టిప్ ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి... కొన్ని దేశాల్లో అనుసరిస్తున్న వెరైటీ పద్ధతులేంటి?

టిప్

ఫొటో సోర్స్, vinnstock/Getty Images

    • రచయిత, మైక్ మాక్ ఈచెరన్
    • హోదా, బీబీసీ కోసం

చైనా నుంచి డెన్మార్క్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో ఎదుటి వ్యక్తిని ప్రశంసించే తీరు భిన్నంగా ఉంటోంది.

టిప్ ఇచ్చే విధానంలో ప్రత్యేకమైన పద్ధతులను అనుసరిస్తోన్న ఓ అయిదు దేశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం..

అమెరికాలోని మొదటి యూనియన్ యాపిల్ స్టోర్‌ ఉద్యోగులు టిప్ ఎలా తీసుకోవాలో చిట్కాలు అడుగుతుండటంతో, ఆ దేశంలో టిప్ కల్చర్‌పై చర్చలు మొదలయ్యాయి.

ఉత్తర అమెరికాలో టిప్ సంస్కృతి తీవ్ర చర్చకు దారితీసింది. ఇది నియంత్రణ కోల్పోతుందని చాలామంది భావించారు.

ఇప్పటికే "గిల్ట్ టిప్పింగ్", "టిప్పింగ్ పాటిగ్యూ", "టిప్ క్రీప్", "వైరల్ టిప్ షేమింగ్", "టిప్‌ఫ్లేషన్" వంటి పదాలు కొత్తగా డిక్షనరీల్లోకి చేరుతున్నాయి.

టిప్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ, అమెరికన్లలా ప్రతిచోటా ఈ టిప్ సంస్కృతిని అనుసరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

స్పెయిన్‌లో ఇది వివాదానికి కూడా కారణమైంది.

ఇప్పటికే ఫ్రాన్స్‌లో "సర్వీస్ కాంప్రిస్" అనే పేరుతో సర్వీస్ చార్జీలను బిల్లుల్లో చేరుస్తున్నారు.

ఇతర ప్రదేశాలలో ముఖ్యంగా తూర్పు ఆసియాలో టిప్ తీసుకునే సంప్రదాయం ఎక్కువగా లేదు. కానీ, కొన్ని రెస్టారెంట్లలో మనకు కనిపిస్తూ ఉంటోంది.

పాతకాలం నాటి ఈ టిప్ సంస్కృతిలో గందరగోళాన్ని వివరిస్తూ, ప్రపంచంలో ప్రత్యేకమైన టిప్ విధానాలను అనుసరించే దేశాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆ దేశ ప్రజలు, వారి టిప్ విధానాలు సమాజంలో ఎలా ప్రతిబింబిస్తాయనే దాని ఆధారంగా ఈ ప్రాంతాలను ఎంపిక చేశాం.

జపాన్

ఫొటో సోర్స్, AzmanL/Getty Images

జపాన్

జపాన్ ఒక విధమైన సన్యాసి స్వర్గం, ఇక్కడ చెత్తాచెదారం మాట వినబడదు. అసంపూర్ణతనూ గౌరవిస్తారు.

ఇక్కడ సామాజిక స్పృహ ఒక కళారూపంగా ఎలివేట్ అయింది (తినే సమయంలో నడవొద్దు, ప్రజా రవాణాలో నిశ్శబ్దంగా ఉండాలి, చేతులు లేదా చాప్‌స్టిక్‌లతో సూచించొద్దు, బహిరంగంగా మీ ముక్కును చీదవద్దు)

అక్కడ టిప్పింగ్ అనేది ఇబ్బందికరమైనదిగా పరిగణిస్తారు. జపనీయులు టిప్ రహిత సేవా సంస్కృతిని కలిగి ఉన్నారు.

విదేశీ సందర్శకులకు ఇది హెచ్చరికతో తెలియజేయాల్సిన విషయం. ఎందుకంటే మీరు టిప్ చేస్తే నేరంగా చూస్తారు.

