నకిలీ చంద్ర ధూళిని సైంటిస్టులు ఎందుకు తయారు చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Nasa/Kim Shiflett
- రచయిత, ధనంజయ్ ఖాదిల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కానరీ దీవులలో లాంజరోట్ మధ్యలో ఉన్న ఎల్‌జెడ్-20 హైవే మీదుగా డ్రైవ్ చేసుకుంటే వెళితే టావో నగరం వస్తుంది. టామియా అగ్నిపర్వత బిలం టావో నడిబొడ్డున ఉన్నప్పటికీ లాంజరోట్‌లో అది పర్యాటక ప్రాంతం కాదు.
అయితే, ఈమధ్యకాలంలో టావోకు పర్యటకుల తాకిడి ఎక్కువైంది. వీరికి అక్కడ ఉన్న అగ్ని బిలం మీద ఆసక్తి లేదు. కానీ, టావో నేలపై ఉన్న చిక్కటి బూడిద రంగు మట్టి వారిని ఆకట్టుకుంటోంది.
రాళ్లు నిండిన ఈ మట్టి, ఈ దశాబ్దపు అత్యంత ప్రతిష్టాత్మకమైన మానవ ప్రయత్నాలలో ఒకదానికి సహాయపడుతోంది. మనుషులను చంద్రుడిపైకి పంపడానికి సహకరిస్తుంది.
టావో సమీపంలోని క్వారీలో ఉన్న అగ్గిరాయి చంద్రుడి ఉపరితలం మీదున్న మట్టిని పోలి ఉన్నట్టు స్పెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది.
1971లో అపోలో 14 సిబ్బంది చంద్రుడి మీద మట్టిని సేకరించి భూమికి తీసుకొచ్చారు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు టావో దగ్గర దొరికిన మట్టితో చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టి నమూనాను తయారుచేస్తున్నారు. కొన్ని పరికరాలను చంద్రుడి పైకి పంపే ముందు ఈ మట్టిపై పరీక్షించేందుకు దీన్ని సిద్ధం చేస్తున్నారు.
ఈ మట్టి నమూనాను LZS-1 అని పిలుస్తున్నారు. చాలాకాలంగా శాస్త్రవేత్తలు చంద్రుడిపై మట్టిని అనుకరించే ప్రయోగాలు చేస్తున్నారు. దాన్లో ఇది తాజా ప్రయోగం.
1988లో మిన్నెసోటాలో తొలి నమూనాను తయారుచేశారు. మిన్నెసోటాలోని డులుత్‌లో ఉన్న ఒక క్వారీలో దొరికే అగ్గిరాయితో ప్రయోగాలు చేశారు. దీన్ని మిన్నెసోటా లూనార్ సిమ్యులంట్-1 (MLS-1) అంటారు.
అపోలో 11 వ్యోమగాములు చంద్రుడిపై 'సీ ఆఫ్ ట్రాంక్విలిటీ' నుంచి సేకరించిన మట్టిలోని రసాయనాలను పోలిన పదార్థాలు మిన్నెసోటా శిలలో ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
చంద్రుడిపై అగ్గిరాయితో నిండిన చీకటి ప్రదేశాలను "చంద్రుడి సముద్రాలు" అని పిలుస్తారు. ఇక్కడ అధికంగా మెగ్నీషియం నిల్వలు, స్వల్పంగా ఐరన్ నిల్వలు ఉంటాయి. అలాగే, చంద్రుడిపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లల్లో కాల్షియం, అల్యూమినియం నిండి ఉంటుంది.

ఫొటో సోర్స్, NASA
చంద్రుడిపై మట్టిని పోలిన పదార్థాన్ని ఎందుకు తయారుచేస్తున్నారు?
1969-1972 మధ్య చంద్రుడి మీదకి వెళ్లిన ఆరు అపోలో మిషన్లు సుమారు 380 కిలోల చంద్ర ధూళిని, రాళ్లను భూమికి తీసుకొచ్చాయి. వీటిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నారు.
"ఆ మట్టి చాలా విలువైనది. కేవలం సైన్స్ పరిశోధనలకు వినియోగిస్తున్నాం" అని స్పేస్ సైంటిస్ట్ జాన్ జాన్ గ్రూనర్ చెప్పారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని ఆస్ట్రోమెటీరియల్స్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ సైన్స్ విభాగంలో స్పేస్ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు గ్రూనర్.
అయితే, చంద్రుడి పైకి పంపాలనుకుంటున్న పరికరాలు, స్పేస్‌క్రాఫ్ట్‌లు, స్పేస్ సూట్లను పరీక్షించడానికి అక్కడి నుంచి తెచ్చిన మట్టి సరిపోదు. దానిని పోలిన నమూనాలను తయారుచేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే, చంద్రుడి మట్టి ఆహారం పండించడానికి, స్థావరాలు ఏర్పరచుకోవడానికి కావలసిన సామాగ్రి తయారీకి అనువుగా ఉందో లేదో పరీక్షించాలంటే చంద్రుడి ఉపరితలంపైనున్న మట్టిని పోలిన పదార్థం కావాలి.
