నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
నిర్మల్ కొయ్య బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంటుంది. వీటికి భారత్‌లోనే కాదు, కొన్ని ఇతర దేశాల్లోనూ గిరాకీ ఉంది.
ఈ బొమ్మలను తయారుచేసే కళాకారులను ‘నకాశీలు’ అంటారు. ఈ కళ గతంలో నిర్మల్ ప్రాంత పాలకులు, నిజాం నవాబుల ఆదరణ పొందింది.
నిర్మల్ కొయ్య బొమ్మలకు పొనికి చెట్టు నుంచి వచ్చే కలప మాత్రమే వాడతారు. అయితే ఈ చెట్టు అంతరించే దశకు చేరువైంది. దీంతో పొనికి చెట్టు సంరక్షణ ప్రభుత్వానికి ముఖ్యంగా మారింది. ‘తెలంగాణకు హరితహారం’ ద్వారా వాటి సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
పొనికి చెట్టు ప్రత్యేకత ఏమిటి?
పొనికి (Givotia rottleriformis) లేదా పొలికిగా పిలిచే ఈ చెట్టు వృక్షశాస్త్ర పరిభాషలో ‘యూఫర్బియోసీ’(euphorbiaceae) కుటుంబానికి చెందింది.
దేశంలో ముఖ్యంగా దక్కన్ పీఠభూమి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ)లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
శ్రీలంక తీర ప్రాంతంలో కూడా దీని ఉనికి ఉంది. కొండలు, గుట్టల్లో రాళ్లతో కూడిన నేలలు ఈ చెట్టు పెరిగేందుకు అనువైన ప్రాంతాలు.
తెల్ల పొనికి, నల్ల పొనికి ఇందులో ముఖ్యమైన రకాలు.
మృదువుగా, తేలికగా ఉండే పొనికి చెట్టు కలపను బొమ్మల తయారీలో, అలంకరణకు ఉపయోగించే కర్ర నగిషీలలో ఎక్కువగా వాడతారు.
పొనికి చెట్టు కలపను గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు, మత్స్యకారులు ఈ కలపతో తయారుచేసిన పడవలను చేపలు పట్టడానికి ఉపయోగించేవారు. ఈ కలప లభ్యత తగ్గిపోవడంతో ఇప్పుడు థర్మకోల్‌తో చేసిన పడవలను వాడుతున్నారు.

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
ఎక్కడ ఏ కలప వాడతారు?
నిర్మల్ కొయ్య బొమ్మల తయారీలో తెల్ల పొనికి కలప ఉపయోగిస్తారు. కొండపల్లి, ఏటికొప్పాక ప్రాంతాల్లో కొయ్య బొమ్మల తయారీకి తెల్ల పొనికితో పాటూ కుమ్మర పొలికి (Gyrocarpus), అంకుడు (Wrightia), గారుగ, పెద్ద బిక్కి (Gardenia) చెట్ల కలప వాడతారు.
తేలిక, మృదుత్వం, మన్నిక లాంటి లక్షణాలు ఉండటం వల్ల బొమ్మలు చేయడానికి పొనికి చెట్టు కలప అనువుగా ఉంటుంది.
ఆదిలాబాద్ అడవుల్లో బోథ్, నేరడిగొండ, మామాడ, చెన్నూరు ప్రాంతాల్లో ఎక్కువగా పొనికి చెట్లు కనిపించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది.
ప్రస్తుతం నిర్మల్ జిల్లా పరిధిలో కేవలం 120 తెల్ల పొనికి చెట్లు మాత్రమే ఉన్నాయని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) సునీల్ హీరేమత్ బీబీసీతో చెప్పారు. ఈ చెట్లకు ప్రత్యేకంగా నంబర్లు వేసి సంరక్షిస్తున్నారు.
"నిర్మల్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్నవి తక్కువ చెట్లైనా ఆరోగ్యంగానే ఉన్నాయి. అయితే, కొత్తగా ఈ చెట్ల పెరుగుదల అనేది అంతకు ముందులా లేదు" అని డీఎఫ్‌వో సునీల్ తెలిపారు.