"జపాన్ టిప్ తీసుకోదని ప్రయాణికులకు చెప్పినప్పటికీ, కొంతమంది ఇప్పటికీ డబ్బులతో తమ ప్రశంసలను తెలియజేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ అలాంటిది పనిచేయదు" అని ఇన్‌సైడ్ జపాన్ టూర్స్‌కు చెందిన జేమ్స్ ముండి అన్నారు.

"రెస్టారెంట్‌లలో సిబ్బంది కోసం కస్టమర్ డబ్బును వదిలివేయడం, ఆపై సిబ్బంది రోడ్డుపై వెంబడించి, కస్టమర్ డబ్బును తిరిగి ఇవ్వడం సర్వసాధారణం.

చాలామంది ప్రజలు తమ పనిని గర్వంగా చేస్తారని అర్థం చేసుకోలేరు. ఒక 'ఓయిషికట్ట' (ఇది రుచికరమైనది), లేదా 'గోచిసో సామా' (భోజనం సిద్ధం చేసినందుకు ధన్యవాదాలు) పదాలు వారికి నచ్చుతాయి. డబ్బు ఎప్పుడూ మాట్లాడదు" అని చెబుతున్నారు.

టిప్పింగ్ పట్ల జపనీయుల విరక్తి స్పష్టంగా కనిపిస్తుంది. షోకునిన్ కిషిట్సు అంటే "హస్తకళ". ఇది జపనీయుల జీవితంలో భాగం. ఇది హోటల్ బెల్‌హాప్‌లు, ఫుడ్ కార్ట్ విక్రేతల నుంచి సుషీ చెఫ్‌లు పర్యాటకుల వరకు చాలామందికి చేరిన తత్వశాస్త్రం. సేవ అనేది అవసరాలకు సంబంధించినది. ప్రశంసలు సాధారణంగా పొగడ్తలు (జపనీస్‌లో) లేదా నమస్కరించడం ద్వారా చూపిస్తారు.

అయితే, టిప్ మరో పద్దతిలో ఇవ్వొచ్చు. జపాన్ టాటామి-మ్యాటెడ్ గెస్ట్‌హౌస్‌లలోని రియోకాన్స్‌లో నకై సాన్ (మీ ఆహారం, ఫ్యూటాన్‌ని తయారుచేసే కిమోనో ధరించిన సర్వర్) కోసం డబ్బును వదిలివేయవచ్చు.

అయితే వ్యక్తిగతంగా టిప్ అందజేయవద్దు. ప్రత్యేకంగా అలంకరించిన ఎన్వలప్‌లో కరెన్సీ పెట్టాలి.

ఈజిప్టు

ఫొటో సోర్స్, Travel/Alamy

ఈజిప్ట్

ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో బక్షీష్ లోతుగా పాతుకుపోయింది. బక్షీష్ అంటే టిప్ లేదా దాతృత్వ భిక్ష.

దీన్ని టాక్సీ డ్రైవర్ లేదా టూర్ గైడ్ అడిగినపుడు తెలుస్తుంది. లేదా బజార్‌కి వెళ్లినపుడు గుసగుసలాడుతుండగా కనిపిస్తుంది.

వాళ్లు అడిగే దానికి చివరికి అదే అర్థం వస్తుంది. వాళ్లు అందించిన సేవతో సంబంధం లేకుండా చిన్న టిప్ కోసం పిలుస్తారు.

యాచించడం అని కూడా అనవచ్చు. అయితే, పేదలకు భిక్ష ఇవ్వడం అనేది ఇస్లాంలోని ఐదు సిద్ధాంతాలలో ఒకటి.

ఈ చర్య ద్వారా దానం చేసిన వ్యక్తి పవిత్రుడు అవుతాడమే నమ్మకం.

ఈజిప్టులో రెస్టారెంట్ వర్కర్లు, టాక్సీ డ్రైవర్లు, టూర్ గైడ్‌లు, హోటల్ సిబ్బందికి మాత్రమే కాకుండా డోర్ ఓపెనర్లు, బాత్రూమ్ అటెండెంట్‌లు, సెక్యూరిటీ సిబ్బంది, దుకాణదారులకు కూడా ఇటువంటివి సర్వసాధారణం.