ఆ దిశలోనే శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు.
1989లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఇనిషియేటివ్ (SEI) ప్రకటన తరువాత చంద్రుడిపై మట్టిలాంటి దాన్ని తయారీకి డిమాండ్ ఏర్పడిందని గ్రూనర్ చెప్పారు. అప్పుడే చంద్రుడు, మార్స్‌లపైకి మళ్లి మనుషులను పంపించాలని నాసా ప్లాన్ చేసింది.
దీని ఫలితంగా, 1990ల మధ్యలో జాన్సన్ స్పేస్ సెంటర్‌లో అభివృద్ధి చేసిన చంద్రుడి మట్టి JSC-1 పుట్టుకొచ్చింది. ఇది ఈ తరహా నమూనాలను మార్గదర్శకంగా నిలిచింది.
అరిజోనాలోని ఫ్లాగ్‌స్టాఫ్ సమీపంలోని మెరియం అగ్ని బిలం వద్ద లభించిన మట్టినుంచి దీన్ని తయారుచేశారు.
జేఎస్‌సీ-1.. అపోలో 14 మిషన్ తీసుకొచ్చిన చంద్ర ధూళికి చాలా దగ్గరగా ఉంది.
చంద్రుడిపై మట్టిలో గాజు పదార్థం గణనీయంగా ఉంటుంది. భూమి మీద అగ్నిపర్వతాలకు సమీపంలో ఉన్న మట్టిలో గాజు ఎక్కువగా ఉంటుంది. అందుకే అగ్ని బిలాల దగ్గర మట్టి నుంచే నమూనాలను తయారుచేస్తున్నారు.
జాన్సన్ స్పేస్ సెంటర్ సుమారు 20 టన్నుల జేఎస్‌సీ-1ను తయారుచేసింది.
అయితే, బుష్ ప్రకటించిన ఎస్ఈఐ ప్రోగ్రాం, తరువాత క్యాన్సిల్ అయింది. దాంతో, చంద్రుడి మట్టి నమూనాలకు డిమాండ్ క్రమంగా తగ్గింది.

ఫొటో సోర్స్, ESA
మనిషిని చంద్రుడి పైకి పంపించాలన్న ప్రయత్నాలు..
అనంతరం 2005లో అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ తన తండ్రి లాగే విజన్ ఫర్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ (VSE) ప్రోగ్రాం ప్రకటించారు. ఇది కూడా చంద్రుడిపైకి, మార్స్‌పైకి మనుషులను పంపించే పథకమే.
దాంతో, మళ్లీ చంద్ర ధూళిపై ఆసక్తి పెరిగింది. NU-LHT నమూనాను మోంటానాలోని స్టిల్ వాటర్ గనుల నుంచి తయారుచేశారు శాస్త్రవేత్తలు.
కానీ, 2010లో వీఎస్ఈ కూడా మరుగునపడింది.
2017లో ప్రారంభమైన ఆర్టెమిస్ ప్రోగ్రాంతో చంద్ర ధూళిపై ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఈసారి ప్రైవేట్, కార్పొరేట్ ఏజెన్సీలు ప్రయోగాలు చేపట్టాయి.
ఫ్లోరిడాలోని ఎక్సోలిత్ ల్యాబ్ ఇప్పటివరకు అత్యధిక చంద్ర ధూళి నమూనాలను ఉత్పత్తి చేసింది. సుమారు 80 టన్నుల మట్టిని అభివృద్ధిచేసింది.
చంద్రుడిపై మట్టి చిన్న చిన్న రాళ్లు, కంకరతో నిండి ఉందని, భూమిపై మట్టితో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉంటుందని డాక్టర్ గ్రూనర్ చెప్పారు.
చంద్ర ధూళి నమూనాలను స్పేస్ ఏజెన్సీలు రకరకాల ప్రయోగాలకు ఉపయోగిస్తున్నాయి.
వీటన్నిటి ధ్యేయం ఒక్కటే...చంద్రుడి పైకి మళ్లీ మనిషి అడుగుపెట్టాలి. వీలైతే స్థావరాలు ఏర్పాటు చేసుకోగలగాలి.
అయితే, 100 శాతం చంద్ర ధూళిని పోలిన నమూనాలు తయారుచేసుకోవడం అసాధ్యమని గ్రూనర్ అంటున్నారు.
"80 శాతానికి దగ్గరగా కూడా వెళ్లలేం" అన్నారు.
అయితే, ఎంత దగ్గరగా తయారుచేసుకోగలిగితే అంత మంచిది. దీని ధర కూడా తక్కువేం కాదు.
అతి దగ్గర నమూనాల ధర కిలో 45 డాలర్ల( రూ. 3,600) నుంచి 150 డాలర్ల(రూ.12,000) వరకు ఉంటుంది. ఈ లెక్కన మనం కూడా ఓ పిడికెడు మట్టి కొనుక్కోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?
- స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














