ముస్లిం మహిళ నటించకూడదని స్టేజి మీద ఉండగానే షూట్ చేశారు, అయినా ఆ నటి ఏమాత్రం బెదరలేదు

నీలాంబుర్ ఆయేషా

ఫొటో సోర్స్, CV Lenin

ఫొటో క్యాప్షన్, నీలాంబుర్ ఆయేషా
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

అది 1953వ సంవత్సరం. 18 ఏళ్ళ నీలాంబుర్ ఆయేషా స్టేజీ పై డైలాగు చెబుతుండగా గాలిలోంచి ఒక బుల్లెట్ దూసుకుని వెళ్ళింది.

"నేను పక్కకు జరగడంతో ఆ బుల్లెట్ స్టేజీ పై ఉన్న కర్టెన్లకు తగిలింది. దీంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను" అని ఆ రోజు జరిగిన సంఘటనను 87 సంవత్సరాల ఆయేషా గుర్తు చేసుకున్నారు. కేరళలోని నీలాంబుర్ గ్రామం ఆమె పేరులో భాగంగా మారింది. అదే ఆమె సొంత ఊరు కూడా.

ముస్లిం మహిళలు స్టేజీ పై నటించకూడదంటూ ఆయేషా పై మత ఛాందసవాదులు దాడి చేయడం అది మొదటిసారి కాదు. ఆమెను నటించకుండా ఆపేందుకు చాలా దాడులు జరిగాయి.

కానీ, తనపై విసురుతున్న కర్రలు, రాళ్లు, ఆఖరికి తగులుతున్న దెబ్బలను కూడా ఎదుర్కొంటూ ఆమె నటనను కొనసాగించారు.

"ప్రజల ఆలోచనా వైఖరిని మార్చడంలో సఫలమయ్యాం" అని ఆమె అన్నారు.

తుపాకీ తూటా పేలినప్పుడు ఆమె నటించిన 'ఇజ్జు నల్లోరు మనసనకన్ నొక్కు' (మంచి మనిషి అయ్యేందుకు ప్రయత్నిస్తావు) అనే నాటకాన్ని ఇటీవల కేరళలో కొంత మంది కొత్త నటీనటులు తిరిగి ప్రదర్శించారు. ఈ నాటకాన్ని ఆయేషా ముందు వరుసలో కూర్చుని చూశారు.

కొత్తగా ప్రదర్శించిన నాటకంలోని ప్రారంభ సన్నివేశం ఆయేషా పై జరిగిన షూటింగ్ ఘటనతో మొదలవుతుంది.

ముస్లింలలో నెలకొన్న మత ఛాందసవాదాన్ని వేలెత్తి చూపడాన్ని ఈ నాటకం లక్ష్యంగా చేసుకుంది.

కొత్తగా రూపొందించిన నాటకంలో ముఖ్యంగా మహిళలను అణచివేసేందుకు ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మతపరమైన అసహనం, మత సిద్ధాంతాలకు సంబంధించిన సంఘటనలను చేర్చారు.

ఉదాహరణకు, ఇటీవల కేరళలో జరిగిన ఒక అవార్డు ఉత్సవంలో ఒక అమ్మాయి స్టేజీ పైకి రావడాన్ని నిరసిస్తూ ఒక ముస్లిం నాయకుడు కార్యక్రమం నిర్వాహకులను మందలించిన సంఘటన వివాదాస్పదంగా మారింది.

నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనలు

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో ముస్లింలపై దాడులు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ముస్లింల జనాభా 20 కోట్ల దాకా ఉంది.

మరో వైపు కొంత మంది సంప్రదాయ ముస్లిం వర్గాలు మతపరమైన ఉనికిని కాపాడుకునేందుకు ఛాందస ఆచారాలను సమర్ధించడాన్ని తిప్పికొట్టడం అభ్యుదయ వాదులకు కూడా కష్టంగా మారింది. దీంతో, ముస్లింల మధ్య కూడా రాజకీయ సంఘర్షణ చోటు చేసుకుంటోంది.

1950లు, 60లలో ఇతర కళాకారులతో కలిసి సంప్రదాయవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పటికీ, అదే తిరిగి దేశంలో వేళ్లూనుకుంటుందనే భయాన్ని ఆయేషా వ్యక్తం చేశారు. కేరళలో కూడా ఈ ధోరణి కనిపిస్తోందని అన్నారు.

"ఇటువంటి వైఖరులను మార్చేందుకు మేము ప్రయత్నించాం. కానీ, ఒక అమ్మాయి స్టేజీ పైకి వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం అవ్వడం చూస్తుంటే మనం తిరిగి పాత రోజులను చూస్తున్నట్లుగా ఉంది" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌ బేస్‌మెంట్లో మూసేసిన ఆ 22 గదుల్లో దాగిన రహస్యాలేంటి?

ఒక గ్రామ్‌ఫోన్‌తో మొదలు

అయేషా ఒక ధనిక కుటుంబంలో పుట్టారు. కానీ, తండ్రి మరణంతో కుటుంబం కష్టాలు పాలయింది. కుటుంబం గడవడానికి కష్టంగా ఉన్న రోజుల్లో ముస్లిం సమాజం నుంచి పెద్దగా సహాయం లభించలేదని ఆమె చెప్పారు.

జీవితం కష్టంగా ఉండేది. కానీ, ఆమెకు ఇంట్లో ఉండటం సంతోషంగానే ఉండేది. ఆమెకు 14 సంవత్సరాలు ఉండగానే 47 సంవత్సరాల వ్యక్తితో వివాహం జరిగింది. కానీ, పెళ్ళైన నాలుగు రోజులకే ఆమె ఆ వివాహం నుంచి బయటపడ్డారు.

