తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?

ఎమ్మా అండర్సన్

ఫొటో సోర్స్, Emma Anderson

ఫొటో క్యాప్షన్, తన పరిస్థితి క్షీణించినప్పుడు అలెక్సాను ఎలా వాడాలో చిన్నారి డార్సీకి ఎమ్మా వాట్సన్ నేర్పించారు

గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్) జరిగిన తల్లి ప్రాణాలను అలెక్సా పరికరం సహాయంతో ఆరేళ్ల పాప రెండుసార్లు కాపాడింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ తల్లి చెప్పారు.

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోకి చెందిన ఎమ్మా అండర్సన్‌కు 15 ఏళ్ల వయస్సున్నప్పుడే హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతీ అనే గుండె సమస్య ఉన్నట్లు నిర్ధరణ అయింది.

ప్రస్తుతం ఎమ్మా వయస్సు 27 ఏళ్లు.

తల్లికి గుండె ఆరోగ్యం బాగుండదనే విషయం ఎమ్మా కూతురు డార్సీకి చిన్నప్పటి నుంచే తెలుసు.

అత్యవసర సమయంలో అలెక్సా పరికరాన్ని ఉపయోగించి ఎలా సహాయం అడగాలో డార్సీకి చాలా చిన్నతనంలోనే నేర్పించారు.

తన తల్లికి ఆరోగ్యం బాలేదని చెప్పడానికి డార్సీ ఇప్పటివరకు రెండు సార్లు అలెక్సాను ఉపయోగించారు.

‘‘నేను అలెక్సాలో ఒక సెట్టింగ్ చేసి పెట్టుకున్నా. ఒకవేళ నాకు ఒంట్లో బాగా లేకపోతే, పరిస్థితి మరీ దిగజారితే వెంటనే ‘అలెక్సా, ఆస్క్ ఫర్ హెల్ప్’ అని చెప్పగానే ఆ సమాచారం మా అమ్మకు వెళ్తుంది. మా అమ్మ నాకు దగ్గర్లోనే ఉంటారు’’ అని ఎమ్మా చెప్పారు.

అలెక్సా

ఫొటో సోర్స్, Getty Images

నేర్చుకున్న దాన్ని పరీక్షించడం

అలెక్సాను ఎలా ఉపయోగించాలో నేర్పించిన తర్వాత డార్సీ సరైన సమయంలో రెండుసార్లు దాన్ని ఉపయోగించిందని ఎమ్మా తెలిపారు.

‘‘ డార్సీ రెండుసార్లు అలెక్సాను ఉపయోగించింది. ఒకసారైతే ఆమె తనంతట తానుగా అంబులెన్స్‌ను కూడా పిలిపించింది. అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది.

నాకు తనను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఆమె ఒక సూపర్ స్టార్’’ అని బీబీసీ రేడియో కార్యక్రమంలో ఎమ్మా చెప్పారు. గతంలో తన ఆరోగ్యం ఎంత చెడిపోయిందో ఆమె వివరించారు.

హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతీ సమస్య వల్ల గుండె కండరాలు ప్రమాదకరస్థాయిలో దళసరిగా మారతాయి. దీనివల్ల రక్తం సరఫరా చేయడం గుండెకు కష్టమవుతుంది.

ఈ సమస్య బయటపడినప్పటి నుంచి ఎమ్మా మందులతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఒకసారి సాధారణ చెకప్ కోసం వెళ్లిన ఆమెకు అత్యవసరంగా గుండె మార్పిడి చేయాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు.

‘‘నేను ఎప్పటిలాగే చెకప్ కోసం వెళ్లాను. కానీ, నా గుండె బాగా క్షీణించినట్లు డాక్లర్లు చెప్పారు. ఇక వేచి చూసే సమయం కూడా లేదన్నారు. వెంటనే అత్యవసర జాబితాలో నా పేరును చేర్చారు.

కొన్ని నెలల్లోనే నా గుండె పూర్తిగా విఫలమైంది. గుండె మార్పిడి చేసేంతవరకు ఒక బెలూన్ పంప్‌తో నా గుండె కొట్టుకునేలా చేసి నన్ను బతికించారు.

10 రోజుల తర్వాత, ఒక దాత గుండె అందుబాటులో ఉన్నట్లు మాకు కాల్ వచ్చింది’’ అని ఆమె వివరించారు.

