'చందమామ రావె' అని మనం పిలుస్తుంటే భూమికి దూరం జరుగుతున్న చంద్రుడు

చందమామ

ఫొటో సోర్స్, Getty Images

వందల కోట్ల ఏళ్ల కిందట భూమిపై ఒక రోజంటే 13 గంటల కంటే తక్కువ సమయమే ఉండేది. దీనికి కారణం చంద్రుడు, భూమి మీద ఉండే మహాసముద్రాల మధ్య సంబంధమే.

మానవ చరిత్ర యావత్తు చంద్రుడికి, భూమికి మధ్య విడదీయరాని సంబంధం కొనసాగుతూనే ఉంది. చంద్రుడి ఆకర్షణ శక్తి కారణంగా భూమి మీద సముద్రాలలో ఆటుపోట్లు ఏర్పడుతుంది.. అలలు ఎగసిపడుతుంటాయి.

అంతేకాదు, భూమిపై అనేక నిశాచర జీవజాతుల మనుగడ చంద్రుడి వెన్నెలలోనే. అనేక నాగరికతలు చాంద్రమానం ఆధారంగానే క్యాలండర్‌లు పాటించాయి.

భూమిపై జీవం ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులు ఉండడం కూడా చంద్రుడి వల్లే సాధ్యమైందంటాయి కొన్ని సిద్ధాంతాలు. వివిధ వాతావరణ వ్యవస్థలు జీవంపై ప్రభావం చూపడానికి కూడా భూమి చుట్టూ చంద్రుడి అసాధారణ కక్ష్యే కారణమన్న వాదనలున్నాయి.

కానీ, చంద్రుడు కూడా క్రమంగా మన పట్టు నుంచి జారిపోతున్నాడు. భూమికి దూరం దూరం జరుగుతున్నాడని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీన్నే లూనార్ రెసిషన్ అంటున్నారు. అపోలో మిషన్ వ్యోమగాములు, శాస్త్రవేత్తలు ఇటీవల చంద్రుడు భూమి నుంచి ఎంత వేగంగా దూరం జరుగుతున్నాడన్నది కచ్చితంగా లెక్కించారు.

చంద్రుడు ఏడాదికి 1.5 అంగుళాలు ( 3.8 సెం.మీ.) దూరంగా వెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దానివల్ల భూమిపై రోజులో కాలం స్వల్పంగా పెరుగుతోంది.

‘ఇవన్నీ ఆటుపోట్ల గురించే’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని రాయల్ హాలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసే డేవిడ్ వాల్తామ్ చెప్పారు. భూమి, చంద్రుడి మధ్య సంబంధంపై ఆయన అధ్యయనం చేస్తుంటారు.

‘చంద్రుని కారణంగా మహాసముద్రాలలో ఏర్పడే అలలు, ఆటుపోట్ల కారణంగా భూభ్రమణ వేగం తగ్గుతుంది. చంద్రుడు ఆ శక్తిని కోణీయ వేగంగా పొందుతాడు’ అన్నారు వాల్తామ్. ఒక అక్షం చుట్టూ ఏదైనా తిరుగుతున్నప్పుడు దాని వేగాన్ని కోణీయ వేగం అంటారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Steven Saphore/Anadolu Agency/Getty Images

భూకక్ష్యలో తిరిగే చంద్రుడి ఆకర్షణ శక్తికి సముద్రాలలో ఆటుపోట్లు కలుగుతాయి. భూకక్ష్యలో చంద్రుడు తిరిగే వేగం కంటే ఎక్కువ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటుంది. చంద్రుని ఆకర్షణతో పాటు సముద్ర బేసిన్‌లోని ఘర్షణలు అలలు చంద్రుడి దిశగా పైకి ఎగసేందుకు కారణమవుతాయి.

అదే సమయంలో భూమి గురుత్వాకర్షణ వల్ల అవి తిరిగి కిందకు పడతాయి. ఈ ప్రక్రియలో భూమి తాలుకా భ్రమణ శక్తి నెమ్మదిస్తుంది. ఫలితంగా భూ భ్రమణం నెమ్మదిస్తుంది.. అది చంద్రుడు శక్తి పుంజుకోవడానికి కారణమవుతుంది. అలా శక్తి పుంజుకొన్న చంద్రుడు భూమి ఆకర్షణ శక్తికి కొంత దూరంగా వెళ్లగలుగుతాడు.

