వెయిట్‌ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...

వెయిట్ లాస్

ఫొటో సోర్స్, Getty Images

బరువు తగ్గడానికి మీరు చిట్కాలు పాటిస్తున్నారా? సూపర్ ఫుడ్స్ తినడమో, అప్పుడప్పుడు భోజనం మానేయడమో చేస్తున్నారా?

ఈ రోజుల్లో బరువు తగ్గించుకోవడానికి మనలో చాలామంది అనేక పద్ధతుల్లో ప్రయత్నిస్తుంటాం.

అయితే, ఇలా పాటించే పద్ధతుల్లో కొన్ని అపోహలూ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం

క్యారట్

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 1: పండ్లు, కూరగాయలు తింటే బరువు తగ్గుతాం

కూరగాయలు, పండ్లు వంటి ‘ఫ్రీ ఫుడ్స్’ తింటే బరువు తగ్గుతాం అని చాలామంది భావిస్తుంటారు.

బాగా తక్కువ కేలరీలు ఉండే ఆహారాలను ‘ఫ్రీ ఫుడ్స్’గా పరిగణిస్తుంటారు.

నిజానికి ఏ ఆహారం కూడా ‘ఫ్రీ ఫుడ్’ కాదు. ప్రతి ఆహారం కూడా ఎంతో కొంత స్థాయిలో శక్తినిస్తుంది.

బరువు తగ్గడమే మీ లక్ష్యమై, కేవలం పండ్లు, కూరగాయలే తీసుకుంటున్నా ఎంత ఎక్కువగా తీసుకుంటున్నారు, వాటితో ఎన్ని కేలరీలు శరీరానికి అందుతున్నాయో చెక్ చేసుకోవాలి.

కేలరీలకు సంబంధించి స్పష్టమైన లక్ష్యంతో పాటు, ఏం తింటున్నారో కూడా మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి.

food

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 2: వేగంగా బరువు తగ్గడానికి సూపర్ ఫుడ్స్, సప్లిమెంట్స్ ఉపయోగపడతాయి

బరువు తగ్గడానికి క్యాబేజ్ వర్గానికి చెందిన కేల్, బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ, పసుపు, బ్లూబెర్రీస్, గ్రీన్ టీ వంటి ఫుడ్స్‌పై ఆధారపడుతున్నారా? అయితే మీరు ఒక విషయం అర్ధం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఏ ఆహారం కూడా బాగా బరువు తగ్గించడానికి ఉపయోగపడదు.

రోజుకు 3 వేల కేలరీల శక్తినిచ్చే పిజ్జాలు, దాంతోపాటు మూడు బ్యాగుల కేల్ తింటున్నారనుకోండి.. అప్పుడు మీరు మీ శరీరానికి అవసరానికి మంచి కేలరీలు అందిస్తున్నట్లు లెక్క.

అంతేకాదు.. సంతృప్త కొవ్వులు, ఉప్పు అధిక మొత్తంలో అందిస్తున్నట్లు.

అలా అని ఈ ఆహారాల వల్ల ప్రయోజనాలు లేవని కాదు. అవి పోషకాలందించే ఆహారాలే.. కానీ, ఆరోగ్యకరమైన, సమతులమైన ఆహారంపై దృష్టిపెట్టాలి.

అంతేకాదు, అద్భుతాలు చేస్తాయని చెప్పే ఆహారాలపై ఆశలు పెట్టుకోరాదు. అలాంటివేవీ ఉండవు.

అన్నం

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 3: పిండిపదార్థాలు తక్కువగా ఉండే ఆహారమే మంచిది

పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్) తక్కువగా ఉండే ఆహారంతో ప్రారంభంలో బరువు వేగంగా తగ్గుతారు.

కానీ, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కార్బోహైడ్రేట్స్‌ను పూర్తిగా తగ్గించేయాల్సిన అవసరం లేదు. ఆహారంతో కార్బోహైడ్రేట్స్ కొంత మేర తగ్గించి మాంసకృత్తులుండే ఆహారంతో ఆ లోటును భర్తీ చేసుకోవాలి.

ఇది ఒకసారి ప్రయత్నించి శరీరానికి అనుకూలంగా ఉంటే కొనసాగించాలి, లేదంటే ఎప్పటిలా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారం కొనసాగించాలి.

పీచు పదార్థం(ఫైబర్) సమృద్ధిగా ఉండే హోల్ గ్రైయిన్స్ తీసుకోవడం మంచిది.

అపోహ 4: హై ప్రొటీన్ డైట్స్ ఉత్తమం

సాధారణంగా తక్కువ కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాలు తీసుకోవడంతో ఈ అపోహ ముడిపడి ఉంది.

ఆహారంలో తక్కువ కార్బొహైడ్రేట్స్ తీసుకునేవారు ప్రత్యామ్నాయంగా ప్రోటీన్స్ అధికంగా ఉండేలా చూసుకుంటారు.

శరీరానికి తగినన్ని మాంసకృత్తులు అవసరమే కానీ.. మాంసకృత్తులు అధికంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనడానికి ఆధారంగా తగనన్ని అధ్యయనాలు లేవు.