ఎమ్మా వాట్సన్

ఫొటో సోర్స్, MEAN PA

ఫొటో క్యాప్షన్, స్కాటిష్ సింగర్ టామ్ వాకర్‌తో ఎమ్మా అండర్సన్

గుండె మార్పిడితో కొత్త జీవితం

2022 ఏప్రిల్‌లో స్కాట్లాండ్‌లో క్లైడ్‌బ్యాంక్‌లోని గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిలో ఎమ్మా అండర్సన్‌కు గుండె మార్పిడి జరిగింది.

గుండె సమస్య ఉన్నట్లు మొదట నిర్ధరించినప్పుడే ఆమెకు ఛాతిలో ఇంటర్నల్ డీఫిబ్రిలేటర్‌ను అమర్చారు.

గుండె మార్పిడి చేసుకోవడం తన జీవితాన్ని మార్చేసిందని, దీని తర్వాతే తన భాగస్వామి కానర్‌ను 2022 జులైలో పెళ్లి చేసుకోగలిగానని ఆమె చెప్పారు.

‘‘గుండె మార్పిడి జరిగినప్పటి నుంచి నాకు జీవితం సరికొత్తగా అనిపిస్తోంది. నేను స్కూల్ వరకు నడుచుకుంటూ వెళ్లి డార్సీని ఇంటికి తీసుకొని వస్తున్నాను. అంతకుముందు నేను ఈ పని చేయలేకపోయేదాన్ని. చాలా సులభమైన పనులను గతంలో చేయలేకపోయాను. ఇప్పుడు చేయగలుగుతున్నా’’ అని ఆమె చెప్పారు.

స్కాట్లాండ్‌లో గుండె సమస్యలతో 28 వేల మంది బాధపడుతున్నారు. వీరిలో ‘హైపర్‌ట్రాఫిక్ కార్డియోమయోపతీ’ అనేది అత్యధికుల్లో కనిపించే సమస్య అని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ తెలిపింది.

గుండె సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఆ దాతకు జీవితాంతం రుణపడి ఉంటా: ఎమ్మా

గుండె దాతకు, ఆ దాత కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మా తెలిపారు.

‘‘గుండె మార్పిడి అనేది అంత సులభం కాదు. చాలా కష్టమైన పని. నేను కొన్నిరోజులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఆధారపడ్డాను. ఆపరేషన్ తర్వాత చాలా కాలం పాటు ఇతర చికిత్సలు కూడా జరిగాయి. నా కండరాలు చాలా క్షీణించాయి. నేను కనీసం నడవలేకపోయాను. నా పెళ్లికి వారం రోజుల ముందు నేను డిశ్చార్జ్ అయ్యాను. మళ్లీ నడక నేర్చుకున్నా. నా పెళ్లిలో స్వయంగా నేనే నడుచుకుంటూ వెళ్లగలిగాను. అప్పుడు కూడా నా శరీరంపై కుట్లు ఉన్నాయి’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆసుపత్రిలో కోలుకుంటున్నప్పుడు వివిధ దశల్లో ఆమె ఫోటోలు తీసుకొని వాటిని ‘ద బెస్ట్ యెట్ టు కమ్’ అనే టామ్ వాకర్ పాటతో టిక్ టాక్ వీడియో రూపొందించారు.

ఎమ్మా అండర్సన్

ఫొటో సోర్స్, Emma Anderson

ఫొటో క్యాప్షన్, గుండె సమస్య కారణంగా ఎమ్మా అండర్సన్ చాలా కాలం పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది

ఆమె రూపొందించిన వీడియో చూసిన టామ్ వాకర్ కదిలిపోయారు. ఆయన స్వయంగా ఆమెను లండన్‌కు ఆహ్వానించారు.

‘‘టామ్ నన్ను సంప్రదించారు. లండన్ రావాల్సిందిగా కోరారు. తను చేస్తున్న వీడియోలో భాగం కావాలని నన్ను అడిగారు’’ అని ఆమె చెప్పారు.

తనకు గుండెను దానం చేసిన కుటుంబానికి కృతజ్ఞతలు తెలపడానికి మాటలు చాలట్లేదని ఎమ్మా అన్నారు.

ఆమెకు గుండె మార్పిడి జరిగిన ఆసుపత్రి డైరెక్టర్ గోర్డెన్ జేమ్స్ మాట్లాడుతూ, ‘‘జాతీయ ఆరోగ్య సర్వీసులకు 75 ఏళ్లు పూర్తయ్యాయి. స్ఫూర్తిదాయకమై ఎమ్మా కథ ఈ సర్వీసులు ఆరోగ్య రక్షణ రంగంలో ఎంత కీలకమో చెబుతోంది’’ అన్నారు.

వీడియో క్యాప్షన్, ఇయర్ ఫోన్స్ వల్ల వచ్చే 5 సమస్యలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)