ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పాడి పశువుల నుంచి పాలు పితికిన దగ్గర నుంచి అవి పాల ప్యాకెట్ల రూపంలోకి మారి మన ఇళ్లకు చేరడానికి మధ్యలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?
రండి, పాల ప్రయాణం గురించి తెలుసుకుందాం.
విశాఖ డెయిరీ రోజూ 10 లక్షల పాలు ప్యాకెట్లను తయారు చేస్తుంది.
మొత్తం 11 జిల్లాలకు సరఫరా చేస్తుంది. ఉదయాన్నే పాడి రైతులు నిర్వహించే 4 వేల పాల సేకరణ కేంద్రాల నుంచి పాలను సేకరిస్తుంది.
పాల సేకరణ నుంచి పాల ప్యాకెట్ల ప్యాకింగ్ వరకు ఉండే దశలను, అక్కడ జరిగే పనులను విశాఖ డెయిరీ ఎండీ ఎస్వీ రమణ బీబీసీకి వివరించారు.
వివరాలు రమణ మాటల్లోనే..
‘‘పాల సేకరణ నుంచి ప్యాకెట్ వినియోగదారు ఇంటికి చేరే వరకు పాల సేకరణ, పాల ప్రాసెసింగ్, పాల ప్యాకేజింగ్, పాల రవాణా అనే నాలుగు దశలుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
1.పాలు పితికిన తర్వాత 4 డిగ్రీల వద్ద నిల్వ
రోజూ ఉదయాన్నే పాడి రైతులు ఆవు, గేదెల నుంచి పాలను పితికి వాటిని సమీప పాల సేకరణ కేంద్రాల వద్దకు తీసుకుని వెళ్తారు. అలా వచ్చిన పాలను అక్కడుండే ఫ్యాట్ చెకింగ్ మిషన్ ద్వారా ఆ పాలలో ఉన్న కొవ్వు శాతాన్ని లెక్కించి దాన్ని బట్టి రైతుకు డబ్బులు చెల్లిస్తాం. సాధారణంగా పాల సేకరణ కేంద్రాలకు వచ్చే పాలల్లో సగటున ఆవు పాలకు 4.2, గేదె పాలకు 6 శాతం వరకు ఉన్న వాటికి తొలి ప్రాధాన్యం ఇస్తాం.
ఆ పాలను ఒకటి, రెండు గంటల వ్యవధిలో సమీపంలో డెయిరీ నిర్వహించే బల్క్ కూలింగ్ సెంటర్లకు ఆటోల ద్వారా తరలిస్తాం. బల్క్ కూలింగ్ సెంటర్లలో ఈ పాలను 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తాం. ఇలా చేయడం వలన పాలలో ఉండే నాణ్యత చెడిపోదు. అక్కడ నుంచి ట్యాంకర్లలో డెయిరీకి తరలిస్తాం. ఈ ట్యాంకర్లలో కూడా 4 డిగ్రీల ఉష్ణోగ్రతే ఉంటుంది. పాలు ప్యాకింగ్‌కు వెళ్లే వరకు ఇదే ఉష్ణోగ్రతలో ఉంచుతాం.
2.సీలు తెరిచి ఉంటే ఆ పాలు తీసుకోరు
డెయిరీకి చేరుకునే ట్యాంకర్లకు సీల్ చేస్తారు. మార్గ మధ్యలో ఎవరైనా ఆ సీల్ తీసేస్తే, ఆ పాలలో నీళ్లు లేదా ఇతర పదార్థాలు కలపడం, అలాగే పాలను దొంగిలించే అవకాశం ఉంటుంది.
అందుకే డెయిరీకి వచ్చే సరికి పాల కేంద్రాల వద్ద వేసిన సీల్ లేకున్నా, అనుమానస్పదంగా అనిపించినా వాటిని డెయిరీలోకి తీసుకోం.
అలాగే పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చిన ట్యాంకర్లలోని పాల నమూనాలను సేకరించి వాటిలో ఏదైనా కల్తీ జరిగిందా అనే విషయంలో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తాం. వాటిలో కల్తీ అని తేలితే, ఆ పాలను డెయిరీలోకి అనుమతించం.