పూరీ

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 5: క్వాంటిటీ కంటే క్వాలిటీకి ప్రాధాన్యమిస్తే బరువు తగ్గుతాం

తినేది తక్కువైనా ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల బరువు తగ్గుతామని చాలామంది భావిస్తుంటారు.

పీచుపదార్థాలు, మాంసకృత్తులు సమృద్ధిగా ఉండే ఆహారం.. పండ్లు, కూరగాయాలు తినడం వల్ల తక్కువ కేలరీలకు పరిమితం కాగలమని అనుకుంటారు.

కానీ, గింజలు, ఆలివ్ ఆయిల్, కొవ్వు అధికంగా ఉండే చేపలు(ఆయిలీ ఫిష్)‌లలో కేలరీలు అధికంగా ఉంటాయి.

దానికి కారణం ఇలాంటి ఆహారాలలో మంచి కొవ్వులు(గుడ్ ఫ్యాట్స్) అధిక మొత్తంలో ఉండడమే.

ఇక బరువు తగ్గడం విషయానికొస్తే శరీరానికి శక్తినిచ్చే కేలరీలను ఎంత మేర తగ్గించుకోవాలి, కేలరీల లోటు ఏ స్థాయిలో మెంటైన్ చేయాలనేది స్పష్టత ఉండాలి.

అపోహ 6: బరువు తగ్గాలంటే ‘డైట్ ఫుడ్’ ఒక్కటే మార్గం

తక్కువ కేలరీలు కలిగి ఉండే ‘డైట్ ఫుడ్’ మంచి మార్గంలా కనిపిస్తుంది.

కానీ, మీరు తినే ఆహారం నుంచి ఎలాంటి పోషకాలు అందుతున్నాయన్నది ముఖ్యం.

పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉండే మాంసకృత్తులు(లీన్ ప్రోటీన్), పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మంచివి. దీర్ఘకాలికంగా బరువు మెంటైన్ చేయడానికి ఇవి తోడ్పడతాయి.

అపోహ 7: అందరూ ఒకే వేగంతో బరువు తగ్గుతారు

‘నా ఫ్రెండ్ వారానికి కేజీ బరువు తగ్గుతున్నారు.. నా బరువు మాత్రం తగ్గడం లేదు’ అని కొందరు చెప్తుంటారు.

అవును, అందరూ ఒకే తరహాలో బరువు తగ్గరు. ఒక్కొక్కరి శరీరానికి శక్తి అవసరాలు ఒక్కోలా ఉంటాయి.

హార్మోన్స్, తీసుకునే ఆహారం, శరీరానికి అందే లవణాల శాతం, ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు వంటివన్నీ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఒకేలాంటి ఆహారం తీసుకుంటూ, ఒకే స్థాయిలో కసరత్తులు చేసేవారంతా ఒకే వేగంతో బరువు తగ్గాలని ఏమీ లేదు.

పప్పులు

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 8: ఆరోగ్యకరమైన ఆహారానికి చాలా ఖర్చవుతుంది

కొందరు అనుకునేటట్లు ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమేమీ కాదు.

అందుబాటు ధరల్లో ఉండే పప్పులు, కూరగాయలు, తృణ ధాన్యాలు తినొచ్చు.

ప్రోటీన్స్ కోసం మాంసాహారానికి బదులు కొంతమేర పప్పులు తినొచ్చు.

ఇలా డబ్బు ఆదా చేయొచ్చు, బడ్జెట్లోనే ఆరోగ్యకరమైన ఆహారం తినొచ్చు.

అపోహ 9: తిండి తగ్గించడం కోసం ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం

బరువు తగ్గే లక్ష్యంతో భోజనం స్కిప్ చేయడం, భోజనానికి బదులు ద్రవాలు తీసుకోవడం, తక్కువ కేలరీలతో గ్యాస్ నిండిన పానీయాలు తాగడం వల్ల కొంత నష్టం ఉంది.

ఇలా చేయడం వల్ల శరీరానికి పోషకాలు అందవు. శక్తి కూడా అందదు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు కాదు.

ఇలాంటి పద్ధతికి బదులు ఆహారం తీసుకోవడానికి ముందు నీరు తాగడం కొంత నయం.

లేదంటే ఆహారానికి ముందు సూప్ తాగి తరువాత తక్కువ పరిమాణంలో ఘనాహారం తీసుకోవచ్చు.

ఎక్సర్‌సైజ్

ఫొటో సోర్స్, Getty Images

అపోహ 10: బరువు తగ్గడానికి కార్డియో ఎక్సర్‌సైజ్‌లు ఉత్తమం

బరువు తగ్గడానికి ఎక్సర్‌సైజ్ చేయాల్సిన అవసరం లేదు.

బరువు తగ్గడంలో 70 నుంచి 80 శాతం పాత్ర డైట్‌దే. అయితే, కార్డియో ఎక్సర్‌సైజ్‌లో కేలరీలు ఖర్చు చేయడం వంటి చాలా ప్రయోజనాలుంటాయి.

అయితే, కార్డియో ఎక్సర్‌సైజ్‌లతో దీర్ఘకాలంలో కండరాల బరువు పెరుగుతుంది.

ఇది ఆరోగ్యకరమైన బరువే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)