మరో స్కైలాబ్ 'ఐఎస్ఎస్': 2031లో భూమి మీద నిప్పుల వాన కురిపిస్తుందా, ఎక్కడ?

ఫొటో సోర్స్, NASA
- రచయిత, జోనాథన్ ఓకలహాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫుట్‌బాల్ మైదానమంత సైజులో, 200 ఏనుగుల కంటే బరువున్న ఒక భారీ ప్రయోగశాల అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ మానవాళికి సేవలందిస్తోంది. అయితే, కాలం తీరిన ఆ ప్రయోగశాలను తిరిగి భూమి మీదికి తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. మరి దానిని అంతరిక్షంలోనే ఉంచితే ఏమవుతుంది? దానికి భవిష్యత్తు ఉందా?
ఇప్పటికి ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2031లో 400 టన్నుల బరువున్న ఈ లోహపు ప్రయోగశాల నిప్పులు చిమ్ముకుంటూ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతంలో కూలిపోతుంది.
దాని అవశేషాలు సముద్రంలో కొన్నివేల కిలోమీటర్ల విస్తీర్ణంలో పడిపోతాయి. దీంతో మానవ చరిత్రలో మనిషి నిర్మించిన ఒకానొక ఘనమైన ప్రాజెక్టు చరిత్రలో కలిసిపోతుంది. అదే- ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్).

ఫొటో సోర్స్, NASA
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎవరిది?
1998లో నిర్మితమైన ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను ఇప్పటివరకు 20 దేశాలకు చెందిన 250 మందికి పైగా వ్యోమగాములు సందర్శించారు. తొలి సందర్శకుడు 2000 నవంబరులో అక్కడికి చేరుకున్నారు. ‘‘ఈ స్పేస్ స్టేషన్ ఒక ఘన విజయం’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అధిపతి జోసెఫ్ యాష్‌బాకర్ అన్నారు.
ఈ ప్రాజెక్టులో డజనుకు పైగా దేశాల భాగస్వామ్యం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం సాగించిన అమెరికా, రష్యా కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.
సోవియట్ రష్యా పతనం తర్వాత కొన్నాళ్లకే అమెరికా, రష్యా కలిసి పనిచేసిన ప్రాజెక్టు ఇది. ‘‘ఇదొక అంతర్జాతీయ ఘన విజయం’’ అని నాసా సైన్స్ సెంటర్ మాజీ అధిపతి థామస్ జూబోఖన్ అన్నారు.
ప్రస్తుతం ఈ స్పేస్ స్టేషన్‌లో ఉన్న హార్డ్‌వేర్ దశాబ్ధాల కిందటిది. దీనివల్ల అంతరిక్ష కేంద్రం కక్ష్యలో నియంత్రణ కోల్పోవచ్చన్న ఆందోళన ఉంది.
1985లో సోవియట్ యూనియన్ పంపిన సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నియంత్రణ కోల్పోయిన ఈ అంతరిక్ష కేంద్రానికి ఇద్దరు వ్యోమగాములు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మరమ్మతు చేసి తిరిగి గాడిన పెట్టారు.
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు’’ అని అమెరికాలోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంకు చెందిన స్పేస్ హిస్టారియన్ కేథీ లెవీస్ చెప్పారు.

ఫొటో సోర్స్, NASA
ప్రమాదాన్ని తప్పించగలమా?
అంతరిక్షంలో అలాంటి దుస్థితి మరోసారి ఎదురుకాకుండా ఉండాలంటే, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌ను 2031 నాటికి భూమి మీద కూల్చేయాలి. దీనిని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ ప్రయత్నమంటూ జరిగితే, ఇది చరిత్రలోనే అతి పెద్ద రీఎంట్రీ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనికి అవసరమైన స్పేస్‌టగ్‌ను డెవలప్ చేయడానికి నిధులు కావాలని అమెరికా కాంగ్రెస్‌ను నాసా కోరింది. స్పేస్‌టగ్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భూవాతావరణంలోకి తీసుకువచ్చే ఒక అంతరిక్ష నౌక.