విస్తృత ప్రచారం వల్ల గతంతో పోలిస్తే నిర్మల్ కొయ్య బొమ్మల అమ్మకాలు పెరిగాయి.
సంప్రదాయ బొమ్మల స్థానంలో రోజువారీ ఉపయోగించుకునే వస్తువుల తయారీ, గృహ అలంకరణల తయారీలో నిఫ్ట్ ( నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ), జాతీయ హస్తకళల కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు కూడా శిక్షణ పొందారు.
"నిర్మల్ కొయ్య బొమ్మల అమ్మకాలు పెరిగాయి. అయితే, డిమాండ్‌కు తగ్గట్టుగా కలప అందుబాటులో లేదు. గతంలో అటవీ శాఖ నిర్వహించే డిపోల్లో కలప సులువుగా దొరికేది. 20 ఏళ్లుగా ఇది కష్టం అవుతోంది. రానురాను మరింత కష్టమైపోతుంది" అని నిర్మల్ కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం మేనేజర్ బ్రహ్మరౌతు శంకర్ బీబీసీతో చెప్పారు.
పొనికి చెట్లు తగ్గిపోవడానికి కారణాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా గతంలో సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ రీసర్చ్ కాలేజీలో జరిపిన పరిశోధనల ప్రకారం పొనికి చెట్ల సంఖ్య తగ్గడం వెనుక పలు కారణాలు ఉన్నాయి.
అడవుల నరికివేత, పొనికి విత్తనాలకు సహజంగానే తక్కువ శాతం మొలకెత్తే గుణం ఉండటం లాంటివి ఇందులో ఉన్నాయి.
ఇవే కాకుండా ఈ చెట్లు పెరిగే అటవీ ప్రాంతంపై బయటి ప్రాంత ఒత్తిడి పెరగడం, పొనికి చెట్లను ఎక్కువగా నరికివేయడం, అడవుల పెంపకం కార్యక్రమంలో ఈ చెట్లకు ప్రాధాన్యం లేకపోవడం, పొనికి విత్తనాలపై ఉండే కవచం (సీడ్ కోట్) అనేక పొరలతో కూడి మొలకెత్తేందుకు కఠినంగా ఉండటం, విత్తనం సుదీర్ఘ నిద్రాణ స్థితిలో ఉండటం లాంటివి ప్రధాన కారణాలు.
"అడవిలో కొత్తగా పొనికి మొక్కలు రావాలంటే వాటి విత్తనాలు కిందపడాలి. అయితే అటవీ ప్రాంతంపై ఒత్తిడి పెరగడంతో పొనికి చెట్ల ఆవాసాలు దెబ్బతిన్నాయి. గొర్రెలు, మేకలు లాంటి జంతువులు పరిమితికి మించి ఆ ప్రాంతాల్లో మేత మేయడం, అడవిలో రేగే కార్చిచ్చు లు ఇలా చాలా సమస్యలు ఉన్నాయి" అని నిర్మల్ డీఎఫ్‌వో సునీల్ హీరేమత్ తెలిపారు.
వాణిజ్యపరంగా అటవీశాఖ కోణంలో చూస్తే టేకు, చందనం వంటి విలువైన జాతి కాకపోవడంతో పొనికి చెట్టుకు అడవుల పెంపకం కార్యక్రమంలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
ఈ చెట్లను రక్షించేందుకు ఏంచేయాలి?
పొనికి చెట్ల సంఖ్యను పెంచేందుకు స్థిరమైన ప్రయత్నాలు సాగాలని ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ కాలేజీ తన పరిశోధనల్లో చెప్పింది.
పొనికి మొక్కల పెంపకం ప్రక్రియను ప్రామాణీకరించడంతో పాటు అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేపట్టే సిల్వీకల్చర్‌లో పొనికికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
గతంలో ఇక్కడ జరిగిన పరిశోధనల్లో భాగంగా పొనికి మొక్కలను పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఒక అంచనాకు వచ్చారు.
ఈ చెట్టు కొమ్మలను నియంత్రిత వాతావరణ పరిస్థితులు ఉండే ‘మిస్ట్ చాంబర్’లలో పెంచేందుకు ప్రయత్నించారు.