సీల్ చేసిన పాల ట్యాంకర్లు డెయిరీలోకి వచ్చిన తర్వాత వాటిని పాలను నిల్వ ఉంచే భారీ ట్యాంకర్లలోకి పంపిస్తాం. వాటిని సైలోస్ అని పిలుస్తాం. ఆ ట్యాంకర్ల నుంచే వివిధ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆ పాలను పంపిస్తాం.

3. క్రిములను చంపే ప్రాసెస్
డెయిరీకి చేరిన పాలలో వివిధ పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చినవి ఉంటాయి. వీటిలో కొన్ని అవసరం లేని క్రిములు కూడా ఉంటాయి. వాటిని తొలగించడం ప్రాసెసింగ్ యూనిట్లలోనే జరుగుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లలో క్రిములను చంపడంతోపాటు పాలలోని కొవ్వు శాతాన్ని సర్దుబాటు చేయడం లేదా ఈక్వైలైజ్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది.
సైలోస్ ట్యాంకర్ల నుంచి ప్రాసెసింగ్ యూనిట్లకు పాలను పంపుతాం. ఆ పాలను పాశ్చరైజింగ్ చేసే యంత్రాలలోకి పంపుతాం. పాశ్చరైజేషన్ అంటే పాలలో ఉండే హానికర బ్యాక్టిరీయాను చంపడం. ఇందుకోసం పాలను 75 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచుతాం. అంతే కాకుండా, ఈ పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల పాల జీవిత కాలం కూడా పెరుగుతుంది.
పాశ్చరైజేషన్ తర్వాత హోమోజినైజేషన్ జరుగుతుంది. వివిధ పాల సేకరణ కేంద్రాల నుంచి వచ్చే పాలలో వివిధ రకాలైన కొవ్వు శాతం ఉంటుంది. ఆ పాలన్నింటిని కలిపి అందులో ఉండే పరమాణువులు సమానంగా పంచబడేటట్లు చేయడమే హోమోజినైజేషన్ ప్రక్రియ. ఎక్కువ పీడనం వద్ద జరిగే ఈ ప్రక్రియ వల్ల పాలకు చిక్కదనం సమానంగా వస్తుంది.
ఇక్కడే ఆవు, గేదె పాలతోపాటు మేకలు, గొర్రెల పాలు కూడా కలపవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. వాటిని కలపవచ్చు. ఎందుకంటే వాటిలోని కొవ్వును స్టాండర్డైజ్ చేస్తాం. కాబట్టి సమస్య ఉండదు. అయితే విశాఖ డెయిరీ గొర్రెలు, మేకల పాల సేకరణ చేయదు.
హోమోజినైజేషన్ తర్వాత ’సెంట్రిఫ్యూజ్’ అనే పద్ధతిలో క్రీమ్ సెపరేటర్స్ ద్వారా పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తాం. ఇలా పాల నుంచి కొవ్వును అవసరమైన మేరకు వేరు చేసిన తర్వాత ఆ కొవ్వు నుంచి నీటిని తీసివేసి వెన్నను తయారు చేస్తాం. 20 వేల లీటర్ల పాలలో రెండు వేల లీటర్ల వెన్నను తీస్తాం.

4. ఫుల్ క్రీం, టోన్డ్ మిల్క్ అంటే..?
ఈ ప్రాసెసింగ్ తర్వాత మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా కొవ్వు శాతాన్ని టోన్డ్, క్రీమ్, స్టాండర్డ్ వంటి రకాలైన పేర్లతో మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా వాటిని ప్యాకింగ్ చేసేందుకు సిద్ధం చేస్తాం. ఆ ప్యాకెట్లు ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయో తెలుసుకునేందుకు వీలుగా వాటిని వివిధ రంగుల ప్యాకెట్లలో ప్యాక్ చేస్తాం.
ఫుల్ క్రీం మిల్క్: ఇందులో 6 శాతం కొవ్వు(ఫ్యాట్), అలాగే ఇతర పదార్థాలు (సాలిడ్స్ నాట్ ఫ్యాట్) 9 శాతం ఉంటాయి. ఇందులో ఫ్యాట్ ఎక్కుగా ఉండటం వల్ల రుచి ఎక్కువగా వస్తుంది. ఈ పాలను స్వీట్ల తయారీలో, హోటల్స్ వంటకాల్లో వాడతారు.