ఈ ప్రాజెక్టుకు బిలియన్ డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు ) ఖర్చవుతుందని అంచనా వేసినట్లు నాసాకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం హెడ్ కాథీ లూడర్స్ అన్నారు.
స్టేషన్‌ను భూమి మీద కచ్చితంగా ఎక్కడ పడేలా చేయాలో ఆలోచించడమే పెద్ద పని. భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద వస్తువులు కూడా కాలిబూడిదైన సందర్భాలు ఉన్నాయి. 2001లో రష్యాకు చెందిన మిర్ అంతరిక్ష కేంద్రం, 1979లో నాసా పంపిన స్కైలాబ్ అలాంటి వాటిలో ప్రముఖమైనవి.
ఐఎస్ఎస్‌తో మరో సమస్య కూడా ఉంది. ఇది మిర్ కంటే మూడు రెట్లు పెద్దది. "నిజంగా ఇది పెద్ద సవాలే " అని అమెరికాలోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో పని చేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ అన్నారు.
"400 టన్నుల వస్తువు ఆకాశం నుంచి పడిపోవడం చిన్న విషయం కాదు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే ఆలస్యమైందా?
1998లో రష్యా సొంతంగా జర్యా మాడ్యూల్‌ను నిర్మించింది. ఇప్పుడా స్టేషన్ భారీగా విస్తరించింది. దీనికి మరో 16 మాడ్యూళ్లు జతయ్యాయి. అలాగే భారీ సోలార్ ప్యానెళ్లు, వేడిని తగ్గించడానికి రేడియేటర్‌లాంటివన్నీ ఇందులో ఉన్నాయి. 109 మీటర్ల పొడవుతో ఇది ఫుట్‌బాల్ మైదానమంత ఉంటుంది. ఇది అంతరిక్షంలో నిర్మించిన అతిపెద్ద మానవ నిర్మాణం.
"ఒక రకంగా ఇది గిజా పిరమిడ్‌ల వంటిది" అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ఆస్ట్రాలిటికల్‌లో అంతరిక్ష విశ్లేషకురాలు లారా ఫోర్జిక్ అన్నారు.
ఐఎస్ఎస్ జీవితకాలాన్ని ఇప్పటికే అనేకసార్లు పొడిగించారు. అయితే 2030కి మించి పొడిగించడం ప్రమాదకరమని చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనిని తిరిగి సరైన కక్ష్యలో ప్రవేశపెట్టడానికి డజన్ల కొద్దీ బూస్టింగ్ స్పేస్‌క్రాఫ్ట్‌లు అవసరమని, బదులుగా దీనిని భూమి మీదకు తీసుకురావడమే సులభమని నాసా నిరుడు విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది.
ఎప్పుడు మొదలవుతుంది?
ఐఎస్ఎస్‌ను భూమి మీదకు రప్పించే పని 2026లో మొదలవుతుంది. 2030 నాటికి గంటకు 400 కి. మీ. వేగం నుంచి 320 కి.మీ. వేగంతో భూమి మీదకు పడిపోతుంది.
‘‘అంతకు ముందే స్పేస్ స్టేషన్‌కు చివరిసారిగా సిబ్బందిని పంపి అక్కడి నుంచి తీసుకురావాల్సిన వస్తువులు, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పరికరాలను వెనక్కి తెప్పిస్తారు. తద్వారా స్పేస్ స్టేషన్ బరువు కూడా తగ్గుతుంది’’ అని యాష్‌బాకర్ అన్నారు. ఈ వ్యవహారం ఇంకా చర్చల దశలోనే ఉందన్నారాయన.
సిబ్బంది చివరిసారి వెళ్లి వచ్చిన తర్వాత స్టేషన్ ఎత్తు 280 కి.మీ.కు తగ్గుతుంది. అప్పటికి అది నో రిటర్న్ పాయింట్‌కు చేరుతుంది. అక్కడున్న వాతావరణ పరిస్థితి కారణంగా స్పేస్ స్టేషన్ భూవాతావరణంలోకి రాలేదు. రష్యాకు చెందిన ప్రోగ్రెస్ స్పేస్‌క్రాఫ్ట్ సహకారంతో ఐఎస్ఎస్‌ను భూవాతావరణంలోకి తిరిగి తీసుకురావాలని ప్రణాళిక వేసుకున్నారు.