బక్షీష్‌ను లోతుగా పరిశీలిస్తే పే-ఇట్-ఫార్వర్డ్ సిస్టంలో భాగమని తెలుస్తుంది.

అంటే ముందుగానే టిప్ ఇస్తే టూర్ గైడ్‌లు కైరో నుంచి అస్వాన్ వరకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు, హోటల్ ద్వారపాలకులు, ఇతర సిబ్బంది అత్యున్నత సేవను అందించవచ్చు.

ఈజిప్షియన్ పౌండ్‌ల మాదిరిగానే డాలర్లు తీసుకుంటారు. ద్వారం వద్ద నవ్వుతూ కనిపించాలంటే మరో ఒకటి, రెండు డాలర్లు వదులుకోవల్సి రావొచ్చు.

ఇలా చేస్తే కింగ్స్ లోయలో తాళం వేసి ఉన్న దేవాలయం తలుపు కూడా మీ కోసం తెరుచుకోవచ్చు. మ్యూజియంలోని టాయిలెట్ తెరిచి ఉండవచ్చు. ఎందుకంటే చాలామంది ప్రయాణికులు వీటిని కనుగొనలేరు.

చైనా

ఫొటో సోర్స్, dowell/Getty Images

చైనా

బీజింగ్, షాంఘై వంటి చైనాలోని అత్యంత ఆధునిక మహానగరాలలో కూడా మూఢనమ్మకాలు, సంప్రదాయాలు కనిపిస్తుంటాయి.

ఉదార చెల్లింపులను ఆశించరు. దీనికి దూరంగా ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ టిప్పింగ్ నిషేధించారు.

నిజానికి చైనా సిద్ధాంతాలలో ప్రజలందరూ సమానమే. ఎవరూ మరొకరికి సేవకులు కాదు. వేరొకరిపై ఆధిపత్యం చాలాకాలంగా నిషిద్ధం.

చైనా గొప్ప హోటళ్లు, రెస్టారెంట్‌ల దేశంగా వృద్ధి చెందుతోంది.

అయినప్పటికీ టిప్పింగ్ పద్దతి ముఖ్యంగా తక్కువ సందర్శించే నగరాలు, పట్టణాలలో ఇప్పటికీ పలు రూపాల్లో ఉందని ఇంట్రెపిడ్ ట్రావెల్ చైనా జనరల్ మేనేజర్ మ్యాగీ టియాన్ అంటున్నారు.

"చైనాలో టిప్పింగ్ మంచి పద్దతి కాదని భావిస్తున్నప్పటికీ, కాలం మారుతోంది" అని మ్యాగీ చెబుతున్నారు.

"చైనీయులకు ఇప్పటికీ టిప్పింగ్ అలవాటు లేదు. కానీ చాలామంది విదేశీ నివాసితులు, సందర్శకులు ఉన్న పెద్ద నగరాల్లో గ్రాట్యుటీలు ఇప్పుడు ఆమోదయోగ్యమైనవే .

మీరు ఏదైనా ప్రాంతం సందర్శించినట్లయితే టూర్ గైడ్‌లు, బార్టెండర్‌లకు చిన్న మొత్తంలో టిప్పింగ్ ఇచ్చి స్వాగతిస్తారు" అంటున్నారు మ్యాగీ.

అమెరికా

అమెరికా మాదిరే చాలా దేశాలు టిప్ ఇవ్వడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాయి.

ఇది సూపర్ బౌల్ మాదిరి జాతీయ మనస్తత్వంలో పాతుకుపోయింది. కొన్నిసార్లు ఈ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం విదేశీ యాత్రికుడికి కష్టంగా ఉంటుంది.

బిల్లుకు 20-25 శాతం అదనంగా ఇవ్వడం కల్చర్ అయిపోయింది. టిప్‌ఫ్లేషన్ స్థానికులకు, సందర్శకులకు సవాళ్లు విసురుతుంది.

ఈ రోజుల్లో టిప్ ఇవ్వడం, ఆశించడం విపరీతంగా పెరిగింది. దీనికి డిజిటల్ టిప్పింగ్ కూడా తోడైంది.

