ఆంబర్‌గ్రీస్: చనిపోయిన తిమింగలం కడుపులో బయటపడ్డ ఈ రాయి విలువ రూ.4 కోట్లు.. దీనికి ఎందుకంత ధర?

ఫొటో సోర్స్, IUSA-ULPGC
చనిపోయిన ఒక స్పెర్మ్ వేల్ (ఒక రకమైన తిమింగలం) పేగుల్లో శాస్త్రవేత్తలు దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే రాయిని గుర్తించారు.
స్పెయిన్‌లోని కానరీ ద్వీప సమూహానికి చెందిన లా పల్మా ప్రాంతంలో ఉన్న ఒక బీచ్‌లో ఈ వేల్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
తిమింగలం పేగుల్లో ఏర్పడిన రాయి లాంటి 9 కేజీల పదార్థం విలువ 5 లక్షల డాలర్లు ఉంటుందని స్థానిక మీడియా చెప్పింది. ఈ పదార్థాన్ని ‘ఆంబర్‌గ్రీస్’ అని పిలుస్తారు.
పేగుల్లో ఏర్పడిన ఈ రాయి కారణంగానే ఆ తిమింగలం చనిపోయింది.
13 మీటర్ల పొడవు, 20 టన్నుల బరువున్న ఈ తిమింగలాన్ని లా పల్మా ద్వీపంలోని నోగలెస్ బీచ్‌లో మే నెలలో గుర్తించారు.

ఫొటో సోర్స్, EPA
ఈ తిమింగలంపై కొన్ని వారాల పాటు ఫోరెన్సిక్ అధ్యయనాలు జరిగాయి. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ లాస్ పల్మాస్ డి గ్రాన్ కనారియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ అండ్ ఫుడ్ సేఫ్టీ (ఐయూఎస్‌ఏ) యూనివర్శిటీ పరిశోధకులు ఒక విషయాన్ని వెల్లడించారు.
పెద్ద పేగులో ఉన్న ఈ రాయి కారణంగానే పేగుల్లో అవరోధం ఏర్పడి తిమింగలం చనిపోయినట్లు గత నెలలో ఐయూఎస్‌ఏ తెలిపింది.
స్పెర్మ్ వేల్స్ తినే ఆహారం కారణంగా ఈ రకమైన రాళ్లు ఏర్పడతాయి.
సాధారణంగా స్పెర్మ్ వేల్ చాలా గట్టిగా ఉండే స్క్విడ్ బీక్స్ (పక్షి ముక్కు)ను ఆహారంగా తీసుకుంటాయి.
వాంతి చేసుకోవడం ద్వారా లేదా మలవిసర్జన ప్రక్రియలో బీక్స్‌ను బయటకు పంపించగలవు. కానీ, కొన్నిసార్లు ఇది తిమింగలాలకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది.
‘‘కిడ్నీల్లో రాయి ఏర్పడినట్లే, ఇక్కడ కూడా ఒక పదార్థం పేరుకుపోతుంది. తర్వాత అది గట్టిగా మారడం మొదలవుతుంది. బీక్ అనేది తిమింగలం శరీరం నుంచి పూర్తిగా బయటకు రాకపోతే, పేగుల పనితీరును దెబ్బతీస్తుంది. తర్వాత అది అక్కడే పేరుకుపోతుంది. తర్వాత ఒక రాయిలాగా మారడం మొదలవుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ లాస్ పల్మాస్ డి గ్రాన్ కనారియా ప్రొఫెసర్ ఆంటోనియో ఫెర్నాండేజ్ చెప్పారు.
పేగుల్లో ఏర్పడిన ఈ అవరోధం వల్ల డిఫ్‌థెరాయిడ్ కోలిటిస్ అనే ఇబ్బందితో తిమింగలం బాధపడింది. దీనివల్ల పేగుల్లోని బ్యాక్టీరియా రక్తంలో చేరడంతో అనేక అవయవాల్లో రక్తస్రావం జరిగి అది చనిపోయింది.

ఫొటో సోర్స్, VW PICS/GETTY
సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో భారీ విలువ
సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో ‘ఆంబర్‌గ్రీస్’ అని పిలిచే పదార్థానికి చాలా విలువ ఉంటుంది. దీనికి ఉండే లక్షణాల కారణంగా ఇది అధిక ధర పలుకుతుంది.
స్పెర్మ్ వేల్స్‌లో 1 నుంచి 5 శాతం మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయగలవని, అందుకే దీని విలువ భారీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
గతంలో మతపరమైన వేడుకల్లో ఈ పదార్థాన్ని ఉపయోగించేవారు. మధ్యప్రాచ్యంలో వీర్యవృద్ధి కోసం, చైనాలో రెడీ-టు-ఈట్ ఆహారపదార్థాల్లో లేదా సంప్రదాయిక ఔషధ తయారీలో వాడేవారు.
ప్రస్తుతం, దీన్ని ఎక్కువగా పర్‌ఫ్యూమ్ పరిశ్రమలోనే వాడుతున్నారు.
‘‘ఆంబర్‌గ్రీస్‌కు ఒక ప్రత్యేక వాసన ఉంటుంది’’ అని బ్రిటిష్ పర్‌ఫ్యూమ్ కంపెనీ షే అండ్ బ్లూ వ్యవస్థాపకుడు డామ్ డేవెట్టా 2015లో బీబీసీతో అన్నారు.
‘‘దాని అరోమా చాలా తీవ్రంగా ఉంటుంది. పర్‌ఫ్యూమ్‌కు అది అదనపు విలువను జోడిస్తుంది. చర్మంపై పర్‌ఫ్యూమ్ ఎక్కువ సమయం పాటు ఉండేలా ఇది సహాయపడుతుంది’’ అని ఆయన చెప్పారు.
లా పల్మా స్పెర్మ్ వేల్‌లో లభించిన రాయి పరిమాణం, బరువు ఆధారంగా దాని విలువ రూ. 4 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి:
- నాంటెరెలో ఫ్రాన్స్ పోలీసుల కాల్పులో చనిపోయిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుంటాడు?
- వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?
- అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?
- హైడ్రోజన్: పెట్రోల్-డీజిల్, విద్యుత్‌లకు ప్రత్యామ్నాయం ఇదేనా?
- ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