ఈ మార్పు కారణంగానే భూమి రోజు నిడివి స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. 1600 సంవత్సరం నాటి నుంచి లెక్కిస్తే భూమిపై రోజులో కాలం నిడివి సగటున శతాబ్దానికి 1.09 మిల్లీ సెకండ్ల మేర పెరిగింది. మరికొన్ని ఇతర సిద్ధాంతాలు, గ్రహణాల ఆధారంగా వేసిన ప్రాచీన లెక్కల ప్రకారం ఈ సమయం కాస్త ఎక్కువగా ఉంది. శతాబ్దానికి 1.78 మిల్లీ సెకండ్ల మేర సమయం పెరుగుతున్నట్లు ఈ లెక్కలు చెప్తున్నాయి.

సాధారణంగా ఇది చాలా స్వల్పంగా కనిపిస్తున్నా నాలుగైదు వందల కోట్ల సంవత్సరాల భూమి చరిత్రను చూసినప్పుడు మార్పు కనిపిస్తుంది.

సౌర వ్యవస్థ ఏర్పడిన తరువాత తొలి 5 కోట్ల సంవత్సరాల లోపే చంద్రుడు ఆవిర్భవించినట్లు అంచనా. భూమి పూర్తి రూపం దాల్చకముందే దాన్ని అంగారక గ్రహం పరిమాణంలో ఉండే థీయా అనే మరో ఖగోళ వస్తువు ఢీకొందని, అలా ఢీకొనడం వల్ల విరిగిన శకలాల నుంచి చంద్రుడు ఏర్పడినట్లు విస్తృతామోదం పొందిన సిద్ధాంతం ఒకటి ఉంది.

ప్రస్తుతం చంద్రుడు భూమి నుంచి ఉన్న దూరం కంటే వందల కోట్ల సంవత్సరాల కిందట ఇంకా దగ్గరగా ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి.

చంద్రుడు ప్రస్తుతం భూమి నుంచి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇటీవలి ఓ అధ్యయనం ప్రకారం 320 కోట్ల సంవత్సరాల కిందట చంద్రుడు భూమి నుంచి 2,70,000 కిలోమీటర్ల దూరంలోనే ఉండేవాడు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Nicolas Economou/Getty Images

‘‘వేగంగా తిరిగిన భూమి వల్ల రోజులో సమయం తగ్గింది. నేటి లాగా కాకుండా 24 గంటల వ్యవధిలో రెండుసార్లు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఉండేవి.’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనా చేపట్టిన అధ్యయనానికి నేతృత్వం వహించిన జియోఫిజిస్ట్ టామ్ యూలెన్ఫెల్డ్ తెలిపారు.

దీని వల్ల పగలు, రాత్రి పూటల మధ్యనుండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం తగ్గి ఉండొచ్చు. కిరణజన్య సంయోగక్రియ జీవుల బయోకెమిస్ట్రీపై ప్రభావం పడి ఉంటాదని ఆయన అన్నారు.

అయితే, లూనార్ రెసిషన్ రేటు స్థిరంగా కొనసాగడం లేదని, కొన్నిసార్లు ఇది వేగంగా, కొన్ని సార్లు నెమ్మదిగా ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.

సుమారు 550 నుంచి 625 మిలియన్ ఏళ్ల క్రితం చంద్రుడు ఏడాదికి 7 సెంటిమీటర్ల దూరం జరిగి ఉండొచ్చని అర్జెంటీనాకు చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సాల్టా జియోలాజిస్ట్ వనినా లోపెజ్ డే అజారేవిచ్ అన్నారు.

‘‘భూమి నుంచి దూరంగా వెళ్తోన్న చంద్రుని దూరం కాలానికి అనుగుణంగా మారింది. భవిష్యత్‌లో కూడా ఈ మార్పు ఉంటుంది’’ అని యూలెన్ఫీల్డ్ అన్నారు. చరిత్రను తీసుకుంటే, ప్రస్తుతం ఉన్న దాని కంటే నెమ్మదిగా వెనక్కి జరుగుతున్నట్లు కనిపిస్తుంది.

రెసిషన్ సాధారణంగా గరిష్టంగా ఉన్న ఈ కాలంలో మనం నివసిస్తున్నామని, ప్రస్తుత రేటుతో వెనక్కి జరుగుతున్న చంద్రుడు ఈ స్థానానికి చేరుకోవాలంటే 150 బిలియన్ ఏళ్లు పట్టిందని అన్నారు.

