో భార్యతో మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు.

‘‘మాకు చిన్న ఇల్లు ఉంది. దానికి మరమ్మతులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యే వరకు అద్దె ఇంట్లో ఇంటానని నా భార్య చెప్పారు.

మే 9న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌తో జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్‌ను నిలిపేశారు. అప్పుడు నా భార్యతో మాట్లాడలేకపోయాను.

తర్వాత సీమ తమ్ముడితో మాట్లాడాను. సీమ ఉంటున్న అద్దె ఇంటికి వెళ్లిన ఆమె తమ్ముడితో ఆ ఇంటి యజమాని ఒక విషయం చెప్పారు. ఇల్లు కొనడం కోసం ఊరు వెళ్తున్నానని చెప్పిన సీమ ఇంతవరకు రాలేదని ఆ ఇంటి యజమాని అతనికి చెప్పారు’’ అని ఆయన వివరించారు.

గులాం హైదర్ తెలిపిన వివరాల ప్రకారం, అతని భార్య ఇంటిని అమ్మేసి నగలు, పిల్లలను తన వెంట తీసుకెళ్లింది.

తనకు ఆమెపై ఎప్పుడు ఎలాంటి అనుమానం రాలేదని గులాం అన్నారు. తొలుత తన భార్య దుబాయ్ వెళ్లిందని, ఆ తర్వాత నేపాల్‌లో ఉన్నట్లు పరిచయస్థుల ద్వారా తనకు తెలిసిందని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో ఆమె భారత్‌లోని జైల్లో ఉన్నట్లు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు.

తన భార్య పబ్‌జీ గేమ్ వల్ల మోసపోయిందని, పిల్లలతోపాటు ఆమెను తిరిగి పాకిస్తాన్‌కు తీసుకురావాలని ఆయన అన్నారు.

తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సీమా రింద్ చెప్పిన మాటలను గులామ్ హైదర్ ఖండించారు.

తాను విడాకులు తీసుకోలేదని, సీమను ప్రేమిస్తున్నానని అన్నారు. ఆమెను ఎంతో నమ్ముతున్నానని అందుకే ఇల్లు కూడా ఆమె పేరు మీదనే తీసుకున్నట్లు తెలిపారు.

సీమా

సీమ మామ ఏం చెప్పారు?

సీమా గులాం హైదర్ మామ మీర్ జాన్ జఖ్రానితో బీబీసీ ప్రతినిధి రియాజ్ సుహైల్ ఫోన్‌లో మాట్లాడారు.

2014లో సీమ, గులాం హైదర్‌ల వివాహం జరిగిందని ఆయన చెప్పారు.

పెళ్లి తర్వాత తన కొడుకు, కోడలు కరాచీకి వెళ్లి అక్కడ ఒక ఇల్లును కొన్నట్లు తెలిపారు.

‘‘నా కుమారుడు అక్కడ రిక్షా నడిపేవాడు. వారిద్దరూ సంతోషంగా ఉండేవారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం అక్కడికి వెళ్లి అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు.

ఆ తర్వాత రిక్షా తొక్కే ఆమె తండ్రి కూడా ఆమెతో పాటు ఉండేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు.

మే 9న పాకిస్తాన్‌లో ఇంటర్నెట్‌ను నిలిపేసినప్పటి నుంచి తన భార్యపిల్లలతో గులామ్‌కు సంబంధాలు తెగిపోయాయి’’ అని ఆయన వివరించారు.

సీమా

కరాచీ వెళ్లిన మీర్ జాన్‌కు ఏం తెలిసింది?

తన కొడుకు అభ్యర్థన మేరకు తాను కరాచీకి వెళ్లినట్లు మీర్ జాన్ చెప్పారు.

‘‘అక్కడికి వెళ్లాక నా కోడలు ఇల్లును అమ్మేసి సామాన్లు అన్నింటినీ ఒక అద్దె ఇంట్లో ఉంచినట్లు నాకు తెలిసింది.

నా కొడుకు పంపించిన 7 లక్షల రూపాయలతో పాటు ఏడు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె జాడ, పిల్లలు జాడ మాకు తెలియలేదు.

పిల్లలు , కోడలు కనిపించడం లేదని మాలిర్ కాంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను’’ అని చెప్పారు.

సీమా రింద్ తన భర్తతో విడాకులు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో చెప్పారు. అయితే మీర్ జాన్ దీన్ని ఖండిస్తూ “నలుగురు పిల్లల తల్లికి ఎవరైనా విడాకులు ఇస్తారా?” అని ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ దాటి భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో ఇండియాకు వచ్చిన పబ్జీ ప్రేయసి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)