అప్పటికే ఆమె గర్భం దాల్చినట్లు ఆమెకు తర్వాత తెలిసింది. కానీ, ఆమె విడాకులు తీసుకోవడానికి వెనుకాడలేదు.

ఒక రోజు ఆమె ఒక గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లో వస్తున్న పాటతో పాటు పాడుతూ ఉండగా, నాటక రచయత ఈకే అయాము ఇంట్లోకి ప్రవేశించారు.

అదే సమయంలో కమ్యూనిస్టుల సహకారంతో నడుస్తున్న ఒక అభ్యుదయ నాటక సమాజం రాష్ట్రంలో గుర్తింపు పొందుతోంది. వారు నాటకాలు, చైతన్యవంతమైన రాజకీయ పాటలు, ఇతర కళా రూపాలతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఇది కొంత మందికి రచనలు చేసేందుకు, నాటకాలు వేసేందుకు స్ఫూర్తి కలిగించింది.

కానీ, ఆ నాటకాల్లో పాత్రలను చాలా వరకు పురుషులు మాత్రమే ధరించేవారు.

నీలాంబుర్ ఆయేషా

ఫొటో సోర్స్, Nilambur Ayisha

ఫొటో క్యాప్షన్, నీలాంబుర్ ఆయేషా

1957లో దేశంలోనే తొలి కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రిగా ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఒకసారి నాటకాన్ని చూసి మహిళలు కూడా ఈ నాటకాల్లో పాత్రలు పోషిస్తే బాగుంటుందనే సూచనను అయాముకు చేశారు.

ఆయేషా పాడటాన్ని విన్న అయాము తన నాటకంలో (జమీలా‌) కీలకమైన గృహిణి పాత్రను పోషించమని అడిగారు.

ఆయేషా నాటకం వేసేందుకు అంగీకరించారు కానీ, ఆమె తల్లి మాత్రం మతాధికారులు తమను వెలి వేస్తారేమోనని ఆందోళన చెందారు.

"మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారెవరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదనే విషయాన్ని గుర్తు చేశాను. అలాంటప్పుడు వాళ్లకు శిక్షించే అధికారం ఎలా ఉంటుంది?" అని ప్రశ్నించినట్లు చెప్పారు.

ఆమె నటించిన నాటకం పెద్ద హిట్ అయింది. కానీ, అది చాలా మందికి ఆవేశాన్ని రగిల్చింది.

"మా పై చాలా దాడులు జరిగాయి. స్టేజీ పై కనిపించడాన్ని మత ధిక్కారంగా ముస్లిం సంప్రదాయ వాదులు భావించారు" అని ఆ నాటకంలో ఆయేషా కొడుకు పాత్రలో నటించిన వీటీ గోపాల కృష్ణన్ చెప్పారు.

ఆయేషా నటిస్తున్నప్పుడు చాలా మంది రాళ్లు విసిరారు. ఆమెను రక్షించాలని చూసిన సహనటుల పై కూడా దాడులు జరిగాయి.

ఒక సారి ప్రేక్షకుల్లోంచి ఒక వ్యక్తి స్టేజీ పైకి దూసుకొచ్చి ఆయేషాను కొట్టిన చెంప దెబ్బకు ఆమె వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బ తింది. ఆమె పై కాల్పులు జరిపిన వ్యక్తి దొరకలేదు.

నీలాంబుర్ ఆయేషా

ఫొటో సోర్స్, CV Lenin

ఫొటో క్యాప్షన్, నీలాంబుర్ ఆయేషా

ఈ దాడులు ఆమెను భయపెట్టాయా?

"అసలు భయపెట్టలేదు. నా శక్తి మరింత పెరిగింది" అని ఆయేషా అన్నారు.

"ఇదొక మానవీయ కోణం ఉన్న నాటకం. మనుషుల్లో దాగిన మంచిని బయటకు తెచ్చి, వ్యక్తుల నేపధ్యాలతో సంబంధం లేకుండా అందరినీ ప్రేమించమని చెబుతుంది. అందుకే మా బృందం పై చాలా సార్లు దాడి చేశారు" అని ఆయేషా అన్నారు.

ఆయేషా ప్రదర్శించిన ధైర్యం కేరళ చరిత్రలో ఆమెకు తిరుగులేని స్థానాన్ని ఇచ్చింది" అని ఒక సీనియర్ విలేఖరి జానీ ఓకే అన్నారు.

"ఆమె కళ, సంస్కృతి ద్వారా మార్పును తేవడానికి ప్రయత్నించిన సాంఘిక సంస్కరణోద్యమంలో పాలు పంచుకున్నారు" అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆమె ఇళ్లల్లో పని చేసేందుకు సౌదీ అరేబియా వెళ్లారు. అయితే, అక్కడ ఎంత కాలం ఉన్నారో నాకు గుర్తు లేదు" అని చెప్పారు.

ఆమె కేరళకు తిరిగి వచ్చిన తర్వాత మలయాళం చిత్రాల్లో నటించడం మొదలుపెట్టారు.

ఆమె నటనకు అవార్డులు కూడా లభించాయి. నటనకు సంబంధించిన వర్క్ షాపులు, కార్యక్రమాల్లో ప్రసంగించేందుకు కూడా ఆమెకు ఆహ్వానాలు పంపేవారు.

వెనక్కి తిరిగి చూసుకుంటే తనకేమీ చింతలు లేవని ఆమె అంటారు.

"నేను భౌతిక దాడులతో సహా అన్నిటినీ ఎదుర్కొన్నాను. 87 సంవత్సరాల వయస్సులో నేనీ ప్రపంచం ముందు గర్వంగా నిలబడగలను" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడ పాపుపుణ్యాల శాఖ అధికారులు ప్రతిరోజూ ప్రజల పాపాలు లెక్కిస్తారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)