ఈ మొత్తం ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంది.
అయితే, ఈ ప్రోగ్రెస్ స్పేస్ క్రాఫ్ట్స్‌లో తలెత్తున్న ఇబ్బందులు, అమెరికా, రష్యా మధ్య రాజకీయ విభేదాల కారణంగా, ప్రస్తుతం నాసా తన స్పేస్‌టగ్‌ను దీనికి ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.
‘‘నాసా ఇప్పుడు రష్యాను నమ్ముకుని ముందుకెళ్లాలని అనుకోవడం లేదు’’ అని యూఎస్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఎయిర్ అండ్ స్పేస్ స్టడీస్ లో స్పేస్ పాలసీ నిపుణుడు వెండీ విట్‌మన్ కాబ్ అన్నారు. 2025 నాటికి తాను ఐఎస్ఎస్ నుంచి తప్పుకుంటానని రష్యా ఇప్పటికే సంకేతాలిచ్చింది.
ఏ వ్యోమనౌకను ఉపయోగించినా, చివరి పుష్ తర్వాత స్పేస్ స్టేషన్ 120 కి.మీ. ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడ చిక్కనైన భూ వాతావరణాన్ని తాకుతుంది. అప్పటికి దానివేగం గంటకు 29 వేల కిలోమీటర్లు ఉంటుంది.
హెడ్ విండ్ ఎక్కువగా ఉండటం వల్ల మొదట సౌర ఫలకాలు దెబ్బతింటాయని మెక్‌డోవెల్ చెప్పారు. మిర్ అంతరిక్ష కేంద్రం అనుభవాలను బట్టి భూమికి 100 కి.మీ.ఎత్తులో ఈ ఘటన జరుగుతుందని అంచనా. ఈ ఫలకలు క్రష్ అయిపోవడానికి కొద్ది నిమిషాల సమయం పడుతుంది.
భూమికి 80 కి.మీ.ఎత్తులో మాడ్యూల్ వేల డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరి ముక్కలు కావడం మొదలవుతుంది. అందులోని లోహపు యంత్రాలన్నీ కరిగిపోతాయి. అవి ఉల్కాపాతంలాగా ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతూ భూమివైపు దూసుకొస్తాయి.
మిర్ అంతరిక్ష కేంద్రం భూవాతావరణంలోకి వచ్చినప్పుడు ఏర్పడిన అగ్గిరవ్వలు ప్రజలను అబ్బురపరిచాయి. అయితే, ఐఎస్ఎస్ దానికి మూడు రెట్ల పరిమాణంలో ఉండటంతో, అది భూవాతావరణంలోకి ప్రవేశించడం మరింత అద్భుతంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, NASA
ప్రమాదం ఎంత ?
ఐఎస్ఎస్‌ను భూమి మీద కూల్చడం అంతా అనుకున్న ప్రకారం జరిగితే మానవాళికి ఎలాంటి ప్రమాదం జరగదు.
ఒకవేళ ఏదైనా ఉపగ్రహాన్ని భూమి మీదకు తెస్తున్నప్పుడు భస్మం కాకుండా ఉంటే, అది శాటిలైట్ల శ్మశానంగా చెప్పుకునే పాయింట్ నెమో (ఇది న్యూజీలాండ్, దక్షిణ అమెరికాల మధ్య ఉంటుంది) వద్ద కూలుతుంది. అంతరిక్షం నుంచి వచ్చే వాటిని సురక్షితంగా డంప్ చేయడానికి ఈ ప్రాంతాన్ని వాడుతుంటారు. ఇది మనుషుల ఉనికికి దూరంగా ఉంటుంది. సముద్ర ప్రవాహాల తీవ్రత కారణంగా ఇక్కడ పోషకాలు కూడా తక్కువ ఉండటంతో సముద్ర జీవుల సంచారం కూడా తక్కువగా ఉంటుంది.