గ్యాస్‌స్టేషన్‌ల నుంచి స్టార్‌బక్స్ హోటల్స్ వరకు చాలామంది రిటైలర్లు ఇప్పుడు నేరుగా బిల్లులో సర్వీస్ ఛార్జీని అదనంగా చేరుస్తున్నారు. సర్వర్లకు తక్కువ జీతం, రోజువారీ పనులపై ఆధారపడి ఉన్న గ్రాట్యుటీలే దీనికి కారణం.

మీరు సేవలను పొందితే అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు బార్ లో కూర్చున్నప్పుడు టిప్ ఇవ్వకపోతే సర్వర్ మీకు సేవ చేయడంలో వివక్ష చూపవచ్చు.

"మరెక్కడా లేని విధంగా అమెరికాలో టిప్ కల్చర్ ఉంది" అని ట్రావెల్ కోన్సీయేర్జ్ సర్వీస్ నైట్స్‌బ్రిడ్జ్ సర్కిల్‌లో మేనేజింగ్ డైరెక్టర్ పీటర్ ఆండర్సన్ అంటున్నారు.

"ఇటీవల న్యూయార్క్‌లో నేను ఒక షాప్ నుంచి వాటర్ బాటిల్ కొన్నాను. చెల్లించేటప్పుడు టిప్ అడిగారు. కానీ నేనే నీటిని తీసుకున్నాను, కౌంటర్‌కు తీసుకెళ్లి బిల్లు చెల్లించాను. 20 శాతం అదనంగా ఇచ్చేశాను.'' అని అన్నారు.

చాలాచోట్ల ఈ పద్దతి సిబ్బందికి తక్కువ వేతనం చెల్లిస్తూ, కస్టమర్‌తో ఎక్కువ ఖర్చు పెట్టించడంలో భాగమే.

అమెరికాలో 'నో టిప్పింగ్' క్యాంపెయిన్స్, సిబ్బంది అర్హతకు తగిన వేతనం పద్ధతుల వైపు మళ్లుతున్నప్పటికీ వాటి పురోగతి నెమ్మదిగానే ఉంది.

ప్రస్తుతానికి యుఎస్‌లో టిప్పింగ్ చట్టబద్ధంగా, స్వచ్ఛందంగా ఉంటుందని గ్రహించాలి. అయితే వెయిటింగ్ స్టాఫ్, ఇతర ఫ్రంట్‌లైన్ టూరిజం కార్మికులకు వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి.

టిప్

ఫొటో సోర్స్, Alexander Spatari/Getty Images

డెన్మార్క్

సమానత్వం, దాతృత్వానికి ప్రతీక గల దేశం, ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన డెన్మార్క్‌లో టిప్పింగ్ కల్చర్ పెద్దగా లేకపోవడం ఆశ్చర్యం కలిగించవచ్చు.

దీనికి గల ప్రధాన కారణాలు రెండు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల కంటే మెరుగైన సంక్షేమ వ్యవస్థ, తలసరి అధిక జీడీపీ కారణంగా పౌరులు ప్రయోజనం పొందుతారు.

అంటే సేవా సిబ్బంది, టాక్సీ డ్రైవర్లు, ఫ్రంట్‌లైన్ కార్మికులు ఒకేలా టిప్స్ లపై ఆధారపడరు. సేవపై రుసుం సాధారణంగా రెస్టారెంట్లు, హోటళ్లలో బిల్లులో చేర్చుతారు.

డెన్మార్క్‌లో టిప్పింగ్ సంప్రదాయం కానప్పటికీ స్కాండినేవియా ( నార్తర్న్ యూరప్‌లోని స్వీడన్, డెన్మార్, నార్వే దేశాలు) అంతటా టోకెన్ రూపంలో సేవను రెస్టారెంట్‌లోని బిల్లులో చేర్చడం సాధారణంగా మారింది.

ముఖ్యంగా ఐరోపాలో దాదాపు ప్రతిచోటా సేవలకు మానిటరీ టిప్ లేదా రివార్డ్ అందిస్తారు. ఇవి వారికి బంగారంతో సమానం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)