స్టాండర్డైజ్డ్ మిల్క్: ఇందులో 4.5 శాతం ఫ్యాట్, 8.5 శాతం ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది. ఇది క్రీడాకారులు, ఎదిగే పిల్లలు, ఎనర్జీ ఎక్కువ కావానుకునేవారికి ఉపయోగం.
టోన్డ్ మిల్క్: ఇందులో 3 శాతం కొవ్వు ఉండేటట్లు చేస్తారు. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. వృద్ధులు, పిల్లలు, యువత అందరు వాడే పాలు.
డబుల్ టోన్డ్ మిల్క్: టోన్డ్ మిల్క్‌లో కొవ్వు శాతాన్ని సగానికి తగ్గిస్తే అంటే 1.5 శాతం ఉండేటట్లు చేస్తే వాటిని డబుల్ టోన్డ్ మిల్క్ అంటారు. ఈ పాలు కార్డియో పేషెంట్లు, స్లిమ్‌గా ఉండాలని కోరుకునేవారు ఎక్కువగా వాడతారు.

24 గంటల్లోనే కస్టమర్ వద్దకు..
ఇలా ప్యాకింగైన పాలను ఎప్పటికప్పుడు వినియోగదారులకు పంపిస్తారు. పాల సేకరణ కేంద్రం నుంచి బయలుదేరిన పాలు వినియోగదారు వద్దకు ప్యాకెట్ రూపంలో 24 గంటల్లోనే పంపిస్తాం. రోజూ డెయిరీ నుంచి రాత్రి 12 దాటిన తర్వాత వివిధ ప్రాంతాలకు పాల ప్యాకెట్లను రవాణా చేస్తారు. ఉదయం 5 గంటల కల్లా వినియోగదారు ఇంటికి, లేదా పాల దుకాణాలకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. డెయిరీ నుంచి వినియోగదారుకు రవాణా అయ్యే ముందు కూడా వీటి నమూనాలు సేకరించి నాణ్యత పరీక్షలు చేస్తాం.
రవాణాకు సిద్ధంగా ఉండే పాలలో శాంపిల్స్ సేకరించి కల్తీ జరిగిందా అనేది పరీక్షిస్తాం. అలాగే అందులో ఉండాల్సిన స్థాయి కంటే ప్రిజర్వేటివ్స్, న్యూట్రాలెంట్స్ ఎక్కువ, తక్కువ ఉన్నాయా వంటి పరీక్షలు చేస్తాం. ఫలితాల్లో ఏదైనా తేడా కనిపిస్తే ఆ పాల రవాణాను నిలిపి వేస్తాం.
విశాఖ డెయిరీ రోజూ సుమారు 10 లక్షల ప్యాకెట్లు తయారు చేసి మార్కెట్‌లోకి పంపుతుంది. వీటిలో 60 నుంచి 70 శాతం వరకు అర లీటర్ ప్యాకెట్లే ఉంటాయి.
ఒక 10 శాతం బల్క్ మిల్క్ అంటే ట్యాంకర్ల ద్వారా పంపిస్తాం.
అలాగే 200 ఎంఎల్ ప్యాకెట్లు కూడా చిన్న కుటుంబాల కోసం తయారు చేస్తాం.
ట్యాంకర్లలో డెయిరీకి పాలు చేరిన తర్వాత అంతా యంత్రాల సహాయంతోనే పాల ప్యాకెట్లు తయారవుతాయి.
గంటకు 8 నుంచి 10 వేల పాల ప్యాకెట్లు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి.

డెయిరీ ఉత్పత్తులు
పాల ప్యాకెట్ల తయారీలో భాగంగా వివిధ ప్రక్రియలకు గురైన పాల ద్వారా ఉప ఉత్పత్తులు కూడా వస్తాయి. అందులో ప్రధానంగా వెన్న వస్తుంది. అలాగే ఈ వెన్నతో పాటు పాలలో ఉండే కొవ్వు శాతాన్ని బట్టి లస్సీ, స్వీట్లు, బ్రెడ్ తయారీలో వాటిని వాడతారు. ఇవన్నీ కూడా డెయిరి ఉత్పత్తులుగానే రిటైల్ సెంటర్లలో అమ్ముతున్నాం. అలాగే స్వీట్లు తయారు చేసి ప్రత్యేకంగా బేకరీలను నిర్వహిస్తున్నాం.’’
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