ఈ విధానంలో నాటిన కొమ్మలకు వేర్లు వచ్చేలా అందివ్వాల్సిన హార్మోన్లపై పరిశోధనలు కొంత వరకు జరిగాయి.
తిరుపతిలోని శ్రీనివాస వనం ఫీల్డ్ రీసర్చ్ స్టేషన్‌లో స్టెమ్ కటింగ్ ద్వారా నాటిన పొనికి మొక్కల్లో వేర్ల పెరుగుదల మీద వివిధ రకాల హార్మోన్ల ప్రభావంపై గతంలో పరిశోధనలు జరిగాయి.
"అటవీ శాఖ పరిశోధన, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో పొనికి మొక్కలను పెంచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. అనుకున్న ఫలితాలు రాకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని జాతుల మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఇలాంటి వాటితో పోలిస్తే పొనికి చెట్టు ఒక కఠినమైన జాతి. నిజం చెప్పాలంటే దీని గురించి మరింతగా అర్థం చేసుకోవాల్సింది ఉంది" అని డీఎఫ్‌వో సునీల్ హీరేమత్ అభిప్రాయపడ్డారు.
గతంలో వరంగల్ కాకతీయ యూనివర్శిటీ ప్లాంట్ బయోటెక్నాలజీ రీసర్చ్ లేబొరేటరీ తన పరిశోధనల్లో భాగంగా పొనికి విత్తనాల్లో సుదీర్ఘ నిద్రాణస్థితిని అధిగమించి, వేగంగా మొలకెత్తేందుకు జైగోటిక్ ఎంబ్రియో కల్చర్ విధానం ఉపయోగపడుతుందని పరిశోధనాపత్రం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
పొనికికి ప్రత్యామ్నాయం లేదా?
అంతరించే ప్రమాదం అంచున ఉండటం, లభ్యత తగ్గిపోవడంతో కొయ్య బొమ్మల తయారీలో పొనికి కలప స్థానంలో ప్రత్యామ్నాయం కోసం గతంలో ప్రయత్నాలు జరిగాయి.
"ప్రభుత్వం, అటవీశాఖ వారు పొనికి కలపకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని గతంలో చాలా సార్లు చెప్పారు. వారి సూచనల ప్రకారం మునగ చెట్టు కలపతో బొమ్మల తయారీకి ప్రయత్నించి విఫలమయ్యాం. పొనికితో పోలిస్తే ఇతర చెట్ల కలపలో నార ఎక్కువగా ఉంటుంది. నార వల్ల బొమ్మలు సరిగా చేయలేం" అని నిర్మల్ కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం మేనేజర్ శంకర్ అన్నారు.
సిద్దిపేట ములుగు అటవీ పరిశోధన కాలేజీ, ఇండియన్ ప్లైవుడ్ పరిశ్రమ పరిశోధన, శిక్షణ సంస్థ, బిహార్ రాష్ట్రంలోని రాజేంద్రప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో పొనికి కలపకు ప్రత్యామ్నాయంగా ఎర్ర బూరగ చెట్టు (Bombax ceiba)ను వాడవచ్చని సిఫార్సు చేశారు.

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
హరితహారంలో ఏంచేస్తున్నారు?
అటవీశాఖ అనుభవాల నేపథ్యంలో నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ( డీఆర్డీఏ) ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా పొనికి మొక్కల పెంపకంపై తిరిగి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
పొనికి చెట్ల కొమ్మల ద్వారా (స్టెమ్ కటింగ్) ప్రత్యేకంగా హరితహారం నర్సరీల్లో సుమారు ఐదు వేల మొక్కల పెంపకం చేపట్టారు. అయితే పది శాతం మొక్కలే బతికాయి.
నిర్మల్ జిల్లా హార్టికల్చర్ శాఖ సహాయంతో ఈ ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్ర నర్సరీల నుంచి ఐదు వేల తెల్ల పొనికి మొక్కలను తెప్పించారు.