కానీ, 450 కోట్ల ఏళ్ల క్రితం చంద్రుడు పుట్టినప్పటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందని, గతంలో ఇది చాలా నెమ్మదిగా జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది.

మనం అంచనా వేసిన దాని కంటే మూడింతలు ఎక్కువగా చంద్రుని కారణంగా మహాసముద్రాలలో ఏర్పడే అలలు, ఆటుపోట్ల వేగం ఉండొచ్చని వాల్తామ్ అన్నారు.

అట్లాంటిక్ మహా సముద్రం పరిణామం దీనికి కారణమై ఉండొచ్చు.

‘‘ఒకవేళ ఉత్తర అట్లాంటిక్ కాస్త వెడల్పుగా లేదా సన్నగా ఉంటే ఇలా జరగదు’’ అని వాల్తామ్ చెప్పారు.

ఒకవేళ మీరు మిలియన్ ఏళ్ల వెనక్కి వెళ్తే, ఖండాలు వివిధ రకాల స్థానాల్లో ఉండటం వల్ల ఆటుపోట్ల బలం అప్పటికప్పుడే తగ్గిపోయేదని అన్నారు.

కానీ, భవిష్యత్‌లో వీటి మార్పులు కొనసాగవచ్చు. కొత్త అలల ప్రతిధ్వని ఇప్పటి నుంచి మళ్లీ 150 మిలియన్ ఏళ్లకు సంభవించవచ్చు. సరికొత్త ‘‘సూపర్ కాంటినెంట్’ విధానాల్లో ఇప్పటి నుంచి సుమారు 250 మిలియన్ ఏళ్లకు ఈ ప్రతిధ్వని కనుమరుగు కావొచ్చు.

చంద్రుడు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం ఉన్న అధిక తిరోగమన రేటులో కూడా చంద్రుడు భూమిని పూర్తిగా విడిచిపెట్టే దూరంగా వెళ్లే అవకాశం లేదు. ఇది జరగడానికి 5 నుంచి 10 బిలియన్ సంవత్సరాలకు ముందే సూర్యుని స్వీయ విధ్వంసం చోటు చేసుకుంటుంది. అప్పటికే మనుషులు నశించే అవకాశం ఉంటుంది.

అయితే, అంతకన్నా ముందే, మానవ చర్యల ద్వారా వాతావరణ మార్పులు ఏర్పడటం, హిమనీ నదాలు కరగడం వంటివి కూడా రోజు వ్యవధిని తగ్గించడానికి దోహదపడతాయి.

ప్రాథమికంగా మంచు ఆటుపోట్లను తగ్గిస్తుందని వాల్తామ్ అన్నారు. సుమారు 600-900 మిలియన్ సంవత్సరాల కిందట, భూమి స్నోబాల్ ఎర్త్ అని పిలిచిన కాలంలో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వీటి కారణంగా చంద్రుని తిరోగమన రేటులో మందగమనం కనిపిస్తుంది. అయితే, దీన్ని అంచనా వేయడం కష్టం. ఎందుకంటే వీటి వెనక సంక్లిష్టమైన అనేక చర్యలుంటాయి.

ఒక విధంగా చెప్పాలంటే, నాసా పంపబోయే ఆర్టెమిస్‌ వ్యోమనౌకలో చంద్రుడిని చేరుకునే వ్యోమగాములు, 60 ఏళ్ల కిందట తమ పూర్వీకులు చూసినదానికన్నా దూరం నుంచి భూమిని చూస్తారు.

(అయితే, భూమి చుట్టూ ఉన్న చంద్రుని దీర్ఘ వృత్తాకార కక్ష్య ఈ దూరాన్ని నిర్ణయిస్తుంది. దాని అతి సమీప, అతి దూర బిందువుల మధ్య దూరం ప్రతి 29 రోజులకు 43,000 కి.మీ. మారుతూ ఉంటుంది)

కానీ, మనలాంటి సామాన్యులకు గడుస్తున్న ప్రతి రోజుకు కొన్ని పీకో సెకండ్ల (ఒక సెకండ్‌లో ట్రిలియన్ వంతు ) కాలం జత అవుతుండటాన్ని గుర్తించడం కష్టం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)