ఐఎస్ఎస్ భారీగా ఉండటంతో శిథిలాలు పడే విస్తీర్ణం సుమారు ఆరు వేల కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడటం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ‘‘ విమానాలు, ఓడల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది’’ అని మెక్‌డోవెల్ అన్నారు.
సోలార్ ప్యానెళ్లు ఊడిపోవడం దగ్గర్నుంచి, పాయింట్ నెమోలో అది నీళ్లను తాకే వరకు దాదాపు 40 నిమిషాల టైమ్ పడుతుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, NASA
సముద్రానికి వదిలేయాలా?
చూడటానికి ఇది అద్భుత దృశ్యమే అయినా, దీని నుంచి పడిపోయే వస్తువులు, లేదా చెత్త గురించి కొందరు ఆందోళన చెందుతున్నారు. పైగా ఇందులో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. ‘‘ ఇవన్నీ నీటి పాలయ్యే వస్తువులే. వీలైనన్ని వస్తువులను తిరిగి ఉపయోగించడం గురించి ఆలోచించాలి’’ అని జాన్ క్లీన్ అన్నారు. ఆయన జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో స్పేస్ పాలసీ నిపుణుడు.
2022 చివరలో అమెరికాలోని సిస్‌లూనార్ ఇండస్ట్రీస్, ఆస్ట్రోస్కేలాంటి సంస్థలు భాగస్వాములుగా ఉన్న గ్రూప్ ఒకటి అమెరికా ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చింది.
అంతరిక్షంలో కొత్త నిర్మాణాలు లేదా స్పేస్ వెహికల్స్‌ను తయారు చేయడానికి స్పేస్ స్టేషన్‌లోని కొంత లోహాన్ని కరిగించడం లేదా మొత్తం మాడ్యూళ్లను వేరు చేయడంలాంటివి చేయవచ్చని సూచించింది.
‘‘దీనికి కచ్చితంగా అవకాశం ఉంటుందని మేం భావిస్తున్నాం. అంతరిక్షంలో సాల్వేజ్ యార్డ్‌ను నిర్మించాలనుకుంటున్నాం" అని సిస్‌లూనార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యారీ కాల్నాన్ అన్నారు.
"కొత్త, వినూత్న ఆలోచనలను మేం ఆహ్వానిస్తున్నాం. అయితే, ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనలూ మా దగ్గరకు రాలేదు’’ అని నాసా ప్రతినిధి ఒకరు అన్నారు.
ప్రస్తుతానికి ఐఎస్ఎస్ మొత్తాన్ని పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేయాలన్న ప్రతిపాదనైతే ఉంది. దశాబ్దాలపాటు సేవలందించిన ఈ ఐఎస్ఎస్ నిప్పులు చిమ్ముకుంటూ, ప్రజలకు కనువిందు చేసుకుంటూ నేల మీద రాలిపోతుంది.
2031లో మీరు గనక పసిఫిక్ మహాసముద్రంలో జనాలు వెళ్లని ఆ ప్రాంతంలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. కరిగిన లోహాల ముక్కలు మీ మీదకు దూసుకురావచ్చు.
‘‘అది ఎవరూ ఆపలేని ఒక బాణాసంచా వేడుక, మీడియాకు ఒక అద్భుతమైన ఘటన’’ అని మెక్‌డోవెల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: 'పోలీసుల ఎన్కౌంటర్లో హిందూ యువకుడు మృతి'.. అసలేం జరిగింది?
- సూర్య, చంద్ర గ్రహణాలు కాకుండా వేరే గ్రహణాలు కూడా ఉంటాయా, ఎలా ఏర్పడతాయి?
- ప్రపంచ బ్యాంకును పర్సనల్ లోన్ అడగొచ్చా, ఆ బ్యాంకు ఎలా పని చేస్తుంది?
- భూమిని గ్రహ శకలం ఢీకొడితే కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండవు. అప్పుడు మనుషులు ఏం తిని బతకాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