"హరితహారంలో భాగంగా చాలా రకాల మొక్కలు నాటి పచ్చదనం పెంచుతున్నాం. నిర్మల్ కొయ్యబొమ్మల కళను బతికించడం ఒక సవాలుగా తీసుకున్నాం. గత అనుభవాలతో ఇప్పటికే మా నర్సరీల్లో పెంచిన కొన్ని పొనికి మొక్కలు చక్కగా నాటుకున్నాయి. జిల్లా అటవీ శాఖ మాకు కేటాయించిన 20 ఎకరాల అటవీ భూమిలో తొలి విడతలో తొమ్మిది ఎకరాల్లో ఐదు వేల మొక్కలు నాటుతాం. ఇవన్నీ చిగురిస్తాయని ఆశిస్తున్నాం’’ అని నిర్మల్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి బీబీసీతో అన్నారు.
"డీఆర్డీఏ అధికారుల ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం, మా శాఖ పరంగా కావాల్సిన తోడ్పాటు అందిస్తున్నాం. నర్సరీల్లో పెంచే మొక్కల్లో తక్కువ శాతం బతకడానికి సరిగా వేర్లు పెరగకపోవడమే కారణం. అయితే పొనికి కలపకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మా ప్రయత్నాలు తిరిగి ప్రారంభిస్తాం. జిల్లాకు మంజూరైన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నర్సరీలో గత పరిశోధనల అనుభవాలతో తిరిగి పెంచేందుకు ప్రయత్నిస్తాం. మా ప్రయత్నం విజయవంతమైతే స్థానిక కొయ్య బొమ్మల తయారీదారులకు కావల్సిన మొత్తంలో కలప దొరుకుతుంది" అని నిర్మల్ జిల్లా అటవీ అధికారి సునీల్ హీరేమత్ తెలిపారు.
సుమారు 15 సంవత్సరాలు నిండిన పొనికి చెట్ల నుండి వచ్చే కలప మాత్రమే బొమ్మల తయారీకి అనుకూలంగా ఉంటుందని నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ సంఘం మేనేజర్ శంకర్ చెప్పారు.
అధికారుల ప్రయత్నాలు భవిష్యత్తులో బొమ్మల తయారీ కళాకారులకు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Praveen Kumar Shubham/BBC
స్థానిక మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి: నిపుణులు
అడవుల పెంపకం, హరితహారం నర్సరీల్లో స్థానిక మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలని వృక్షశాస్త్ర నిపుణులు కోరుతున్నారు.
భవిష్యత్తులో స్థానిక జీవావరణ వ్యవస్థపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయకుండానే హరితహారం నర్సరీల్లో గతంలో విదేశీ ప్రాంతానికి చెందిన మాంగ్రూవ్ జాతి 'కోనోకార్పస్' మొక్కలను పెంచి విరివిగా నాటడంతో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేస్తున్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కోనోకార్పస్ వేర్లు భూమిలో లోతుగా చొచ్చుకువెళ్లి తాగునీరు, డ్రైనేజీ పైపులను ధ్వంసం చేసిన ఉదాహరణలు ఉన్నాయి.
హరితహారంలో భాగంగా నర్సరీల్లో స్థానిక ప్రాధాన్యం ఉన్న మొక్కల పెంపకం ఆవశ్యకతపై కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పరిశోధనలు చేసింది. నర్సరీల్లో అధికారులు పెంచే అవకాశం ఉన్న 104 స్థానిక వృక్ష జాతులను తన పరిశోధన పత్రంలో సూచించింది.
"అడవుల పెంపకంలో భాగంగా గతంలో నీలగిరి (యూకలిప్టస్), సుబాబుల్, టేకు చెట్లు పెంచారు. ప్రస్తుతం కమర్షియల్‌గా రైతులు వీటిని సాగుచేస్తున్నారు కాబట్టి మేము స్థానిక జాతుల పెంపకం పై దృష్టి పెట్టాం. పక్షులు, అడవి జంతువులకు పండ్లను అందించే మొక్కలను 30 శాతం వరకు పెంచుతున్నాం" అని అటవీ అధికారి సునీల్ హీరేమత్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















