బృహస్పతి చంద్రుళ్లపై పరిశోధనకు 'జ్యూస్'‌.. అక్కడ జీవం ఉందా?

జ్యూస్

జూపిటర్ (బృహస్పతి, గురుగ్రహం) వ్యవస్థే గమ్యస్థానంగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ(ఈఎస్ఏ) అంతరిక్ష నౌకను విజయవంతంగా ప్రయోగించింది.

బృహస్పతి ఉపగ్రహాలపై పరిశోధనకు ఈఎస్‌ఏ ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఈ అంతరిక్ష నౌకను 'జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్‌' అని సంక్షిప్తంగా 'జ్యూస్' అని పిలుస్తున్నారు.

జూపిటర్‌ ఉపగ్రహాల మీద జీవం ఉందా లేదా అనేది కనిపెట్టడమే ఈ మిషన్ లక్ష్యం.

ఫ్రెంచ్ గయానా నుంచి ఏప్రిల్ 13నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక వాయిదా పడింది.

ఏప్రిల్ 14న అరియాన్ 5 అనే రాకెట్ ద్వారా జ్యూస్‌ను అంతరిక్షంలోకి పంపించారు.

స్పేస్‌క్రాప్ట్ ఆ ఉపగ్రహాలను చేరుకోవడానికి ఎనిమిదేళ్లు పడుతుంది.

బృహస్పతి చుట్టూ తిరిగే మంచు చంద్రుళ్ల ఉపరితలం కింద ద్రవరూప సముద్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అరియాన్ 5 రాకెట్ జ్యూస్‌ను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరియాన్ 5 రాకెట్ జ్యూస్‌ను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లింది

ఫ్రెంచ్ గయానా తీర ప్రాంతం కౌరౌ నుంచి రాకెట్ లాంచ్ చేశారు. జ్యూస్ ఆకాశంలోకి వెళ్లే అద్భుతాన్ని వీక్షించేందుకు కౌరౌ బీచ్‌లో జనం గుమికూడారు.

బుగబుగమని పొగ వదులుతూ అరియాన్ 5 ఆకాశంలోకి దూసుకెళ్లడం అద్భుత దృశ్యమని చూసినవారు సంబరపడ్డారు. బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త రెబెకా స్మిత్ కూడా ఇందులో భాగం పంచుకున్నారు.

రాకెట్ జ్యూస్‌ను అంతరిక్షంలో నిర్ణీత మార్గంలో విడిచిపెట్టినట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ధృవీకరించింది.

భూమి నుంచి బృహస్పతిని చేరుకోవడానికి జ్యూస్ 643 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

జ్యూస్ ప్రయోగం

ఫొటో సోర్స్, ESA

రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళిన 26 నిమిషాల తరువాత జ్యూస్ విజయవంతంగా విడివడి నిర్ణీత మార్గంలోకి ప్రవేశించింది.

దాంతో, కౌరౌ స్పేస్ స్టేషన్‌లో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

ఆ తరువాత జ్యూస్ నుంచి భూమికి ఫోన్ వచ్చింది. జ్యూస్ డాటా పంపడం ప్రారంభించిందని ఈఎస్ఏ సైంటిస్టులు తెలిపారు.

అరియాన్ 5 ఆకాశంలోకి ఎగరగానే, "జ్యూస్ వస్తోంది, బృహస్పతీ సిద్ధంగా ఉండు" అని ఈఎస్ఏ మిషన్ కంట్రోల్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండ్రియా అకోమాజో అన్నారు.

ఇది ఈఎస్ఏ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం. అయితే, ఇది సగం విజయ మాత్రమేనని, ఇంకా ఎనిమిదేళ్ల ప్రయాణం ఉందని బీబీసీ సీనియర్ ఎడిటర్ రెబెకా మోరెల్ అన్నారు.

గురు గ్రహ వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

అక్కడ జీవరాశి సాధ్యమేనా?

భూమి తరువాత జీవరాశికి అనువైన గ్రహం మార్స్ (అంగారకుడు) అని చాలా కాలంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవాళ కాకపోయినా సుదూర భవిష్యత్తులో అంగారక గ్రహంపై జీవరాశి కళ్లు తెరుస్తుందని అంచనా వేస్తున్నారు.

కొందరు ఆస్ట్రోబయాలజిస్టులు మాత్రం బృహస్పతి, శని గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు.

భూ గ్రహంపై సముద్రాల అడుగున సంభవించిన అగ్ని పర్వతాల విస్ఫోటనమే భూమిపై జీవరాశి ఊపిరి పోసుకోవడానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి వ్యవస్థే బృహస్పతి, శని చుట్టూ తిరిగే ఉపగ్రహాల మీద కూడా ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: